Wednesday, 29 April 2026

ఇది హిందూత్వకు టెర్మినల్ స్టేజ్!

 కాలధార

ఇది హిందూత్వకు టెర్మినల్ స్టేజ్!   


డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు 


 

ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్న  పాలన అనేది నిఘంటువు అర్ధం. పాలకులు ప్రజల్ని వశీకరణం చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అలాంటి దగ్గర దారులు తెలిసిన బహుకొద్ది మంది మాత్రమే అధికారాన్ని దక్కించుకునే క్రీడగా ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. దగ్గర దారులు అనడానికి బదులు అడ్డదారులు అనుకున్నా పెద్ద తప్పేమీకాదు.

 

మనదేశంలో ఎన్నికల్లో గెలవడానికి సంఘపరివారం ఓ సులువైన మార్గాన్ని కనిపెట్టింది. ముస్లిం భూతాన్ని మించిన విన్నింగ్ ఫార్మూలా మరొకటి లేదని దానికి అర్ధం అయింది. నరేంద్ర మోదీజీ రాజకీయ గ్రాఫ్ వేగంగా పెరగడానికి ఈ ఫార్మూలా బాగా పనిచేసింది.

 

    2011 జనాభా లెఖ్ఖల ప్రకారం భారతదేశంలో హిందువులు 79 శాతం. ముస్లింలు 15 శాతం. క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులు, జైనులు 6 శాతం. హిందువులకు ముస్లింలతో ముప్పు వుందని ప్రచారంచేస్తే ఆ 79 శాతం ఓటర్లను సులువుగా ఆకర్షించుకోవచ్చనేది ఒక వ్యూహం.

 

    15 శాతం ఓటర్లను అన్యులుగా చూపెట్టి, 85 శాతం ఓటర్లను  ఆకర్షించే వ్యూహం భారత రాజకీయాల్లో కొత్తదేమీకాదు. మొదట్లో కాంగ్రెస్ కూడా  ఇదే వ్యూహంతో సాగేది. ఓటర్లలో ఓ 15 శాతం కమ్యూనిస్టు తదితర పార్టీల  అభిమానులున్నాసరే 85 శాతం తమతోనే వుంటారనే ధీమాతో వ్యవహరించేది. ఇది రాజకీయ ప్రాతిపదిక. కమ్యూనిస్టులది కూడ సేమ్ టు సేమ్ ఫార్మూలా. దేశంలో దోపిడిదారులు 15 శాతం మాత్రమేననీ శ్రామికులు 85 శాతం అని వాళ్ళు లెఖ్ఖలు వేసుకునేవారు.  ఇది వర్గ ప్రాతిపదిక. అంబేడ్కర్ శిబిరం నుండి వచ్చిన కాన్షీరామ్ సహితం 85 శాతం ఫార్మూలాను పాటించేవారు.  పెత్తందాదీ కులాలు 15 శాతం మాత్రమేననీ, బహుజనులు 85 శాతం అనీ గణాంకాలు వివరించేవారు. ఇది కులప్రాదిక.

 

    రాజకీయ, వర్గ, కుల, భాషా, ప్రాంతీయత తదితర  ప్రాతిపదికలకన్నా ఎన్నికల్లో  మతం చాలా ప్రభావశీలంగా పని చేస్తుందని  కనిపెట్టింది మాత్రం బిజెపియే. 15 శాతం ముస్లింలను ప్రమాదకారులుగా చూపెట్టి 85 శాతం హిందువులను ఆకర్షించడానికి అది ప్రతి ఎన్నికల్లోనూ  ప్రయత్నం చేస్తుంది. అందులో సగం ఓట్లు పడినా రాజ్యాధికారం దక్కుతుందని  దానికి అర్ధం అయింది. ‘హిందూ ఖతరే మే హై’ అనేది దాని అధికార రక్షా కవచంగా మారిపోయింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణమంత్రి హిందువులే అయినపుడు హిందువులు ప్రమాదంలో ఎలా వుంటారు? అనే అనుమానం కూడ ఎవరికీరాదు. అదే మత మహాత్యం. ఇంత చేసినా  గడిచిన మూడు లోక్ సభ ఎన్నికల్లోనూ బిజేపికి పూర్తిగా 40 శాతం ఓట్లు కూడ రాలేదు. అయినప్పటికీ మొదీజీ అప్రతిహత శక్తిగా వెలుగులో వుంటున్నారు.  బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రాజాస్వామ్యంలో ఇలాంటి వింతలు కూడ కొన్ని వుంటాయి.

 

జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాక మోదీజీ చారిత్రాత్మక వాగ్దానాలు అనేకం చేశారు. ఆకర్షనీయ పథకాలు అనేకం ప్రకటించారు.  వాటిల్లో ఒక్కదాన్ని కూడ నెరవేర్చకపోగా వాటికి విరుధ్ధమైన ఆచరణను సాగించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కు తీసుకునివచ్చి ప్రతి భారతీయుడుడికి 15 లక్షల రూపాయల చొప్పున పంచవచ్చు అనే మాటతో వారు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆధికారంలో వచ్చాక వారు ఆ నల్లధనాన్ని ఎలాగూ వెనక్కి తీసుకురాలేదు. మరోవైపు, బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయేవారి సంఖ్య వారి హయాంలో బాగా పెరిగింది. మత పరంగా, సామాజికవర్గం పరంగా, ప్రాంత పరంగా వీరెవరూ? అని ఆరాతీస్తే సంఘపరివారానికి చాలా కోపం వస్తుంది. చీలికవాదులంటూ గోదీ మీడియా  చాలా పెద్ద గొంతుతో వాళ్ళ మీద విరుచుకు పడుతుంది.

 

'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' అనేది వారి మరో ప్రసిధ్ధ నినాదం. దేశంలో ఇద్దరు కార్పొరేట్ల ఆస్తులు నిరంతరం పెరిగిపోతుండడాన్నీ, మరో వైపు ఆదివాసులు, ముస్లింలు, వలస కార్మికుల్ని తీవ్రంగా వేధించడాన్నీ మనం ప్రతిరోజూ చూడవచ్చు. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా మొత్తం 543  స్థానాల్లో ఒక్క చోటతప్ప, మరెక్కడా బిజెపి ముస్లిం అభ్యర్ధులకు పార్టీ టిక్కెట్టు ఇవ్వలేదు. లక్షద్వీప్ లో  మరొకరు వుండరుకనుక అక్కడ మాత్రమే ముస్లింకు ఒక సీటు ఇచ్చారు.  ఉత్తరప్రదేశ్ లో ముస్లీంల మీద  నేరారోపణ జరిగితేచాలు; నేరం రుజువు కాకుండానే వాళ్ళ ఇళ్ళను బుల్ డోజర్లతో కూల్చేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

 

ఎన్నికల్లో ఓటర్లకు ఈ కిక్కు సరిపోదు. డోసు పెంచాలి. దేశాన్ని ముస్లిం ముప్పు కబళించేస్తున్నదని భయపెట్టాలి. ముస్లింలు నవ్వినా ఏడ్చినా ప్రేమించినా పొట్టకూటికోసం బన్నులు అమ్ముకున్నా దానికో జిహాద్ బిరుదు తగిలించి ఆందోళన సాగించాలి. బన్ను జిహాద్, లవ్ జిహాద్, జమీన్ జిహాద్.  ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఒకవైపు ముస్లింలు పంక్చర్లు వేసుకోవడానికితప్ప మరి దేనికీ పనికిరారు అని ప్రచారం చేస్తుంటారు. ముస్లింలు తమ స్వశక్తి మీద విద్యారంగంలో మంచి ఫలితాలను సాధిస్తే దానికో జిహాద్ బిరుదు తగిలించి ఆ విద్యా సంస్థను మూసేసేవరకూ నిద్రపోరు. కశ్మీర్ లో ఈ మధ్య ఓ మెడికల్ కాలేజీలోని 50 సీట్లలో 42 స్థానాల్ని ముస్లింలు మెరిట్ ప్రాతిపదికన దక్కించుకున్నారు. అంతే, ‘మెడికల్ జిహాద్’ అంటూ ఆందోళన చేసి ఆ మెడికల్ కాలేజీనే మూయించివేశారు. టిప్పు రాగానే రెచ్చిపోవడానికి  వ్యవస్థీకృత వృత్తి కళాకారులు  సోషల్ మీడియాలోనూ, అన్-సోషల్ మీడియాలోనూ వేల సంఖ్యలో సిధ్ధంగా వుంటారు.

 

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న  ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు బిజెపికి ప్రతిష్ణాత్మకం. తమిళనాడు నేల మీద బిజెపి విత్తనం మొలకెత్తడం కష్టం. ఇప్పుడు బిజెపి శక్తులన్నింటినీ పశ్చిమ బెంగాల్ మీద కేంద్రీకరించింది. అంటే, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడం అన్నమాట.

 

పశ్చిమ బెంగాల్ లో తాము అధికారంలోనికి వస్తే బంగ్లాదేశ్ చొరబాటుదార్లను మెడపట్టి గెంటేస్తామనీ, దేశ తూర్పు సరిహద్దును ముళ్ళకంచెలతో మూసి వేస్తామని హోంమంత్రి అమిత్ షా ఒక వాగ్దానం చేశారు. చొరబాటుదార్లను బయటికి పంపించడానికి detect, delete and deport విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. నిజానికి చొరబాటుదార్లను బయటికి పంపించడానికి బిజెపి  పశ్చిమ బెంగాల్ లో అధికారంలోనికి రావలసిన పనిలేదు. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రంలో ఇప్పుడు బిజెపినే అధికారంలో వుంది. ఓటర్లు ఇలాంటి లాజిక్కులు అడగకూడదు. చెప్పింది వినాలి.

   

బెంగాలో చొరబాటుదారుల ‘యొక్క’, చొరబాటుదారుల ‘ద్వార’ చొరబాటుదారుల ‘కొరకు’ ప్రభుత్వాన్ని తృణామూల్ కాంగ్రెస్ నడుపుతున్నదని ప్రధాని ఆరోపించారు. చొరబాటుదార్ల మతాన్నీ, భాషనూ, సంస్కృతీ సాంప్రదాయాలనూ పరిరక్షించడానికి మమతా బెనర్జీ అదనంగా శ్రమిస్తున్నారని వారు ఎద్దేవ చేశారు. బిజెపి నాయకుడు ఒకాయన అయితే బెంగాల్ ఎన్నికల్ని ఏకంగా నాగరీకతల యుధ్ధంగా చిత్రించారు.

 

    విధానపరమైన ప్రచారాలు  సరిపోవనుకున్నప్పుడు సంఘపరివారం అనేక దిగజారుడు పనులు సహితం చేస్తుంది. ఎన్నికల ప్రచారం జోరుగు సాగుతున్న కాలంలో, శ్రీరామ నవమికి ముందు   పశ్చిమ బెంగాల్ పురులియాలో ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహాలను కొందరు దుండగులు విధ్వంసం చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు పోలీసులు సహజంగా ముస్లింలను అనుమానిస్తారు. అరెస్టులు చేస్తారు. కానీ, మతకల్లోలాలను రెచ్చగొట్టడానికి  బిజిపి నేతలే విగ్రహాల విధ్వంసానికి పాల్పడినట్టు తేలింది.

 

సంఘ్ పరివారం ప్రచారం, దాడులకు భయపడి భారత ముస్లిం సమాజం గోమాంసానికేకాక అసలు బీప్ కే దూరమయిపోయింది.  దానితో గోరక్షణ కోసం ఏర్పడిన బిజెపి దళాలకు పనిలేకుండా పోయింది. వాళ్ళే గోవుల్ని కోసి ఆ ముక్కల్ని గుళ్ళల్లో విసిరి ఆ నిందను ముస్లింల మీద వేసేంత వరకు తెగిస్తున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు మరీ ఎక్కువవుతున్నాయి.

 

ఈ పూనకం ఎంత వరకూ వెళ్ళిపోయిందంటే దేశలో శాకాహారులు హిందువులు, మాంసాహారులు ముస్లింలు అనే కొత్త నిర్వచనాన్ని ముందుకు తెచ్చారు. ఈ తర్కం ప్రకారం దేశంలో మాంసాహారులే మెజారిటి.   అంటే ముస్లింలే మెజారిటి అన్నమాట.

భారత ఆర్ధిక స్థితి నాలుగో స్థానం నుండి ఆరవ స్థానానికి పడిపోయింది. భారతదేశంకన్నా బంగ్లాదేశ్ తలసరి జిడిపి మెరుగ్గావుంది.    అమెరిక ముఖం మీద ఉమ్మేసినా మన దేశాధినేతలు కర్చిఫ్ తో తుడుచుకుని మౌనంగా వుండిపోతున్నారు. వీటి మీద మాట్లాడాల్సిన సమయంలో “వాళ్లు మాసం తినడమేగాక ఆ వీడియోలను బయట పెట్టి ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు” అని స్వయంగా ప్రధానియే ప్రచారం చేస్తున్నారు. ముస్లింలను సామాజికంగా వెలివేయడానికి హిందువులు పందుల్ని పెంచుకోవాలని సంఘపరివార వ్యూహకర్తలు పిలుపులు ఇస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు. దీన్ని హిందూత్వకు టెర్మినల్ స్టేజి అనవచ్చు.   

 

హిందూ సమూహం మొత్తం లించింగ్ బ్యాచీల్లా వుండదు. మతాన్ని ఒక పవిత్ర వ్యవహారంగా భావించే సమూహం కూడ వుంటుంది. కొత్తగా వస్తున్న ఈ వికారపు పోకడల్ని వాళ్లు ఆమోదిస్తున్నారా? భరిస్తున్నారా? అనేది ఒక సమంజసమైన  సందేహం.  వాళ్లు ఆమోదించకపోతే హిందూత్వ లోపలి నుండే బీటలు వారుతుంది.

 

రచన : 28-04-2026

ప్రచురణ : తెలుగుప్రభ 29-04-2026

No comments:

Post a Comment