Goals of the Movements and The Beneficiaries of movements are different
ఖాన్ యజ్దానీ (డానీ)
ప్రత్యేక
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో ఏట ప్రవేశించిన సందర్భంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
తెలంగాణలో ఇది అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం కనుక మరింత ప్రత్యేకత వచ్చింది. ఉద్యమ
కాలంలో వ్యక్తం అయిన ఆదర్శాలు, ఉద్యమకారుల్ని ముందుకు నడిపించిన ఆకాంక్షలు నెరవేరాయా? అంటే సానుకూలంగా సమాధానం చెప్పడం
కష్టం. నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా అంటూ మొదలయిన ఉద్యమం నుండి పుట్టిన ప్రభుత్వం ఇప్పుడు దాదాపు
బిజెపి చెప్పినట్టు నడుచుకుంటాం అనే దిశగా నడుస్తోంది; బిజెపికి కేవలం ముగ్గురు
ఎమ్మెల్యేలే వున్నప్పటికీ.
ఈ
సందర్భంగా ఎవరి జ్ఞాపకాలు వారికి వుంటాయి. అందులో కొన్ని తియ్యగా వుంటాయి; కొన్ని
చేదుగానూ వుంటాయి.
తొలి
విడత తెలంగాణ ఉద్యమం 1969లో సాగింది. దాదాపు ఆ సమయంలోనే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం
రాజుకుంటున్నది. కొండపల్లి సీతారామయ్య – కేజి సత్యమూర్తిల నాయకత్వంలోని ఎంఎల్
గ్రూపును అప్పట్లో సెంట్రల్ ఆర్గనైజింగ్
కమిటి (సివోసి) అనేవారు. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదలలతో నాటి యువతరం
అసంతృప్తితో రగిలిపోతుండింది. నక్సల్ బరీ వాళ్లను విపరీతంగా ఆకర్షించింది.
తెలంగాణలో ప్రత్యేక ఉద్యమానికి గొప్ప వేడిని అందించింది ఆ సమూహమే. ఆ సమూహానికి
స్పూర్తి ప్రదాతలు కేఎస్ – కేజి.
జాతుల
ప్రజాస్వామిక హక్కుల్లో విడిపోయే హక్కు జీవప్రదమైనది అనేది రష్యాలో జేవి స్టాలిన్ ముందుకు తెచ్చిన అవగాహన.
ఆ షరతు మీదనే సోవియట్ రష్యా సంయుక్త రాష్ట్రాలు (యూఎస్ ఎస్ ఆర్) ఏర్పడింది. స్టాలిన్ జాతుల సిధ్ధాంతాన్ని ముందు
ఆంధ్రప్రదేశ్ కూ, 1980లలో ఈశాన్య రాష్ట్రాలకూ, ఆ పిదప పంజాబ్ కు అన్వయించిన ఘనత కొండపల్లి సీతారామయ్యకు చెందుతుంది. నేను
వారిని చాలా గొప్పగా అభిమానిస్తున్న కాలం అది.
ఎమర్జెన్సీ
అనంతరం నేను సివోసిలో చేరాను. మనం ఏ రాజకీయ పార్టీలో చేరినా వాటి కార్యక్రమాల్ని,
విధానాల్ని, తీర్మానాలనూ ఆమోదిస్తున్నట్టే లెఖ్ఖ. అలా ఆమోదించకుండ ఎవరూ ఏ
పార్టీలోనూ చేరలేరు. నేను సివోసిలో చేరానంటే ప్రత్యేక తెలంగాణను ఆమోదించాననే
అర్ధం. ఆ సివోసి 1980లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ గా మారింది.
కాలోజీ
నారాయణ రావు అధ్యక్షతన 1997లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ ‘వరంగల్ డిక్లరేషన్’
సభ జరిగింది. ఇది పీపుల్స్ వార్ కార్యక్రమం. ఆ సభ ఆహ్వాన సంఘానికి విఎన్ సాయిబాబా
ఆధ్యక్షుడు. విజయవాడలో వున్న నాకు ఓరోజు వరవరరావు, సాయిబాబా ఫోన్ చేసి ఆహ్వాన సంఘంలో
వుండాలన్నారు. సాయిబాబాతో అంతగా సాన్నిహిత్యం లేదుగానీ వరవరరావు మాటను నేను ఎన్నడూ
కాదనలేను.
కేవి
రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు,
చలసాని ప్రసాద్, వరవరరావు అంటే నాకు చాలా
గౌరవం. అలాగే పీపుల్స్ వార్ నాయకుల్లో కేఎస్, సత్యమూర్తి, ఐవి సాంబశివరావులు అన్నా
అంతటి అభిమానం. వీరితోపాటూ వివి కృష్ణారావు, ఆర్ ఎస్ రావు లను కూడ చేర్చేస్తే నా
కమ్యూనిస్టు ఉద్యమ గురువుల జాబితా పూర్తి అయిపోతుంది.
వరంగల్
డిక్లరేషన్ నిర్వాహక కమిటీలో ఆంధ్రా-రాయలసీమ ప్రాంతాల నుండి ఇంకెవరున్నారో నాకు
గుర్తులేదు. ఆ రెండు రోజులు వెళ్ళి వరంగల్ లో వున్నాను.
అప్పటికీ
నేను పీపుల్స్ వార్ లో లేను. నక్సలైట్ పార్టీలతో సహా కమ్యూనిస్టు పార్టీలు
చెపుతున్నదానికీ చేస్తున్నదానికీ పొంతన లేదనే అనుమానం నాకు 1980ల రెండవ భాగంలో మొదలయింది.
నేను లేవనెత్తే ప్రశ్నలు వాళ్ళకు నచ్చకో, వాళ్ళు చెప్పే సమాధానాలతో నేను సంతృప్తి
చెందకో 1990 తరువాత నేను పీపుల్స్ వార్ కు పూర్తిగా దూరం అయిపోయాను. విప్లవ రచయితల
సంఘంలో 2002 వరకు కొనసాగాను. అయితే, సామాజిక
సందర్భం డిమాండ్ చేసినప్పుడు కలిసి
పనిచేయడానికి ఎప్పుడూ సిధ్ధంగానే వున్నాను.
ఆ
సమయంలో చంద్రబాబు కేబినెట్ లో కేసిఆర్
రవాణా శాఖామంత్రిగా వున్నారు. అప్పట్లో వారు కూడ తెలంగాణ ఆర్ధిక, సాంస్కృతిక వెనుకబాటుతనం మీద
దృష్టి పెట్టారు. వీటి మీద పరిశోధనలు నిర్వహించడానికి ఉస్మానియా యూనివర్శిటీ
సమీపంలోని తార్నాకలో ఒక ఆఫీసు పెట్టారు.
దానిపేరు సెంటర్ ఫర్ సబ్ ఆల్ట్రన్ స్టడిస్
(సిఎస్ఎస్). నా చిరకాల మిత్రుడు కేఎన్
చారీ, ఎస్ రామకృష్ణ దానిని నిర్వహించేవారు. వాళ్ళిద్దరూ చెరో పత్రికల్లో
పనిచేస్తున్నారు. ఏపి టైమ్స్ ఆంగ్ల దినపత్రిక 1998లో మూత పడడంతో నేను నిరుద్యోగిగామారి
హైదరాబాద్ లో వున్నాను. చారీ రామకృష్ణ
ఆఫర్ చేయడంతో సిఎస్ఎస్ లో ఆఫీస్ మేనేజర్ గా చేరాను. అప్పటికి తెలంగాణ రాష్ట్ర
సమితి ఆరంభం కాలేదు. ఇది జరిగిన రెండు, మూడేళ్ల తరువాత టిఆర్ ఎస్ పుట్టింది.
ఉద్యమాల్లో
పాల్గొనేవారు చాలా నిజాయితీపరులు. ఆవేశంతోపాటూ, అంకితభావం కలిగివుంటారు. వాళ్లు
చాలా అమాయకులు కూడ; ప్రాణత్యాగాలు బలిదానాలు ఆత్మాహుతులకు సహితం సిధ్ధపడతారు. వుద్యమాలు
వుధృతంగా సాగుతున్న కాలంలోనే వ్యక్తి మనిషిగా మారుతాడని నా నమ్మకం.
2004
ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకుంటే, 2009 ఎన్నికల్లో టిడిపి టిఆర్
ఎస్ తో పొత్తు పెట్టుకుంది. ఆసమయంలో రాయలసీమ – ఆంధ్రా ప్రాంతాల కాంగ్రెస్, టిడిపి నాయకులు
చాలా మొండిగా మూర్ఖంగా ప్రవర్తించారు. రాష్ట్రం
విడిపోతున్నదని అప్పటికే ఢిల్లీ నుండి స్పష్టమైన సంకేతాలు వచ్చేశాయి. విడిపోవడానికి
ఆంధ్రా-రాయలసీమ ప్రాంతాలకు అవసరమైన షరతుల్ని విధివిధానాలను రూపొందించి ముందు
పెడితే అన్నింటినీ అంగీకరించడానికి తెలంగాణ పొలిటికల్ జేయేసి సిధ్ధంగావుంది. అలాంటి కీలకమైన సమయంలో రాష్ట్రాన్ని విడిపోనివ్వమూ
అని వెర్రి పట్టుదలకుపోయారు. ఆ సమయంలో తెలంగాణ
రాజకీయ జేయేసి చాలా తెలివిగా అడుగులు వేసి భౌగోళిక తెలంగాణను సాధించింది.
ఉద్యమాలు
సఫలం కాగానే పంపకాల గోల మొదలవుతుంది. ఆస్తుల పంపకాలు, పదవుల పంపకాలతో మనుషులు
వ్యక్తులుగా (man and individual) మారిపోతారు. సంఘీభావం క్రమంగా అంతరించిపోతుంది.
ఏ
ఉద్యమంలో అయినా ఎవరు పాల్గొంటున్నారు, ఎవరు సమర్ధిస్తున్నారు, ఎవరు నాయకత్వం
వహిస్తున్నారూ? అనే అంశాల కన్నా ఎవరు పెట్టుబడి పెడుతున్నారు? ఎవరు స్పాన్సర్
చేస్తున్నారూ? అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే
ఉద్యమ లక్ష్యాలు వేరు; ఉద్యమాల లబ్దిదారులు వేరు.
అలనాటి
చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితాలను ఎవరు దక్కించుకున్నారో సిపిఐ,
సిపియంలకు అంతగా అవగాహన లేకపోవచ్చు. కానీ, ఆ అంశం మీద గొప్ప గొప్ప విశ్లేషణలు
చేసిన పీపుల్స్ వార్ నాయకులకు ఆ తరువాత ఏర్పడిన మావోయిస్టు పార్టి నాయకులకు
తెలంగాణ ఉద్యమ ఫలితాలను ఎవరు
దక్కించుకోబోతున్నారో కఛ్ఛితంగా ఒక అవగాహన వుండి తీరాలి. గతితార్కిక చారిత్రక
భౌతికవాదం అంటే అదే. గత అనుభవాలనుబట్టి భవిష్యత్ పరిణామాలను ఊహించి జాగ్రత్త పడడం.
ఆ విషయం మీద ప్రజల్ని చైతన్యవంతుల్ని
చేయాలి. వాళ్ళు అలా చేసిన దాఖలాలు లేవు. తమ ప్రసంగాల చివర బూర్జువా పార్టీలతో
జాగ్రత్తగా వుండాలి అని లాంఛనంగా ఒక ‘డిస్ క్లయిమర్’ ఇచ్చి సరిపెట్టేవారు.
ఏపీలో
1982 నుండి 2004 వరకు ఎన్నికల ఫలితాలను నక్సలైట్లు నిర్ణయించేవారంటే
అతిశయోక్తికాదు. 2009 నుండి ఎన్నికల్లో నక్సలైట్ల ప్రభావం తగ్గిపోయింది. 2014
తరువాత సమాజంలోనే నక్సలైట్ల అస్తిత్వం తగ్గడం మొదలయింది. అంతేకాదు; పాత విజయాలు
పరాజయాలుగా మారడం మొదలయింది.
1970-80ల
నాటి సిరిసిల్లా -జగిత్యాల, ఆదిలాబాద్-కరీంనగర్ రైతాంగ ఉద్యమాల సందర్భంగా గడియల
మీద దాడులు జరిగాయి, గడియల యజమానులు పారిపోయారు.
వాళ్ల భూముల్ని ఉద్యమకారులు ఆక్రమించి పేదలకు పంచారు. కానీ, ప్రభుత్వ రెవెన్యూ
రికార్డుల్లో భూయజమానుల పేర్లను మార్చలేదు. అలా మారిస్తే తాము బూర్జువా చట్టాలను
గౌరవించినట్టు అవుతుందని విప్లవకారులు భావించివుంటారు. భూముల్ని క్రమబధ్ధం
చేసుకోవడానికి ప్రయత్నించిన వారిని లొంగుబాటుదారులుగా భావించి మందలించేవారు. ఈ
మందలింపులు అనేవి అనేక స్థాయిల్లో వుంటాయి.
గడియల్ని,
గ్రామాలను, పొలాల్ని వదిలిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆశ్రయం కోసం పట్టణాలు,
రాజధాని నగరానికి పారిపోయిన భూస్వాములు
అక్కడ వాణిజ్య, పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారు. రెండవ విడత తెలంగాణ ఉద్యమం
ఉధృతంగా సాగుతున్న కాలంలో వాళ్లంతా తిగిగి గ్రామాల్లో ప్రవేశించారు; గడియలకు కొత్త
రంగులు వేసుకున్నారు. ప్రాంతీయ అస్తిత్వం బలంగా ముందుకు వచ్చి వుండింది కనుక మారిన
సన్నివేశంలో భూస్వామ్య-పెట్టుబదీదారుల్ని కూడ ఉద్యమకారులు మిత్రులుగా భావించడం
మొదలెట్టారు. గ్రామాల్లో వాళ్ల పునరాగమనం కేసిఆర్ స్కెచ్ ప్రకారమే జరిగిందనేవారూ
వున్నారు.
కొత్త
రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారాన్ని చేపట్టిన టిఆర్ ఎస్ భూముల నమోదు కోసం
ప్రతిష్టాత్మకంగా ధరణి పథకాన్ని చేపట్టింది. అలనాడు ఉద్యమకారులు ఆక్రమించుకున్న
భూములు తిరిగి చట్టబధ్ధంగా గడియల యజమానులకు చేరాయి. వాళ్లకు గ్రామాల్లో భూములూ
తిరిగివచ్చాయి, పట్టణాల్లో వ్యాపారాలు పెరిగాయి. అటుగ్రామాల్లోనూ ఇటు పట్టణాల్లోనూ
వాళ్ళే ఇప్పుడు పాలకవర్గాలు. ఈ మార్పు విప్లవ కమ్యూనిస్టుల చలవే అంటే చాలామందికి
కోపం రావచ్చుగానీ; ఇప్పుడు వాళ్లు తమ ఇళ్ళల్లో విప్లవ కమ్యూనిస్టుల ఫొటోలు
పెట్టుకుని దండం పెట్టుకుంటున్నారు. నమ్మితే నమ్మండి!
అప్పుడు
నక్సలైట్ల బాటే నా బాట అన్న కేసిఆర్ ఇప్పుడు క్రమంగా బిజెపికి అనుకూలంగా నడుచుకోక
తప్పని స్థితిలో పడుతున్నారు. తెలంగాణలో ఇదో కొత్త పరిణామం. కర్ణాటకలో లభించిన
విజయంతో ఉత్సాహంగావున్న కాంగ్రెస్ తెలంగాణలో కూడ విజయాన్ని సాధిస్తే బిజెపికి లోక్
సభ ఎన్నికలు చాలా పెద్ద సవాలుగా మారుతాయి. కాంగ్రెస్ కు తెలంగాణలో అడ్డుకట్ట వేయడానికి టిడిపితోనేకాక టిఆర్ ఎస్ తో
సహితం చేతులు కలపడానికి కూడ బిజెపి సిధ్ధపడుతోందని కొన్ని సూచికలు చెపుతున్నాయి.
సిపిఐ
సిపియంలది మరీ దయనీయ స్థితి. అప్పుడు నిజాం సంస్థానంలోని తెలంగాణను ఆంధ్రాతో కలిపి
భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పరచాలని కాంగ్రెస్ భావించింది. నిజానికి అది జాతీయ
బూర్జువావర్గం నినాదం. దాన్ని విశాలాంధ్ర పేరిట కమ్యూనిస్టు పార్టీ తన భుజాన్న
వేసుకున్నది. తెలంగాణ మలి విడత ఉద్యమం బలపడుతున్నప్పుడు విశాలాంధ్ర దుకాణాలన్నింటినీ
కట్టేసి టిఆర్ ఎస్ పక్కన చేరిపోయింది.
ఇంతకీ
రెండు తెలుగు ప్రాంతాలను కలపడం కమ్యూనిజమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టడం
కమ్యూనిజమా? ఎవరయినా తేల్చి చెపితే బాగుండు. ఈ అవకాశవాదాల్ని ప్రజలు సరిగ్గానే పసికట్టారు.
రెండు రాష్ట్రాల శాసనసభల్లోనూ ఏ కమ్యూనిస్టు పార్టికి కూడ ఇప్పుడు ఒక్క స్థానం కూడ లేదు. దీనికి నిందించాల్సింది
ప్రజల్ని అయితే కాదు.
(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు)
2 జూన్ 202
ప్రచురణ : నవభూమి దినపత్రిక, 9 జూన్ 2023
https://epaper.navabhoomi.in/view/2377/andhrapradesh/4
No comments:
Post a Comment