Sunday, 19 April 2026

BJP Elections strategy


ఎన్నికల్లో గెలవడానికి సంఘపరివారం ఓ సులువైన మార్గాన్ని కనిపెట్టింది. ముస్లిం భూతాన్ని మించిన విన్నింగ్ ఫార్మూలా మరొకటి లేదని దానికి అర్ధం అయింది. నరేంద్ర మోదీజీ రాజకీయ గ్రాఫ్ వేగంగా పెరగడానికి ఈ ఫార్మూలా బాగా పనిచేసింది. 


2011 జనాభా లెఖ్ఖల ప్రకారం భారతదేశంలో హిందువులు 79 శాతం. ముస్లింలు 15శాతం. క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులు, జైనులు 6 శాతం. ముస్లింలతో ముప్పు వుందని ప్రచారంచేస్తే మిగిలిన 85 శాతం ఓటర్లను సులువుగా ఆకర్షించుకోవచ్చనేది ఒక వ్యూహం. 


15 శాతాన్ని అన్యులుగా చూపెట్టి 85 శాతాన్ని ఆకర్షించే వ్యూహం భారత రాజకీయాల్లో కొత్తదేమీకాదు. మొదట్లో కాంగ్రెస్ కూడా  ఇదే వ్యూహంతో సాగేది. 15 శాతం కమ్యూనిస్టు తదితర పార్టీల  అభిమానులున్నాసరే 85 శాతం తమతోనే వుంటారనే ధీమాతో వ్యవహరించేది. ఇది రాజకీయ ప్రాతిపదిక. కమ్యూనిస్టులది కూడ సేమ్ టు సేమ్ ఫార్మూలా. దేశంలో దోపిడిదారులు 15 శాతం మాత్రమేననీ శ్రామికులు 85 శాతం అని వాళ్ళు లెఖ్ఖలు వేసుకునేవారు.  ఇది వర్గ ప్రాతిపదిక. అంబేడ్కర్ శిబిరం నుండి వచ్చిన కాన్షీరామ్ సహితం 85 శాతం ఫార్మూలాకు కులప్రాదికన పునర్ నిర్వచించారు. పెత్తందాదీ కులాలు 15 శాతం మాత్రమేననీ, బహుజనులు 85 శాతం అనీ గణాంకాలు వివరించేవారు. 


రాజకీయ, వర్గ, కుల, ప్రాంతీయత తదితర  ప్రాతిపదికలకన్నా  మతం చాలా ప్రభావశీలంగా పని చేస్తుందని  కనిపెట్టింది మాత్రం బిజెపి. 15 శాతం ముస్లింలను ధేశానికి ముప్పుగా చూపెట్టి 85 శాతాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తే, అందులో సగం ఓట్లు పడినా రాజ్యాధికారం దక్కుతుందని  దానికి అర్ధం అయింది. గడిచిన మూడు లోక్ సభా ఎన్నికల్లోనూ బిజేపికి 40 శాతం ఓట్లు కూడ రాలేదు. అయినప్పటికీ మొదీజీ అప్రతిహత శక్తిగా వెలుగులో వుంటున్నారు.  బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రాజాస్వామ్యంలో ఇలాంటి వింతలు కూడ వుంటాయి. 


జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాక మోదీజీ చారిత్రాత్మక వాగ్దానాలు అనేకం ప్రకటించారు.  వాటిల్లో ఒక్కదాన్ని కూడ నెరవేర్చకపోగా వాటికి భిన్నమైన ఫలితాలను సాధించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కు తీసుకునివచ్చి ప్రతి భారతీయుడుడికి 15 లక్షల రూపాయల చొప్పున పంచవచ్చు అనే మాటతో వారు జాతీయ రాజకీయాల్లో వెలుగులోనికి వచ్చారు. ఆధికారంలో వచ్చాక వారు ఆ నల్లధనాన్ని ఎలాగూ తీసుకురాలేదు. మరోవైపు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినవారి సంఖ్య వారి హయాంలో బాగా పెరిగింది. మతపరంగా, రాష్ట్రపరంగా వీరెవరూ అని ఆరాతీస్తే సంఘపరివారానికి చాలా కోపం వస్తుంది. చీలికవాదులంటూ గోదీ మీడియా  చాలా పెద్ద గొంతుతో విరుచుకు పడుతుంది. 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' అనేది వారి మరో ప్రసిధ్ధ నినాదం. దేశంలో ఇద్దరు కార్పొరేట్ల ఆస్తులు నిరంతరం పెరిగిపోతుండడాన్నీ, మరో వైపు ఆదివాసులు, ముస్లింలు, వలస కార్మికుల్ని తీవ్రంగా వేధించడాన్నీ మనం ప్రతిరోజూ చూడవచ్చు. 543 లోక్ సభ స్థానాల్లో ఒక్క సీటు తప్ప, మరేచోట కూడ బిజెపి ముస్లిం అభ్యర్ధికి పార్టీ టిక్కెట్టు ఇవ్వలేదు. లక్షద్వీప్ లో  ముస్లింకు ఇవ్వక తప్పలేదు. ఉత్తరప్రదేశ్ లో నేరం రుజువుకానక్కరలేదు; నేరారోపణ జరిగితేచాలు ముస్లింల ఇళ్ళను బుల్ డోజర్లతో కూల్చేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 


ఎన్నికల్లో ఈ కిక్కు సరిపోదు. డోసు పెంచాలి. దేశాన్ని ముస్లిం ముప్పు కబళిస్తున్నదని భయపెట్టాలి. ముస్లింలు నవ్వినా ఏడ్చినా ప్రేమించినా పొట్టకూటికోసం బన్నులు అమ్ముకున్నా దానికో జిహాద్ బిరుదు తగిలించి ఆందోళన సాగించాలి. బన్ను జిహాద్, లవ్ జిహాద్, జమీన్ జిహాద్, మెడికల్ జిహాద్ ..  ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. 


టిప్పు రాగానే రెచ్చిపోవడానికి  వ్యవస్థీకృత కళాకారులు  సోషల్ మీడియాలోనూ, అన్-సోషల్ మీడియాలోనూ వేల సంఖ్యలో సిధ్ధంగా వుంటారు. 


ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న  ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు బిజెపికి ప్రతిష్ణాత్మకం. తమిళనాడు నేల మీద బిజెపి విత్తనం మొలకెత్తడం కష్టం. ఇప్పుడు బిజెపి శక్తులన్నింటినీ పశ్చిమ బెంగాల్ మీద కేంద్రీకరించింది. 

No comments:

Post a Comment