The aim of Marxist literature is to change the society
సమాజ మార్పే మార్క్సిస్టు సాహిత్య లక్ష్యం
సమాజంలో దేనికీ ఒక అర్ధమే వుండదు. ప్రతి దానికీ అనేక అర్ధాలూ, నిర్వచనాలూ, దృక్పథాలూ వుంటాయి. కళాసాహిత్యాలు కూడ దీనికి మినహాయింపుకాదు. మనిషి ఆలోచనలు, భావాలు, సంస్కారాల నుండి కళాసాహిత్యాలు పుడతాయనే అభిప్రాయం ఒకటుంది. కళాసాహిత్యాలు ఒక మహాత్యము అనే భావన కూడ బలంగా చెలామణిలో వుంది. స్వయంగా దేవుడే తమచేత రచనలు చేయించాడు అని చెప్పుకున్న మహాకవులున్నారు.
కళాసాహిత్యాల విషయంలో మార్క్సిస్టుల దృక్పథం వేరు. వాళ్ళు సమాజాన్ని కళసాహిత్యాలకు పుట్టినిల్లుగా చూస్తారు. కళాసాహిత్యాలకే కాక సమస్తరంగాల్లో మనుషుల ఆలోచనలకు సమాజమే మూలం అనేది మార్క్సిస్టుల అభిప్రాయం. మరోమాటల్లో చెప్పాలంటే, మార్క్సిస్టుల సమాజ విమర్శ నుండే మార్క్సిస్టుల కళాసాహిత్య పరామర్శ పుడుతుంది. సమాజ విమర్శలో రాజకీయ విమర్శ కూడ వుంటుందిగనుక మార్స్కిస్టు సాహిత్యంలోనూ రాజకీయ విమర్శ వుంటుంది. దైవాంశాన్నీ, మహాత్యాలను తొలగించి కళసాహిత్యాలను శుష్కంగా మారుస్తున్నారనే నింద ఎలాగూ మార్క్సిస్టు సాహిత్యకారుల మీద వుంది. మార్క్సిస్టు సాహిత్యకారులకు సౌందర్యశాస్త్రం (aesthetics) తెలీదు; సాహిత్యాన్ని రాజకీయాలతో కలుషితం చేస్తారు అనే విమర్శ కూడ వుంది. సౌందర్యశాస్త్రంలో కూడ వర్గ దృక్పధం వుంటుంది. శ్రమే జీవన సౌందర్యం అనేది మార్క్సిస్టు సాహిత్యకారుల ప్రమాణం. కష్టాలు,. సవాళ్ళు, ఆణిచివేతల నుండి బయటపడడానికి జీవులు చేసే కృషికన్నా సౌందర్యం ప్రకృతిలోగానీ, సమాజంలోగానీ ఏముంటుందీ?
మార్క్సిస్టు సాహిత్యంలో మాత్రమే రాజకీయాలుంటాయా? ఇతర సాహిత్యాల్లో రాజకీయాలు వుండవా? అనేది తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశం. ‘కళ కళ కోసమే’ అనేది చాలా కాలం ఒక విలువగా కొనసాగింది. ‘రాజ్యం రాజ్యం కోసమే’ అనే రాచరిక నియంతృత్వం నుండి పుట్టిన సిధ్ధాంతం ఇది. ఆధునిక యుగంలో దీని మీద అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ‘ప్రభుత్వాలు ప్రజల కోసం’ అనే కొత్త విలువలు వచ్చాయి.
‘కళ కళ కోసమే’ (లాటిన్ లో Ars Gratia Artis) అనే విలువతో హాలీవుడ్ లో మెట్రో గోల్డ్విన్ మేయర్ (ఎంజియం) అనే భారీ చలనచిత్ర నిర్మాణ సంస్థ 1924లో ఏర్పడింది. కళా విలువల గురించి అంత గొప్పగా మాట్లాడిన ఆ సంస్థే ‘జేమ్స్ బాండ్’ ప్రాంచైజీను నిర్మించింది. రెండవ ప్రపంచ యుధ్ధం తరువాత బ్రిటీష్ నవలాకారుడు ఇయాన్ లాంచెస్టర్ ఫ్లెమింగ్ ‘జేమ్స్ బాండ్’ పాత్రను సృష్టించాడు. బాండ్; బ్రిటీష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్విస్ (M16) ఏజెంటు. ప్రపంచ మార్కెట్లో అప్పట్లో బ్రిటన్, అమెరికాలతో పోటీపడుతున్న రష్యా, చైనా తదితర సోషలిస్టు దేశాల్ని అవహేళన చేయడం ఈ పాత్ర లక్ష్యం. 1991లో రష్యా పతనం తరువాత జేమ్స్ బాండ్ పాత్ర ముస్లిం-చమురు దేశాల్ని అవహేళన చేయడం మొదలెట్టింది. కళకళ కోసం నినాదంతో మొదలైన సంస్థ ఇంత పచ్చిగా అంతర్జాతీయ రాజకీయాల్ని చిత్రిస్తూ సినిమాలను తీసింది. ఎంజియం సంస్థ ప్రస్తుతం ఇ-కామర్స్ జెయింట్ అమేజాన్ ఆధీనంలో వుంది. కళకళ కోసం అనే నినాదం వెనుక కూడ రాజకీయార్ధిక ప్రయోజనాలుంటాయని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.
మార్క్సిస్టు సాహిత్యకారులు తమకు రాజకీయాలున్నాయని బాహాటంగా ప్రకటించడమేగాక కళాసాహిత్యాలకు రాజకీయాలు వుండాలని కూడ వాదిస్తారు. మరోమాటల్లో చెప్పాలంటే ఇతరులు చాటుగా చేసే పనిని మార్క్సిస్టులు బాహాటంగా చేస్తారు. చెప్పాల్సిందీ, చెయ్యాల్సిందీ చాటుగానా? బాహాటంగానా అనేది ఒక్కటే తేడా?
మనుషుల సామాజిక, రాజకీయ, మేధో జీవిత ప్రక్రియలన్నింటినీ భౌతిక ఉత్పత్తి జీవన విధానం నిర్ణయిస్తుందననేది మార్క్సిస్టుల స్థూల అవగాహన. "మనుషుల సామాజిక అస్తిత్వాన్ని వాళ్ళ చైతన్యం నిర్ణయించదు; అందుకు విరుధ్ధంగా మనుషుల సామాజిక అస్తిత్వం వాళ్ళ చైతన్యాన్ని నిర్ణయిస్తుందని’ ఒక సందర్భంలో కార్ల్ మార్క్స్ చాలా స్పష్టంగా ప్రకటించాడు. It is not the consciousness of men that determines their being, but on the contrary their social being, that determines their consciousness."
సామాజిక అస్తిత్వం (social being) అనే మాట చాలా విస్తృతమైనది. ఇందులో అర్ధికం, సాంస్కృతికం, కులం, మతం, లింగం, వర్ణం, భాషా, ప్రాంతం వగయిరాలు ఎన్నో వుంటాయి. కొందరు సంకుచిత మార్క్సిస్టులు సామాజిక అస్తిత్వాన్ని కేవలం ఆర్ధిక పునాదికే పరిమితం చేయడంవల్ల దాని విస్తృతికి గండిపడుతోంది. ఆర్ధికేతర అణచివేతకు గురయ్యే సమూహాలు మార్స్కిస్టు సంస్థలకు దూరం కావడానికి ఇలాంటి సంకుచిత వాదాలు దోహదం చేస్తాయి. అన్నిరకాల దోపిడీ అణిచివేతల లక్ష్యం సారాంశంలో ఆర్ధికమే కావచ్చుగానీ దోపిడీ అణిచివేతలన్నీ ఆర్ధిక రూపంలో మాత్రమే వుంటాయనడం మూర్ఖత్వం. అది మార్క్సిజం కాదు. సంకుచిత మార్క్సిజం.
మార్క్సిస్టు కళాసాహిత్యాలు 19వ శతాబ్దం మధ్యలోనో, రష్యాలో సోషలిస్టు విప్లవం విజవంతం అయిన తరువాతో మొదలయ్యాయనే అభిప్రాయం కూడ సరైనదికాదు. అణగారిన సమూహాలను విముక్తి చేసే ప్రణాళికను మార్క్స్ 1848లో ప్రచురించిన మాట నిజమేగానీ, సమాజంలో అనాదిగా రకరకాల రూపాల్లో అణిచివేత పీడనలు కొనసాగుతూ వున్నాయి. వాటిని ప్రతిఫలించే సాహిత్యం కూడ అనాదిగా వుంది; ఇప్పుడూ వుంది. కార్మికవర్గ సాహిత్యం తప్ప మరేదీ మార్క్సిస్టు సాహిత్యంకాదని ఎవరయినా అంటే వాళ్ళు మార్క్సిస్టు సిధ్ధాంతాన్ని మూర్ఖంగా బలహీనపరుస్తున్నారని అర్ధం. దళిత, బహుజన, మైనారిటీ, ఆదివాసీ, స్త్రీవాద వగయిరా అణగారిన సమూహాలు సాగించే ఉద్యమాలన్నీ విముక్తి పోరాటాలే; అవి సృష్టించే కళాసాహిత్యాలన్నీ విముక్తి సాహిత్యమే; టెక్నికల్ గా మార్క్సిస్టు సాహిత్యమే.
మార్క్సిస్టు సాహిత్య సంఘాలు ఒక్కో చారిత్రక దశలో తమ నిర్ణిత కార్యక్రమాన్ని బట్టి ఒక్కో రకం సాహిత్య ప్రక్రియకో, ఒక్కో రకం సామాజిక అంశానికో అధిక ప్రధాన్యం యిస్తుంటాయి. అంత మాత్రాన ఇతర సాహిత్య ప్రక్రియలో, ఇతర సామాజిక అంశాలో అప్రధానమైనవి అయిపోవు.
మార్క్సిస్టు దృక్పథం నుండి సౌందర్యశాస్త్రాన్ని అభివృధ్ధి చేసినవారి జాబితా చాలా పెద్దది. అనటోలి లూనచరస్కీ, జియోర్జీ ప్లెఖనొవ్, బెర్తొల్ట్ బ్రెక్ట్, ఆంటోనియో గ్రాంస్కీ, జియోర్జ్ లుకాక్స్ మొదలయినవారు వారిలో ప్రముఖులు. తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు మార్క్సిస్టు సాహిత్య విమర్శను సాహిత్యరంగంలో వర్గపోరాటం స్థాయికి తీసుకుని వెళ్ళారు. ఆసక్తివున్నవాళ్ళు వాళ్ళ గ్రంధాల్ని విస్తారంగా అధ్యయనం చేయాల్సే వుంటుంది. ఔత్సాహికులు మాత్రం ముందుగా కొన్ని మూల సూత్రాలను అయినా తెలుకోవడం ముఖ్యం.
మార్క్సిస్టు సమాజ విమర్శ, సాహిత్య పరామర్శ ఎలాంటి మార్మికతకు తావియ్యకుండ సూటిగా సరళంగా వుంటుంది. ఇందులో మూడే మూడు మెట్లున్నాయి.
మొదటి మొట్టు; సమాజాన్ని వున్నది వున్నట్టు నిజాయితీగా చూపెట్టాలి.
సమాజంలో ఏ విభాగంలో అయినా ఏ అంశాన్ని తీసుకున్నా దాని యధాస్థితి కొందరికి ఆహ్లాదకరంగా ఉంటుంది మరికొందరికి అసహ్యకరంగా ఉంటుంది. కొందరికి ఇష్టంగా ఉంటుంది కొందరికి కష్టంగా ఉంటుంది. వివాహవ్యవస్థనే తీసుకోండి. ప్రపంచ దేశాల్లోని దాంపత్య వ్యవస్థల్లో భారత దాంపత్య వ్యవస్థ మహా గొప్పది అనంటే మన దేశంలో పురుషులకు ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ, స్త్రీలకు దానికి విరుధ్ధమైన అనుభవాలు వుండవచ్చు. వాళ్ళు పై అభిప్రాయాన్ని తప్పక ఖండిస్తారు. సమాజంలో సమతుల్యత కోసమే కులవ్యవస్థ వుందని అంటే యజమానికులాలకు ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ శ్రామిక కులాల అనుభవాలు అందుకు విరుధ్ధంగా వుండవచ్చు. వాళ్ళు పై అభిప్రాయాన్ని ఖండిస్తారు. మరే దేశంలోకన్నా భారత దేశంలో మతసహనం పరిఢవిల్లుతోంది అనంటే మెజారిటీ మత సమూహాలకు ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ, మైనారిటీ మత సమూహాల అనుభవాలు అందుకు విరుధ్ధంగా వుండవచ్చు. వాళ్ళు పై అభిప్రాయాన్ని తప్పక ఖండిస్తారు. ప్రతి అంశంలోని రెండు విరుధ్ధ వాస్తవాలను సాహిత్యం నిజాయితీగా ప్రతిఫలించాలి.
రెండో మెట్టు; సమాజం ఇప్పుడు ఇట్లా ఎందుకు వున్నదో వివరించాలి.
కళాసాహిత్యాలు కేవలం కొందరి ఆహ్లాదాన్నీ, మరికొందరికి ఆవేదనను చిత్రిస్తే సరిపోదు. కొందరికి సౌకర్యం ఎలా దక్కిందో ఇతరులకు ఆ దుస్థితి ఎందుకు దాపురించిందో కూడ వివరించాలి.
మూడో మెట్టు; సమాజంలోని అణగారిన సమూహాల జీవితాల్లో మార్పును ఎలా తేవచ్చో సూచించాలి.
సమాజంలో సహజంగానే వైవిధ్యాలు ఉంటాయి. వైరుధ్యాలు కూడ వుండవచ్చు శతృవైరుధ్యాలు వుండకూడదు. వాటిని తొలగిస్తే అణగారిన సమూహాల జీవితాల్లో మార్పు వచ్చి కొత్త సమాజం వారికి కూడ ఆహ్లాదకరంగా వుంటుంది. మార్చడం అంటే వంద అర్ధాలు వుండవు; ఒక్కటే అర్ధం వుంటుంది; పీడితుల మీద అణిచివేతను తొలగించడమే. అణిచివేతను తొలగించేపని శాంతియుతంగా జరుగుతుందా? పెద్ద ఘర్షణతో జరుగుతుందా? అనేది సందర్భాన్ని బట్టి ఆధారపడివుంటుంది.
మార్క్సిస్టు రచయితలు వస్తువుకు ప్రాధాన్యం ఇచ్చి శిల్పాన్ని నిర్లక్ష్యం చేస్తారనే అపోహ ఒకటుంది. వస్తుశిల్పాలు విడిగా ఉంటయనేదే ఒక తప్పుడు అవగహన. శిల్పంలేని వ్యక్తీకరణే ఉండదు. అయితే, మార్క్సిస్టులు వస్తువు మీద ధ్యాస పెడతారు అనేది వాస్తవం. సాహిత్యానికి సామాజిక కోణాన్ని నిర్ణయించేది వస్తువే. సాహిత్యానికి సామాజిక కోణం ఉండకూడదనేవాళ్ళు అతి తెలివిగా మార్క్సిస్టు సాహిత్యంలో శిల్పం ఉండదని ఆరోపిస్తుంటారు. ఇలా ఆరోపించేవారికి కూడ వస్తువు ఉంటుంది; అది యధాస్థితిని కాపాడడం. వాళ్ళు నేరుగా ఆ ముక్క చెప్పారు; దాన్ని దాటవేస్తారు లేదా హాస్యాన్నో వినోదాన్నో ఆశ్రయిస్తారు. ఇక శిల్పం విషయానికి వస్తే అద్భుత శిల్పాన్ని సృస్థించిన మార్క్సిస్టు రచయితలు అనేకులు కనిపిస్తారు. జాక్ లండన్ రచనల్లో మనవపాత్రల్ని మించిన ప్రధాన పాత్రగా ప్రకృతి ఉంటుంది. తెలుగులో రావి శాస్త్రిని మించిన శిల్పం ఎవరికుంది?
కళాసాహిత్యాలు కాల్పానికంగా మాత్రమే వుండాలిగానీ వాస్తవికతతో వాటికేం పనీ? అనే వాళ్ళని అలా వుండనివ్వండి!. సమాజాన్ని వున్నదున్నట్టు చిత్రించాలి అనే మార్క్సిస్టు సాహిత్య ఆదేశంతో మార్క్సిస్టేతరులకు కూడా పెద్దగా అభ్యంతంరం వుండకపోవచ్చు. అయితే, సమాజం అలా ఎందుకు వున్నదో వివరించాలనే విషయంలో తగవు వుంటుంది. కవులు, రచయితలు భావుకులుగా వుండాలే తప్ప శాస్త్రపరిశోధకుల్లా వుండరాదనే గడుసరి వాదంతో వాళ్ళు సామాజిక వాస్తవిక వాదాన్ని ఎదుర్కొంటారు. ఇక సమాజాన్ని మార్చాలనే విషయంలో మాత్రం రెండు రకాల సాహిత్యాల మధ్య తగువు తీవ్రంగా వుంటుంది. సమాజాన్ని మార్చడానికీ, మార్చమని ఆదేశించడానికి కవులు, రచయితలు ఉపదేశకులా? నియంతలా? అని వాళ్లు విరుచుకుపడతారు. సమాజంలో మార్పును అడ్డుకోవడానికి వాళ్ళు కొంచెం గట్టిగానే నడుంబిగిస్తారు. ఇలాంటి సందర్భాల్లోనే సాహిత్య సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం అవసరం అవుతుంది.
ఇతరుల వాదాలు ఎన్నివున్నా ఎలా వున్నా సమాజంలో అణగారిన సమూహాల జీవితాలను మెరుగ్గా మార్చడమే మార్క్సిస్టు కళా సాహిత్యాల లక్ష్యం. కార్ల్ మార్క్స్ చనిపోయినపుడు ఆయన సమాధి వద్ద ఒక కొటేషన్ రాయాల్సి వచ్చింది. మార్క్స్ జీవిత కాలంలో అనేక గ్రంధాలు ప్రచురించాడు; కొన్ని లక్షల వాక్యాలు రాశాడు. వాటన్నింటి నుండి ఆయన భావాల్ని ప్రతిఫలించే ఒక వాక్యాన్ని ఏంగిల్స్ ఎంపిక చేశాడు. ఆ వాక్యం ఏమంటే: “తత్త్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వాఖ్యానించడంతో సరిపెట్టారు; నిజానికి చెయ్యాల్సిందేమంటే ప్రపంచాన్ని మార్చడం” (“The philosophers have only interpreted the world, in various ways. The point, however, is to change it.). సమాజాన్నిమార్చడమే మార్క్సిస్టు సాహిత్య లక్ష్యం.
(రచయిత ఖదీర్ బాబు ఆధ్వర్యంలో షామీర్ పేట్ ల్యాండ్ ఆఫ్ లవ్ (LOL)లో 2022 నవంబరు 25,26 తేదీల్లో జరిగిన రైటర్స్ మీట్ లో చేసిన ప్రసంగం ఆధారంగా)
ఉషా యస్ డానీ
9010757776
ప్రచురణ : అక్షరం పేజి, ప్రజాశక్తి, 23 జనవరి 2023
https://epaper.prajasakti.com/view/?date=2023-01-23&edition=1&pg_no=4=4
No comments:
Post a Comment