Saturday 21 January 2023

Muslim society better not to insist for polygamy

For Publication in the Edit page of Andhrajyothi daily.

 Muslim society better not to insist for polygamy

 బహుభార్యత్వం కోసం  ముస్లిం సమాజం

పట్టుబట్టక పోవడమే మంచిది

 

దివ్య ఖురాన్ లో ‘మహిళలు’ శీర్షికతో ఒక సూరా వుంది. ఆ సూరా పేరు ‘అన్ నిసా’. ఖురాన్ లో ఇది నాలుగవ సూరా. బానిసలు, అనాధలు, నిరుపేదలు, నిరాశ్రయులు, వితంతువులు అయిన స్త్రీలను ఆదుకోవడంలో భాగంగానూ,  సమాజంలో వారికి ఒక గౌరవనీయమైన స్థానం ఇవ్వడం కోసమూ  వాళ్ళను వివాహం చేసుకోవడం కూడ ఒక పరిష్కార మార్గమనే ఒక సూచన ఈ సూరాలో వుంది.


ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మందిని వివాహం చేసుకున్న సంఘటనలు మనకు అబ్రహామిక్ మతాలయిన యూదు, క్రైస్తవ, ఇస్లాంల  పవిత్ర గ్రంధాల్లోనేగాక ఇతర మత గ్రంధాలలోనూ కనిపిస్తాయి. దానికి అనేక సమర్ధనలు కూడ ఆ గ్రంధాల్లో వుంటాయి.

 

పురాణాల ప్రకారం హిందూ సమాజంలోనూ బహుభార్యత్త్వానికి అవకాశంవుంది. మధ్యయుగాల్లోనూ  బహు భార్యలు కలిగిన హిందూ రాజులు అనేకమంది మనకు కనిపిస్తారు. కానీ, వర్తమాన హిందూ సమాజం ఆ సాంప్రదాయాన్ని అధికారికంగా వదులుకుంది. అయితే, అనధికారికంగా బహుభార్యత్త్వాన్ని పాటిస్తున్నవారు హిందూ సమాజంలో మనకు అనేక మంది తారసపడుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అనధికార రెండవ భార్య వ్యవస్థను ఇప్పటికీ చూడవచ్చు. వర్తమాన భారత ముస్లిం సమాజంలోకన్నా హిందూ సమాజంలోనే బహుభార్యత్త్వం ఎక్కువ సంఖ్యలో వుందని కొన్ని సామాజిక పరిశోధనల గణాంకాలు చెపుతున్నాయి.

గత ఏడాది జులై నెలలో జాతీయ కుటుంబ- ఆరోగ్య సర్వే (NFHS) ప్రకటించిన నివేదిక ప్రకారం ముస్లింలు, హిందువులకన్నా క్రైస్తవుల్లో బహుభార్యత్త్వం ఎక్కువ శాతం వుందట. ఆదివాసీ తెగల్లో ఒక సాంప్రదాయంగా బహుభార్యత్త్వం వుండడం,  ఈశాన్య రాష్ట్రాల్లోని ఆదివాసుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు కావడం దీనికి కారణమని ఆ సర్వే నివేదిక పేర్కొంది.

ముస్లిం సమాజంలో బహుభార్యత్త్వానికి కొన్ని షరతులతో ధార్మిక సమర్ధన వుంది కానీ దాన్ని పాటిస్తున్న వాళ్ళు చాలా చాలా తక్కువ. హిందూ సమాజం బహుభార్యత్త్వాన్ని త్వజించింది కానీ దాన్ని ఇప్పటికీ పాటిస్తున్నవాళ్లు ముస్లీంలకన్నా ఎక్కువ. మరోమాటల్లో చెప్పాలంటే ముస్లిం సమాజం బాహాటంగా చేస్తున్నదాన్ని హిందూ సమాజం చాటుగా చేస్తున్నది. కొన్ని గ్రామాల్లో ‘వుంపుడుగత్తెల’ (స్త్రీవాదులు క్షమించుగాక!) సమూహాలు ఇప్పటికీ బాహాటంగానే  కనిపిస్తాయి.

 

బహుభార్యత్త్వం కూడ విడాకుల వివాదం లాంటిది. దేశంలో ముస్లిం సమాజంలో కన్నా హిందూ సమాజంలో విడాకులు పొందిన స్త్రీలు చాలా ఎక్కువ. కానీ ముస్లిం పురుషులు చాలా సులువుగా విడాకులు ఇచ్చేస్తారనే సాధారణ అభిప్రాయమే సమాజంలో బలంగా వుంది. వివాహ వయస్సు విషయంలోనూ ఇలాంటి అపోహలే వున్నాయి. సిపాయిల తిరుగుబాటుకు పదేళ్లు ముందు వివాహానికి కనీస వయస్సును పదేళ్ళుగా నిర్ణయిస్తూ చట్టం వచ్చింది. అంటే అంతకు ముందు అంతకన్నా తక్కువ వయస్సున్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. ఇది కేవలం ముస్లింల సాంప్రదాయంకాదు; బ్రిటీష్ ఇండియాలో అందరి సాంప్రదాయం. కానీ ముస్లింలు మాత్రమే అతి పిన్న వయస్సులో ఆడపిల్లలకు పెళ్ళి చేస్తారనే అభిప్రాయం ఇతర సమాజాల్లో బలంగా నాటుకుంది.

భారత ముస్లింలు అంతర్ముఖులుగావున్నా, మౌన ప్రేక్షకులుగా వుండిపోతున్నాసరే సహించలేని సమూహాలు ప్రస్తుతం అధికారంలో వున్నాయి. అవి తరచూ ముస్లింలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడాన్ని మనం గత దశాబ్ద కాలంగా చూస్తున్నాం. ఇతర సమాజాల ముందు ముస్లింలను అనాగరికులుగా చిత్రించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ముస్లిం సమాజాన్ని వేధిస్తే  మరో సమాజం ఆనందిస్తే అది ఎన్నికల్లో ఓట్లుగా మారి వరుస విజయాలను  సమకూరుస్తుందనే రాజకీయ వ్యూహం ఒకటి దేశవ్యాప్తంగా అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలే ఈ రకం వ్యూహాలను రచిస్తున్నప్పుడు ఇక వారి అభిమానులైన అల్లరి మూకలు ఊరుకుంటాయా? ఈ మూకలు ఏం చేసినా వాళ్ళకు సత్కారాలుంటాయి; పదోన్నతులు దక్కుతాయి; శిక్షలు మాత్రం వుండవు. టోటల్ లీగల్ ఇంప్యూనిటి!

దేశంలో ట్రిపుల్ తలాక్ వివాదం సాగుతున్న రోజుల్లోనే సంఘీయులు కొందరు ‘బహుభార్యత్త్వం’, ‘నిఖా హలాలా’ల మీద కొత్త వివాదాన్ని రేపారు. ఈ రెండు సాంప్రదాయాలు రాజ్యంగబధ్ధమో, చట్టబధ్ధమో తేల్చాలంటూ 2018 జులైలో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సహా పలువురు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (PIL) వేశారు.  ఈ వివాదాన్ని తేల్చడానికి సుప్రీంకోర్టు జస్టిస్ ఇందిరా బెనర్జీ, హేమంత్ గుప్తా, సూర్యకాంత్, ఎంఎం సుంద్రేష్, సుధాన్షు ధులియాలతో  ఐదుగురు - జడ్జీల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం గత ఆగస్టు 30న జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC), జాతీయ మహిళా కమీషన్ (NCW), జాతీయ మైనారిటీస్ కమీషన్ (NCM) లను ప్రతివాదులుగా చేర్చి ఈ అంశం మీద వాళ్ళ అభిప్రాయాలను కోరింది.  జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తా మూడు నెలల క్రితం పదవీ విరమణ చేయడంతో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. ఐదుగురు – జడ్జీలతో కొత్తగా  రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం జనవరి 20న ప్రకటించింది.

ఈ సందర్భంగా మనం ఆధునిక కాలంలో పౌరస్మృతి చరిత్రను ఒకసారి మననం చేసుకోవాలి. దేశంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలయిన కొత్తలోనే వలస పాలకులకు ఒక విషయం  స్పష్టంగా బోధపడింది. తమ పౌరస్మృతి భారతదేశ సంస్కృతికి పొసగదనీ, బ్రిటీష్ పౌరస్మృతిని వలస దేశంలో బలవంతగా అమలు చేస్తే తిరుగుబాట్లు చెలరేగుతాయనీ వాళ్లు గుర్తించారు. తమ తమ పౌరస్మృతుల్ని ప్రకటించాల్సిందిగా ముస్లిం, హిందూ ధార్మిక ప్రతినిధుల్ని కోరారు. ముస్లింలు ఖురాన్-హదీసుల్ని, హిందువులు మనుస్మృతిని తమ పౌరస్మృతులుగా పేర్కొన్నారు. వాటిని ఆమోదిస్తూ 1772 ఆగస్టు 15న అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ ఉత్తర్వులు జారీచేశాడు. అప్పటి నుండి మనుస్మృతి, ఖురాన్-హదీసులు హిందూ, ముస్లింల అధికార పౌరస్మృతులుగా కొనసాగాయి.

స్వాంతంత్ర్యం వచ్చాక, దేశవాసులందరికీ “న్యాయమూ, స్వేఛ్ఛ, సమానత్వము, సోదరభావం”లను హామీ ఇచ్చిన భారత రాజ్యాంగం 1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆమోదాన్ని పొందింది. 1950 జనవరి 26 నుండి  అమల్లోనికి వచ్చింది. మనుస్మృతిని తొలగించి ఆ స్థానాన్ని కబళించిందని భారత రాజ్యాంగాన్ని ఆనాడు తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాలే ఇప్పుడు బహుభార్యత్త్వం, నిఖా హలాలాలకు రాజ్యాంగ ఆమోదం వుందోలేదో  తేల్చాలని వాజ్యం వేశాయి. తంపులమారితనం మన సాంస్కృతిక జీవితంలో భాగం అయిపోయింది.

 

రేపు ఏర్పడబోయే ఐదుగురు జడ్జీల రాజ్యంగ ధర్మాసనం అంతిమంగా ఎలాంటి తీర్పు చెపుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం. అత్యున్నత న్యాయస్థానపు అత్యున్నత ధర్మాసనం ఎలాంటి తీర్పు చెప్పినా ముస్లిం సమాజం ఆమోదించక తప్పదు. అయినప్పటికీ, ముస్లిం సమాజం కూడ తనవైపు నుండి కొన్ని సంస్కరణల్ని చేపట్టాలి.

పురుషుల జనాభాకన్నా స్త్రీల జనాభా రోజురోజుకూ తగ్గిపోతున్న  కాలం ఇది. దేశంలో 52 మంది పురుషులకు 48 మందే స్త్రీలున్నారు. మరోవైపు సహజీవనానికి క్రమంగా ఆమోదాంశం పెరుగుతున్న రోజులివి, వివాహేతర లైంగిక సంబంధాలు ఇప్పుడు శిక్షార్హమైన నేరం కూడ కాదు. సమీప భవిష్యత్తులో ఇలాంటి మార్పులు అనేకం రానున్నాయి. ముస్లిం పురుషులకు అనుకూలంగావున్న తలాక్ పధ్ధతుల్ని బాధితులైన ముస్లిం స్త్రీలు సహితం వ్యతిరేకించారన్న వాస్తవాన్ని ధార్మిక పెద్దలు గుర్తు పెట్టుకోవాలి. బహుభార్యత్త్వానికి కూడ బాధితులున్నారు.  

ఇప్పటి భారత ముస్లిం సమాజంలో బహుభార్యత్త్వాన్ని కలిగివున్నవారు వెయ్యికి ఒక్కరు కూడ లేరు. ఆ కొద్ది మంది అయినా బానిసలు, అనాధలు, నిరుపేదలు, నిరాశ్రయులు, వితంతువులు అయిన స్త్రీలను మాత్రమే పెళ్లి చేసుకున్నారని  చెప్పే పరిస్థితి లేదు.  పౌరస్మృతిలోని ఈ వెసులుబాటును ముస్లింలకన్నా ముస్లిమేతరులే ఎక్కువగా వాడుకుంటున్నారనే విమర్శ కూడ వుంది. అనేక మంది సెలబ్రెటీలు బహుభార్యత్త్వం పొందడం కోసం తాత్కాలికంగా ఇస్లాంను స్వీకరించిన సందర్భాలు అనేకం వున్నాయి.  ఈ నేపథ్యంలో బహుభార్యత్త్వం సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి భారత ముస్లిం సమాజం అనవసర ప్రతిష్టకు పొయి పట్టుబట్టక పోవడమే మంచిది. అత్యున్నత న్యాయస్థానపు రాజ్యాంగ ధర్మాసనం ఎలాగూ బహుభార్యత్త్వం రాజ్యాంగ బధ్ధం కాదనే తీర్పు చెపుతుంది.  వాటిని రద్దు చేయడానికి అత్యున్నత న్యాయస్థానంతో సహకరించడమే మేలు.  దానివల్ల ముస్లిం సమాజపు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.

 

ఏఎం ఖాన్ యజ్దానీ (డానీ)

రచయిత ముస్లిం ఆలోచనాపరులు, మొబైల్ : 9010757776

 

విజయవాడ

21-01-2023 

No comments:

Post a Comment