Monday, 13 April 2026

“We cannot transform a society that we do not understand.” అర్ధంకాని సమాజాన్ని మార్చలేం!*

 

*కాలధార*

*అర్ధంకాని సమాజాన్ని మార్చలేం!*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

ప్రపంచ పటం మీద ఇప్పుడు రెండు రకాల యుధ్ధాలు సాగుతున్నాయి. ఒకటి గ్లోబల్ ఇంకొకటి లోకల్.

 

అమెరికా - ఇజ్రాయేల్ కలిసి ఇరాన్ మీద ఆయిల్ యుధ్ధం చేస్తున్నాయి. ఇజ్రాయిల్ మీద ఇరాన్ ఎలాగూ ప్రతిదాడులు చేస్తుంది. కానీ, టెహరాన్, న్యూయార్క్ నగరాల మధ్య రానూపోనూ దూరం పాతిక వేల కిలోమీటర్లు. అంతదూరం వెళ్ళి క్షిపణులు ప్రయోగించి తిరిగొచ్చేంత సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అభివృధ్ధి చెందలేదు. కనుక గల్ఫ్ ప్రాంతంలో,  వివిధ దేశాల్లోవున్న అమెరికా యుధ్ధ స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అలా ఇది ఒక ప్రాంతీయ యుధ్ధంగా మారింది. రేపు రష్యా, చైనా, ఉత్తర కొరియాలు రంగంలోనికి దిగితే అది మరో ప్రపంచ యుధ్ధంగా మారే ప్రమాదం లేకపోలేదు.  భారతదేశంలో అబూజ్ మడ్ లోనూ కొన్నేళ్ళుగా ఒక యుధ్ధం సాగుతోంది. అక్కడ భారత ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న మావోయిస్టుల్ని తుద ముట్టించినట్టు కేంద్ర హోం మంత్రి పార్లమెంటులో ప్రకటించారు.

 

నక్సలైట్ ఉద్యమంలో 50 యేళ్ళ క్రితం కూడ ఇలాంటి నైరాశ్య పరిస్థితి ఒకసారి వచ్చింది. దాదాపు కాలి బూడిదగా మారిపోయిందనుకున్న ఉద్యమానికి ఫీనిక్స్ పక్షిలా తిరిగి ప్రాణం పోసి ఏపుగా పెంచి దేశవ్యాప్తంగా విస్తరింప చేసిన ఘనత కొండపల్లి సీతారామయ్యకు దక్కుతుంది. కేఎస్  కృషిని తలకిందులు చేసిన ఘనత ఇప్పటి మావోయిస్టు పార్టికి దక్కుతుంది. అది పరాజయం నుండి పెరుగుదలకు ప్రయాణం అయితే ఇది పెరుగుదల నుండి పరాజయానికి ప్రయాణం. అలా ఈరోజు ఆనాటి కొండపల్లిని తలచుకోవాల్సిన అవసరం వచ్చింది.

 

కేఎస్ వర్ధంతి ఏప్రిల్ 12. ఆయన చనిపోయి 24 ఏళ్ళు. ఈ సమాజం బాగోలేదనీ, దీన్ని మార్చాల్సిన అవసరం వుందని ఆశించేవారికి కేఎస్ ఇప్పటికీ స్పూర్తి.

 

కేఎస్ చాలా విస్తారంగా సిధ్ధాంత వ్యాసాలు రాశారు. అవన్నీ యధాతధంగా ఈరోజు పనికి వస్తాయని అనుకోవడంతప్పు. స్థలకాలాలు మారిపోయినపుడు ఉద్యమాల్లో వ్యూహాలు, ఎత్తుగడలు సమూలంగా మారిపోతాయి. ఆనాటి ఆ పరిస్థితుల్ని మార్చడానికి ఆయనేం చేశాడు? ఆయన స్పూర్తితో - ఈనాడు ఈ పరిస్థితుల్ని మార్చడానికి మనం ఏం చేయాలీ? అనే కనీసపు సృహ లేకపోవడం గతితార్కిక చారిత్రక భౌతిక వాద మౌలిక సూత్రాలకు  వ్యతిరేకం.

 

వాస్తవ సమాజ అవగాహన వాస్తవ పోరాట విధానాలు అనేవి కొత్త తరాలు కేఎస్ నుండి నేర్చుకోవాల్సిన మార్గదర్శకాలు. అర్ధంకాని సమాజాన్ని మార్చలేం! We cannot transform a society that we do not understand.

 

నక్సలైట్ ఉద్యమంలో కొండపల్లి శకం 1990లో ముగిసింది. సరిగ్గా అప్పుడే మన దేశంలో అర్ధ వలస-అర్ధ భూస్వామ్య శకం కూడ ముగిసింది. ఆ తరువాత ప్రపంచంలో పునర్ వ్యవస్థీకరణ సాగింది.  తూర్పు యూరప్ దేశాలు సోషలిజాన్ని వదిలివేశాయి. ప్రపంచ కమ్యూనిస్టు విప్లవ కేంద్రంగా వెలసిల్లిన సోవియట్ రష్యా ముక్కలైంది. తూర్పుగాలి ఆగిపోయి పడమటి గాలి వీచడం మొదలయింది. వామపక్ష భావజాలం బలహీనపడి రైట్ వింగ్ తీవ్రవాదం బలపడింది. మతతత్త్వం చెలరేగింది. అందులో భాగంగానే దేశంలో అద్వానీ రథయాత్రలు సాగాయి. బాబ్రీమసీదు కూల్చివేత, గుజరాత్ మారణకాండ, కేంద్రంలో బిజేపి నాయకత్వంలో అధికార కూటమి ఏర్పడడం వగయిరాలు వాటికి కొనసాగింపే. ఆర్ధికరంగంలో గరీబీ హఠావో నినాదాలు అంతరించి కార్పొరేట్ బఢావో విధానాలు విజృభించాయి.

 

విద్యా వైద్య తదితర సమస్త రంగాల్లో  పబ్లిక్ సెక్టార్ ను వెనక్కి నెట్టి ప్రైవేట్ సెక్టార్ కు పెద్దపీట వేశారు. విద్య ఖరీదైపోవడంతో ఆ విద్య ద్వార ఉపాధి పొందినవారు అవినీతిపరులైపోవడానికి ఆస్కారం పెరిగింది. రాజకీయార్ధిక రంగాల్లో వచ్చిన మార్పులు బెడ్ రూముల వరకూ విస్తరించాయి. కుటుంబ వ్యవస్థ ప్రైవటైజ్ అయిపోయింది. అంతేకాదు; మనుషుల ఆలోచనా ధోరణి మారిపోయింది. మనిషికీ సమాజానికి ఒక అనుబంధం వుందనుకునే కాలం అంతరించి మనిషి ఒంటరివాడై అంతఃసంఘర్షణకు గురయ్యే కాలం వచ్చింది. ఒక్కమాటలో ఈ సమాజం కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ( కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం)గా మారిపోయింది.

 

కొత్త సమాజంలో  కార్పొరేట్లకు అడవులు, ఖనిజాలు మొత్తంగా కావాలి. ఫలితంగా విస్తాపనకు గురయ్యే ఆదివాసులు దీనికి మొదటి బాధితులు. మతతత్త్వాన్నీ సమాజపు అట్టడుగు పొరల వరకు తీసుకుని వెళితే రాజకీయ పై పొరల్లో మెజారిటీ మత సమూహానికి అధికారం దక్కడం సులువు అవుతుంది. దీనికి ప్రధాన బాధితులు మైనారిటీ మత సమూహాలు; ముస్లింలు, క్రైస్తవులు, శిక్కులు. అలాగే, ప్రభుత్వ నియంతృత్వ   పోకడలకు ప్రధాన బాధితులు ఉదారవాదులు, మత సామరస్యవాదులు. ఈ సమూహాలన్నీ ప్రధాన బాధితులు మాత్రమే; నిజానికి బాధితుల జాబితా  చాలా పెద్దది, చాలా విస్తారమైనది.  

 

మావోయిస్టుల పోరాట పటిమను, అంకిత భావాన్నీ, ప్రాణ త్యాగాలనూ ప్రత్యర్ధులు సహితం తక్కువగా అంచనా వేయరు.  కానీ, కొత్తగా ఏర్పడిన కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ( కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం) సమాజాన్ని వాళ్లు అర్ధం చేసుకోలేదు.  లేదా అర్ధం చేసుకోదలచలేదు. 1927-40ల మధ్య కాలంలో వ్యవసాయ ప్రధాన  చైనాలో పుట్టిన అర్ధ వలస-అర్ధ భూస్వామ్య సిధ్ధాంతాన్ని వాళ్ళు ఇప్పటికీ గుండెలకు హత్తుకుని తిరుగుతున్నారు. భారత జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 14 శాతానికి పడిపోయినా వాళ్ళ ఆలోచనలు మారలేదు. వాళ్ళ ప్రాణపద కార్యక్రమాలయిన ‘వ్యవసాయిక విప్లవం’, ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ రూపకల్పనలో మనకు ఎక్కడా ‘ఆదివాసులు’ అనే పదం కనిపించదు. ‘ముస్లిం’ కాదుకదా, మైనారిటీలు అనే పదం అందులో వుంటుందని ఆశించడం  కూడ అమాయికత్వమే అవుతుంది. విచిత్రం ఏమంటే, ఉదారవాదుల మీద వాళ్ళకు కనీసపు గౌరవం కూడ లేదు.

 

నిర్బంధాన్ని తట్టుకునే క్రమంలో మావోయిస్టులు  ఎంచుకున్న వెనకతట్టు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆదివాసులు వున్నారు. అభూజ్ మడ్ ప్రాంతపు ఆదివాసులతో  కలిసి ఒక దశాబ్ద కాలంగా వాళ్ళు  పనిచేస్తున్నారు. వాళ్ళు ఆచరిస్తున్నది వాళ్ళ కార్యక్రమంలో కనిపించదు; వాళ్ళ కార్యక్రమంలో ప్రకటించుకున్నది వాళ్ళ ఆచరణలో కనిపించదు. ఇలా ప్రకటిత కార్యక్రమానికీ, ఆచరణకు పొంతన కుదరకపోతే ఉద్యమాలు  ముందుకుకాక వెనక్కు పరుగులు తీస్తాయి. ఇప్పుడు మనం అలాంటి పరిణామాలనే చూస్తున్నాం. 

 

సంఘపరివారం ప్రచారంచేసే హిందూత్వ సిధ్ధాంతం, దాని  లక్ష్యమయిన హిందూరాష్ట్ర ఏర్పాటు ప్రస్తుతం దేశంలో అధికార భావజాలంగా మారిపోయింది. విపక్ష పార్టీలు, ఉదారవాదులతోపాటూ కమ్యూనిస్టుల మీద కూడ దీని ప్రభావం కనిపిస్తోంది. నిజానికి వాళ్ళ  పరిస్థితి దయనీయంగా మారిపోయిందనవచ్చు. అధిక సంఖ్యాక సమూహాలకు దూరం కాకుండా వుండడానికి వాళ్ళు పడరానిపాట్లు పడుతున్నారు.

 

సంఘపరివారం మతం అనే ఆపరేటివ్ సిస్టమ్ తో హిందూ మత సమూహాల  మెదళ్ళను మొత్తంగా తన కంట్రోల్ లోనికి తీసుకుంది. వాళ్లలో ఉండాల్సిన సెన్సిటివిటీస్ ను క్రమంగా చంపేస్తోంది. “హిందూ ఖతరేమే హై” అన్నది ప్రధాన ప్రచారం. పార్లమెంటరీ ప్రజాస్వామిక ఎన్నికల కార్యక్షేత్రంలో దీన్ని ఎలా ఎదుర్కోవాలో కమ్యూనిస్టులకు అర్ధం కావడంలేదు. ఎంతటి కమ్యునిస్టులయినాసరే హిందూవులకు జరుగుతున్న అన్యాయాలను గురించి కూడా మాట్లాడాలి కదా అని నిలదీస్తే వీళ్ళు నీళ్ళు నములుతున్నారు.

 

వాస్తవ ప్రపంచంలో మైనార్టీల మీద కొనసాగుతున్న అణిచివేతను గట్టిగా విమర్శించడానికి కూడ ఇప్పుడు కమ్యూనిస్టులు జంకుతున్నారు. అంతేకాదు, వ్యక్తి స్వేఛ్ఛ, భావ ప్రకటనా స్వేఛ్ఛా, మత స్వేఛ్ఛ ని ప్రసాదించే ఆర్టికల్ 21, ఆర్టికల్ 25లను అమలు పరచమని గట్టిగా అడిగే సాహసాన్ని కూడ వీరు ప్రదర్శించలేకపోతున్నారు. ఈ పరిస్థితి దేశంలోని మైనార్టీల్ని ఏకాకుల్ని చేసి అభద్రతా భావానికి గురిచేస్తున్నది. ధార్మిక రంగంలో మొదలయిన ఈ వివక్ష రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాలకు కూడ విస్తరించింది.

 

అమెరిక-ఇజ్రాయిల్ సైనికాధికారులు ఇరాన్ పై యుధ్ధాన్ని పవిత్ర యుధ్ధం(క్రూసేడ్స్‍) గా ప్రచారం చేయడం మొదలెట్టారు. అలాంటి సన్నివేశం మనదేశంలోనూ రూపుదిద్దుకుంటున్నది. ఈ వాస్తవాన్ని కమ్యునిస్టులకు అనుక్షణం గుర్తు చేయడం మైనారిటీ ఆలోచనాపరుల సామాజిక బాధ్యతగా మారింది.

 

14-04-2026


No comments:

Post a Comment