Saturday, 11 April 2026

New Article

 

తత్త్వవేత్తల ప్రధాన కర్తవ్యం ప్రపంచాన్ని మార్చడమేనని కార్ల్ మార్క్స్ అన్నాడు. ఆయన చెప్పిన వేల, లక్షల వాక్యాల్లో ఇది మహోన్నతమైనది.   అయితే, సమాజాన్ని మార్చడం అంత సులభమైన వ్యవహారంకాదు. ఎలాంటి సమాజాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాము అనేది మనకు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న. ఇందులో మూడు అంశాలున్నాయి.  మూల సమాజం, గమ్య సమాజం, మూల సమాజాన్ని గమ్య సమాజంగా మార్చే ప్రక్రియ.

 

గమ్యసమాజాన్ని వర్ణించడం కొంత సులువు. మనం ఏర్పరచుకున్న ఆదర్శాలన్నింటినీ అందులో కూర్చవచ్చు. మరో మాటల్లో చెప్పాలంటే మూల సమాజంలోని దుర్లక్షణాలన్నింటినీ తీసేస్తే అది ఆదర్శ సమాజం అయిపోతుంది. మతగ్రంధాల్లో స్వర్గలోక వర్ణన ఈ నియమాల మీదే సాగుతుంది.  

 

మూల సమాజ వాస్తవ స్వభావాన్ని చెప్పడం అంత సులువుకాదు. కొందరు దీన్ని కుల వ్యవస్థ అంటారు; మరి కొందరు దీన్ని మతవ్యవస్థ అంటారు; ఇంకొందరు తెగ వ్యవస్థ అంటారు. కొందరు కార్పొరేట్ల వ్యవస్థ అంటారు. లింగం, ప్రాంతం, భాషా వ్యవస్థలు అనేవాళ్ళూ వున్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్ళు దీన్ని నియంతృత్త్వ వ్యవస్థ అంటారు ఏ గుడ్డివానికీ అర్ధం కాని ఏనుగు లాంటిది ఈ వ్యవస్థ. నిజానికి గుడ్డివాళ్లెవరూ తప్పు చెప్పలేదు. వాళ్లకు అర్ధం అయ్యిందే చెప్పారు. ఇప్పుడూ అంతే. ప్రతి ఒక్కరు తమకు అర్ధం అయిందే నిజాయితీగానే చెపుతున్నారు. కానీ, ఏ ఒక్కరికీ ఈ సమాజ వాస్తవం అర్ధం కాలేదు.

 

ఈ సమాజం కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ అని నాకు కొన్నేళ్ళుగా అనిపిస్తున్నది. ఇది అర్ధవలస- అర్ధ భూస్వామ్య సమాజం అని సిపిఐ మావోయిస్టులు అంటున్నారు.  ఇది కుల సమాజం అని ఎస్సీలు, బిసిలు అంటున్నారు. ఇది తెగ సమాజం అని ఆదివాసులు అంటున్నారు. ఇది పురుష వ్యవస్థ అనో, మరో వ్యవస్థ అనో అంటున్నవారు కూడా చాలామంది వున్నారు.  వీళ్ళందరూ చెప్పేది వాస్తవమే కావచ్చు; వాస్తవం కాకనూపోవచ్చు. వాస్తవం వీళ్లందరి మధ్య ఎక్కడో వున్నది.

 

ఇక వర్తమాన సమాజాన్ని మార్చే విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది సంఘపరివారం గురించి. వాళ్ళు చాలా కాలంగా దీన్ని హిందూ రాష్ట్రగా మార్చాలంటున్నారు. మిగిలినవారు పది ముక్కలుగా వున్నారు కనుక హిందూ రాష్ట్ర కోరుకునేవారు దేశంలో ఎక్కువమంది వున్నారు. అయితే వాళ్ళంతా కలిసినా 20-25 శాతానికి మించి వుండరు. ఎన్నికల్లో బిజెపికి, దాని కూటమికీ ఓట్లేస్తున్న వారందరినీ హిందూరాష్ట్ర అనుకూలురుగా భావించడానికి కూడ వీల్లేదు. దేశంలో హిందూరాష్ట్రను వ్యతిరేకించేవాళ్ళు 70-75 శానికి మించి వుంటారు. అయితే వాళ్ళు వంద ముక్కలుగా వుంటారు. 


No comments:

Post a Comment