ప్రసంగించమని చాలా ప్రేమగా పిలుస్తారు
ప్రసంగం వీడియోను ఒక జ్ఞాపకంగా మాత్రం ఇవ్వరు!
సభలకు నన్ను వక్తగా పిలిచేవారు చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. అసలు మన మీద ప్రత్యేక అభిమానం వుంటేనేగా వాళ్ళు వక్తగా పిలిచేది!. ఏసి టూ టైర్ ట్రైన్ టిక్కెట్టు ఇస్తారు; ఏసి డబల్ బెడ్ రూం లో బస ఏర్పాటు చేస్తారు. మంచి భోజనం పెడతారు. ఉదయాన్నే రైల్వేస్టేషన్ వద్ద రిసీవ్ చేసుకుంటారు. రాత్రి మళ్ళీ స్టేషన్ కు వచ్చి వీడ్కోలు చెపుతారు. వచ్చే ఏడాది కూడ మీరే మా మెయిన్ స్పీకర్ అంటారు. అప్పుడుడప్పుడు శాలువ కూడ కప్పి అభిమానం చాటుకుంటారు.
అయితే కొందరు సభకు సంబంధించిన కొన్ని బేసిక్స్ ను మరచిపోతారు. అది వాళ్ల తప్పుకాదు; వాళ్ళకు బేసిక్స్ తెలీవు. నిపుణులను అడిగి బేసిక్స్ తెలుసుకోవాలని తెలియకపోవడం మాత్రం పెద్ద తప్పే.
సభలో ప్రాణప్రదమైన అంశం సౌండ్ అండ్ లైట్. సౌండ్ లో ఐదు అంశాలుంటాయి. మైక్రో ఫోన్, స్టాండ్, పోడియం, సౌండ్ సిస్టమ్, ఆకోస్టిక్స్. చాలా చోట్ల చేతికి మైకి ఇచ్చి మాట్లాడమంటారు. అలాంటి చోట్ల నాకు మూడు నాలుగు నిముషాల కన్నా ఎక్కువ సేపు మాట్లాడడం చాలా కష్టం. నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని అనుభవించడానికి చాలా స్ట్రేయిన్ పేయిన్ ను చవిచూడాల్సి వస్తుంది.
కొందరికి త్రీ-పాయింట్ లైటింగ్ గురించి బొత్తిగా తెలీదు. స్పీకర్ వెనుక లైటింగ్ పెడతారు. స్పీకర్ ముఖం మీద లైటింగ్ వుండదు. అప్పుడు స్పీకర్ సిల్హౌటీలో ప్రేక్షకులకు నల్లగా దయ్యంలా కనపడుతుంటాడు. స్పీకర్ ముఖకవళికలు అస్సలు కనిపించవు. స్పీకర్, శ్రోతల మధ్య ఒక అన్యోన్య సంబంధం ఏర్పడకపోతే ఎన్నడూ ఉపన్యాసం రక్తికట్టదు.
ఉపన్యాసం అనేది ప్రదర్శనకళ. పెర్ఫార్మింగ్ ఆర్ట్. ఆడియో విజువల్ ప్రాడక్ట్. ఆ ఫెసిలిటీస్ అన్నీ దానికి ప్రాధమిక అవసరాలు.
పది మందిలో ఒక స్పీకర్ గా పిలిస్తే దానికి పెద్దగా ప్రిపరేషన్ అవసరం వుండదు. సందర్భాన్నిబట్టి స్పాంటేనిటీని ఉపయోగించి రెండు మూడు నిముషాలు మాట్లాడితే సరిపోతుంది.
ఒక ప్రత్యేక సందర్భంలో ఒక ప్రత్యేక అంశం మీద సమగ్రంగా ప్రసంగించడానికి పిలిచినపుడు దానికి కనీసం ఓ పది రోజుల ప్రిపరేషన్ అవసరం అవుతుంది. కావలసిన రీసెర్చ్, రిఫరెన్సెస్ పూర్తి అయ్యాక నేను పాయింట్ల వారీగా నోట్స్ రాసుకుంటాను. ఉపన్యాసం ఇవ్వడానికి ఓ నాలుగు రోజుల ముందే నిర్వాహకులకు నా ఉపన్యాసం ప్రసంగ పాఠం కాపీ పంపుతాను. వాళ్ళు తమకు ప్రత్యేక ఆసక్తిగల మరికొన్ని అంశాలను చేర్చమంటారు. అనవసర అపార్ధానికి అవకాశం వుంటుందనుకునే కొన్ని అంశాల్ని తీసేయమంటారు. వాళ్ళ సూచనలు వచ్చాక పైనల్ కాపీ తయారు చేసుకుంటాను.
"ఇక ముగించాలి" అని అధ్యక్షుడు అనడానికి ముందే ప్రసంగాన్ని ముగించడం మంచి సాంప్రదాయం. ఇచ్చిన దానికన్నా ఎక్కువ సమయం ప్రసంగించి ఇతర వక్తల సమయాన్ని హరించే హక్కు ఏ వక్తకూ లేదు. నా ప్రసంగానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు అని నిర్వాహకుల్ని ముందే అడుగుతాను . నిర్వాహకులు సాధారణంగా మనకు 30 నిముషాల వ్యవధిని ఇస్తారు. సబ్జెక్ట్ విస్తారాన్ని బట్టి కొందరు 45 నిముషాలు, ఒక గంట కూడ వ్యవధి ఇస్తారు. వారు చెప్పిన వ్యవధిని దాటకుండ నా ప్రసంగాన్నీ జాగ్రత్తగా ఎడిట్ చేసుకుంటాను. ఒకసారి రిహార్సల్ కూడ చేస్తాను. అది ఇక నేరుగా ప్రింటర్ కాపీగా మారిపోతుంది.
కొందరు నిర్వాహకులు మొదట ఫోన్ చేసినపూడు తగిన సమయమే కేటాయిస్తారు. తీరా సభ మొదలయ్యాక వాళ్ళకు కొన్ని లోకల్ ఆబ్లిగేషన్స్ గుర్తుకు వస్తాయి. జాబితాలో లేనివాళ్లనూ వేదిక మీదికి పిలుస్తారు. ఈ ఆబ్లిగేషన్ స్పీకర్లు మాట్లాడిన సమయాన్ని ప్రధాన వక్తకు కేటాయించిన సమయంలో కోత వేస్తారు. ఇక ఆ ఉపన్యాసం ఒక లాంఛన ప్రాయంగా మారిపోతుంది.
నన్నొక ఇంపార్టెంట్ స్పీకర్ గా పిలిచిన ప్రతి సభకూ నేను కొత్త బట్టలతో వెళతాను. ఆ కొత్త బట్టలు ఆ ఉపన్యాసానికి గుర్తుగా వుంటాయి. వాటిని చూసినపుడు ఆ ఉపన్యాసం, దాన్ని నిర్వహించినవారు, మెచ్చుకున్నవారు, విబేధించినవారు, సూచనలు చేసినవారు, ఆనాటి వాతావరణం మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ బట్టల జతకు అంతటి ఎటాచ్ మెంట్ వుంటుంది. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. మెమెంటో అన్నమాట!
ఉపన్యాసానికి పాయింట్లు రాసుకుని సాప్ట్ / హార్డ్ కాపీలతో వెళ్ళినపుడు అనివార్యంగా పోడియం, మైక్రోఫోన్ స్టాండ్ కావాలి. అవి రెండూ లేకుండ కేవలం మైక్ చేతికి ఇస్తే మన కుడిచేతిని కట్టేసినట్టే. ఎడమ చేతిలో కాగితాలుంటాయి. లేదా సాఫ్ట్ కాపీతో సెల్ పోన్ వుంటుంది. అక్కడికి వక్త సగం చచ్చిపోతాడు. తోడేలును భోజనానికి పిలిచి సన్నటి కూజాలో పాయసం పెట్టిన కొంగ కథ గుర్తుకు వస్తుంది. వక్తల్ని 'దివ్యాంగులు'గా మార్చి ప్రసంగించమనడం ఏం న్యాయం?
ఉపన్యాసానికి ఎప్పుడైనా బలాన్ని ఇచ్చేది సబ్జెక్ట్, సందర్భం. ఆ తరువాత మంచి ఉపన్యాసానికి ఇంకో రెండు దినుసులు కావాలి. ఇందులో మొదటిది; వేదిక ముందు వుండే శ్రోతల శ్రధ్ధ. ఉపన్యాసాన్ని శ్రోతలు శ్రధ్ధగా వింటుంటే ఉపన్యాసకుడి బాధ్యత పెరుగుతుంది. ఉపన్యాసం ఇంకా మెరుగుపడుతుంది. రెండోది, వేదిక మీద వుండే సాటి వుపన్యాసకులు. తనతో సమఉజ్జీగా భావించే మరో ఉపన్యాసకుడు వేదిక మీద వుంటే ఉపన్యాసకునిలో పోటీతత్వం పెరుగుతుంది. అప్పుడూ ఉపన్యాసం గొప్పగా రక్తికడుతుంది.
ఇక్కడితో నిర్వాహకులు తమ పని పూర్తయిపోతుంది అనుకుంటారు. కానీ, ఉపన్యాసలకు మరో ముఖ్యమైన బాధ్యత మిగిలే వుంటుంది. అదే ఉపన్యాసానికి ఆడియో వీడియో కాపి. చాలా మంది నిర్వాహకులు ఈ బాధ్యతను చాలా నిర్లక్ష్యం చేస్తారు. ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్ ను పెట్టుకోరు. ఈ రోజుల్లో అదేమి ఖరీదయిన వ్యావహారం కాదు. 1000 - 1500 రూపాయలిస్తే అన్నీ తామే చూసుకుని ఎడిట్ కాపీని పెన్ డ్రైవ్ లో వేసి ఇచ్చే వీడియోగ్రాఫర్లు దాదాపు అన్ని పట్టణాల్లోనూ వున్నారు. మీటింగ్ ఖర్చుతో పోలిస్తే ఇది పెద్ద లెఖ్ఖలో ఖర్చుకాదు. వక్తల ట్రావెలింగ్ ఫేర్ , ట్రావెలింగ్ అలవెన్సెస్, క్యాబ్స్ కాస్ట్ , ఏసి వసతి, భోజనం వగయిరాలకు ఒక్కొక్కరికి సగటున 8 వేల రూపాయలు అవుతాయి. అలా పోల్చినా వీడియో గ్రాఫర్ ఖర్చు పెద్దదేమీకాదు.
స్మార్ట్ ఫోన్లు వుంటే చాలు ఎవరయినా సరే వీడియో తీసేయవచ్చనే భ్రమల్లో చాలామంది వుంటారు. కొన్ని చోట్ల ఏకంగా నిర్వాహకుల పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి తమాషా చూస్తుంటారు. మరికొన్ని చోట్ల కెమేరా ఫిజిక్స్ గురించీ, ఫ్రేమ్ జామెట్రీ గురించి, ఎక్స్ పోర్ట్ రిజల్యూషన్ గురించి ఏమాత్రం పరిజ్ఞానం లేని వారికి ఈ బాధ్యతను అప్పచెపుతారు.ఇంతటి నిర్లక్ష్యాన్ని నేను భరించలేను. చాలా అసహనానికి గురవుతాను.
ఒక చారిత్రక సందర్భంలో ఒక సభను నిర్వహిస్తున్నవారికి ఆ సంఘటనను చరిత్రలో పదిలపరచాలనే స్పృహ వుండాలి.
ఈ అమెచ్యూర్ కెమేరామన్ లకు కొన్ని సూచనలు చేయాలనిపిస్తున్నది. ఫొటోలు తీసే సమయంలో కెమేరాను వర్టికల్ (పోట్రెయేట్)గానూ పట్టుకోవచ్చు. హారిజాంటల్ (ల్యాండ్ స్కేప్)గానూ పట్టుకోవచ్చు. కానీ, వీడియో తీసే సమయంలో విధిగా హారిజాంటల్ (ల్యాండ్ స్కేప్) యాంగిల్స్ లో మాత్రమే తీయాలి. ఈ వీడియోను స్మార్ట్ టీవీలో చూసేటప్పుడు ఎలావుంటుందనే ఆలోచన వుండాలి. ఎక్కడెక్కడ గ్రాఫిక్ ప్లేట్స్ వస్తాయి అనే ఊహ వుండాలి. మిగిలిన స్పేస్ లో మన ఆబ్జెక్ట్ ను ఎలా కంపోజ్ చేయాలనేది చాలా ముఖ్యం. అదే సృజనాత్మకత.
లక్షన్నర రూపాయల ఖరీదు చేసే ఆపిల్ ఫోన్లు కాకపోయినా ఇరవై వేల రూపాయల విలువచేసే MI 10i ఫోన్లలోనూ Full High Defenition (FHD 1920 X 1080p) రిజల్యూషన్ వస్తుంది. అంతకు తక్కువ రిజల్యూషన్ వుంటే ఆ వీడియో ఎందుకూ పనికిరాదు; ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చాము అని సంతృప్తిపడడానికి తప్ప. FHD రిజల్యూషన్ లో రికార్డ్ అయిన వీడియో ఫైల్ ను అవసరాన్ని బట్టి అనేక రకాలుగా వాడవచ్చు. 4K, 8K రిజల్యూషన్లు అందుబాటులో వున్న కాలంలో కనీసం FHD రిజల్యూషన్ లో అయినా వీడియో తీయకపోతే ఆ వీడియోగ్రాఫర్ ను పురాతత్వ ప్రదర్శనశాలలో పెట్టాలి.
వీడియో తీసే సమయంలో ప్రతి 20-30 నిముషాలకు ఒక కట్ వేసుకోవాలి. వక్తను జాగ్రత్తగా గమనిస్తూ అతను పాజ్ తీసుకున్నప్పుడో, మంచినీరు తాగుతున్నప్పుడో కట్ వేసుకుంటే మరీ మంచిది. 30 నిముషాల లోపు వుండే ఫైల్స్ ను డౌన్ లోడింగ్ - అప్ లోడింగ్ -చేయడం సులువు. భారీ ఫైల్స్ ఒక్కోసారి అప్ లోడింగ్ -డౌన్ లోడింగ్ జరగవు. దిగువస్థాయి కంప్యూటర్లలో స్ట్రక్ అయిపోతాయి.
సభల వీడియోలవల్ల ఒక విశాల ప్రయోజనం వుంటుంది. సాధారణంగా మన సభలకు ఓ వందమంది వస్తుంటారు. కరోనానంతర కాలంలో అంతమంది కూడ రావడంలేదు. ఆ సభ ప్రసంగాల వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే కనీసం ఇంకొ 2, 3 వందల మంది చూస్తారు. సభల్ని నిర్వహించేది భావప్రచారం కోసమే కనుక ప్రసంగాల వీడియోలు తప్పని సరి.
మొన్న సెప్టెంబరు 14న నేను MI 10i మొబైల్ ఫోన్ మీద తీసిన భార్గవ గడియారం ప్రసంగం వీడియో లింకుల్ని కింద కామెంట్స్ లో పెట్టాను. ఓసారి చూడండి. అదే సభలో నేను కూడ ప్రసంగించాను. నా ప్రసంగాన్ని ఎవరూ ప్రాపర్ గా వీడియో తీయలేదు. ఒకరు తీశారుగానీ, వారు. కెమెరాను కత్తిలా నిలువుగా పట్టుకుని ఫేస్ బుక్ లో లైవ్ ఇస్తున్నారు. అలా కెమేరాను నిలుగా ఎన్నడూ పట్టుకోరాదు. అలా చేస్తే ఇమేజ్ 67 శాతం వృధా అవుతుంది. ఫ్రేమ్ ను ట్రిమ్ చేస్తే ఇంకో 20 శాతం పోతుంది. ఇచ్చిన స్పేస్ లో 90 శాతం వృధా చేసేవారిని ఏమనాలీ? ఉపన్యాసం మధ్యలోనే కనీసం కెమెరాను అడ్డంగా పట్టుకోమని ఆ మొబైల్ ఫోన్ రవినగాయిచ్ కు సౌంజ్ఞ చేశారు. నిలువుగా వీడియో తీయడానికే ఆ కత్తి వీరుడు అంకితమయ్యారు.
2020 సెప్టెంబరు 9న విజయవాడ ఏంబి భవన్ లో 'శ్రీశ్రీ' విశ్వేశ్వరరావు నాయకత్వంలోని సాహితీమిత్రులు నిర్వహించిన 'ఫాసిజం ప్రమాదం' సభ ఒక ప్రామాణిక కార్యక్రమం. టాపిక్ గంభీరమైనది. వేదిక మీద ఇద్దరమే ఉపన్యాసకులం. మొదట నేను, తరువాత తమ్మినేని వీరభద్రం. ఇద్దరికీ చేరో 45 నిముషాలు కేటాయింపు. ఆ సభకు అధ్యక్షోపన్యాసం కూడా లేదు. కేవలం వక్తల పరిచయ వాక్యాలు మాత్రమే వున్నాయి. పరిచయ వాక్యాల్ని కూడ విశ్వేశ్వరరావు ప్రముఖ కవి రావులపాటి సీతారాం తో రాయించాడు. మా తరువాత గోరటి వెంకన్న, విమలక్కలు చెరో 45 నిముషాల వాగ్గేయ ప్రదర్శనలు చేశారు. హాలు బాగుంది, వేదిక బాగుంది, సౌండ్ అండ్ లైట్ ఏర్పాట్లు బాగున్నాయి. శ్రధ్ధగా వినే ఆడియన్స్ వున్నారు. అంతా చాలా చక్కగా సమకూరింది. విశ్వేశ్వరరావు తన అభిరుచికి తగ్గట్టు ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ ను పెట్టాడు. అంతేగాక, అంతర్జాతీయ స్థాయి ఫొటోగ్రాఫర్ ను కూడ ఏర్పాటు చేశాడు. వారం రోజుల తరువాత నా ప్రసంగం వీడియో ఫైల్, కార్యక్రమంలో నేను వున్న ఫొటోల కట్ట చాలా శ్రధ్ధగా నాకు అందజేశాడు. అప్పుడు శ్రీనివాసరెడ్డి తీసిన ఫొటోనే ఇప్పటికీ నా ఫేస్ బుక్ వాల్ లో కవర్ ఫొటోగా కొనసాగుతోంది.
(విశ్వేశ్వర రావు మీటింగు వీడియోతోపాటూ, మొన్న 14 సెప్టెంబరు నాటి వీడియోల లింకుల్ని కూడ కామెంట్స్ బాక్స్ లో పెట్టాను. చూసి మీరే బేరీజు వేసుకోవచ్చు).
No comments:
Post a Comment