Tuesday 31 January 2023

Three Prisoners - ముగ్గురు ఖైదీలు


 ముగ్గురు ఖైదీలు

 


ముగ్గురు ఖైదీలు

 

 

ఈ ఫొటోలో నాపక్కన వసంతరావు వున్నాడు. మా వెనక ఏడుకొండలు వున్నాడు. ఏడు కొండలు ఆంధ్రా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్సెస్  ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. వసంతరావు రాజమండ్రిలో క్రిమినల్ లాయర్ గా వుంటున్నాడు. డాక్టర్ ఏంఎఫ్ గోపీనాధ్ ఆధ్వర్యంలో జరిగిన  ‘భారత్ బచావ్’ రాష్ట్ర సదస్సు సందర్భంగా  జనవరి 29న చాలాకాలం తరువాత మేము విజయవాడలో కలిశాం.

 

మేం ముగ్గురం జైల్ మేట్సుం! 1980 ఫిబ్రవరి నెలలో ఓ రెండు వారాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసివున్నాం. మాది 2-బి వార్డు. అంటే పొలిటికల్ ప్రిజనర్స్ వార్డు. మొత్తం తొమ్మిది మంది. ఎనిమిదిమంది పురుషులు, ఒక స్త్రీ. ఆమెను వుమెన్స్ వార్డులో వుంచారు.

 

తోరాడ సత్యనారాయణ ఏ-1; నేను ఏ-2. కేవీ రమణారెడ్డిగారు మమ్మల్మి ‘నవరత్నాలు’ అంటూ మెచ్చుకుంటూ అరుణతారలో ఓ ఉత్తేజకరమైన వ్యాసం రాశారు.

 

ఏమి రోజులవీ. అదొక విలాసవంతమైన జైలు జీవితం (దుస్సమాసం కాదుకదా!). అనుక్షణం సస్పెన్స్ తో కూడిన గొప్ప అడ్వంచర్ థ్రిల్లర్ అది. నాకు రాష్ట్రస్థాయిలోనేగాక  ఢిల్లీ, కలకత్తా వరకు ఒక గుర్తింపు తెచ్చిన సంఘటన అది. బెయిల్ వచ్చినపుడు ఒక ఆనందంతోపాటూ కొంచెం బాధా వేసింది. ఇంతటి ప్రేమాభిమానాలతో కూడిన ఒక భావోద్వేగ జీవితాన్ని కోల్పోతున్నాననిపించింది.

 

పోలీసు అధికారి మీద హత్యాయత్నం ఆరోపణలున్న కేసులో మాకు రెండు వారాల్లోనే బెయిల్ రావడం చాలా మందికి ఆశ్చర్యంగా కనిపించింది. ఉద్యమానికి అభిమానులైన అడ్వకేట్లు రాజమండ్రి, హైదరాబాద్ లోనేకాక ఢిల్లీలోనూ తమ ప్రయత్నాలు చేశారు. అన్నింటికంటే ఆశ్ఛర్యం ఏమంటే రాజమండ్రి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్లు సహితం మా బెయిల్ కోసం తమ పరపతిని ఉపయోగించారట. యుధ్ధరంగంలో వున్నప్పుడు మనం ఊహించని వైపు నుండి కూడ మద్దతు దొరుకుతుంది. జైల్లో కూడ సిబ్బంది అధికార్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు.

 

అప్పటి ఆంధ్రాయూనివర్శిటీ రాడికల్ విద్యార్ధి నాయకుడు చెరుకూరి రాజ్ కుమార్ ను పోలీస్ కష్టడీ నుండి తప్పించిన సంఘటన ఇది. ఆ తరువాత రాజ్ కుమార్ పూర్తిగా రహాస్య జీవితానికి వెళ్ళిపోయాడు.  తరువాతి కాలంలో పీపుల్స్ వార్ లో  జాతీయ నాయకునిగా మారి ‘ఆజాద్’ గా చాలా ప్రసిధ్ధుడు అయ్యాడు. ఏం మనిషతను? ఒక ఐదు నిముషాలు తీరిక దొరికితే చుట్టూ వున్న వారిని కడుపుబ్బా నవ్వించేవాడు. అంతటి హాస్య ప్రియుడు. మరుక్షణం ఒక అరవీరభయంకరునిగా మారిపోయి ప్రత్యర్ధి మీద దాడి చేసేవాడు. 

 

ఇది ముందు రాజమండ్రి గోదావరి స్టేషన్ సమీపానవున్న  విక్రం మహల్ మైదానంలో జరిగిన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ బహిరంగ సభలో మొదలయ్యింది.  మ్యూజియం రోడ్డు పోలీస్ స్టేషన్ కష్టడీ బ్రేక్ వరకు సాగింది. ఇంతకీ మా మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా? ‘Attempt to murder – on circle inspector – in police station’.  మా స్థాయికి తగ్గ కేసు అది. దేనికయినా ఒక లెవల్ వుండాలి !

 

ఆ కేసు మా ప్రతిష్టను బాగా పెంచేసింది. కేరళలో కున్నిక్కాల్   అజిత 1968 నవంబరు 24న మలబార్ స్పెషల్ పోలీస్ క్యాంప్ మీద చేసిన దాడి సంఘటన అంతటి పేరు మాకు ‘అప్పనంగా’ వచ్చేసింది. కొన్నాళ్లు జనం మమ్మల్ని ‘నవరత్నాలు’ అనేవాళ్ళు.

 

జైల్లో పులి శివరామకృష్ణయ్య అనే పాత నక్సలైట్ మాకు తోడయ్యాడు. నెల్లూరు జిల్లా తనది. లైఫర్. అన్యాయంగా అతన్ని సాధారణ ఖైదీలతో వుంచేవారు. మేము జైలుకు వెళ్ళాక పోరాడి ఆయన్ని రాజకీయ ఖైదీల వార్డుకు తెచ్చుకున్నాం. జైల్లో నిమ్మకాయల రాఘవయ్య నాయుడు (బ్యాంకు అధికారి) మాకు తాత్విక గురువు. మార్క్సిస్టు ఎకనామిక్స్ లో నిపుణుడు. రోజూ ఒక గంట రాజకీయార్ధికశాస్త్రం పాఠం చేప్పేవారు.  తోరాడ సత్యనారాయణ మా దళపతి. అంటే పార్టి జైల్ కమిటి నాయకుడు. తోరాడ సత్యనారాయణ అప్పటికే యాక్షన్ హీరో. తనకు అంతకు ముందే జైల్ బ్రేకింగ్ అనుభవం వుంది. కడియాల రాఘవేంద్రరావుతో కలిసి తను కొన్ని జైళ్ళను  బ్రేక్ చేసి నక్సలైట్ ఖైదీలను విడిపించాడు.  బయటి నుండి ఏకంగా రాజమండ్రి జైలు సెల్ వరకు సొరంగం తవ్వేసిన ఘనుల్లో ఒకడు. మనది మామూలు ట్రైనింగా?

 

ఏడుకొండలు మంచి బాడీ బిల్డర్. వైజాగ్ లో తనను మిస్టర్ యూనివర్శిటీ  అనేవారు. “రాజ్ కుమార్ ను తప్పించండి” అని బయటి నుండి పార్టి ఆదేశాలు రాగానే పోలీసు స్టేషన్ లో ముందు దాడి చేసింది తనే. ఒక విలువైన కామ్రేడ్ ను బతికించుకోవడం కోసం పది మంది చనిపోవడానికి సిధ్ధమయ్యే రోజులవి. మనుషులు ఎవరి బతుకులు వాళ్ళు ఎలాగూ బతికేస్తారు. పెళ్ళాం పిల్లల్ని పోషించుకుంటారు. కొండొకచో పెళ్ళాం పిల్లలే పోషిస్తారు. ఇలాంటి రొటీన్ జీవితంలో నాకు ఎలాంటి రుచి అనిపించదు. మరొకరికి మేలైన బతుకుని ఇవ్వడం కోసం తాము చనిపోవడానికి సిధ్ధపడం Altruistic Suicide. ఇది సామాన్యమైన విషయం కాదు. అలాంటి సన్నివేశాలు అప్పట్లో తరచూ కనిపించేవి.

 

హీరో అంటే ఇప్పుడు సినిమా యాక్టర్లను అంటున్నారుగానీ, అసలు అర్ధం జనపద గణ నాయకుడు. ఆ అర్థంలో వరవరరావు 2011లో జరిగిన ఒక సభలో నన్ను హీరో అన్నారు. దానికి రాజమండ్రి కేసు ఒక విధంగా ఆరంభం. 

 

సరిగ్గా ఇలాంటి సంఘటననే కారంచేడు ఉద్యమం సందర్భంగా 1985 సెప్టెంబరు 11 సాయంత్రం చీరాల పోలీస్ స్టేషన్ లో రీ-ప్లే జరిగింది. మళ్ళీ అదో పెద్ద యాక్షన్ సీన్!

 

ఈ భూమ్మీద నాకు ఇద్దరు నచ్చరు; పోలీసులు; ద్రోహులు. శత్రువుకన్నా ద్రోహి ప్రమాదకారి. గురజాడ అప్పారావుగారి జట్కావాడిలా నాకు పోలీసులు లేని సమాజం ఇష్టం. అంటే ఆంక్షలు లేని సమాజం అన్నమాట! పోలీసులు చాలా మందిని అకారణంగా తిడుతుంటారు; కొడుతుంటారు; చిత్రహింసలు పెడుతుంటారు; కొందరిని చంపేస్తారు కూడ. నేనే పోలీసుల్ని కొట్టానని నా మీద మూడు పట్టణాల్లో మూడుసార్లు కేసులు నమోదు అయ్యాయి. మూడు చోట్లా అరెస్టు చేశారు. వీటికి నేనేమీ చింతించను. అవన్నీ గొప్ప జ్ఞాపకాలు.

 

కారంచేడు ఉద్యమంలోనూ చీరాల కోర్టు నన్ను, బి పరంజ్యోతి తదితరుల్ని ఒంగోలు జైలుకు రిమాండ్ వేసింది. మళ్ళీ అదొక పెద్ద డ్రామా సీన్. ఒంగోలు జైలు లోపలి వరకూ వెళ్ళాం. జైలు సెల్లోకి మాత్రం  అడుగు పెట్టలేదు. అంతకు ముందే బయటికి వచ్చేశాం.

 

ఇప్పుడు ఓటిటిలో నడుస్తున్న  Keanu Reeves JOHN WICK సీరీస్ అంతటి యాక్షన్ ప్యాక్డ్ డ్రామా సన్నివేశాలు ఇవన్నీ. వీటిని స్క్రీన్ మీద చూస్తున్నప్పుటికన్నా నిజ జీవితంలో చేస్తున్నప్పుడు చాలా థ్రిల్ గా వుంటుంది. మృత్యువు మన నీడగా మారిపోయినపుడు జీవికను నిలబెట్టుకోవడానికి పెనుగులాడడమే జీవితంలో అందమైన ఘట్టం. ఎప్పుడయినా తీరిక దొరికినప్పుడు వీటిని ఒక నవలగా రాస్తాను.

మనుషులు భావోద్వేగాలతో బతకగలగడం ఒక వరం!  

No comments:

Post a Comment