నివాళి
నిమగ్నత అతని జీవనవిధానం
-
ఉషా యస్ డానీ
1980వ దశకంలో, కోస్తాజిల్లాల రాడికల్
ఉద్యమంలో, నేనూ చంద్రా జంట ఉపన్యాసకులుగా ఉండేవాళ్ళం. రాడికల్స్ యువజన విభాగానికి నేనూ,
విద్యార్థి విభాగానికి తనూ ప్రాతినిధ్యం వహించేవాళ్లం. భావి నాయకత్వాన్ని తయారుచేయడానికి,
ఎంపిక చేసిన ఓ ఆరుగురి కోసం, 1984లో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని పల్లేర్లమూడిలో, విరసం ఒక ప్రత్యేక
శిక్షణా శిబిరాన్ని నిర్వహించింది. అందులో, నేనూ చంద్రా సహాధ్యాయులం.
తరువాతి కాలంలో, ఎ. సుబ్రహ్మణ్యం, బాలగోపాల్‌లతో కలిసి, చంద్ర, పౌర హక్కులు, మానవ
హక్కుల ఉద్యమాల్లో చాలా చురుగ్గా పనిచేశాడు. నేను పాక్షికంగా నాయకత్వం వహించిన 1985 నాటి కారంచేడు ఉద్యమంలోనూ,
నేనూ నేరుగా నాయకత్వం వహించిన 2000 నాటి చినగంజాం స్నో వైట్ సాల్ట్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలోనూ గుంటూరుకు చెందిన
సీనియర్ లాయర్ వై. కోటేశ్వరరావుతో పాటు చంద్రా కూడా మాకు బాసటగా ఉన్నాడు.
1991 నాటి చుండూరు ఉద్యమంలో చంద్ర
చురుగ్గా పాల్గొన్నాడు. ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో రాష్ట్ర
ప్రభుత్వం చంద్రశేఖర్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. చుండూరు హత్యాకాండ
నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో చంద్ర ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించాడు.
సాహిత్య వ్యాసంగంతోపాటూ, తత్వశాస్త్రంలో చంద్రకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. మార్క్సిస్టు
- లెనినిస్టుగా మొదలైన చంద్ర
ఇటీవలి కాలంలో పోలిష్ సామాజిక శాస్త్రవేత్త జిగ్మంట్ బౌమన్‌కు వీరాభిమానిగా మారాడు.
ఇటాలియన్ సామాజిక శాస్త్రవేత్త ఆంటోనియో గ్రామ్‌స్కీని తెలుగునాట ఎక్కువగా ప్రచారం
చేసింది అతనే. ఆ తరువాత ఫ్రెంచ్ ఆధునికానంతర తత్వ్తవేత్తలు, మైకెల్ ఫోకాల్ట్ (ఫ్యూకో),
జాక్వస్ డెర్రిడాల ప్రభావం చంద్ర మీద బలంగా పడింది.
దేన్ని చదివినా అందులో పూర్తిగా లీనం అయిపోవడం చంద్ర బలం, అదే అతని బలహీనత కూడా.
1920లలో నికోల శాక్కొ, బార్టోలోమియో
వాంజేట్టి అనే ఇద్దరు ఇటాలియన్లను అమెరికాలో ఉరివేసిన సంఘటన 1980లలో చంద్రను తీవ్రంగా కలచివేసింది.
ఈ కేసును వాదించడానికి ’ది శాక్కొ - వాంజెట్ట్టి డిఫెన్స్ కమిటీ’ ఒకటి అప్పట్లో ఏర్పడింది. అందులో ఒక అడ్వకేట్ (అతని పేరు ఇప్పుడు
నాకు గుర్తులేదు) ఈ కేసుతో పూర్తిగా లీనమైపోయాడు. శాక్కొ, వాంజేట్టి కేసు ఫైళ్ళ ఆధారంగా
చంద్ర తెలుగులో ఒక గొప్ప నవల రాశాడు. ఆ లాయర్ పాత్ర నిజజీవితంలోనూ అతన్ని చివరి వరకూ
వెంటాడింది అనిపిస్తుంది. 1997 నాటి విష్ణువర్ధన్,
చలపతి కేసు సందర్భంగా, ఉరి శిక్షకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో చంద్ర ఆ స్ఫూర్తితోనే
మమేకమైపోయాడు.
ఫ్యూకో ముందుకు తెచ్చిన ’హిస్టరీ ఆఫ్ హ్యూమన్ సెక్సువాలిటీ’ గురించి చంద్ర చాలా
సందర్భాల్లో చర్చ చేసేవాడు. మనం ప్రధాన స్రవంతి సెక్స్‌ను ప్రామాణికంగా తీసుకునీ, ఉపస్రవంతుల
సెక్స్‌ను నిర్లక్ష్యం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసేవాడు.
తత్వశాస్త్రానికి సంబంధించినంత వరకు, నేనూ, త్రిపురనేని శ్రీనివాస్, చంద్రా ముగ్గురం
త్రిపురనేని మధుసూదనరావు గురుకులం నుంచి వచ్చినవాళ్లం. వయసులో వాళ్లిద్దరూ నాకన్నా
పదేళ్ళు చిన్నవాళ్ళు. ఈ మాట గుర్తుకొచ్చినపుడు నాకు ఎక్కడో హెచ్చరిక గంటలు మోగుతున్నాయి
అనిపిస్తుంది.
ఆధునిక సమస్యలన్నింటి ప్రస్తావన మార్క్స్ రచనల్లో లేకపోవచ్చు. అయినప్పటికీ, ఆధునిక
సమస్యలన్నింటినీ అర్థం చేసుకోవడానికే కాక, వాటిని మార్చడానికి అవసరమైన పనిముట్లు కూడా
మార్క్సిజంలో ఉన్నాయని భావించేవారిలో
నేనూ ఒకడ్ని. అంచేత, ఇతర సామాజిక శాస్త్రవేత్తల్ని
నేను పరికించినవాడినే తప్పా, వాళ్ళతో మమేకమైపోయిన వాడిని మాత్రం కాదు. ఈ విషయంలో నామీద
చంద్రాకు కాస్త (నిజానికి బోలెడు) అసంతృప్తి ఉండేది. ఏడాది క్రితం పర్‌స్పెక్టివ్ ఆర్కే
ఇంట్లో కలిసినప్పుడు, శాక్కొ - వాంజెట్టి పుస్తకం మీద “డానీ! బౌమన్ గురించి నా నమ్మకాన్ని వమ్ముచేయవని ఈ కానుక’ “ అని రాసిచ్చాడు. ఇప్పుడు నేను
’జిగ్మంట్ బౌమన్ లిక్విడ్ మోడర్నిటీ’ని మరింత అధ్యయనం చేయాలి అనుకుంటాను.
హైదరాబాద్,
22 జనవరి 2013
(ఆంధ్రజ్యోతి దినపత్రిక, 23 జనవరి 2013)
No comments:
Post a Comment