Thursday, 20 August 2026

Neha Bora on 'Dimagi Naxals'

 *దిమాగీ నక్సల్!*

*వెరీ గుడ్!*

*మాకు మెదడు వున్నట్టు* 

*ఒప్పుకున్నట్టేగా!*  

*నేహా బోరా ఇంటర్వ్యూ -  డానీ సమాజ విశ్లేషకులు 




ప్రశ్న:

ముందుగా, ఇటీవలి కాలంలోని అత్యంత విజయవంతమైన, దేశానికి కొత్త ఆశను కల్పించిన ఉద్యమంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు అభినందనలు. ముఖ్యంగా, గత రెండు దశాబ్దాలుగా సమాజాన్ని ఆవరించిన  భయోత్పాత వాతావరణాన్ని ఈ ఉద్యమం కొంతవరకు తొలగించగలిగింది. అందుకు మరిన్ని అభినందనలు. 

ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్దాం.

1. *జంతర్ మంతర్ నుంచి దేశవ్యాప్తంగా పర్యటన ఎందుకు?*

నేహా బోరా:

ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించడం.

జార్ఖండ్‌లో విద్యార్థులు JPSC, JSSC పరీక్షలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. అందుకే రాంచీ వెళ్లాం.

కోల్‌కతాలో ISI విద్యార్థులు తమ విద్యాసంస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్లాం.

తర్వాత జైపూర్, రాజస్థాన్ వెళ్లాం. రాజస్థాన్ పేపర్ లీక్‌లకు కేంద్రంగా మారింది. ప్రైవేట్ కోచింగ్ మాఫియా అక్కడ చాలా పెద్ద సమస్య. విద్యా వ్యవస్థ ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోటాలో పేపర్ లీక్ ఘటనలు విస్తృతంగా ఉన్నాయి.

అందుకే అక్కడి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించాం.

హైదరాబాద్‌లో ABVP హింసకు వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థులు పోరాడుతున్నారు. మరో విశ్వవిద్యాలయంలో కూడా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నారు. CJIని కాన్వొకేషన్‌కు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తే తమను బార్‌లో నమోదు చేయబోమని బెదిరించే పరిస్థితి కూడా ఉంది.

అంటే దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి.

జంతర్ మంతర్ ఉద్యమం దేశంలోని ఇతర విద్యార్థులకు ఎంతో శక్తినిచ్చింది. ఇప్పుడు వాళ్లు తమ తమ సమస్యలపై పోరాడుతున్నారు. మేము వారి పోరాటాలకు అండగా నిలవడానికి, వారికి ధైర్యం ఇవ్వడానికి వెళ్తున్నాం. వారు తమ కోసం పోరాడుతున్నారు; మేము వారితో కలిసి పోరాడుతున్నాం.

2. *జంతర్ మంతర్ ఉద్యమం ఎలాంటి పాఠాలు నేర్పిందీ?* 

నేహా:

ఆ ఉద్యమం విజయం సాధించడానికి ప్రధాన కారణం మేము సంఘటితంగా ఉండటం.

అందుకే ఎక్కడ విద్యార్థులు పోరాడుతున్నా వారు కూడా సంఘటితం కావాలి. అధికార ధోరణులను, నిరంకుశ శక్తులను నిజంగా ఎదుర్కోవాలంటే కలిసి రావాలి, తమను తాము చైతన్యపరుచుకోవాలి. పరిపాలనకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తాము ఐక్యంగా ఉన్నామని చూపించాలి.

3. *ఇక మీ తక్షణ లక్ష్యం ఏమిటి?*

నేహా:

అలాంటి ప్రత్యేకమైన తక్షణ లక్ష్యం ఏదీ లేదు.

విద్యార్థులను కలవడం, వారి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించడం, వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను సంఘటితం చేయడం, సంఘటిత రాజకీయాల్లోకి తీసుకుని రావడం, నిజమైన శక్తి ఐక్యతలోనే ఉందని వారికి అర్థమయ్యేలా చేయడం — ఇవే మా లక్ష్యాలు.

నాణ్యంఐన విద్య కోసం, విద్యార్ధులకు మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడాలి.

4. *జంతర్ మంతర్‌లో మూడు భిన్నమైన స్రవంతులు ఒకే వేదిక పైకి వచ్చాయి. ఇక భవిష్యత్తు?*

నేహా:

మేమంతా కలిసి కొత్త సంస్థ ఏర్పాటు చేయబోవడం లేదు.

నేను AISAలో భాగం. అదే నా సంస్థ.

అభిజిత్ దీప్కే CJPలో భాగం. అదే ఆయన సంస్థ.

సోనం వాంగ్‌చుక్ స్వతంత్ర వ్యక్తి. ఆయనకు ఆయన సొంత అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే ఉమ్మడి సమస్యలు ఉంటే విద్యార్థుల కోసం, దేశంలోని యువత కోసం మేము ఒక ఐక్య వేదిక ద్వార కలిసి పోరాడవచ్చు.

5. *మీరు మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తారా?*

నేహా:

మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాలపై నా అవగాహన భిన్నంగా ఉంటుంది.

నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చాను. మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాలను ఆదర్శ రాజకీయాలుగా మేము చూడం.

కాబట్టి నేను మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాల్లో చేరను.

నేను రాజకీయాల్లోనే ఉన్నాను — నాకు సాధ్యమైనంత లోతుగా.

నా భావజాలాన్ని నేను కొనసాగిస్తాను. మెయిన్‌స్ట్రీమ్ పార్టీలు తమ రాజకీయాలను కొనసాగించవచ్చు.

6. *మోదీ కొత్తగా అంటించిన “దిమాగీ నక్సల్” అనే లేబుల్ పై మీ స్పందన ఏమిటి?*

నేహా:

అది ఏమాత్రం ప్రభావం లేని పదం. ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించడానికి, వారిని నిరుత్సాహపరచడానికి, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి కొత్త కొత్త పదాలను సృష్టిస్తున్నారు.

కానీ “దిమాగీ నక్సల్” అనేది ఒక జోక్ మాత్రమే.

అందరూ నరేంద్ర మోదీని ఉద్దేశించి రకరకాల వ్యంగ్య నినాదాలు ఇస్తున్నారు. ఆయన కూడా — “నన్ను ఇలా అందరూ ఎగతాళి చేస్తున్నారు కదా, నేనూ ఏదైనా కొత్త పదం కనిపెట్టాలి” అనుకుని “దిమాగీ నక్సల్” అనే పదాన్ని తీసుకొచ్చినట్టుంది.

కానీ ఇందులో మరో విషయం ఉంది.

“దిమాగీ నక్సల్” అంటే మనందరికీ మెదడు ఉంది.

మనకు ఆలోచించే శక్తి ఉంది.

మనం ఏమి ఆలోచిస్తున్నామో చెప్పడానికి టెలీప్రాంప్టర్ అవసరం లేదు.

మన మెదడులో ఉన్నదాన్ని ఎవరో రాసి ఇస్తేనే కెమెరా ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు.

అలాగే సామాన్య ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడే ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచం కూడా మనకు అవసరం లేదు. ప్రజలతో స్నేహంగా ఉండాల్సింది పోయి, వారి నుంచి పూర్తిగా దూరమయ్యే భాష మనకు అవసరం లేదు.

కాబట్టి వాళ్లు మమ్మల్ని “దిమాగీ నక్సల్స్” అని పిలిస్తే — పిలవనివ్వండి.

ఇప్పుడు ఈ దేశంలోని సామాన్య ప్రజలకు ఎన్నో రకాల లేబుళ్లు వేస్తున్నారు.

ప్రతిసారి వాళ్ళు ఒక కొత్త లేబుల్ ను కనిపెట్టినప్పుడల్లా, మన ఐక్యత  మరింత బలపడుతోంది. 

ఒకవైపు ఈ దేశ ప్రజలు. 

మరోవైపు ప్రజలకు లేబుళ్లు పంచేవాళ్లు. అంతే.

ప్రశంస : నువ్వు The sharpest voice of the protest ' 

నేహా : నాకు మార్క్సిస్టు రాజకీయాలున్నాయి. 

****

No comments:

Post a Comment