Monday, 26 September 2022

Cultural Dictatorship Vs Cultural Equality 9 th October 2022 Ravulpalem Speech

Cultural Dictatorship Vs Cultural Equality

సాంస్కృతిక నియంతృత్వం – సాంస్కృతిక సమానత్వం

డానీ

 

1.        ఈరోజు సదస్సు నిర్వాహకులు ప్రసంగించడానికి నాకు ఇచ్చిన అంశం  'మనువాదం- అంబేడ్కర్ - భారత రాజ్యాంగం'.

 

2.        నేను దీనికి ఇంకో మాటను చేరుస్తాను; సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్త్వం. ఈ మాట కష్టంగా వుంటే సులువుగా ఫాసిజం అనుకోవచ్చు. అయితే, ఫాసిజానికి దేశకాలమాన పరిస్థితులనుబట్టి కొంత అర్ధం ఆచరణ మారుతూ వుంటుంది. దాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి.

 

3.        'మనువాదం - భారత రాజ్యాంగం' రెండూ పరస్పర విరుధ్ధమైన సామాజిక దృక్పధాలుగల గ్రంధాలు. Dichotomy అంటారు. ఈ రెండు దృక్పథాల మధ్య వుండే వైరుధ్యాన్ని పరిష్కరించాలనేది నిర్వాహకుల అభిప్రాయం కావచ్చు. నిజానికి ఈ వైరుధ్యాన్ని పరిష్కరించే పనిని దాదాపు ఓ వందేళ్ల క్రితమే బాబాసాహెబ్ అంబేడ్కర్ చేపట్టాడు.

 

4.        1925లో పుట్టిన  ఆరెస్సెస్ మనుస్మృతిని తన ఆదర్శంగా ప్రకటించుకుంది.

 

5.        ఓ రెండేళ్ల తరువాత, మహద్ సత్యాగ్రహం చివరి అంకంలో  1927 డిసెంబరు 25న అంబేడ్కర్ చితిని పేర్చి  మనుస్మృతికి  శాస్త్రోక్తంగా దహనసంస్కారాలు నిర్వహించాడు.  పక్కన గాంధీజీ ఫోటో పెట్టుకుని మరీ ఈ పని చేశాడు.

 

6.        ఇది జరిగిన ఓ ఇరవైళ్ల తరువాత 1947 ఆగస్టు 29న  ఆయనే  భారత రాజ్యాంగ పరిషత్తులో  డ్రాఫ్టింగ్ కమిటీకి కొత్త అధ్యక్షునిగా నియమితులయ్యాడు.

 

7.        అప్పటి వరకు  ఆ బాధ్యతల్ని చూస్తూ తొలి చిత్తుప్రతిని తయారు చేసిన  బెనెగల్ నర్సింగ్ రావు ( బిఎన్ రావు ) Permanent Court of International Justiceకు జడ్జిగా నియమితులు కావడంతో అంబేడ్కర్ కు ఆ అవకాశం దక్కింది.

 

8.        తనకు దక్కిన అవకాశాన్ని అంబేడ్కర్ చాలా గొప్పగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆనాడు ఒక ఉద్యమకారునిగా మనుస్మృతిని తగలబెట్టిన వాడే ఈసారి   మనుస్మృతిని అధికారికంగా అభావం చేసే ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని సృష్టించాడు.

 

9.        ఆనాటి రాజ్యాంగ పరిషత్ సభ్యుల వర్గ స్వభావం గురించి, వాళ్ళ ప్రాపంచిక దృక్పథం గురించి కూడ మనం గుర్తులో పెట్టుకుంటే అంబేడ్కర్ చేసింది ఎంత పెద్ద సాహసమో తెలుస్తుంది.

 

10.   1946లో మన రాజ్యాంగ సభలో 389 మంది వుండేవారు. పాకిస్తాన్ విడిపోయాక ఆ సంఖ్య 299కి తగ్గింది. వీరిలో 2/3 వంతు మంది కాంగ్రెస్ సభ్యులు. మిగిలినవారు సంస్థానాల ప్రతినిధులు, కొందరు మాత్రం నామినేటెడ్ సభ్యులు.

 

11.   అప్పటికి దేశంలో ఎన్నికలు జరగలేదు. రాజ్యాంగ సభ్యులు  ఏ ఒక్కరూ ప్రజల ద్వార ఎన్నికయినవారు కాదు. పైగా అత్యధికులు ఛాందస భావాలు కలిగినవారు.

 

12.   మరో ముఖ్యమైన అంశం ఏమంటే, అప్పటికి దాదాపు 175 సంవత్సరాలుగా బ్రిటీష్ పాలనలో మనుస్మృతి  హిందువుల పౌరస్మృతిగా అధికారికంగా కొనసాగుతోంది.

 

13.   ఈ నేపథ్యంలో, ఒక ప్రజాస్వామిక రాజ్యాంగం ఆమోదం పొందిందంటే దానికి అంబేడ్కర్ కృషి ఎంతవుందో రాజ్యాంగసభ సభ్యుల మద్దతు కూడ అంతేవుంది.

 

14.   వాళ్ల వర్గ స్వభావం భిన్నమైనదైనప్పటికీ వారిలో ఎక్కువమంది భారతదేశంలో వలస పూర్వ రాచరిక పాలనను పునరుధ్ధరించాలని అనుకోలేదు. వాళ్ళు స్వతంత్ర దేశంలో ఒక ఆదర్శ ఆధునిక ప్రజాస్వామ్య సమాజాన్ని నిర్మించాలని అనుకున్నా అనుకోకపోయినా తమకు ఒక ప్రజాస్వామిక రాజ్యాంగం వుండాలని మాత్రం భావించారు.

 

15.   ఇప్పుడు భారత పాలకవర్గాల దృక్పథం మళ్ళీ వెనక్కు వెళుతోంది.

 

16.   భారత మతసామరస్య, సామ్యవాద, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతినే భావి రాజ్యాంగంగా ప్రకటించడానికి భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

17.   ఈమధ్య కర్ణాటకలో హిజబ్ వివాదం కొనసాగింది. ఆ సందర్భంగా కర్ణాటక పంచాయితీ శాఖామంత్రి కే. ఎస్. ఈశ్వరప్ప ఓ విద్యాలయం ఆవరణలో మూడు రంగుల జాతీయ జెండాకు బదులుగా  కాషాయ జెండాను ఎగురవేశారు. “భవిష్యత్తులో కాషాయ జెండాయే మన జాతీయ జెండా అవుతుంది అని  వారు ప్రకటించారు. “కాషాయ జెండాను ఎర్రకోట మీద కూడ ఎగురవేస్తాం అని  వారు ధీమా వ్యక్తం చేశారు.

 

18.   కర్ణాటక ఎంపి  అనంతకుమార్ హేగ్డే 2018లో కేంద్రమంత్రిగా వున్నకాలంలో "మేము ఇక్కడ వున్నది మతసామరస్య రాజ్యాంగాన్ని తొలగించడానికే" అని ఒక బహిరంగ ప్రకటన చేశారు. కేంద్రంలోని ఎన్డీఎ  ప్రభుత్వంలో రాజ్యాంగబధ్ధ  స్థానాల్లో వున్నవారు అనేకులు ఇలాంటి ప్రకటనల్ని తరచూ చేస్తున్నారు.

 

19.   బిజెపి నాయకులు తరచూ చేస్తున్న ఈ ప్రకటనలు  ఒక రాజకీయ విన్యాసం మాత్రమేనా? వీటికి  సామాజిక ఆర్ధిక ప్రయోజనాలు కూడా వున్నాయా? అని ఆలోచించాలి. అదే ఇప్పుడు చర్చనీయంశం.

 

20.   దాదాపు రెండు వేల ఏడు వందల  శ్లోకాలతో, 12 అధ్యాయాలతో రెండున్నర వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న భారీ గ్రంధం మనుస్మృతి.  

 

21.   ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశానిది. 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 448 అధీకరణలకు విస్తరించి 72 ఏళ్ళుగా కొనసాగుతున్న  గ్రంధం ఇది. ఆపైన 105 సవరణలు కూడ వున్నాయి.

 

22.   ఈ రెండు గ్రంధాలు పరస్పర విరుధ్ధమైనవని ముందుగా చెప్పుకున్నాము. ఇతర వివరాల్లోనికి వెళ్ళే ముందు ఈ రెండు గ్రంధాల సారాన్ని ఒకసారి అర్ధం చేసుకోవాలి.

 

23.   మనుస్మృతి అంటే సాంస్కృతిక నియంతృత్వం (Cultural Dictatorship). అంటే, ఒక సాంస్కృతిక సాంప్రదాయాన్ని పాటించేవారు ఇతర సాంస్కృతిక సాంప్రదాయాల్ని పాటించేవారిని సమస్త రంగాల నుండి అణిచివేయడం. దానినే సాంస్కృతిక జాతీయవాదం అంటున్నారు.

 

24.   భారత రాజ్యాంగం అంటే సాంస్కృతిక సమానత్వం (Cultural Equality ). అంటే, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల నివశించేవారందరూ సమానులు, సోదరులు అనే ఆదర్శం గలవారు. దీనినే భౌగోళిక జాతీయవాదం లేదా ప్రాదేశిక జాతీయవాదం  అంటున్నాం.

 

25.   సాంస్కృతిక జాతీయవాదానికి వినాయక్ దామోదర్ సావర్కర్ మూల పురుషుఢు అయితే, భౌగోళిక జాతీయవాదానికి ఆద్యుడు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ.

 

26.   వర్తమాన భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద పదం ఫాసిజం. ఎవరికి తోచినట్టువారు, ఎవరికి అర్ధం అయినట్టువారు, ఎవరికి అవసరం అయినట్టువారు ఫాసిజంను నిర్వచిస్తున్నారు. దీనివల్ల ఒక అనవసర గందరగోళం మన దేశ రాజకీయాల్లో నెలకొంది. ముందు ఈ గందరగోళాన్ని పరిష్కరించాలి. ఆ తరువాత పాసిజంతో ఎలా డిల్ చేయాలో తేల్చుకోవాలి.

 

27.   ఫాసిజం అనగానే చాలా మందికి జర్మనీలో 1934-45 నాటి ఆడాల్ఫ్ హిట్లర్ పాలనా కాలం గుర్తుకు వస్తుంది. దేశం లోపల మత మైనారిటీలను అణిచివేయడం, దానికోసం కాన్సన్ ట్రేషన్ క్యాంపులు, గ్యాస్ ఛాంబర్లు నెలకొల్పడం, కార్పొరేట్ శక్తులకు ప్రత్యక్షంగా రాజ్యాధికారాన్ని అప్పచెప్పడం, అనేక బయటి దేశాలను  ఆక్రమించడం వగయిరాలు గుర్తుకు వస్తాయి. అయితే ఫాసిజం జర్మనీకి సంబంధించిన పదం కాదు. హిట్లర్ ‘జాతీయ సామ్యవాద జర్మనీ కార్మకుల పార్టి(The National Socialist German Workers' Party) నాయకుడు. దీనినే సంక్షిప్తంగా ‘నాజీ పార్టి’ అంటారు. జర్మనీలో హిట్లర్ కొనసాగించింది ఫాసిజం కాదు; నాజిజం.

 

28.   ఫాసిజం ఇటాలియన్ పదం. బెనిటో ముస్సోలిని 1922-43 మధ్యకాలంలో ‘నేషనల్ ఫాసిస్టు పార్టి పేరుతోనూ, పీట్రో బదోగిలియో మరో రెండేళ్ళు ‘రిపబ్లికన్ ఫాసిస్టు పార్టి పేరుతోనూ ఇటలీలో ఫాసిజాన్ని కొనసాగించారు. బెనిటో ముస్సోలిని  పాలనా కాలంలోనే గియొవాన్ని జెంటైల్ 1932లో ఫాసిస్టు సిధ్ధాంతం అనే గ్రధం రాశాడు.

 

29.   రాజకీయార్ధిక చరిత్రతో కొద్దిపాటి పరిచయం వున్నవారికి కూడ ఒక విషయం  స్పష్టంగా తెలుస్తుంది. బానిస సమాజంలో బానిస ప్రభువుల నియంతృత్వం వుంటుంది. భూస్వామ్య సమాజంలో భూస్వాముల నియంతృత్వం వుంటుంది. రాచరిక వ్యవస్థలో రాజుల నియంతృత్వం వుంటుంది. కుల సమాజంలో యజమాని కులాల నియంతృత్వం వుంటుంది. మత వ్యవస్థలో యజమాని మతాల నియంతృత్వం వుంటుంది. పెట్టుబడీదారీ వ్యవస్థలో పెట్టుబడీదారుల నియంతృత్వం వుంటుంది.  

 

30.   పెట్టుబడీదారి సమాజాల్లో వలసవాద, సామ్రాజ్యవాద, కార్పొరేట్ వాద వగయిరా దశలుంటాయి. సహజంగానే కార్పొరేట్ వాద దశలో కార్పొరేట్ నియంతృత్వమే వుంటుంది. మతోన్మాదాన్ని ఆశ్రయించి కార్పొరేట్లు తమ నియంతృత్వాన్ని కొనసాగిస్తుంటారు.  మతోన్మాదానికి వాళ్లు పెట్టుకున్న గౌరవనీయమైన పేరు సాంస్కృతిక జాతీయవాదం. సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం అనేది దీని సాంకేతిక నామం.

 

31.   ప్రస్తుతం మన దేశంలో సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం కొనసాగుతోంది. మతోన్మాద కార్పొరేట్ నియంతృత్వం, హిందూమతోన్మాద కార్పొరేట్ నియంతృత్వం, కాషాయ కార్పొరేట్ నియంతృత్వం వగయిరా పేర్లతో దీనిని పిలుస్తున్నారు.

 

32.   సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం రెండవ ప్రపంచ యుధ్ధకాలంలోనూ అనేక దేశాల్లో అనేక రకాలుగా అనేక పేర్లతో కొనసాగింది. సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వాన్ని సాంకేతికంగా అర్ధం చేసుకోకుండ ఫాసిజం, నాజిజం అనేస్తే ఒక పెద్ద ఇబ్బంది వస్తుంది. అలనాటి ఇటలీ, జర్మనీల నిర్ధిష్ట పరిస్థితులతో పోలిక వస్తుంది. కొన్ని అంశాలు అలా వుండవచ్చు; మరికొన్ని అంశాలు అలా వుండకపోనూ వచ్చు. సారం ఒకటే అయినా రూపం అనేక రకాలుగా  మారవచ్చు.

 

33.   సారాన్ని చూడకుండ రూపాన్ని చూస్తే సైధ్ధాంతిక రంగంలోనూ అనేక చిక్కులు వస్తాయి. ఇటలీ, జర్మనీ ల ప్రాధమిక అనుభవాల ఆధారంగా ఆనాటి అంతర్జాతీయ  కమ్యూనిస్టు  సిధ్ధంతవేత్తలు  కొందరు ఫాసిజాన్ని నిర్వచించారు. ఒక అవగాహన కోసం వాళ్ళ సూత్రికరణల్ని ఇప్పుడు కూడ  పరిశీలించాల్సిందే. గానీ, వర్తమాన భారత సమాజం ఆనాడు వాళ్లు చెప్పినట్టులేదు గాబట్టి ఇక్కడ ఫాసిజం లేదు, నాజిజంలేదు, అవి రావు అని తీర్మానించడం చారిత్రక భౌదికవాదాన్ని అడ్డంగా నిరాకరించడమే అవుతుంది.

 

34.   హిట్లర్ కాన్సెన్ట్రేషన్ క్యాంపులు పెట్టాడు; మన దేశంలో డిటెన్షన్ సెంటర్లు వున్నాయి.  హిట్లర్, ముస్సోలినిలు ఇతర దేశాల్ని ఆక్రమించారు;  మనదేశం ఇతర దేశాలను ఆక్రమించలేదు. హిట్లర్ గ్యాస్ ఛాంబర్లను నిర్మించాడు మనకు గ్యాస్ ఛాంబర్లులేవు; అండాసెల్స్ మాత్రమే వున్నాయి. మత మైనార్టీల అణిచివేతకు ముస్సోలినీ, హిట్లర్ ఇద్దరూ అల్లరి మూకల్ని బాహాటంగా సమర్ధించేవారు. ఇక్కడ అల్లరి మూకల్ని న్యాయస్థానాలు నిర్దోషులని తేలుస్తున్నాయి. ముస్సోలినీ, హిట్లర్ ఇద్దరూ మిలటరీ దుస్తులు వేసుకునేవారు; మన దేశాధినేతలు సాంప్రదాయ దుస్తుల్ని వేసుకుంటున్నారు.

 

35.   ఇన్ని తేడాలు వున్నప్పుడు దీనిని ఫాసిజం అనలేము అంటూ మహామహా కమ్యూనిస్టు నాయకులుగా పేరుపడినవాళ్ళు సహితం గట్టిగానే వాదిస్తున్నారు.

 

36.   లాభాల్ని అర్జించడం అనే ఒకేఒక లక్ష్యం తప్ప పెట్టుబడీదారులకు స్థిర విలువలు అంటూ ఏమీ వుండవు. వాళ్ళే ఒక సందర్భంలో మతాన్ని ప్రభుత్వాన్ని విడగొట్టాలంటారు; ఇంకో సందర్భంలో మతరాజ్యం కావాలంటారు.

 

37.   పెట్టుబడ్దారులు ముదిరితే కార్పొరేట్లు అవుతారు. భారత దేశంలో  ప్రస్తుతం సాంస్కృతిక జాతీయవాద  కార్పోరేట్ నియంతృత్వం  (Cultural Nationalistic  Corporate  Dictatorship (CNCD) (సాజాకాని) కొనసాగుతోంది. దీనినే కొందరు సాధారణ భాషలో ఫాసిజం అంటున్నారు.

 

38.   స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో సాంస్కృతిక జాతీయవాద కార్పోరేట్ నియంతృత్త్వం సుదీర్ఘకాలం వుండింది. ప్రజాస్వామిక దేశాలుగా భావించే అమెరిక ఇంగ్లండ్ లతో సహా అనేక దేశాల్లోనూ కొన్ని సందర్భాల్లో ఫాసిజం కొనసాగింది.

 

39.   సాంస్కృతిక వైవిధ్యాల ఆధారంగా ఒక సమూహం మరో సమూహాన్నిక్రూరంగా అణిచివేయడం ద్వార కార్పొరేట్ల సంపదను పెంపొందించుకోవడం అనేది సాధారణ లక్ష్యం అయినప్పటికీ, స్థానిక ప్రత్యేకతలను బట్టి సాంస్కృతిక జాతీయవాద  కార్పోరేట్ నియంతృత్వం ఒక్కో  దేశంలో ఒక్కోరూపాన్ని తీసుకుంది.

 

40.   ఇప్పుడు సమస్య ఇది ఫాసిజమా? నాజిజమా? అన్నది కాదు. మన దేశంలో సాంస్కృతిక జాతీయవాద  కార్పోరేట్ నియంతృత్వం  కొనసాగుతున్నదా? లేదా? అన్నదే అసలు ప్రశ్న.

 

41.   చాలా మంది మరచిపోతున్న ఒక కీలక చారిత్రక వాస్తవం ఏమంటే ఫాసిజానికీ నాజిజానికీ పుట్టినిల్లు మనదేశమే. మనువాద కులవ్యవస్థను మించిన సాంస్కృతిక  నియంతృత్వం ఏముంటుందీ? దాని ఆధునిక రూపమే సాంస్కృతిక జాతీయవాద  కార్పోరేట్ నియంతృత్వం. అందుకే దీనిని నయా మనువాదం అనవచ్చు.

 

42.   మను స్మృతిలో 12 అధ్యాయాలున్నాయి.

 

43.    మొదటి అధ్యాయంలో 119 శ్లోకాలున్నాయి.  ప్రకృతి, విశ్వం పుట్టుక, నాలుగు యుగాలు, నాలుగు వర్ణాలు, వాటి ధర్మాలు, బ్రాహ్మణవర్ణ ఔన్నత్యం గురించి ఇవి వివరిస్తాయి. 

 

44.   రెండవ అధ్యాయంలో 249 శ్లోకాలున్నాయి. బ్రహ్మచర్యం,  యజమానుల  సేవ గురించి ఇవి వివరిస్తాయి. 

 

45.   మూడవ అధ్యాయంలో 286 శ్లోకాలున్నాయి.  వివాహ వ్యవస్థ, దాని విధివిధానాలు, పూర్వికులకు తర్పణలు వదలడం మొదలైన అంశాలను ఇవి వివరిస్తాయి.

 

46.    నాలుగవ అధ్యాయంలో 260 శ్లోకాలున్నాయి.   గృహస్త ధర్మాలు, ఆహారపు అలవాట్లు, ఏది తినాలి, ఏది తినకూడదు, ధర్మాన్ని అతిక్రమిస్తే దేవుడు వేసే శిక్షలు, 21 రకాల నరకాలు మొదలైన అంశాలను ఇవి వివరిస్తాయి. 

 

47.     ఐదవ అధ్యాయంలో 169 శ్లోకాలున్నాయి. మహిళల కర్తవ్యాలు,  పవిత్రత, అపవిత్రత, పాతివ్రత్యం మొదలైన అంశాలు ఇందులో వుంటాయి.

 

48.     ఆరవ అధ్యాయంలో 96 శ్లోకాలున్నాయి.  మతగురువుల బాధ్యతలు, అధికారాల గురించి వీటిల్లో వుంటుంది.

 

49.   ఏడవ అధ్యాయంలో 226 శ్లోకాలున్నాయి.   ధర్మరక్షణ కోసం రాజులు నిర్వర్తించాల్సిన కర్తవ్యాల గురించి వీటిల్లో వుంటుంది.

 

50.   ఎనిమిదవ అధ్యాయంలో 420 శ్లోకాలున్నాయి.     అపరాధాలు, న్యాయం, వాగ్దానాలు, రాజనీతి గురించిన వివరాలు ఇందులో వుంటాయి.

 

51.    తొమ్మిదవ అధ్యాయంలో 336 శ్లోకాలున్నాయి. సంపదకు సంబంధిన  నియమాలు, నిషేధాల గురించి వీటిల్లో వుంటుంది.

 

52.   పదవ అధ్యాయంలో 131 శ్లోకాలున్నాయి. వర్ణసంకరం, దాని ఫలితాలు, వాటితో వ్యవహరించాల్సిన తీరు గురించి వుంటుంది.

 

53.   పదకొండవ అధ్యాయంలో 266 శ్లోకాలున్నాయి. పాపం గురించీ, పాపానికి తలపడినవారితో  వ్యవహరించాల్సిన తీరు గురించి వీటిల్లో వుంటుంది.

 

54.   పన్నెండవ అధ్యాయంలో 126 శ్లోకాలున్నాయి. గుణకర్మలు, వేదాల ప్రసంశ వగయిరాలు వీటిల్లో వుంటాయి.

 

55.   ఈ గ్రంధం అనేక ఒక ఉన్నత ఆదర్శ జీవితాన్ని బోధిస్తుంది అనేవారూ వున్నారు. వాళ్లు దీనిని ‘మను ధర్మశాస్త్రం, ‘మానవ ధర్మశాస్త్రం అంటుంటారు.

 

56.   ఈ ఆదర్శాలు 2500 సంవత్సరాల క్రితపు యజమానివర్ణాలకు అనుకూలంగానూ, శ్రామిక వర్ణాలను అణిచివేయడానికీ, ప్రతి చిన్న తప్పుకు అతి క్రూర శిక్షలు వేయడానికీ ఉద్దేశించినవి.

 

57.   శూద్రులు వేదం చదవరాదని ఒక నియమం వుంది. శూద్రులు వేదం  చదివినా, విన్నా చాలా క్రూరమైన శిక్షలు వుండేవి. ఆదిశంకరాచార్యుడు మనుస్మృతికి  వేదస్థాయి ఇచ్చాడు. అంచేత మనుస్మృతిని కూడ శూద్రులు చదివే అవకాశంలేదు.

 

58.   భారత ఉపఖండంలో 1857లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఆరంభమయ్యే వరకు మనుస్మృతిలో ఏముందో ద్విజేతరులకు  అంటే శూద్రులకు, దళితులకు తెలీదు. వారు క్రూరమైన శిక్షలు అనుభవించేవారుగాని ఏ నియమాల ప్రకారం తమను శిక్షిస్తున్నారో కూడ వారికి తెలిసేదికాదు. 

 

59.   మనుస్మృతిని తమ పౌర స్మృతిగా గుర్తించాలని 1772లో అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ ను హిందూసమాజం కోరింది. అందుకు ఆయన అంగీకరించాడు.  పాలన సౌలభ్యం కోసం  సర్ విలియం జోన్స్ 1794లో మనుస్మృతిని ఇంగ్లీషు లోనికి అనువదించాడు. ఆ తరువాత మాత్రమే, ఆంగ్లంలో వున్నత విద్య చదివిన శూద్రులు, అతిశూద్రులకు మనుస్మృతి అందుబాటు లోనికి వచ్చింది.

 

60.   1920వ దశాబ్దం నాటికి ఆంగ్లంలో వున్నత విద్య చదివిన దళితుల్లో మొదటివాడు అంబేడ్కర్.

 

61.   శూద్రులకు శిక్షలు వేయడమే లక్ష్యంగా పుట్టిన గ్రంధం కనుక దీనికి మనుస్మృతి అనే పేరు స్థిరపడింది. అంబేడ్కర్ తరువాత అది  మనుస్మృతిగా విస్తృత ప్రచారం లోనికి వచ్చింది.  అంబేడ్కర్ మనుస్మృతిని ‘బ్రాహ్మణీయ శాస్త్రం అని కూడ అనేవాడు.

 

62.   అంబేడ్కర్ మనుస్మృతి సారాన్ని రెండు వాక్యాల్లో తేల్చేశాడు. “ఇది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ ఆదర్శాల తిరస్కరణ - it is the negation of the spirit of Liberty, Equality and Fraternity.

 

63.   “ఇది ఒక వర్గానికి సమస్త అధికారాలను కట్టబెడుతుంది. మరో వర్గాన్ని వికలాంగులుగా మార్చి కట్టిపడేసి వుంచుతుంది  - it confers privileges upon one class and puts handicaps on others.

 

64.   మనుస్మృతి సమాజంలో శ్రమ విభజన నియమాలను సూచిస్తుంది అనేవారూ వున్నారు. ఎవరి పనుల్ని వారు సక్రమంగా నిర్వహిస్తేనేకదా సమాజం నడిచేది అనేవారూ వున్నారు.

 

65.   మనుస్మృతి శ్రమ విభజన మాత్రమే కాదు, శ్రామికుల విభజన కూడ – అన్నాడు అంబేడ్కర్. 

 

66.   మనుస్మృతిని బిజెపి మాత్రమే కోరుకుంటున్నదా? లేక మన సమాజంలో అలాంటి కోరిక గలవారున్నారా? అన్నది చాలా కీలకమైన ప్రశ్న.

 

67.   అణగారిన సమూహాలు తరచూ  రాజ్యాధికారాన్ని సాధించాలని మాట్లాడుతుంటాయి. ఈ మాటకు రెండు అర్ధాలుంటాయి. మొదటిది; అణగారిన సమూహాలకు ప్రస్తుతం  అధికారం లేదనీ, రెండో అర్ధం; ప్రస్తుతం రాజ్యాధికారం పీడక సమూహాల చేతుల్లో వుందని.

 

68.     పీడక సమూహాలు రాజ్యాధికారాన్ని ఎలా దక్కించుకున్నాయి. దానికి ఈ సమాజం ఎలా సహకరించిందీ అని మనం ప్రశ్నించుకోవాలి. 

 

69.   సమాజ సంపద మీద ఆధిపత్యం కలిగిన సమూహాలే ఆధునిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటాయి. నేరుగా ప్రాయోజిత శాసన వ్యవస్థ (క్రోనీ లెజిస్లేచరీ) అని చెప్పక పోయినా మార్క్స్, లెనిన్ కూడ అలాంటి అర్ధం వచ్చే మాటలే చెప్పారు.

 

70.   కొందరు వర్తమాన భారత ఫాసిజాన్ని కాషాయ కార్పొరేట్ ఫాసిజం అంటున్నారు. మరికొందరు హిందూత్వ కార్పొరేట్ ఫాసిజం అంటున్నారు. హిందూ హిందూత్వ వేరు వేరు పదాలు. హిందూ అనేది ధార్మికక పదం; హిందూత్వ అనేది రాజకీయార్ధిక ఆధిపత్య వ్యక్తీకరణ. ఈ పదాన్ని ముందుగా దామోదర్ సావర్కర్ వాడారు. 1923లో ‘Hindutva: Who Is a Hindu?’ అనే గ్రంధాన్ని రాశాడాయన. అప్పటికి ముస్లిం లీగ్ ద్విజాతి సిధ్ధాంతం అనే మాటను వాడలేదు. ద్విజాతి సిధ్ధాంతాన్ని ముందుకు తెచ్చింది సావర్కరే.

 

71.   అయితే విద్యావంతులు తక్కువగావున్న మనదేశంలో హిందూ, హిందూత్వ పదాల తేడా ఇప్పటికీ చాలా మందికి తెలీదు. కాషాయం కూడ అలాంటిదే. ఒక రంగును మొత్తంగా నెగటివ్ అర్ధంలో వాడడం తప్పు.

 

72.   అలాగే సెక్యూలర్ ఇంగ్లీషు పదానికి లౌకికవాదం అనే తెలుగు అనువాదం సరిపోవడంలేదు. లౌకికలో మతాతీత అనే అర్ధమేగాక మతరహిత అనే అర్ధమూ వుంది. ఇది ముస్లింలు శిక్కులు బౌధ్ధులు క్రైస్తవులకేగాక హిందువులకు సహితం ఆమోదం కాని పదం. మనం మత సామరస్యాన్ని కోరుకుంటున్నాము. అంచేత లౌకిక అనడానికి  బదులు మత సహనం, మతసామరస్యం అనే పదాలను వాడుదాం.

 

73.   ఈ పదాలను వాడడంవల్ల సాధారణ హిందువులను కూడ మనం అనవసరంగా దూరం చేసుకునే ప్రమాదం వుంది.   వాటికి బదులు సాంస్కృతిక కార్పొరేట్ నియంతృత్వం అనడం మంచిది.

 

74.   పెట్టుబడీదారీ వ్యవస్థ పై నుండి విస్తరిస్తే వలసవాదం, సామ్రాజ్యవాదం రూపాల్లో తన నియంతృత్వాన్ని సాగిస్తుంది.  కార్పొరేట్ వ్యవస్థ  మతాన్ని ఆశ్రయించి కింది నుండి విస్తరిస్తూ  తన నియంతృత్వాన్ని సాగిస్తుంది.

 

75.     భారత రాజ్యాంగానికీ, దానీ ప్రధాన ఆదర్శాలైన న్యాయమూ, స్వేఛ, సమానత్వం, సోదర భావాలకు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది.  ప్రమాదం ఎక్కడ జరిగినా గాయాలవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాల బారిన పడకుండ తప్పించుకుంటారు. కొందరికి స్వల్ప గాయాలవుతావు. కొందరికి తీవ్రగాయాలయ్యి బతకడం కష్టంగా మారుతుంది. కొందరు ఏకంగా చనిపోతారు.

 

76.   సాంస్కృతిక కార్పొరేట్ నియంతృత్వం నొప్పి దేశంలో దాదాపు అందరికీ వుంది. ఇందులో ఇప్పుడు చెప్పినట్టు తరతమ స్థాయిలున్నాయి. ముస్లింలకు అందరికన్నా ఎక్కువ గాయాలవుతున్నాయంటే ఎవరికీ అభ్యంతరం వుండదనుకుంటున్నాను.

 

77.   ఇదేదో ముస్లింల పోరాటం అనుకుంటే తప్పు. ఇది ఎస్టీల పోరాటం. ఎస్సీల పోరాటం. బిసిల పోరాటం, కమ్యూనిస్టుల పోరాటం, సోషలిస్టుల పోరాటం.  సామ్యవాదులు, మానవతావాదులు, మానవహక్కుల వాదుల పోరాటం, మతసామరస్యవాదుల పోరాటం, సాధారణ భక్తుల పోరాటం. ఇది భారతీయుల పోరాటం.

 

78.   మతతత్త్వ కార్పొరేట్ నియంతృత్వాన్ని ఎదుర్కోవాలంటే ఒక్కటే మార్గం వుంది; దేశంలోని విపక్షాలన్నీ బేషరతుగా ఏకం కావాలి.

 

79.   ఇప్పుడు ఒక్కటే నినాదం భారతీయులం ఒకటవుదాం! సోదరభావాన్ని కాపాడుకుందాం!

 

 సామాజిక పరివర్తన కేంద్రం సదస్సు

రావులపాలెం, 9 అక్టోబరు 2022, ఆదివారం.

No comments:

Post a Comment