నాలాంటి వాళ్లను ఎప్పుడూ నమ్మకండి.
రాత్రి మీ పరిస్థితి నాకు పూర్తిగా అర్ధం అయింది.
గతం గురించి మరచిపొండి.
అది మీకు నష్టాన్నీ, కష్టాన్ని కలుగచేస్తూ వుంటుంది.
ముందు ఇంటి పని నుండి బయటపడండి.
వంట పనికి, అంట్ల పనికి ఇద్దరు పని మనుషుల్ని పెట్టుకోండి.
చిన్న కుటుంబాల్లో ఇద్దరు పని మనుషులు నెలకు ఓ ఆరు వేల రూపాయలకు వస్తారు.
అలా దొరికిన సమయాన్ని ఇతర రంగాల్లో పనిచేస్తే ఆ ఆరు వేల రూపాయలకన్నా ఎక్కువ వస్తాయి.
మనుషులు శారీరక శ్రమ నుండి మేధో శ్రమ వైపుకు, గ్రామాల నుండి పట్టణాలకు ప్రయాణం చేస్తారు.
ఇంటి పని నుండి బయట పడ్డాక మీ కొత్త జీవిత భాగస్వామి కోసం వెతకండి.
అతను సింగిల్ అయ్యుండాలి.
మీరు అతనికి అతను మీకు నచ్చాలి.
వీలుంటే రిజిస్టర్ మేరేజ్ చేసుకోండి.
అధికారిక రికార్డులు అన్నింటిలోనూ మీ పేరు చేరేలా చూసుకోండి.
మీలో ఎవరు చనిపోయినా ఆస్తి పంపకాలు ఎలా జరగాలి అనేది స్పష్టంగా రూపొందించుకుని రిజిస్టర్డ్ వీలునామా రాసుకోండి.
సహజీవనంలో ఇలాంటి లీగల్ అంశాలను పట్టించుకోకపోవడంవల్లనే మీ విశాఖపట్నానికే చెందిన జగత్ ధాత్రి బలవన్మరణానికి గురయ్యారు.
ఆస్తి వున్నప్పుడు దానికి కొన్ని నియమాలుంటాయి. వాటిని పాటించి తీరాలి.
ఆస్తికి అతీతమైన ప్రేమ వుంటుందని నమ్మితే దానికే కట్టుబడి వుండాలి.
అతనికి ఆస్తితోపాటూ ముందుగానే సంతానం వున్నా, మీకూ ఆస్తితోపాటు సంతానంవున్నా మీ రెండో వివాహం అంత సులువు కాదు.
ఆస్తి దగ్గర మనుషులు కుక్కలకన్నా హీనంగా ప్రవర్తిస్తారు. అటు అతని వారసులు ఇటు మీ వారసులు కొట్లాడుకుంటారు.
ఈ ఆస్తి వివాదాలు లేకుండ, పెళ్ళి లేకుండ, సహజీవనం చేసే పరిష్కారం కూడ ఒకటి వుంది.
అప్పుడూ దాని నియమాలు దానికుంటాయి. వాటిని పాటించాల్సి వుంటుంది.
మనుషులు సాధారణంగా దాంపత్యం ఎలా వుండాలని ఆలోచిస్తారు.
మరణం తరువాత ఈ లోకంలో జరిగే పరిణామాల్ని గురించి కూడ ఆలోచించాలి.
ముందు మీరు మీ మాజీ భర్త మీద భావోద్వేగ కవితలు రాయడం మానేయండి.
నాలాంటి వాళ్లను ఎప్పుడూ నమ్మకండి.
ఎవరయినా ప్రేమ నిండిన కళ్ళుగల ఇమోజీలో, ఎర్రటి హృదయాలో, పెదాలో పంపితే నేనూ బోలెడు సరదా కబుర్లు చెపుతుంటాను. అది ఆ క్షణపు సరదా మాత్రమే. దీన్ని శాశ్వితం చేసుకోవాలని వారూ అనుకోరు నేనూ అనుకోను.
మీకు అన్నీ మంచే జరగాలని ఆశిస్తాను.
No comments:
Post a Comment