*అజ్ఞాత దాతలూ మీకు వందనాలు*.
సమాజ కార్యక్రమాల్ని సమిష్టిగా చేయాలి*
ఢిల్లీ ప్రయాణానికి కాంట్రిబ్యూషన్ కోరుతూ నేను పెట్టిన పోస్టు మీద ఒకరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇలా కాంట్రిబ్యూషన్ కోరుతూ పోస్టులు పెట్టడం నాకు ఇది మొదటిసారికాదు. సమాజ హితాన్ని కోరే ఏ పనినీ ఒంటరిగా చేయరాదు. ఇదొక రూలు. ప్రజలు పోరాడాలి. వారి తరఫున కొందరు మాత్రమే పోరాడకూడదు. ఎందుకంటే, కొద్దిమంది “హీరోలు” ప్రజల తరఫున అన్ని చర్యలూ చేపడితే, మిగిలిన ప్రజలు ప్రేక్షకులుగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు కేవలం సానుభూతిపరులు, ప్రేక్షకులుగా కాకుండా కాకుండా, రాజకీయ చర్యలో క్రియాశీలక పాత్రధారులు కావాలి. ఒక గెరిల్లా దళం అడవుల్లో సంవత్సరాల పాటు నిలబడవచ్చు. దాడులు చేయవచ్చు. భద్రతా బలగాలను ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఒక విప్లవం విజయవంతం కావాలంటే అంతకంటే ఎక్కువ అవసరం. ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులవ్వాలి. - 1950లో తనను కలిసిన భారత కమ్యూనిస్టు పార్టి ప్రతినిధి బృందానికి స్టాలిన్ చేసిన హితవు ఇది.
స్టాలిన్ సలహాలు సూచనలు నాకు ఈమధ్య తెలిశాయిగానీ, నేను నక్సలైటుగా మారిన కొత్తలో కొండపల్లి సీతారామయ్య స్వయంగా చెప్పిన పాఠం కూడా ఇదే. సాము కోసం ఒక కర్ర కొనాల్సి వచ్చినా పదిమందీ పది పావులాలు వేసుకోవాలి అనే వారాయన. లేకపోతే ఆ కర్రకు ఒకడే యజమాని అవుతాడు.
నేను నెలలో సగం రోజులు హైదరాబాద్ లో సగం రోజులు విజయవాడలో వుంటాను కనుక ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. అవి వ్యక్తిగత ప్రయాణాలు. మా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. దానికి ఇతరుల కాంట్రిబ్యూషన్ అక్కర లేదు.
నా ఆర్ధిక స్థితి గురించి ఒక వాస్తవం చెప్పాలి. నాకు ఆరడుగులు కాదుకదా ఈ భూమ్మీద ఇప్పుడు ఒక్క అడుగు స్థలం కూడ లేదు. ఓ ఐదెకరాలు వుండేవి. వాటిని కారంచెడు ఉద్యమం సందర్భంగా వదిలేశాను. కాలమ్స్ రాసినందుకు పత్రికలు ఇచ్చే డబ్బులు టీకి కూడా సరిపోవు. అన్నట్టు నేను టీ తాగను, సిగరెట్టు కాల్చను. ఇంకోటి తాగుతాను. బ్యాంకు అకౌంటులో తరచూ మినిమమ్ బ్యాలెన్స్ కూడ వుండదు. అయినప్పటికీ నన్ను నా కుటుంబ సభ్యులు నా భార్యా, ఇద్దరు కొడుకులు ముగ్గురూ నా ఇమేజ్ తగ్గకుండా అపురూపంగా చూసుకుంటారు.
పెద్ద ప్రయాణాలకు పెట్టమంటే వాళ్ళూ పెట్టగలరు. రెండు కారణాలవల్ల, నేను వాళ్లను అడగను. దానికి ప్రధాన కారణం; ముందే చెప్పినట్టుః సమాజ కార్యక్రమాల్లో సమాజాన్ని ఇన్ వాల్వ్ చేయాలి.
నిజానికి ఇలా పోస్టులు పెట్టకపోయినా నేను ఢిల్లీనో, మరోచోటికో వెళుతున్నానని తెలిస్తే ఆ ఖర్చులు అందజేసే అభిమానులున్నారు. ఏ నగరంలో అయినా ఎంతో ప్రేమగా ఆతిథ్యం ఇచ్చే మిత్రులున్నారు. రైతు ఉద్యమం సాగుతున్నప్పుడు కరోనా తీవ్రంగా వుంది. చాలా పెద్ద రిస్క్ తీసుకుని ఢిల్లీ మిత్రుడు BGB తిలక్ తన ఇంట్లో నాకు వసతి ఏర్పాటు చేశాడు. అవసరం పడినప్పుడు ఢిల్లీకి రానూపోనూ ఫ్లయిట్ టిక్కెట్లు పంపించేవారూ వున్నారు.
అయినప్పటికీ కాంట్రి బ్యూషన్ కావాలని నేను పోస్టు పెట్టాను. ఇది అందరికీ తెలియాలనే. ఇందులో తమకూ బాధ్యత వుందని ప్రజలు భావించాలి. చాలామంది చాలాసార్లు స్పందించారు. ఇప్పుడూ స్పందించారు. మనమ మంచి పని చేస్తున్నపుడు అది అందరికీ తెలియాలి; తెలపాలి. అప్పుడు మంచి వ్యాపిస్తుంది.
అన్నింటికన్నా గొప్ప విషయం ఏమంటే, డబ్బులు పంపినవాళ్ళు సోషల్ మీడియాలోనే ప్రకటించండి అన్నాను. అభిమానులు డబ్బులు పంపించారు. కానీ తాము పంపినట్టు సోషల్ మీడియాలో ప్రకటించలేదు. ఇంకా మంచి బతికే వున్నదని నేను నమ్ముతాను.
ప్రపంచంలో ఏ ఉద్యమం అయినా నాయకత్వ లోపాలతో ఆగిందేమోగానీ ఆర్ధిక నిధులు లేక ఆగలేదు. ఆగదు. ఆజ్ఞాత దాతలున్నారు. వుంటారు.
ఢిల్లీలో నిరసనలు జరుగుతున్న ప్రాంతానికి సమయానుకూలంగా భోజనం ప్యాకేట్లు వస్తున్నాయి. నీళ్ళ బాటిల్స్ వస్తున్నాయి. ఈ సాంప్రదాయం ఇప్పుడు ముంబాయి హైదరాబాద్ కు కూడా చేరింది.

No comments:
Post a Comment