Saturday, 25 July 2026

సింహాసనం వణికింది

 

సింహాసనం వణికింది 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు 

 

            ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నియంతను ఒక హాస్యాస్పదమైన కేతిగాడిగా చూపించడం ద్వారా, నియంతల గురించి ప్రజల్లో పేరుకుపోయిన భయాన్ని తొలగించడానికే  తాను ‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమా తీసినట్టు  చాప్లిన్ ఓ వివరణ ఇచ్చాడు. ఢిల్లీలో బొద్దింకలు అదే పని చేశాయి. నియంతలు కూడా భయపడతారు. దిగివస్తారు. వెనక్కి తగ్గుతారు. అవసరమైతే తమ మంత్రులను కూడా బలి ఇస్తారు.

 

            ఇంతకాలం మనకు ఒక నేరేటివ్ను నమ్మించారు. భారత ప్రధాని సర్వశక్తిమంతులు. సర్వజ్ఞులు. వారు అనుకున్నదే జరుగుతుంది. ఎంతటివారైనా వారి పాదాక్రాంతం కావాల్సిందే. వారు హిమాలయాలంత ఎత్తులో ఉంటే, దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తూర్పు కనుమల్లోని చిన్న గుట్ట మాత్రమే. ప్రజాస్వామ్యానికి మూడు మూలస్థంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు, అనధికారికంగా నాలుగో స్థంభంగా భావించే మీడియాఅన్నీ వారి కనుసన్నల్లోనే కదులుతున్నాయనే భావనను ప్రజల్లోకి నెట్టారు. భావన ఎంత బలంగా మారిందంటేప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న ప్రశ్నకంటే, అధికారాన్ని ఎదిరించడం సాధ్యమా కాదా అన్నదే అసలు ప్రశ్నగా మారిపోయింది.

 

            అప్పుడు షాహీన్ బాగ్ వచ్చింది. వాళ్లను పాకిస్తానీయులన్నారు. రైతులు ఉద్యమిస్తే ఖలిస్తానీయులన్నారు. మహిళా రెజర్లు న్యాయం అడిగితే, వారి మీదే నిందల దాడులు చేశారు. ఉద్యమాలన్నీ ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రశ్నలనే లేవనెత్తాయి. కానీ వాటికి ఒక పరిమితి ఉంది. వాటి మీద ఒక నిర్దిష్ట ప్రయోజనాలున్న సామాజికవర్గాల ఉద్యమాలంటూ ముద్ర వేయగలిగారు. వాటిని మిగతా సమాజం నుంచి వేరు చేయడం అధికారానికి సులభమైంది.

 

            కానీ బొద్దింకల ఉద్యమం వ్యూహాన్ని తలకిందులు చేసింది. అది ఒక సామాజిక వర్గం ఉద్యమం కాదు. అది ఒక మత ఉద్యమం కాదు. అది ఒక కుల ఉద్యమం కాదు. అది పిల్లల ఉద్యమంగా మొదలై, తల్లిదండ్రుల ఉద్యమంగా విస్తరించింది. చివరికి, దేశం మొత్తం తన పిల్లల భవిష్యత్తు గురించి ప్రశ్నించే ఉద్యమంగా మారింది.

 

            మొదట బొద్దింక అన్న అవమానాన్ని వాళ్లు ఆత్మగౌరవంగా మార్చుకున్నారు. “పిల్లలు ఏం చేస్తారు?” అన్న చిన్నచూపును—“పిల్లలు ఏదైనా చేయగలరుఅనే సత్యంగా మార్చారు. అమ్మాయిలు ఢిల్లీ వీధుల్లో నిలబడి గోదీ మీడియాను ప్రశ్నిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. “మమ్మల్ని పాకిస్తానీయులంటున్నారు. పాకిస్తాన్ వెళ్లి బిర్యానీలు తిన్నవాళ్లు ఎవరు?” అని వాళ్లు అడిగారు. ఒక్క ప్రశ్నలోనే ఎన్నో సంవత్సరాల రాజకీయ ప్రచారానికి సమాధానం ఉంది. “మేము నమ్మే దేవుని ఆలయాలను మూసివేశారు. కానీ అల్లా ఇంటినీ, గురుద్వారాలనూ మా కోసం తెరిచి ఉంచారుఅని హిందూ సమూహం చెబుతుందని ఎవరూ ఊహించి ఉండరు. మతాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించే వారికి అది చాలా అసౌకర్యకరమైన వ్యాఖ్య.

 

            ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి దళితుడా కాదా అని ప్రజలు చూడలేదు. అతను తమ సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్ళుతున్నాడా? లేదా? అన్నదే చూశారు. ఇది చిన్న విషయం కాదు.

 

            ఇంకో విషయాన్ని కూడ ఉద్యమం బయటపెట్టింది. ముస్సోలినీ ఇటలీలో బ్లాక్ షర్ట్స్ను, హిట్లర్ జర్మనీలో బ్రౌన్ షర్ట్స్ను ఉపయోగించాడు. ఢిల్లీలో పోలీసులతో కలిసి విద్యార్థులపై దాడి చేస్తున్న కొత్త రకం షర్ట్స్ను ప్రజలు చూశారు. సాక్ష్యాలు బయటపడ్డాయి. వీడియోలు వాటిని బంధించాయి.

 

            నీట్ ప్రశ్నాపత్రాల లీక్ నుంచి మొదలైన డిమాండ్ మరింత పెద్దదైంది. “కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.” ప్రభుత్వం ఇంకా బెట్టుచేస్తే, ప్రధానమంత్రి రాజీనామా చేయాలని కూడా అడగగలంఅన్న స్థాయికి ఉద్యమం చేరింది. అదే కీలక మలుపు.

 

            గత పన్నెండు సంవత్సరాల్లో పార్టీ, సంఘం, ఉద్యమం కూడా స్థాయిలో సింహాసనాన్ని భయపెట్టిందా? బహుశా లేదు. సింహాసనం వణికింది. వైపుకే ముప్పు వస్తున్నప్పుడు, ఒక మంత్రిని వదిలించుకోవడం మంచిదని సింహాసనం భావించింది.

 

            ఢిల్లీలో విద్యార్థినులు ఫైజ్ అహ్మద్ ఫైజ్ గీతాన్ని పాడుతూ తిరిగారు.  కిరీటాలు గాల్లో ఎగురుతాయి. సింహాసనాలు పక్కకు ఒరుగుతాయి.” గీతం తన ప్రభావాన్ని కోల్పోలేదు. ఎందుకంటే చరిత్రలో సింహాసనమూ శాశ్వతం కాదు.

 

            మాయల ఫకీరు ప్రాణం ఎక్కడుందో ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయింది. అది ఒక మంత్రిలో లేదు. అది ఒక పార్టీ కార్యాలయంలో లేదు. అది ప్రజల భయంలో ఉంది. భయం పోయిన రోజుమాయల ఫకీరు శక్తులన్నింటినీ కోల్పోతాడు.

 

            ఉద్యమం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా నిరూపించింది. నాయకుడు అన్నీ తాను కాకూడదు. ప్రజలు ఉద్యమించేలా చేయాలి. ఇది సీట్ల కోసం, పదవుల కోసం, కూటముల కోసం పరస్పరం తగువులాడుకుంటూ రోజురోజుకూ బలహీనపడుతున్న విపక్షాలకు ఒక గుణపాఠం.

 

            ప్రజల సమస్యలను ముందుకు పెట్టండి. ప్రజలను వీధుల్లోనికి తీసుకురండి. ప్రజలకు నాయకత్వం అప్పచెప్పండి. అదే ప్రజాస్వామ్యం.

 

            ఒక మంత్రిని తప్పించినంత మాత్రాన వ్యవస్థ మారిపోలేదు. నీట్ పరీక్షా వ్యవస్థ మారలేదు. కార్పొరేట్ విద్యా సామ్రాజ్యం కూలిపోలేదు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు శాశ్వత పరిష్కారం రాలేదు. అయినా ఇది ఒక మహత్తర విజయం. ఎందుకంటే నిరాశతో నిండిన వాతావరణంలో, అధికారాన్ని ప్రశ్నించడం సాధ్యమేనని ఇది నిరూపించింది.

 

            విజయం ఒక్కరోజులో రాలేదు. సర్ ప్రక్రియతో ఓ జ్ఞాని దేశంలో బోలెడంత అభాసుపాలయ్యారు. ప్రజా సమస్యల్ని లేవనెత్తేవారిని బొద్దింకలంటూ ఇంకో న్యాయమూర్తి సూర్యకాంతులు వెదజల్లారు.  అలా తిట్టు నుండి బొద్దింకల పార్టీ పుట్టింది. జనం నవ్వారు. “ఇదో పిల్లల వ్యవహారంఅన్నారు. అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళ చేతికి నీట్ ప్రశ్నాపత్రాల లీక్ అనే ఆయుధం అందించారు.

 

            అభిజీత్ దీప్కే దాన్ని వరంగా చూశాడు.కళ్లకు అద్దుకున్నాడు. విద్యార్థుల ఆగ్రహాన్ని ఉద్యమంగా మార్చాడు. తరువాత లఢాఖ్ ఉద్యమ నాయకుడు, ప్రజా శాస్త్రవేత్తగా పేరుగాంచిన సోనమ్ వాంగ్చూక్ రంగంలోకి వచ్చాడు. ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులూ జంతర్ మంతర్ వైపు చూడటం మొదలుపెట్టారు. పిల్లల ప్రశ్న తల్లిదండ్రుల ప్రశ్నగా మారింది. తల్లిదండ్రుల ప్రశ్న దేశ ప్రశ్నగా మారింది.

 

            మధ్య ఆసియాలో అరబ్ స్ప్రింగ్. శ్రీలంకలో ప్రజా తిరుగుబాటు. నేపాల్లో జెన్-జీ. మన దేశంలో కాక్రోచెస్. పేరేదైనా కావచ్చు. కొత్త తరం భయపడదు. భయపెడుతుంది. భయపెట్టింది.  

 

            ఈ కథ ఓ అరవై ఏళ్ళ  క్రితం మొదలయింది.  1968లో ఫ్రాన్స్లో విద్యార్థి ఉద్యమం వచ్చింది. దాదాపు అదే కాలంలో భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం పుట్టింది. ప్రపంచంలోని అధికార వ్యవస్థలు ఉలిక్కిపడ్డాయి. ఉద్యమాలకు కారణం ఏమిటి? వాళ్లు జల్లెడపట్టి వెతికారు. వాళ్లకు కనిపించిన ఒక కారణంప్రభుత్వ విద్యాసంస్థలు. చౌకగా, అందుబాటులో ఉన్న విద్యాసంస్థలు ప్రశ్నించే యువతను తయారు చేస్తున్నాయి. యువతే ఉద్యమాలకు వెళ్తోంది అని వాళ్లకు అర్ధం అయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ విద్యను బలహీనపరిచే ప్రక్రియ మొదలైంది. ఉన్నత విద్య క్రమంగా ప్రైవేటు రంగానికి వెళ్లింది. విద్య అనేది నెమ్మదిగా హక్కు నుంచి వస్తువుగా మారింది. వస్తువు చివరికి కార్పొరేట్ ఉత్పత్తిగా మారింది.

 

            ఈరోజు వైద్య విద్య పరిస్థితి చూడండి. మూడు దశాబ్దాల క్రితం ఇంజినీరింగ్ విద్యకున్న డిమాండ్ ఇప్పుడు లేదు. మెడిసిన్ ఆ క్రేజ్ ను పుంజుకుంది. ఎంబీబీఎస్ చదువు కోసం కుటుంబాలు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. పీజీ కోసం మరిన్ని కోట్లు. అయినా, అల్పాదాయ వర్గాలు సహితం అప్పులు చేసైనా సరే తమ పిల్లలను డాక్టర్లు చేయాలనుకుంటున్నారు.

 

            ఇప్పుడు నీట్ ఒక పరీక్ష మాత్రమే కాదు. అది ఒక భారీ ఆర్థిక వ్యవస్థ నీట్ కోచింగ్ మార్కెట్‌ 60 వేల కోట్ల రూపాయల వ్యాపారంగా అంచనా వేస్తున్నారు. చిన్న, మధ్య తరహా కోచింగ్ సంస్థలను కలుపుకుంటే ఆర్థిక వ్యవస్థ మరింత పెద్దదవుతుంది.

 

            వ్యవస్థకు ప్రాణవాయువు ఏమిటి? ర్యాంకులు. ర్యాంకులు ఎలా వస్తాయి? అది విద్యార్థి ప్రతిభపై ఆధారపడి ఉండాలి. కానీ ప్రశ్నాపత్రం ముందుగానే అందే అవకాశం ఉందని మార్కెట్లో నమ్మకం ఏర్పడితే? అప్పుడు కోచింగ్ విద్య కాదు; అది వ్యాపారం. ప్రశ్నాపత్రం ఒక ఉత్పత్తి. ర్యాంకు ఒక ప్రకటన. విజయం ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్. ఇదే అసలు ప్రమాదం.

 

            కార్పొరేట్ విద్యా సామ్రాజ్యం చాలా పెద్దది. చాలా శక్తివంతమైనది. ప్రశ్నాపత్రాల లీకేజీలు కేవలం వ్యక్తిగత అవినీతి కాదు. అవి వ్యవస్థాగత అవినీతి. అందుకే ఉద్యమం ఒక మంత్రిని తప్పించడంతో ముగిసిపోకూడదు. ఇది విద్యా వ్యవస్థను ప్రశ్నించాలి. కోచింగ్ పరిశ్రమను ప్రశ్నించాలి. ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలను ప్రశ్నించాలి. విద్యను వ్యాపారంగా మార్చిన వ్యవస్థను ప్రశ్నించాలి.

 

            ఇప్పటికి  సింహాసనం వణికింది. అది మళ్లీ స్థిరపడుతుందా? లేక ప్రజలు దాన్ని మరింతగా కదిలిస్తారా?

 

26 జూన్ 2026

No comments:

Post a Comment