Sunday 25 September 2022

వాడి ఇల్లు ఒక ఆధునిక కమ్యూన్ !



 వాడి ఇల్లు ఒక ఆధునిక  కమ్యూన్ !  

సోషల్ వర్కర్ గాగానీ, సోషల్ రైటర్ గా గానీ వుండడం అంత సులభమైన వ్యవహారంకాదు. ఇంటా బయటా అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది.

ఉద్యోగమో, కూలో చేసి భార్యా పిల్లల్ని పోషించే పని దాదాపు అందరూ చేస్తారు. సోషల్ వర్కర్స్, సోషల్ రైటర్స్ కత వేరు. వాళ్ళు  భార్యా పిల్లల్ని పోషించడంతో పాటు సమాజ సేవకో, రాయడానికో మరి కొంత సమయాన్ని కేటాయించాల్సి వుంటుంది. విస్తారంగా చదవకుండ రాయడమూ కుదరదు. దానికీ కొంత సమయం కావాలి. 

సోషల్ వర్కర్స్, సోషల్ రైటర్స్ కు  అందరిలాగే రోజుకు 24 గంటలు మాత్రమే వుంటాయి. చదవడానికో, రాయడానికో, సమాజ సేవచేయడానికో సూర్యుడు వాళ్లకు అదనపు సమయం ఇవ్వడు. వాళ్ళు తమ భార్యా పిల్లల నుండి ఆ సమయాన్ని తస్కరించాల్సి వుంటుంది. పచ్చి దోపిడి!  

ప్రతి ఆదివారం భర్త సభలు సమావేశాలు అంటూ వెళ్ళిపోతుంటే ఆ భార్యకు ఆదివారం ఒక సెలవు దినంగా సరదా దినంగా వుండదు. నా భార్య అజిత పుట్టిన రోజు జనవరి 15. ప్రతి సంవత్సరం అదే రోజున విరసం మహాసభలో, పాఠశాలలో వుండేవి. తన పుట్టిన రోజున నేను  తన దగ్గర వుండే అవకాశం లేకపోయేది.   

సామాజిక కార్యకర్తల కుటుంబ సభ్యుల  కష్టాలు సెలవు దినాలను పోగొట్టుకోవడంతో  ఆగదు. దాదాపు ప్రతిరోజూ అదనంగా ఒకళ్ళిద్దరు కార్యకర్తలకు  వండి పెట్టాలి. అరెస్టులు అయితే అదో అదనపు ఆందోళన.  సోషల్ వర్కర్స్ బయట ఆందోళనలు చేస్తుంటారు; ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఆందోళనలో వుంచుతుంటారు.   కారంచేడు ఉద్యమంలో పాల్గొనడానికి వెళ్ళినపుడు నా పెద్ద కొడుక్కి మూడు నెలల 15 రోజులు. (వాడు 1985లో  ఏప్రిల్  2న పుట్టాడు.) అప్పుడు నా భార్య వయస్సు కూడ చాలా తక్కువ. 

ఆఫీసులో తరచూ  సెలవులు పెట్టడం వల్ల లాసాప్ పే అవుతుంది. ప్రయాణ ఖర్చులు వుంటాయి. ఆ లోటునూ కుటుంబ సభ్యులే భరించాలి.  (ఇటీవల కొందరు నాకు ట్రావెలింగ్ ఖర్చులు ఇస్తున్నారు. లేదా కొందరు సహృదయులు స్పాన్సర్ చేస్తున్నారు. అయినా కొన్నింటిని మన జేబులో నుండి పెట్టుకోక తప్పదు). తరచూ ప్రయాణాలవల్ల కొన్ని జబ్బులు వస్తాయి.  అంతగా పరిశుభ్రంగాలేని ప్రదేశాలల్లో తరచూ వుండడంవల్ల  tropical infections వస్తాయి. నాకయితే  తరచూ స్కిన్ ఎలర్జీలు వస్తాయి. వాటినీ కుటుంబసభ్యులే భరించాలి.  

సోషల్ వర్క్ ద్వార వచ్చిన సోషల్ కేపిటల్ ను కొందరు పొలిటికల్ గెయిన్ గా మార్చుకుంటారు. కొన్ని నామినేటెడ్ పోస్టుల్ని పొందుతుంటారు. నేను ఎన్నడూ ఆ పనిచేయలేదు. వైయస్ రాజశేఖర రెడ్డితో నాకు ఒక పాత్రికేయుడు, ముఖ్యమంత్రి సంబంధంకన్నా పెద్ద అనుబంధమే వుండేది. వారు ప్రధాన ప్రతిపక్షనేతగా వున్నప్పుడు నేను బలహీనవర్గాల సమాఖ్యకు అధ్యక్షునిగా వున్నాను. చినగజాం స్నోవైట్ సాల్ట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం వంటి కొన్ని ఉద్యమాలలో మేము కలిసి పనిచేశాం. కానీ నేనెన్నడూ ఆ అవకాశాన్ని  వాడుకోలేదు. 

ఫైనాన్స్ కేపిటల్ లేక, సోషల్ క్యాపిటల్ కూడ లేక ఇంటి పెద్ద ఊర్లబడి తిరుగుతుంటే ఏ భార్య అయినా, ఏ పిల్లలు అయినా ఎంతకాలం భరిస్తారూ?  తగవులు పెరిగి కొన్ని కుటుంబాలు విఛ్ఛిన్నం అయిపోతాయి. నా భార్య పిల్లల్ని చూసినపుడు నాకు అప్పుడప్పుడు గిల్ట్ (అపరాధ) భావన కలుగుతుంది. నన్ను విమర్శించే హక్కు వాళ్ళకు ఉందని కూడ నేను నమ్ముతాను. వాళ్ళు నా మీద తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంటారని నాకు గట్టి అనుమానం. 

ఈరోజు మా చిన్నకొడుకు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి 36వ పుట్టిన రోజు. నా భార్యకన్నా, మా పెద్దబ్బాయికన్నా వాడి ముందు నేను ఎక్కువ గిల్ట్ ఫీలవుతుంటాను.  వాడు ఒకవైపు "నా కోసం నువ్వేం చేశావో చెప్పు" అంటూ నన్ను తరచూ ఆటపట్టిస్తుంటాడు. మరోవైపు నేను నా కుటుంబానికి చేయాల్సిన అనేక పనుల్ని వాడు ముందుగానే చేసేస్తుంటాడు. కొన్ని సమస్యల్ని అసలు నా దృష్టికి కూడ తీసుకురాడు. ఫైనాన్స్ కు సంబంధించి వాడికి ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా తొణకడు. 

కోవిడ్ సెకండ్ వేవ్ నాటి ఉద్రిక్త పరిస్థితుల్లో  నన్నూ అజితను ఆంబులెన్స్ లో విజయవాడ నుండి హైదరాబాద్ కు చేర్చడమే ఒక పెద్ద మిరాకల్. ఒక బెడ్డు ఇద్దరు పేషంట్లుగా సాగుతున్న రోజుల్లో  ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లో స్పెషల్ రూం సాఢించడం మరో అద్భుతం. కోవిడ్ సోకిన తల్లిదండ్రుల్ని   పాండమిక్ భయంతో వదిలేసి  సంతానం పారిపోతున్న రోజులవి. వాడు అజిత గదిలో అటెండెండ్ గా వారం రోజులున్నాడు. మా ఇద్దరికీ కలిపి అక్షరాల 12 లక్షల రూపాయల బిల్లు అయింది. బేరసారాలాడితే, ఎవరిచేతనయినా చెప్పించితే   బిల్లులో ఓ ఇరవైవేలో, 30 వేలో తగ్గేదేమో. వాడికి ఆ పని చేయడం ఇష్టం లేదు.  "పేరెంట్స్  వైద్యం కోసం బేరసారాలాడాలా?" అంటూ కసురుకున్నాడు. పైగా,  మా వైద్యానికి సహకరించిన ఓ లేడీ డాక్టరుకు ఓ ముఫ్ఫయి వేల రూపాయల వాచీని కొని బహుమతిగా ఇచ్చాడు.  కోవిడ్ కాలంలో కార్పొరేట్ హాస్పిటల్స్ ను మెచ్చుకున్నది వాడొక్కడే అయ్యుంటాడు.  పేరెంట్స్‍కు పాతికవేల రూపాయల మెడికల్ బిల్లు కట్టడంలో థ్రిల్ వుండదు;  పాతిక లక్షల రూపాయల బిల్లు కట్టడంలో ఓ కిక్ వుంటుందనుకునే బాపతు వాడు. 

వాడు అదోరకం. మనసు కోరితే ఎక్కడో యూరప్ లో మంచుకొండల శిఖరాలకు వెళ్ళి  యోగా చేస్తాడు. మూడ్ వస్తే గోదావరిజిల్లాలో  ఓ మారుమూల గ్రామానికి  వెళ్ళి స్థానికులతో కలిసి చుట్టలో సిగరెట్లో కాలుస్తూ కబుర్లు చెప్పివస్తాడు. No set rules అనేది వాడి పాలసీ. 

రష్యాలో అక్టోబరు విప్లవం కొనసాగుతున్న కాలంలోనే అమెరికాలో జాక్ లండన్ సోషలిస్టు నాయకునిగా వున్నాడు. అయితే, అమెరికాలో అప్పుడు విప్లవ పరిస్థితులు లేవు. సినిమాలు ఇతర వ్యాపకాల్లో జాక్ లండన్ బాగా డబ్బు సంపారించాడు. అమెరికాలో సామ్యవాద విప్లవం రాకపోయినా తానే ఒక సామ్యవాద వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. దాని కోసం ఒక సువిశాల  ranch నెలకొల్పాడు. ఆ సమయంలో అనేక మంది సోషలిస్టులు  అమెరికా జైళ్ళలో మగ్గుతున్నారు. జాక్ లండన్ వాళ్ళందరికీ  ఒక ఉత్తరం రాశాడు. "సామ్యవాద విప్లవం జరగలేదని మీరు నిరాశ చెందవద్దు. మీరు విడుదల అయ్యాక నా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి కమ్యూన్ జీవితాన్ని గడపండి. ఇక్కడ యజమాని లేడు; కార్మికులు లేరు; అందరూ సమానులు; సహోదరులు. వ్యవసాయం చేద్దాం. వచ్చింది అందరం ఆస్వాదిద్దాం" అంటూ తన ఉటోపియన్ కలను వివరించాడు.   

హైదరాబాద్ మాధాపూర్ లోని అనిల్  5 బెడ్ రూం అప్పార్ట్ మెంట్  ఒక మోడ్రన్ కమ్యూను.  తన పరిచయస్తులు  ఎవరయినా ఉద్యోగంలోగానీ, కుటుంబంలోగానీ  ఇబ్బంది పడుతున్నట్టు తనకు చెపితే వెంటనే  కమ్యూన్ కు వచ్చేయమంటాడు. అనేకమంది అమ్మాయిలు అబ్బాయిలు ఆ ఆశ్రయానికి వచ్చి  నెలల తరబడి వుంటారు. ఏళ్ళ తరబడి వున్నవాళ్ళు కూడ వున్నారు. మెరుగైన అవకాశాలు వచ్చినవాళ్ళు వెళిపోతుంటారు. కొత్తవారు వచ్చి ఆ కమ్యూన్ లో చేరుతుంటారు.  అక్కడ అయ్యే ఖర్చుల్ని  వాళ్ళంతా తమ శక్తి మేరకు కాంట్రిబ్యూట్ చేస్తుంటారు; తమ అవసరం మేరకు తీసుకుంటుంటారు. కమ్యూన్ అంటే అదేకదా. "శక్తి మేరకు శ్రమ; అవసరం మేరకు ఫలితం".

అది మాత్రమేగాక, సమీపబంధువుల్లో కష్టాల్లోవున్న కొందరి పిల్లలకు వాడు కాలేజీ ఫీజులు కడుతుంటాడు. అలాగని వాడి దగ్గర పెద్ద ఆస్తుపాస్తులు లేవు, వాడు ఒకరకం  జీవన విధానాన్ని ఎంచుకున్నాడు. సంపాదించిందంతా అలా ఖర్చుపెట్టేస్తుంటాడు. ప్రతి నెల జీరో బ్యాలెన్స్; బట్ మోర్ హ్యాప్పి! 

వాడూ వాడమ్మ ఒకే గ్రూపు. వాళ్ళు  తరచూ నన్ను విమర్శిస్తుంటారు. మరోవైపు, నన్ను చాలా హై పెడస్టల్ లో వుంచడానికి సమస్త సౌకర్యాలు సమకూర్చుతుంటారు. నేనూ అప్పెరల్ మీద ఎక్కువ శ్రధ్ధచూపుతుంటాను. వాడు నాకన్నా అతివాది.  మొన్న నా బర్త్ డేకు వాడు  నైక్ ఎయిర్ జూమ్ రన్నింగ్ షూస్ కొనుక్కోమని18 వేల రూపాయలు పంపించాడు. నేను అంత అక్కరలేదు అంటే వాడు ఈ వయసులో  'కంఫర్ట్' ముఖ్యం అంటాడు.  నువ్వు ఇంకా మంచి డ్రెస్ లు వేసుకో,  ఇంకా మంచి డ్రింక్ తాగు. ఆ ఖర్చులు బడ్జెట్ వ్యవహారాలు నాకు వదిలేయి. నీకు ఆనందాన్ని ఇచ్చేదయితేనే ఒక యావగేషన్ కోసం  రోజుకు రెండు మూడు గంటలకు మించని  జాబ్ చేయి. అంతేకానీ, డబ్బుల కోసం జాబ్ చేయకు అని ఆదేశిస్తుంటాడు.  

"ఏరా! నీకు ఎక్కడో నా మీద చాలా అసంతృప్తి వుంటుందికదూ' అని అప్పుడప్పుడు అడుగుతుంటాను.  వాడు చిత్రమైన వాదన చేస్తుంటాడు. నాకు చాలా బిజినెస్  నాలెడ్జ్ వున్నప్పటికీ,   కార్పొరేట్లతో కలిసి పనిచేసినప్పటికీ, కొన్ని వాణిజ్య సంస్థలకు సలహాదారునిగా వున్నప్పటికీ దాన్ని సంపదను పెంచుకోవడానికి వాడకపోవడం పొరపాటు అనేది వాడి అభిప్రాయం. 

పైగా, "నువ్వు చేసిన ప్రధాన తప్పు ఏమంటే నీ కాంట్రిబ్యూషన్ విలువ తెలీని సొసైటీలో నీ నైపుణ్యాన్ని ఖర్చు పెట్టేశావు. నీ నైపుణ్యం  విలువ తెలిసిన సొసైటీలో దాన్ని వాడి వుంటే మొత్తం సన్నివేశం మారిపోయివుండేది" అంటాడు. "ఆఫ్ట్రాల్ ఒక పన్నెండు లక్షల రూపాయల మెడికల్ బిల్లుకు కంగారు పడే పరిస్థితిని ఇప్పుడు నువ్వు  తెచ్చుకోవాలా? ఇలాంటి ఖర్చులు చాలా వస్తాయని ముందుగా ఊహించి దానిని ఎదుర్కోవడానికి  సిధ్ధంగా వుండాలికదా?  ఆ పని నువ్వు చేయలేదు. ఆ లోటు ప్రభావం నీ పిల్లలుగా మా  జెనరేషన్ మీద తప్పక వుంటుంది" అంటాడు. ఆ తప్పుకు నన్ను ఎప్పుడూ క్షమించనని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు.

"ఇప్పుడు నేనేదో అన్నానని నువ్వు ఫీల్ కాకు. నువ్వు ఎలా జీవించాలనుకున్నావో అలాగే జీవించావు. నేను ఎలా జీవించాలనుకుంటున్నానో అలాగే జీవిస్తున్నాను" అప్పుడు మాత్రం "you are my hero" అంటాడు. 

"నాన్నా! మా కోసం నువ్వు అనేక సంతోషాలను త్యాగం చేసివుంటావు. గర్ల్ ఫ్రెండ్స్ ను   కోల్పోయి వుంటావు. డెస్టినేషన్  టూర్స్ అవకాశాల్ని వదులుకుని వుంటావు.  ఇప్పుడు మనకు  ఆ పరిస్థితి లేదు.   నీ   గర్ల్  ఫ్రెండ్స్ ఒప్పుకుంటే వాళ్లతో  ఇక్కడికి వచ్చి వుండు. నీకు ఎక్కడికయినా వెళ్ళి వుండాలనిపిస్తే వెళ్ళు. మొత్తం నేను స్పాన్సర్ చేస్తా "  వంటి అనేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తుంటాడు.

బాల్యంలో నా కష్టాలన్నింటికీ మా నాన్న నిస్సహాయత పేదరికమే  కారణం. అంచేత ఎక్కడో మానాన్న మీద నాకు ఒక అసంతృప్తి వుండేది. అయితే, ఆయన్ని నేను 'నా శక్తిమేరకు' మంచిగా చూసుకున్నాను. ఇందులో  చిన్న కుట్ర దాగుంది. మీరు నాకు ఇచ్చినదానికన్నా నేను మీకు ఎక్కువ తిరిగి ఇస్తున్నాననే  మెసేజ్ ను వారికి అలా ఇచ్చేవాడిని. మా రెండోవాడు కూడ సరిగ్గా అలాంటి మెసేజ్ ను నాకు ఇస్తున్నాడని నాకు గట్టి అనుమానం. 

చాలాసార్లు మా చిన్నోడు నా Alter ego ఏమో అని నాకు అనుమానం వేస్తుంటుంది. 
I Love you Anil. Happy Birthday.

26 September 2022

No comments:

Post a Comment