Heinz-Horst Deichmann
జర్మని తోళ్ళ పరిశ్రమ దిగ్గజం Heinz-Horst Deichmann
1999 చివర్లో భారతదేశ పర్యటనకు వచ్చారు. ఆయన సుప్రసిధ్ధ Deichmann SE మహుళజాతి సంస్థకు CEO మాత్రమే కాకుండ గొప్ప దానశీలి. దైవ కార్యాలకు భారీ విరాళాలు ఇచ్చేవారు.
మహేశ్వరంకు చెందిన జే అండ్ జే సొసైటి నిర్వాహకురాలు సువర్చలా శశికిరణ్ తమ సంస్థకు ఆర్ధిక సహాయాన్ని కొరుతూ డైఖ్ మన్ చారిటీ సంస్థకు ఒక లేఖ రాశారు. డైఖ్ మన్ ఇండియా పర్యటనలో చిలకలూరిపేటలోని ఏఎంజి ఇంటర్నేషనల్ సంస్థలో కలుసుకోవాలని అక్కడి నుండి లేఖ వచ్చింది. ఏఎంజి అంటే డాక్టర్ ఎస్. జాన్ డేవిడ్ నిర్వహిస్తున్న చాలా పెద్ద క్రైస్తవ ధార్మిక సంస్థ.
డైఖ్ మన్ ను కలిసే సన్నాహాలు చేసుకుంటుండగా జర్మనీ నుండి ఇంకో లేఖ వచ్చింది. (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ లో తోళ్ళ పరిశ్రమ స్థితి గతుల్ని డైఖ్ మన్ తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది ఆ లేఖ సారాంశం. కేవలం గణాంకాలు కాకుండ మానవీయ కోణంలో పరిస్థితిని వివరించాల;అని కూడ ఆ లేఖలో వుంది.
ఆంధ్రప్రదేష్ లో తోళ్ల పరిశ్రమకు సంబంధించి అనేక అధికారిక, అనధికారిక పత్రాలను జే అండ్ జే సొసైటి సేకరించింది. అదో పెద్ద ఫైల్ అయ్యింది. ఆ పత్రాలను ఒక ఆర్డర్ లో పెట్టడానికి, ఒక జర్నలిస్టిక్ రిపోర్టును తయారు చేయడానికీ వాళ్లు నన్ను అప్రోచ్ అయ్యారు.
వాళ్ళు నన్ను కలిసేనాటికి డైఖ్ మన్ రాకకు ఇంకా ఏడు రోజులు మాత్రమే గడువు వుంది. డైఖ్ మన్ టూర్ షెడ్యూల్ కూడ వచ్చేసింది. ఆ రోజు ఉదయం 10.45 నిముషాలకు ఓ 15 నిముషాలు జేండ్ జే సొసైటీకి కేటాయించారు. 11 గంటల నుండి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేటాయించారు. చంద్రబాబుగారు వస్తున్నారంటే ఓ గంట ముందే సెక్యూరిటి ఆ ప్రాంతాన్ని కమ్ముకుంటుంది. ఆ హడావిడిలో మనకు ఆ 15 నిముషాలు సరిపోక పోవచ్చు. లేదా; మా అప్పాయింట్ మెంటును ఏకంగా రద్దు చేసేయవచ్చు.
డైఖ్ మన్ తో మూడు నిముషాలు మాట్లాడ గలిగినా సమస్యను ఆకర్షణీయంగా వివరించడం ఎలా? అనేది పెద్ద టాస్క్ గా మారింది. ఈ చర్చల్లో ఒక డాక్యుమెంటరీ వీడియో తయారు చేయాలనే ఆలోచన వచ్చింది.
సబ్జెక్ట్ నాకు కొత్తదికాదుకనుక ఒక్కరోజులో స్క్రిప్టు రాసేశాను. నాది అప్పటికి ప్రింట్ మీడియా వ్యవహారమే తప్ప ఎలక్ట్రానిక్ మీడియా గురించి ఓనమాలు కూడ తెలియవు. డైరెక్షన్ గురించి కొంత అవగాహన వుంది. మిత్రులు మధు పులిపాటి గారికి స్టిల్ కెమేరా అనుభవంవుంది. ఇద్దరం కలిసి స్క్రిప్టుకు అవరసమైన షాట్లను రాసుకున్నాము.
మాకు దొరికిన కెమేరామన్ తన దగ్గరున్న VHS కెమేరాతో వచ్చాడు. అది MPEG-1, VCD 264p. అంటే చాలా తక్కువ రిజల్యూషన్. పైగా, అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కోతలు ఎక్కువగా వుండేవి. బ్యాటరీల రీ- చార్జింగుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అప్పటికే 3 సిసిడి క్యామ్ కార్డర్లు మార్కెట్లోనికి వచ్చేశాయి కానీ ఆ విషయం మాకు తెలీదు.
నలుగురరం నాలుగు రోజులు నాలుగు జిల్లాలు తిరిగాం. కృష్ణా, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. ఆరో రోజు హైదరాబాద్ లో ఎడిటింగ్ చేయించాం. ఏడోరోజు ఉదయాన్నే నేనూ, శశికిరణ్ గారు నేరుగా చిలకలూరిపేట వెళ్ళాం. చంద్రబాబు సెక్యూరిటీ చాలా హడావిడి చేసింది. జర్నలిస్టు ప్రివిలేజెస్ తో లోపలికి ప్రవేశించాం. లాప్ టాప్ బూట్ చేసి, సిడిని ఇన్ సర్ట్ చేసి రెడీగా వున్నాం. సరిగ్గా 10.45కు డైఖ్ మన్ మా టేబుల్ దగ్గరకు వచ్చారు. ఒక్క నిముషం కూడ ఆలస్యం చేయకుండా సిడిని ప్లే చేశాము. డైక్ మెన్ మైమరచిపోయి వీడియో చూశారు. ఒక కాపీ తనకూ ఇమ్మన్నారు. ఐదు నిముషాలకు పైగా మాతో ఆప్యాయంగా మాట్లాడారు. తన సెక్రటరీని పరిచయం చేసి అతనితో కాంటాక్ట్ లో వుండమన్నారు.
వీడియో రిజల్యూషన్ గురించి నాకు అప్పటికి అవగాహన లేకపోవడంవల్ల క్యాలిటీ తగ్గింది. అయితే, కంటెంట్ బాగుండడంవల్ల ప్రొడ్యూసర్ చాలా హ్యాప్పీ. నాకు ఇవ్వాల్సిన పారితోషకాన్ని కొంచెం పెంచి ఇచ్చారు.
తొలి డాక్యుమెంటరీ కావడంవల్ల ఈ వీడియో అంటే నాకు చాలా ఇష్టం. అందుకే 20 ఏళ్ల తరువాత దీనిని FHD లోనికి మార్చాలనిపించింది.
డాక్యుమెంటరీలు తీసేవాళ్ళు ఎప్పుడూ అందుబాటులోవున్న హై రిజల్యూషన్ కెమేరాతోనే తీయాలి. ఇప్పుడు FHD మాత్రమేకాక UHD 4k, UHD 8k కెమేరాలు కూడ అందుబాటులో వున్నాయి.
ఏమైనా ఈ డాక్యుమెంటరీ, దాన్ని తీసిన విధానం నాకు ఒక అందమైన అనుభవం; ఒక తిపి జ్ఞాపకం.
20220907
No comments:
Post a Comment