Saturday, 27 June 2026

గోదావరి నీళ్లు : రాయలసీమకు వరమా? లేక దక్షిణాది రాష్ట్రాలకు మళ్లింపా?

 

ఈ వ్యాసాన్ని ప్రచురణకు పరిశీలించండి.

గోదావరి నీళ్లు : రాయలసీమకు వరమా? లేక దక్షిణాది రాష్ట్రాలకు మళ్లింపా?

- డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

“శిశువుకు దక్కని తల్లి స్థన్యంలా ప్రవహిస్తున్నది గోదావరి” అని మహాకవి శ్రీశ్రీ వాపోయి దాదాపు అర్ధ శతాబ్దం గడిచింది. నేటికీ అదే ఆవేదన కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, వాటిని వినియోగించుకోలేకపోవడం దేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు పెద్ద నష్టమని రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజాసంఘాలు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఒక కీలకమైన ప్రశ్న ముందుకు వస్తోంది. సముద్రంలో కలిసే గోదావరి జలాలను రాయలసీమకు తరలించి అక్కడి శాశ్వత కరువు సమస్యకు పరిష్కారం చూపాలా? లేక ఆ జలాలను జాతీయ నదుల అనుసంధాన పథకం పేరిట దక్షిణాది రాష్ట్రాలకు మళ్లించాలా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేముందు గోదావరి నది స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.

భారతదేశంలో గంగానది తరువాత రెండవ అతి పొడవైన నది గోదావరి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వద్ద పుట్టిన ఈ నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా 1465 కిలోమీటర్లు ప్రవహిస్తూ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అనేక ఉపనదులను కలుపుకొని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అందువల్ల గోదావరి జలాలు కేవలం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు మాత్రమే చెందినవి కావు. ఇవి ఆరు రాష్ట్రాల హక్కులు, అవసరాలు, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తమిళనాడును కూడ గోదావరితో అనుసంధానం చేస్తున్నారు.

ప్రజల్లో సాధారణంగా ఉన్న ఒక అపోహ ఏమిటంటే, సముద్రంలో కలిసే నీరంతా వృథా అవుతుందని. కానీ జలశాస్త్ర నిపుణులు అలా భావించరు. నదుల నుంచి కొంత పరిమాణంలో తీపినీరు సముద్రంలోకి చేరడం పర్యావరణ సమతుల్యతకు అత్యంత అవసరం. లేకపోతే సముద్రపు ఉప్పునీరు భూగర్భ జలాల్లోకి చొచ్చుకునివచ్చి డెల్టా ప్రాంతాలను ఉప్పునేలలుగా మార్చేస్తుంది. గోదావరి డెల్టా వంటి సారవంతమైన వ్యవసాయ భూములు క్రమంగా నిరుపయోగమైన సవుడు నేలలుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి, సముద్రంలో కలిసే ప్రతి చుక్క నీరు వృథా అని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు.

అయితే, గోదావరిలో లభించే జలాలలో గణనీయమైన భాగం ఇప్పటికీ వినియోగంలోకి రావడం లేదు అనేది కూడా వాస్తవమే. కృష్ణానదితో పోలిస్తే గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ. కానీ వినియోగం తక్కువ. దీనికి ప్రధాన కారణం భౌగోళిక పరిస్థితులు.  కూనవరం దిగువన గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా వుండడానికి ప్రధాన కారణం సీలేరు, శబరి నదుల నీటిని ఒడిశా, ఛతీస్ గడ్ రాష్ట్రాలు వాడుకోలేకపోతున్నాయి. అక్కడి భౌగోళిక వాతావరణం అందుకు అనువుగాలేదు. భవిష్యత్తులో ఆ రెండు రాష్ట్రాలు తమ వాటా నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తే దిగువ గోదావరికి కష్టాలు తప్పవు.

గోదావరి పరివాహక ప్రాంతంలోని విస్తారమైన భూభాగం ఎత్తైన పీఠభూముల్లో ఉండటం వల్ల అనేక ప్రాజెక్టుల్ని ఎత్తిపోతల పథకాలుగా నిర్మించాల్సి వస్తోంది. వీటి నిర్మాణ వ్యయం మాత్రమే కాదు, నిర్వహణ వ్యయం కూడా చాలా అధికం. విద్యుత్ ఖర్చు వేల కోట్ల రూపాయల వరకు చేరుతోంది. ఈ పరిస్థితిని మనం ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం సాంకేతికంగా సాధ్యమేగానీ, ఆర్ధికంగా లాభదాయకంకాదు. feasible but not viable.

ఈ నేపథ్యంలో రాయలసీమకు గోదావరి జలాలను తరలించాలన్న ఆలోచనకు ప్రాధాన్యం పెరుగుతోంది. రాయలసీమ చరిత్ర కరువుల చరిత్రగా మిగిలిపోయింది. తక్కువ వర్షపాతం, భూగర్భ జలాల అధిక వినియోగం, కృష్ణా జలాలపై అనిశ్చితి వంటి కారణాల వల్ల ఆ ప్రాంతం తీవ్ర జలసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అందువల్ల గోదావరి జలాలను రాయలసీమకు మళ్లించాలనడం  సామాజిక న్యాయం కోణంలో సమర్థనీయమైన వాదన.

అయితే, ఈ సామాజికన్యాయాన్ని పాటించడం కూడ అంత సులువైన న వ్యవహారం కాదు. గోదావరి నుంచి రాయలసీమకు నీరు చేరాలంటే ముందుగా కృష్ణా బేసిన్‌ను దాటాలి. అక్కడి నుంచి పెన్నా బేసిన్‌కు మళ్లించాలి. దీనికోసం భారీ స్థాయిలో కాలువలు, పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంటుంది. అంతేకాదు, గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోకి మళ్లించినప్పుడు అంతర్రాష్ట్ర జల పంపిణీ ఒప్పందాలు కూడా వర్తించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆ నీటిపై తమ హక్కులను వినియోగించుకునే అవకాశాలని పూర్తిగా తోసిపుచ్చలేం. అలా అదనపు నీరు తమకు వస్తుందని ఎగువ రాష్ట్రాలు దానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని సిధ్ధంగా వున్నాయి. అల్మట్టి డామ్ ఎత్తును పెంచడం అందులో భాగమే.

ఇక్కడే మరో కీలక అంశం ముందుకు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా “నదుల అనుసంధానం” అనే ఒక భారీ జాతీయ పథకాన్ని రచిస్తోంది. ముందు మహానది- గోదావరి నదుల్ని అనుసంధానించడం, ఆ పిదప   గోదావరి జలాలను కృష్ణా, పెన్నా, కావేరీ నదులతో అనుసంధానం చేయడం వంటివి ఈ జాతీయ పథకంలో వున్నాయి. దేశంలో నీటి అసమాన పంపిణీని తగ్గించడం, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు అదనపు జలాలను అందించడం దీని ప్రధాన ఉద్దేశమని కేంద్రం చెబుతోంది.

అయితే, ప్రతి పథకానికీ మరో కోణాలుంటాయి. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలు ఈ జాతీయ పథకంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయి. కారణం స్పష్టమే. కావేరీ జలాలపై ఇప్పటికే తీవ్రమైన వివాదాలు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలు భవిష్యత్తులో కీలక ప్రత్యామ్నాయ వనరుగా మారే అవకాశం ఉంది.

ఇక్కడ ఒక రాజకీయ అనుమానం కూడా వ్యక్తమవుతోంది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించడాన్ని పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వం రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇతర రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తోందా? ముఖ్యంగా దక్షిణ భారత రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు కేంద్రం జలవనరులను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తోందా? అనే సందేహాలూ లేకపోలేదు. పైకి ఎన్ని మాటలు చెప్పినా సారాంశంలో ఇది ‘గోదావరీ వాటర్ హైజాక్’ అనే తీవ్ర ఆరోపణలు కూడ వున్నాయి.  

అయితే, ఈ వాదనను నిర్ధారించడానికి తగిన ఆధారాలు ఇంకా అందుబాటులో లేవు. అందువల్ల “గోదావరి జలాలను హైజాక్ చేస్తున్నారు” అనే ఆరోపణను ఇప్పటికి రాజకీయ ఆందోళనగా మాత్రమే పరిగణించాలి. అదే సమయంలో, గోదావరి పరివాహక రాష్ట్రాల అవసరాలు పూర్తిగా తీరకముందే ఇతర రాష్ట్రాలకు జలాలను మళ్లించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమవుతుందని కూడా చెప్పాల్సి ఉంటుంది. గోదావరి ఆరగాణి ప్రాంతంతో తమిళనాడుకు ఎలాంటి సంబంధంలేదు. మంజీర నది పరివాహక ప్రాంతం కొంత కర్ణాటకలోనూ వుంది. అలా గొదావరితో కర్ణాటకకు నీటి బంధం వుంది.

అసలు ప్రశ్న ఏమిటంటే, గోదావరి జలాల వినియోగంలో ప్రాధాన్యత క్రమం ఏమిటి?

మొదటిగా, గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజల అవసరాలు తీరాలి. రెండవదిగా, రాయలసీమ వంటి చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతాలకు నీటి భద్రత కల్పించాలి. మూడవదిగా, గోదావరి డెల్టా పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. చివరిగా, మిగిలిన జలాలను మాత్రమే జాతీయ స్థాయిలో పునర్వినియోగం చేయాలి.

నీటి సమస్య కేవలం సాంకేతిక అంశం కాదు; అది సామాజిక న్యాయం, సమాఖ్య వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ సమతుల అభివృద్ధి వంటి అంశాలతో ముడిపడి ఉంది. అందువల్ల గోదావరి జలాల విషయంలో రాజకీయ నినాదాల కంటే శాస్త్రీయ అధ్యయనాలు, పారదర్శక విధానాలు, అంతర్రాష్ట్ర సంప్రదింపులు అత్యంత అవసరం.

గోదావరి జలాలు రాయలసీమకు వరంగా మారాలా? లేక ఆ వంకతో దక్షిణాది రాష్ట్రాలకు మళ్లించాలా? అనే ప్రశ్నకు ఈ రోజు ఒకే ఒక్క సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. గోదావరి జలాలు ముందుగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజల అభివృద్ధికి, తర్వాత కరువుతో పోరాడుతున్న ప్రాంతాల పునరుజ్జీవనానికి ఉపయోగపడాలి. మిగిలిన జలాల పంపిణీ మాత్రమే జాతీయ అవసరాల దృష్ట్యా పరిగణనలోకి తీసుకోవాలి.

అయితే ఇక్కడ మరో ప్రమాదాన్ని కూడా గుర్తించాలి. నదులలో లభ్యమయ్యే జలాల అంచనాలు శాశ్వతమైనవి కావు. వాతావరణ మార్పులు, అడవుల వినాశనం, వర్షపాత నమూనాలలో మార్పులు, భూగర్భ జలాల క్షీణత వంటి కారణాల వల్ల భవిష్యత్తులో నికర జలాల లభ్యత గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది.

బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం ఆధారిత విశ్వసనీయతను ప్రమాణంగా తీసుకోగా, తరువాతి ట్రిబ్యునల్స్ నీటి లభ్యతను వేరే పద్ధతుల్లో అంచనా వేశాయి. కానీ నేటి వాతావరణ సంక్షోభ పరిస్థితుల్లో పాత గణాంకాలతో భవిష్యత్తును ఊహించడం ప్రమాదకరమవచ్చు.

ఈ నేపథ్యంలో గోదావరి జలాలపై తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం ప్రస్తుత రాజకీయ అవసరాలను మాత్రమే కాదు, రాబోయే తరాల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి.

ఎందుకంటే నీరు కేవలం సహజ వనరు మాత్రమే కాదు; అది భవిష్యత్ తరాల ప్రాథమిక హక్కు కూడా.

28 జూన్ 2026

No comments:

Post a Comment