Monday, 27 April 2026

There are Lot of Good People and I am indebted to them

 

మంచివాళ్లు వున్నారు. నేను వారికి రుణపడివున్నాను.







 

          సమాజం మేలు కోసం ఏ పని చేయాలన్నా బహిరంగంగా ప్రకటించి చేయాలనే నియమం ఒకటుంది. దానివల్ల ఇతరుల్లో సహితం ఆ మంచి పనిలో భాగస్తులు కావాలనే ఆసక్తి కలుగుతుంది. అప్పుడు సమిష్టి తత్త్వం ఏర్పడుతుంది.  లేకుంటే ఒంటరి చేష్టగా వుండిపోతుంది.

 

          నేను ఏదైనా అలాంటి సామాజిక కార్యక్రమాన్ని చేపట్టినపుడు ఒక బహిరంగ ప్రకటన చేస్తాను. ఖర్చులకు మీకు తోచింది ఇమ్మంటాను. కొందరు స్పందిస్తారు. తమకు తోచింది పంపుతారు.

 

          నేను మణిపూర్ వెళ్ళాలనుకున్నప్పుడు కూడ అలాంటి ప్రకటన ఒకటి చేశాను. ఒకళ్ళిద్దరు స్పందించారు. ఓ 500 రూపాయల చొప్పున నా బ్యాంకు అకౌంట్ లో వేశారు. ఈలోగా లండన్ నుండి Paladugu Lakshmana Rao మెసేజ్ పెట్టారు. తాను మణిపూర్ లోనే కాంట్రాక్టులు చేస్తున్నారనీ, పది రోజుల తరువాత హైదరాబాద్ వచ్చి నన్ను మణిపూర్ తీసుకుని వెళతానని అన్నారు. అన్ని ఖర్చులూ తనే భరిస్తానన్నారు. ఉద్యమం రగులుకుంటున్నప్పుడే వెళ్ళాలి అనేది నా ఆలోచన ఆ మాటే వారికి చెప్పాను.  వెంటనే బయలుదేరి వెళుతాను అన్నాను. వారు నా అకౌంట్ లో పది వేల రూపాయలు వేశారు.

 

          ఆ వెంటనే Ajitha Kolla గారు US నుండి ఫోన్ చేశారు. మొత్తం ట్రావెలింగ్ బడ్జెట్ ఎంత అని అడిగారు. సుమారు 40 వేల రూపాయలు కావచ్చు అన్నారు. ఓ పది పదిహేను నిముషాల్లో నా అకౌంట్ లోనికి 40 వేల రూపాయలు జమ అయిపోయాయి. నా ఆశ్చర్యానికి అంతులేదు. లోకంలో మంచివాళ్ళు వుంటారని నేను గట్టిగా నమ్ముతాను. కానీ మరీ ఇంత మంచివాళ్ళు వుండడం తట్టుకోలేనంత ఆనందాన్ని ఇచ్చింది.

 

          ఈలోగా ఐజ్వాల్ నుండి Vadde Jayachandra ఫోన్ చేశారు. వారు మిజోరం స్టేట్ బ్యాంకు వున్నతాధికారిగా ఐజ్యాల్  లో వుంటున్నారు. అప్పటి పరిస్థితుల్లో ఇంఫాల్ ఎయిర్ పోర్టులో దిగి మెయితీలు వుండే ప్రాంతాలను దాటుకుని కుకీ జోలు వుండే దక్షణ ప్రాంతాలకు చేరుకోవడం అసాధ్యం. దానికన్నా మిజోరం వచ్చి మణిపూర్ లోనికి దక్షణ దిక్కు నుండి ప్రవేశించడం సులువు. పైగా, మణిపూర్ నుండి తలదాచుకోవడానికి వచ్చిన కుకీ జో బాధితులకు మిజోరం ప్రభుత్వం ఐజ్వాల్ పరిసరాల్లోనే సహాయక కేంద్రాల్ని నిర్వహిస్తున్నదని వారు వివరించారు. ఐజ్వాల్ ఎయిర్ పోర్టులో విమానం దిగినప్పటి నుండి తిరిగి విమానం ఎక్కేవరకు సమస్త ఖర్చులు తనవే అన్నారు.

 

          నా మణిపూర్ పర్యటన ఆ ముగ్గురి ప్రాయోజిత కార్యక్రమంగా సాగింది. ఈ ముగ్గురిలో Vadde Jayachandra గారిని తప్ప మిగిలిన ఇద్దరినీ నేను ఇంతవరకూ చూడలేదు. వాళ్లు  సహకరించకపోతే నేను కుకీ జో ల సహాయక శిబిరాలకు వెళ్ళగలిగేవాడిని కాను.

 

          అలాగే 2020 చివర్లో  రైతు  ఉద్యమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పుడు కూడ ఇలాంటి ప్రకటనే చేశాను. ఏంవీ ఫౌండేషన్ కు చెందిన ఆర్. వెంకట రెడ్డి గారు విమాన  చార్జీలు పంపించారు. అప్పటికీ నాకు వారితో కూడ పరిచయం లేదు. ఆ తరువాత మేము సన్నిహితులమయ్యాము అది వేరే కత. అది కరోనా కాలం. ఢిల్లీలో తన ఇంట్లో వుండమని  మిత్రుడు బిబిజి తిలక్ ఆఫర్ చేశాడు. ఆ రోజుల్లో అది రిస్క్ తో కూడిన వ్యవహారం.  

 

          ఈ లోకంలో మంచివాళ్లు సాధారణ సమయంలో కనిపించరు. మనం మంచి పని తల పెట్టినపుడు వాళ్లు మనకు కనిపిస్తారు. మంచివాళ్లు వున్నారు! నేను వారికి రుణపడివున్నాను.

 

          27 ఏప్రిల్ 2026

 

         

బిబిజి తిలక్ ఫొటో కోసం వెతికాను. కనిపించలేదు.

No comments:

Post a Comment