Monday, 27 April 2026

We have Crossed 43

43 దాటాము!





 

మనిషి అసలే కోపిష్టి నిలకడగా కాపురం చేస్తాడా? అని మావాళ్ళ అనుమానం. దీనికి ముక్కు మీద కోపం అత్తారింట్లో ఎన్నాళ్లుంటుందని వాళ్ళవాళ్ల భయం. వాళ్ళ అంచనాలకు తగ్గట్టు ఎంత లేదన్నా మేము రోజుకు ఓ మూడుసార్లు దెబ్బలాడుకుంటుంటాం. ప్రతి తగవూ ఇక కుదరదు విడిపోవాల్సిందే అన్నంత వరకూ సాగుతుంది. అలా 43 సంవత్సరాలు సాగిపోయాయి.

 

మాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేసినప్పుడు నేను ఉద్యోగం చేయను; ఉద్యమాలంటూ ఊర్లెంబడి తిరుగుతాను. సంపాదన మీద నమ్మకంలేదు. పిల్లలు పుట్టినా వాళ్ళ పెంపకం చదువు వగయిరా బాధ్యతలన్నీ నీవే  అన్నాను. అన్నింటికీ సరేనంది. హిందూ ముస్లిం  మతాంతర వివాహం ఒకటి ఇలా జరిగిందంటే ఇవ్వాల్టి రోజుల్లో నమ్మడం కష్టం.

 

ఇరాన్ యుధ్ధం, కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్, కగార్ ఆపరేషన్, కారంచేడు, చుండూరు, మణిపూర్ వంటి చిన్న చిన్న విషయాల మీద మాకెప్పుడూ బేధాభిప్రాయాలు లేవు. పోపు మాడడం, ఆవగాయ పచ్చడ్లోకి ముద్దపప్పు లేకపోవడం, పలావు చేసినపుడు ఖట్టా వండకపోవడం వంటి పెద్దపెద్ద విషయాల మీద మేము మూడవ ప్రపంచ యుధ్ధం స్థాయిలో పోట్లాడుకుంటాము. 

 

          చలసాని ప్రసాద్ మా పెళ్ళికి పురోహితుడు. తను అలాంటి దండల పెళ్ళిళ్ళు వంద వరకు చేశాడు. మాది తప్ప అన్నీ విఫలం అయ్యాయి. మా పెళ్ళికి రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఒక ప్రాధాన్యత వుంది. అది విఫలం కాకూడదనేది ఆమె పట్టుదల. దానికోసం తను సామదానబేధ దండోపాయాలు అన్నింటినీ ప్రయోగిస్తుంది.

 

27-04-2026 

No comments:

Post a Comment