నేటి ఉద్యమ
సాహిత్యమే రేపటి రాజ్యాంగం
ఉషా యస్ డానీ
1
చట్టం - సాహిత్యం : అమెరికా - ఇండియా
చట్టాన్నీ, సాహిత్యాన్నీ కలిపి అధ్యయనం
చేయ్యాలనే ఆలోచన, మనకు సంబంధించినంత వరకు
కొత్తది. పశ్చిమ దేశాల్లో, ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, ఇలాంటి
ప్రయత్నం దాదాపు నలభై యేళ్ళ క్రితమే విద్యైక రంగంలో మొదలై కొన్ని ఆటుపొట్లను కూడా
చవిచూసింది.
2
ఉత్పత్తి సంబంధాల పునాది మీదే, మనం ఉపరితలం అని
పిలిచే, సాంస్కృతిక సమస్తం ఏర్పడుతుందని భావించేవాళ్ళలో నేనూ ఒకడ్ని. మతం,
తత్వశాస్త్రం, ఆర్ధికశాస్త్రం, చరిత్ర,
రాజకీయాలు తదితర అంశాలతోసహా, మనం ఈరోజు చర్చిస్తున్న, చట్టం, సాహిత్యం కూడా
ఈ ఉపరితలంలో అంతర్భాగమే!
3
ఆ విధంగా, సాహిత్యం, చట్టం రెండూ, స్థూలంగా, కవలపిల్లల్లాంటివి. వీటిపుట్టుక,
పెరుగుదల, చివరకు లక్ష్యం కూడా సమాజమే! అందువల్ల ఈ రెండు రంగాల మధ్య సంబంధాన్ని
పరిశీలించడంకన్నా, సమాజంతో ఈ రెండు రంగాలకున్న అన్యోన్య అనుబంధాన్ని పరిశీలిస్తే
మనం మరిన్ని మెరుగైన ఫలితాల్ని సాధించడానికి వీలుంటుంది.
4
అమెరికాలో, జేమ్స్ బొయెడ్ వైట్ (James Boyd
White), రిచర్డ్ వీస్‌బెర్గ్ (Richard
Weisberg) , రాబర్ట్ వీస్‌బెర్గ్ (Robert
Weisberg)వంటివాళ్ళు, 1970 వ దశకంలో,
విశ్వవిద్యాలయాల్లో, చట్టం - సాహిత్యం
ఉద్యమాన్ని జోరుగా సాగిస్తున్నపుడు, భారత దేశంలో, మరీ ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‍లో,
ఒక మహత్తర సాంప్రదాయం కొనసాగుతోంది.
5
శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమర్ధించడానికి తెలుగులో విప్లవ సాహిత్యం
ఆవిర్భవిస్తే, ఉద్యమకారులపై ప్రభుత్వ దమనకాండను చట్టపరిధిలో అడ్డుకోవడానికి
పౌరహక్కుల ఉద్యమం ముందుకు వచ్చింది. మహాకవి శ్రీశ్రీ, కేవీ రమణారెడ్డి, కొడవటిగంటి
కుటుంబరావు తదితరులు మొదటి సాంప్రదాయానికి తొలి ప్రతినిధులైతే, పౌరహక్కుల నేతలు
పత్తిపాటి వెంకటేశ్వర్లు, కేజీ కన్నబిరన్ తదితరులు రెండో సాంప్రదాయానికి తొలి
ప్రతినిధులు.
6
వీళ్ల లక్ష్యం సాహిత్యాన్నీ, చట్టాన్నీ విద్యైకంగా అధ్యయనం చేయడంకాదు. తమతమ
రంగాల్లో తాము సాధించిన నైపుణ్యాన్ని సమాజంలో కొత్తగా పుట్టుకొస్తున్న శక్తుల కోసం
ఉపయోగించడం.
7
విశ్వవిద్యాలయాల
సిలబస్‌లలో చట్టాల స్వభావాన్ని లోతుగా అర్ధం చేసుకునే అవకాశాలు తక్కువ. నవలలు,
కథలు వంటి వర్ణణాత్మక సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వార న్యాయవాదులూ,
న్యాయమూర్తులూ ఈ లొటును పూరించుకోవచ్చని అమెరికా లా అండ్ లిటరేచర్ మూవ్‌మెంట్
నిర్వాహకులు భావించారు. ఇక్కడివాళ్ళు అంతటితో ఆగలేదు. మరోఅడుగు ముందుకువేసి, సామాజిక మార్పులో మమేకమైపోయారు. అలా ఏ కోణం నుండి చూసినా అమెరికా ఉద్యమంకన్నా,
ఆంధ్రప్రదేశ్ ఉద్యమం అనేకరెట్లు మహత్తరమైనది.
8
పరస్పర ప్రభావాల్లో పునాది పాత్రే నిర్ణయాత్మకమైనది అయినప్పటికీ, తగినంతగా
పెరిగిన తరువాత, ఉపరితలం కూడా పునాదిని ప్రభావితం చేస్తుంది. అంటే, సమాజం నుండి
పుట్టిన సాహిత్యం, చట్టాలు, తిరిగి సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. పైన్నుండి
కిందికీ, కింది నుండి పైకి సాగే ఈ నిరంతర చలనంలో, పరస్పర విరుధ్ధమైన రెండు రకాల
న్యాయాలు, రెండు రకాల సాహిత్యాలు పుట్టుకు వస్తాయి. పాలకవర్గాల న్యాయం - సాహిత్యం, ప్రజల న్యాయం - సాహిత్యం అని దీన్ని
స్థూలంగా విడగొట్టవచ్చు. వీటిని విడివిడిగా అధ్యయనం చేయడం అవసరం.
9
ఎగువ నుండి న్యాయమూ - సాహిత్యము
ముందు మనం పాలకవర్గ సాహిత్యాన్ని చూద్దాం.
మధ్యయుగాల్లో మతం, తత్వశాస్త్రం, ఆర్ధిక నియమాలు, నైతికం, ధర్మం, చరిత్ర, రాజకీయం,
చట్టం, సాహిత్యం వగయిరాలు ఈనాడున్నట్టు విడివిడి శాస్త్రాలుగాలేవు. పాలకవర్గాల
భావజాలంగానీ, పరిపాలనకు సంబంధించిన విధాన నిర్ణయాలుగానీ, పురాణగాధల రూపంలో ప్రజలకు
చేరుతూ వుండేవి. దానికి ఒక ఉదాహరణ సత్యహరిశ్చంద్ర కథ.
10
ఈ అంశాన్ని శాస్త్రీయంగా అర్ధం చేసుకోడానికి
ముందు మనం మన సాంస్కృతిక జీవనంలో ఈ కథకున్న ప్రాధాన్యాన్ని ఒకసారి గుర్తు
చేసుకోవడం మంచిది. భారతదేశ నీతి కథల్లో సత్యహరిశ్చంద్రదే అగ్రస్థానం. భారతదేశంలో
నిర్మించిన పూర్తి నిడివి తొలి సినిమా కూడా 'రాజా హరిశ్చంద్ర'. 1913 నుండి
ఇప్పటి వరకు ఎనిమిది భారతీయ భాషల్లో 20 సార్లకు పైగా సినిమాగా నిర్మించిన కథ ఇది. ఇక నాటకాలైతే ఎన్ని బృందాలు ఎన్ని
భాషల్లో ఎన్ని వేలసార్లు ప్రదర్శించి వుంటారో లెఖ్ఖేలేదు.
11
సత్యహరిశ్చంద్ర కథ
సత్యవ్రత ఔన్నత్యాన్ని ఈ కథ చెపుతుంది.
మనకందరికీ తెలిసిన కథే అయినప్పటికీ, విశ్లేషణ కోసం ఇప్పుడు మరొక్కసారి క్లుప్తంగా
తడమడం అవసరం.
12
ఈ కథ ఇంద్రసభలో మొదలౌతుంది. అయోధ్యరాజు
హరిశ్చంద్రుడు సత్యవ్రతుడని వశిష్టుడు కీర్తిస్తాడు. వశిష్టుని అభిప్రాయంతో
విశ్వామిత్రుడు విభేధిస్తాడు. హరిశ్చంద్రుని సత్యవ్రతం బూటకమని నిరూపిస్తానని దేవతలతో
పందెంకాస్తాడు విశ్వామిత్రుడు.
13
స్థితిమంతులకన్నా రుణగ్రస్తులకు అబధ్ధాలు
చెప్పే అవకాశాలు ఎక్కువ కనుక, అనేక కుట్రలు చేసి, హరిశ్చంద్రుడ్ని, రుణవలలో
బంధిస్తాడు విశ్వామిత్రుడు. మాటతప్పడం, లేదా రాజ్యాన్ని అప్పచెప్పడంతప్పా
మరోమార్గం వుండదు హరిశ్చంద్రునికి. అతను అయోధ్య రాజ్యాన్ని విశ్వామిత్రునికి
స్వాధీనం చేసి, భార్య చంద్రమతి, కొడుకు లోహితాసునితోసహా కాశీరాజ్యానికి పోతాడు.
14
అయినా విశ్వామిత్రుడు సంతృప్తి చెందడు. చేసిన
దానానికి లాంచనాలు కావాలంటాడు. దక్షిణ వసూలు చేయడానికి నక్షత్రకుడనే వాడ్ని
హరిశ్చంద్రుని వెంట పంపుతాడు.
15
ఆ బృందం కాశీకి వెళ్ళే మార్గంలో, అడవిలో అగ్గి
రాజుకుంటుంది. మంటల్లో చిక్కుకున్న నక్షత్రకుడ్ని తమ ప్రాణాల్ని ఫణంగాపెట్టి కాపాడుతుంది హరిశ్చంద్రుని కుటుంబం .
నక్షత్రకుడి దక్షణ చెల్లించడం కోసం కాశీనగరంలో భార్య, కొడుకుల్ని అమ్మేస్తాడు
హరిశ్చంద్రుడు. ఒక తలారికి తననుతాను అమ్ముకుని, కాటికాపరి పనిలో చేరుతాడు.
16
వాళ్ల కష్టాలు అక్కడితో ఆగవు. తోటలో
పనిచేస్తుంటే, పాము కాటేసి, లోహితాసుడు చనిపొతాడు. కొడుకు శవాన్ని భుజాన వేసుకుని
శ్మసానానికి వెళుతుంది చంద్రమతి. కాటి రుసుం చెల్లించడానికి కూడా ఆమె దగ్గర
డబ్బులు వుండవు.
17
హరిశ్చంద్రుడు భార్యనూ, కొడుకు శవాన్నీ
గుర్తుపడతాడు. కానీ, విద్యుక్త ధర్మానికి కట్టుబడి, కాటిరుసుం కట్టందే కొడుకు
శవాన్నైనా తగలబెట్టడానికి వీల్లేదంటాడు. మెడలోని మంగళ సూత్రాన్ని ఎక్కడైనా అమ్మి
కాటి రుసుం చెల్లించమని చంద్రమతికి సలహా యిస్తాడు.
18
డబ్బుల కోసం అర్ధరాత్రి కాశీనగర వీధుల్లో
తిరుగుతున్న చంద్రమతిని రాజభటులు పట్టుకుంటారు. ఆమెపై కాశీ యువరాజు హత్యానేరాన్ని
మోపుతారు. దోషి చంద్రమతి తల నరికే పని హరిశ్చంద్రునికే అప్పచెపుతాడు తలారి.
19
వృత్తికి అంకితమైన హరిశ్చంద్రుడు తన
జీవితభాగస్వామి తల నరకడానికి సిధ్ధమై ఖడ్గాన్ని గాల్లోకి లేపుతాడు. హరిశ్చంద్రుని
సత్యవ్రత నిష్టను చూసి దేవతలందరూ పరవశించిపోతారు.
హరిశ్చంద్రుడ్ని దీవించి, వాళ్ళ కుమారుడ్ని బతికించి, వాళ్ళ రాజ్యాన్ని
తిరిగి ఇచ్చేసి, వాళ్ల కుటుంబానికి మోక్షాన్ని ప్రసాదించి కథను సుఖాంతం చేస్తారు.
20
హరిశ్చంద్ర నాటకం నేపథ్యం
19వ శతాబ్దం మధ్యలో ఆనకట్టల
నిర్మాణంతో కోస్తా ఆంధ్రా ప్రాంతంలో వ్యవసాయరంగం రూపురేఖలు మారిపొయాయి.20వ శతాబ్దం ఆరంభమయ్యేనాటికే
వ్యవసాయరంగంలో అదనపు ఉత్పత్తిని సాధించడంతో, వాణిజ్యం పుంజుకుని, రుణ - పరపతి
వ్యవస్థ బలపడింది. కార్ఖానాలు ఏర్పడి పారిశ్రామికాభివృధ్ధి ఊపందుకోవడంతో సమాజం
లోనికి కొత్తగా ఉద్యోగవర్గం, ఫ్యాక్టరీ కార్మికవర్గం పుట్టుకు వచ్చింది.
21
కొత్తగా వచ్చిన రుణపరపతి ఒప్పందాల నియమాలనీ,
కార్మికుల క్రమశిక్షణ స్మృతిని విస్తృతంగా ప్రచారం చేయడానికి పాలకవర్గాలకు
సత్యహరిశ్చంద్ర కథ అద్భుతంగా పనికి వచ్చింది. ఈ కథకు మూలాలు మహాభారతంలో
వున్నప్పటికీ, ప్రముఖ కవి, నటుడు, స్వాతంత్ర సమరయోధుడు బలిజేపల్లి లక్ష్మీకాంతం 1920వ దశాబ్దంలో, ఆనాటి కొత్త
అవసరాలకు అనుగుణంగా, దానికి నాటక రూపం ఇచ్చారు. ఎగువ నుండి న్యాయమూ, సాహిత్యానికి
సత్యహరిశ్చంద్ర నాటకం గొప్ప ఉదాహరణ. విద్యాధికులైన శిష్టవర్గాల్లో ఈ నాటకానికి ఎంత
ప్రాచూర్యం వుందో, పేదలు, దళితులు అత్యధికంగావుండే మురికివాడల్లో అంతకన్నా ఎక్కువ
ప్రాచూర్యం వుంది.
22
ఇంతకీ రుణగ్రస్తులకూ, కార్మికులకు ఈ కథ చేప్పే నీతులు ఏమిటీ?
అ. ఆర్ధిక లావాదేవీల్లో మాటతప్పరాదు.
ఆ. రుణ విముక్తి కలిగినపుడే మోక్షం
ప్రాప్తిస్తుంది.
ఇ. ప్రాణాల్ని ఫణంగా పెట్టయినా సరే రుణదాతను
రక్షించుకోవాలి.
ఈ. పెళ్ళాం బిడ్డల్ని అమ్మేసయినాసరే తీసుకున్న
రుణం తీర్చితీరాలి.
ఉ. కొలువు చేస్తున్నపుడు భార్యా, పిల్లలు అనే
పక్షపాతం చూపెట్టకూడదు.
ఊ. ఉద్యోగ ధర్మంగా భార్య తలను నరకాల్సి వచ్చినా
వెనుకాడకూడదు.
23
ఇంకాస్త తరచి చూస్తే, ఈ కథలో మరిన్ని విశేషాలు కనిపిస్తాయి. సత్యవ్రతం అంటే
కేవలం అబధ్ధం చెప్పకపొవడం మాత్రమేకాదు; అదోక జీవిత ఆచరణ. మనుషులు ఎక్కడ మాట
తప్పరాదో, ఎక్కడ తప్పవచ్చునో తెలుసుకోవడం. ఆర్ధిక లావాదేవీల్లోతప్ప మిగిలిన
విషయాల్లో మాట తప్పినా తప్పుకాదని ఈ కథ పరోక్షంగా చెపుతుంది.
24
ధర్మార్ధ కామ మోక్షాల్లో భార్యను విడువను అంటూ
వివాహ సమయంలో భర్త చేసే వాగ్దానాన్ని తప్పి, చంద్రమతిని బహిరంగ మార్కెట్లో
అమ్మేస్తాడు హరిశ్చంద్రుడు. పైగా అది ధర్మసమ్మతమే అని ఈ కథ చెపుతుంది.
25
రుణ వ్యవస్థలో, ఒకరకంగా మూడుస్థంభాలాట సాగుతూ
వుంటుంది. రుణం ఇవ్వకుండా వడ్డీవ్యాపారం బతకదు. అలాగే, ఇచ్చిన రుణాన్ని,
వడ్డీతోసహా, తిరిగి వసూలు చేసుకోలేకపోయినా వడ్డీ వ్యాపారం నడవదు. మరోవైపు, నిరుపేదలు రుణం తీసుకోకుండా బతకలేరు. కానీ,
రుణం తీసుకోవడానికి కావలసిన ఆస్తిహామి (కొల్లాటరల్ సెక్యూరిటి) వాళ్ళ దగ్గర
వుండదు. ఇంకోవైపు, ధనవంతుల దగ్గర అపారమైన
ఆస్తిహామి వుంటుంది. అయితే, రుణం తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకు అస్సలు వుండదు. నిరుపేదలకు అప్పిచ్చి ఇబ్బంది
పడడంకన్నా, అప్పు తీసుకోవాల్సిన అవసరమేలేని ధనవంతుల్ని, కుట్రతోనో, మోసంతోనో,
రుణవలలో పడేస్తే, వడ్డీ వ్యాపారం సురక్షితంగా సాగుతుందని, మనీ లెండర్స్,
బ్యాంకర్స్ కు సత్యహరిశ్చంద్ర కథ కీలకమైన వ్యాపార చిట్కాలు చెపుతుంది.
26
రుణాన్ని తిరిగి వసూలు చేయడం అంటే అసలును
తిరిగి రాబట్టుకోవడం మాత్రమే కాదు. అసలు, వడ్డీ, ఇతర లాంఛనాలు (ప్రాసెసింగ్
ఛార్జెస్) అన్నీ కలిపి రాబట్టుకున్నప్పుడే రుణాన్ని వసూలు చేసినట్టని ఈ కథ చాలా
విస్పష్టంగా చెపుతుంది. అంతేకాదు, బకాయిల వసూళ్ల కోసం ఒక రికవరీ టీమ్‌ను తప్పకుండా
ఏర్పాటు చెసుకోవాలని కూడా ఈ కథ వడ్డీ వ్యాపారులకు సిఫారసు చేస్తుంది. ఈనాడు మనం
చూస్తున్న ’లోన్ రికవరీ టీమ్’ లకు ఆద్యుడు నక్షత్రకుడు.
27
ఇక చివరగా, సత్యం పలకాలనే నీతి వెనుక దాగున్న
వర్గస్వభావాన్ని కూడా ఈ కథలో సులువుగా చూడవచ్చు. ఇందులో, రుణదాత అయిన
విశ్వామిత్రుడు తాను రుణం ఇవ్వలేదని అబధ్ధం చెప్పే అవకాశమేలేదు. రుణగ్రహిత అయిన
హరిశ్చంద్రునికి మాత్రమే, తాను రుణం తీసుకోలేదంటూ, ఒక అబధ్ధం చెప్పి, తప్పించుకునే
అవకాశం వుంటుంది. అంటే, సత్యం పలకాలనే నిబంధన వున్నది కేవలం రుణగ్రహితల కోసమే.
28
రుణవ్యవస్థ అనేది పెట్టుబడీదారి వ్యవస్థకు
మూలస్థంభం అని మనందరికీ తెలుసు. ఫైనాన్స్ కేపిటల్‌తోపాటూ, వాణిజ్య న్యాయ
శాస్త్రాన్ని ఇంత గొప్పగా చిత్రించి, ఒప్పించిన పురాణగాథ ప్రపంచ సాహిత్యంలో
మరెక్కడా కనిపించదు. ఇలాంటి సందర్భాల్లో
షేక్స్‌పియర్ నాటకం ’ద మర్చెంట్ ఆఫ్ వెనిస్’ ను కొందరు ఉటంకిస్తుంటారు. కానీ,
దానికి సత్యహరిశ్చంద్ర నాటకానికున్నంత విస్తృతి, ప్రగాఢత, ఆమోదాంశం లేవు.
29
’ద మర్చెంట్ ఆఫ్ వెనిస్’
నాటకం వడ్డీ వ్యాపారుల కౄరత్వాన్ని చిత్రిస్తుంది. సత్యహరిశ్చంద్ర నాటకం
రుణగ్రహితల ప్రవర్తనా నియమావళిని ప్రభోదిస్తుంది. ఇప్పటి ప్రపంచ బ్యాంకు ప్రాయోజిత
కార్యక్రమంగా చేపట్టదగ్గ అర్హతలన్నీ, సత్యహరిశ్చంద్ర నాటకానికి వున్నాయి.
30
దిగువ నుండి న్యాయము, సాహిత్యము
ఇప్పుడు మనం ప్రజల నుండి పుట్టుకువచ్చే
సాహిత్యాన్నీ, చట్టాలనీ, అవి పాత చట్టాలతో పడే ఘర్షణనీ పరిశీలిద్దాం. దిగువ నుండి
న్యాయం, సాహిత్యాల అధ్యయనానికి విప్లవ రచయిత భూషణం రాసిన 'కొండగాలి' నవల
అనువుగా వుంటుంది. భారత ప్రభుత్వం 1953లో తెచ్చిన అడవుల జాతియీకరణ చట్టం గిరిజనుల జీవితాలపై వేసిన ప్రభావాన్నీ, ఆ
చట్టాలకు వ్యతిరేకంగా గిరిజనులు చేసిన పోరాటాన్నీ ఈ నవల చిత్రించింది.
31
1970 లో ఆవిర్భవించిన విప్లవ రచయితల సంఘం
సృష్టించిన తొలి నవల 'కొండగాలి'. 1973 లో వచ్చిన ఈ నవల, 1960 వ దశకం చివర్లో సాగిన
శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యాన్ని తొలిసారిగా నవలా సాహిత్యంలో
ప్రతిఫలించిన ఘనతను దక్కించుకుంది.
32
తూర్పు కనుమల్లో, శ్రీకాకుళం జిల్లాలోని
నాయుడువలస, గదబవలస అడవి గూడాల్లో, 1960వ దశబ్దపు స్థితి గతుల్ని ఈ నవల చిత్రీకరిస్తుంది. రాజ్యం, సమాజం, సాహిత్యం, న్యాయవ్యవస్థలపై
సరికొత్త ఆలోచనల్ని రేకెత్తించిన చారిత్రక శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాట
నేపథ్యాన్ని ఈ నవల మనకు అందింస్తుంది.
33
ఆర్.కే. పబ్లికేషన్స్, విశాఖపట్నంవారు 1987లో 'కొండగాలి-కొన్ని కథలు' పేరుతో
భూషణం రచనలు అచ్చు వేశారు. ప్రస్తుత విశ్లేషకు ఆ పుస్తకమే ఆధారం.
34
కొండగాలి సంక్షిప్త కథ
బహు నాయికానాయకులున్న నవల కొండగాలి. (ఇలాంటి
రచనల్ని ఇంగ్లీషులో ఎన్‌సెంబుల్ నోవెల్ అంటారు). అయితే, నవల చివరికి వచ్చే
సమయానికి ఆదెమ్మ పాత్ర మరింత కీలకంగా మారిపోతుంది.
35
ఆదెమ్మ గదబవలస గ్రామానికి చెందిన గదబ గిరిజన మహిళ.
ఆమె భర్త సుక్కడు తాగుబోతు. పెళ్ళాన్ని కూడా తార్చేరకం (పెజీ-84).
కాపురం చెడి, అన్న పంచన చేరుతుంది ఆదెమ్మ.
36
నాయుడువలస గ్రామచాకలి గడ్డిసెట్టి ఇంకో ప్రధాన పాత్ర.
మసూచి వచ్చి భార్య చనిపోవడంతో,ఒంటరి బతుకు వెళ్లదీస్తుంటాడు.
37
గ్రామంలో, అర్ధబానిసల్ని పోలిన వెట్టి అమల్లో వుంటుంది.
ధనికరైతులైన నాయుళ్ళ ఇళ్లల్లో వృత్తికులస్తులందరూ ఏడాదంతా పనిచేయ్యాలి. పంటల కోత కాలంలో
వాళ్ళు దయదలిచి ’పోదుం’ గా ఇచ్చింది తీసుకోవాలి.
38
బట్టలు ఉడకబెట్టదానికీ, ఉతకడానికీ అవసరమైన కట్టెలు,
కుంకుడుకాయల కోసం చాకళ్ళు అడవిపై ఆధారపడాలి. గిరిజనులకు గతంలో, అడవిపైవున్న హక్కులన్నీ
1953 చట్టంతో పోయాయి. ప్రస్తుతం, వంటచెరుకు కోసం ఎండుపుల్లలు తెచ్చుకోవడానికీ, మేకల్ని
మేపుకోడానికి మాత్రమే గిరిజనుల్ని అడవిలోనికి అనుమతిస్తున్నారు.
39
ఫారెస్టు సిబ్బంది యమకింకరుల్ని మించినోళ్లు. కలపను
కాంట్రాక్టర్లకు అమ్మేసి, స్థానికుల మీద తప్పుడు కేసులుపెట్టి, భారీగా జురిమానాలు వేస్తుంటారు.
(పేజీ 102) అప్పుడప్పుడు కేసులు కట్టి జైలుకు కూడా పంపుతుంటారు. కోర్టులు, చట్టాలతో వ్యవహరించడం
గిరిజనులకు తెలియని విద్య. ఒకసారి ఎవడైనా జైలుకు వెళ్ళాడంటే వాడి జీవితం అక్కడితో ముగిసినట్టే!
40
క్రూరత్వానికి
మారుపేరు ఫారెస్టర్ రాజు. స్థానికులు వాడ్ని ’ఎర్రజిందవ’ అంటారు. ఎర్రచిరుతపులి అన్నమాటా!
(పేజీ 58) అంతకన్నా నీచుడు ఫారెస్టు గార్డు అప్పారావు.
స్థానికులు అతన్ని "తల్లికి మొగుడు" అని పిలుస్తారు. (పేజీ 61). అడవిలో, మహిళల మీద అత్యాచారాలు నిత్యకృత్యాలు.
"రోజుకో తుప్ప దగ్గర ఒక కోక ఇప్పుతాన్నాను" అని గార్డు అప్పారావు సగర్వంగా
చెప్పుకుంటా వుంటాడు. (పేజీ 102).
41
అడవికన్నా గ్రామం తక్కువేమీకాదు. గ్రామంలో సొండి
సాంబన్న వంటి షావుకారులుంటారు. వాళ్ళు తేనెపూసిన కత్తుల్లాంటివాళ్ళు. మంచిగ మాతకలిపి కౄరంగా దోపిడి చెస్తుంటారు. (పేజీ
73). కొనేటప్పుడు శెనగపప్పు ధర ఇస్తారు; అమ్మేటప్పుడు జీడిపప్పు ధర తీసుకుంటారు.
42
షావుకారు సొండి సాంబన్న కుటుంబంతో ఫారెస్టర్ రాజు
పెట్టుకున్న వివాహేతర సంబంధం స్థానికులకు శాపంగా మారుతుంది. ఫారెస్టర్ అండదండలతో స్థానికుల్ని మరింతగా దోపిడి
చేయడానికి పూనుకుంటాడు షావుకారు. (పేజీ 76).
43
అడవిలో రాజు ఎలాగూ ఎర్రచిరుతపులి. గూడెంలో షావుకారు
మేకతోలు కప్పుకున్న పులి(పేజీ 77). ఇద్దరూ కలిసి అటు అడవిలో, ఇటు గూడెంలో ప్రజల్ని పీడించుకుని తిరుగుతుంటారు.
44
వీళ్లుగాక, అటవీ సంపదని, వ్యవసాయ ఉత్పత్తుల్ని సంతల్లో
కారుచౌకగా కొనడానికి బయటి నుండి వచ్చే వర్తకులుంటారు. నాయుళ్ళు, షావుకార్లు, వర్తకులు,
ఫారెస్టు నిబ్బంది - ఈ నలుగురి మధ్య గిరిజనుల జీవితాలు నలిగిపోతుంటాయి.
45
పెళ్ళాంలేని గడ్డిసెట్టి, భర్త వదిలేసిన ఆదెమ్మ
అడవిలో పనిదగ్గర, ఇంట్లో తిండి దగ్గర ఒకటవుతారు. ’జాతికాని జాతిదాన్ని’ చేసుకున్నందుకు
చాకలి పెద్దకు మూడు వందల రూపాయల తప్పు కదతాడు గడ్డిసెట్టి (పేజీ 149).
46
అడవిలో కొత్తగా నీలగిరి ప్లాంటేషన్లు వేయాలని ప్రభుత్వం
నిర్ణయిస్తుంది. అందులో, స్థానికులు ఉచితంగా కూలీపని చేయాలని ఫారెస్టరు రాజు ఉత్తర్వులు
జారీచేయడంతో కొత్త ఘర్షణ మొదలవుతుంది (పేజీ 59).
47
గ్రామంలోనికి కమ్యూనిస్టులు ప్రవేశించడంతో సమస్యకు
ఒక పరిష్కారం కనిపిస్తుంది (పేజీ 107). చట్తబధ్ధ పోరాటాలతో సమస్య పరిష్కారం కాదనీ,
సమాజంలో దోపిడిని అంతం చేయాలంటే సాయుధపోరాటం చేయక తప్పదని విప్లవ కమ్యూనిస్టులు భావిస్తారు
(పేజీ 144 - 145).
48
కలప కాంట్రాక్టరు గురువయ్య, ఫారెస్టు గార్డు అప్పారావు
కలిసి ఆదెమ్మ మీద అత్యాచారయత్నం చేయడంతో ఘర్షణ పరాకాష్టకు చేరుతుంది. ఫారెస్టు గార్డు అప్పారావు మీద గడ్డిసెట్టి గొడ్దలితో
దాడి చేస్తాడు. గాయం సెప్టిక్ అయ్యి, అప్పారావు కాలు తీసేస్తారు (పేజి 163).
49
ఈ సంఘటనతో, ఖంగుతిన్న ఫారెస్టోళ్ళు, కాంట్రాక్టర్లు,
నాయుళ్ళు, షావుకార్లు, వృత్తికులాల పెద్దలు ఏకమౌతారు. గడ్డిసెట్టి మీద అనేక తప్పుడు కేసులు పెడతారు. అతన్ని అరెస్టు చేస్తారు. అతనింటిని వడ్డి వ్యాపారులు స్వాధీనం చేసుకుంటారు.
50
ఆదెమ్మ మళ్ళీ దిక్కులేనిదైపోతుంది. ఆమె మొదటి భర్త సుక్కడు పోలీసు ఇన్ఫార్మర్ గా మారిపొతాడు.
రెండో భర్త గడ్డిసెట్టి హత్యాయత్నం కేసులో జైలుకు పోతాడు.
51
మరోవైపు, కమ్యూనిస్టు నాయకుల్ని పట్టుకోడానికి అడవిలోనికి
పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగుతాయి. వాళ్ళ అండ చూసుకుని, స్థానికుల పట్టా భూముల్లో
కూడా నీలగిరి మొక్కలు నాటడానికి ఫారెస్టర్ రాజు సిధ్ధమౌతాడు (పేజి 171).
52
అప్పుడు కాలం కడుపుతోవుంది. కొత్త సమాజాన్ని ఆహ్వానిస్తూ,
శ్రీకాళం అడవిలో తుపాకీ పేలింది. గదపవలసలో షావుకారు సొండి సాంబన్నతో వర్గశతృ నిర్మూలనా
కార్యక్రమం మొదలవుతుంది (పేజి 182). అంతకన్నా ముందే, పోలీసు ఇన్ఫార్మర్ సుక్కడ్ని చంపేస్తారు ఉద్యమకారులు. (పేజి 181).
53
అప్పటికీ ఆదెమ్మ కసి చల్లారలేదు. నాయుడువలసలో నాయుడ్ని ఖతం చేయడానికి దళం బయలుదేరడంతో
నవల ముగుస్తుంది (పేజి 183).
54
ఆ తరువాత జరిగిందంతా మనకళ్లముందున్న చరిత్రే!
కొండగాలి పై నోట్స్
55
ఫారెస్టు చట్టాల్లోని అమానుషత్వాన్నీ, గిరిజనులపై
విచ్చలవిడి దోపిడినీ, సాంఘీక దురాచారాల్ని, ప్రభుత్వ నిరంకుశత్వాన్నీ కొండగాలి నవల
వివరంగా చిత్రిస్తుంది.
56
పాలకులు ఏ ఉద్యమాన్ని అయినా సరే, పోలీసులు, ఆయుధాలు,
జైళ్ళు, ఉరికొయ్యలు, చట్టాలు, న్యాయస్థానాలను ఉపయోగించి కౄరంగా అణిచివేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ఉద్యమాలని బలప్రయోగంతో అణిచివేసినంత సులువుగా,
ఆ ఉద్యమాలు ముందుకు తెచ్చిన భావజాలాన్ని బలప్రయోగంతో అణిచివేయడం సాధ్యంకాదు. అందుకే,
నిరంకుశత్వానికి ఎప్పుడూ రెండు పార్శ్వాలుంటాయి. ఇందులో, మొదటిది హింసను ప్రయోగించి
ఉద్యమాలని అణిచివేయడం, రెండోది, కొత్త సంక్షేమ పథకాల్ని ప్రకటించి ప్రజల్ని శాంతింపచేయడం.
57
ఉద్యమాలు
ముందుకు తెచ్చిన భావజాలాల్ని అదుపుచేయడానికి ప్రభుత్వాలకు ప్రత్యేక పరికరాలు
కావాలి. సరికొత్త ప్రజాసంక్షేమ పథకాల్ని చేపట్టడంతోపాటూ వివాదాస్పద చట్టాల్ని సవరించడం
లేదా పూర్తిగా తొలగించడం, ప్రజల కోరిక మేరకు కొత్త చట్టాల్ని రూపొందించడం మొదలయినవన్నీ
ఇందులో భాగమే.
58
శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటం మీద ఇప్పటి వరకు
కొన్ని వందల, బహుశ, వేల రచనలు వచ్చివుంటాయి. వీటిని ప్రాధమికంగా రెండు రకాలుగా విడగొట్టవచ్చు. మొదటిది, ఆ పోరాటం మీద ప్రభుత్వాలు ప్రయోగించిన
నిర్బంధం. రెండోది, సాహిత్యం, సమాజం, భావజాలాలపై ఆ పోరాటం వేసిన ప్రభావం.
59
ఇప్పుడు మరో అధ్యయన పార్శ్వం మన ముందుకు వచ్చింది.
శ్రీకాకుళ గిరిజన సాయుధపోరాట ఫలితంగా పుట్టిన సాహిత్యానికీ, చట్టాలకూ మధ్య సాగిన పరస్పర
ప్రభావాల్ని అధ్యయనం చేయడం దీని లక్ష్యం. మరో
మాటల్లో చెప్పాలంటే, నక్సలైట్ ఉద్యమం చట్టాల్నీ, న్యాయవ్యవస్థనూ, చివరకు రాజ్యాంగాన్నీ
ఎలా ప్రభావితం చేసిందనేది పరిశోధనలకు కొత్త అంశం.
(ఈ కోణంలో ఇదే తొలి ప్రయత్నం కావడంవల్ల నా కృషి
సంపూర్ణమైనదని నేను అనుకోను. ఈ సందర్భంగా నేను గమనించిన కొన్ని ఆసక్తికర అంశాలను మాత్రం
మీ ముందు వుంచుతాను.)
60
కొత్త చట్టాల రూపకల్పన
శ్రీకాకుళం గిరిజన సాయుధపోరాటాన్ని ఉక్కుపాదంతో
అణిచివేస్తున్న సమయంలోనే, గిరిజన భూములకు సంబంధించిన కొన్ని వివాదాస్పద చట్టాల్ని సవరించాల్సిన
అవసరం వుందని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఆక్రమంలోనే, 1970 ఫిబ్రవరి 3 న రెగ్యులేషన్ ఒన్ ఆఫ్ 1970 చట్టం అమల్లోనికి వచ్చింది.
షెడ్యూల్డు ప్రాంతంలో గిరిజనుల భూములు గిరిజనేతరులకు అన్యాక్రాంతం కాకుండా ఈ చట్టం
పరిరక్షిస్తుంది. నిర్బంధం, సంక్షేమ పథకాల
అన్యోన్య సంబంధానికి ఈ రెండు చర్యలు మంచి ఉదాహరణ.
61
నక్సలైటు ఉద్యమం ముందుకు తెచ్చిన ప్రధాన నినాదం
"దున్నేవానికే భూమి". 1970 వ దశకంలో ఈ నినాదం అటు అటవీ ప్రాంతంలోనూ, ఇటు మైదాన ప్రాంతాల్లోనూ నిప్పులా వ్యాపించింది.
వ్యవసాయ కూలీల మనసుల్లో బలంగా నాటుకున్న ఈ కోరిక ఉద్యమ ఫలితంగా ప్రభుత్వాలపై వత్తిడిని
పెంచింది. ఫలితంగా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, 1973 లో ఆంధ్రప్రదేశ్ భూసంస్కరణ (వ్యవసాయ భూములపై పరిమితి) చట్టం వచ్చింది.
62
శ్రీకాకుళ గిరిజన సాయుధపోరాటం చట్టాల మీద వేసిన
ప్రభావం కేవలం భూసంస్కరణలకే పరిమితం కాలేదు. అటవీ ఉత్పత్తుల కొనుగోళ్ల క్రమబద్దీకరణ
కోసం వెంటవెంటనే అనేక చట్టాలు వచ్చాయి. అట్లే,
ఆ తరువాతి కాలంలో పరంపరగా వచ్చిన కుటుంబ చట్టాలు,
మహిళా సంరక్షణ చట్టాలు, పోలీసు-జైళ్ల సంస్కరణలు మొదలైన వాటిపై శ్రీకాకుళం పొరాట ప్రభావాన్ని
నిరాకరించలేం.
63
వీటన్నింటికీ పరాకాష్టగా శ్రీకాకుళ ఉద్యమం, విస్తృత
అర్ధంలో నక్సలైట్ ఉద్యమం, ఏకంగా భారత రాజ్యాంగ మూల సూత్రాల్నే మార్చేసింది. నక్సలైట్
ఉద్యమం బలంగా ముందుకు తెచ్చిన సామ్యవాదం అనే ఆకాంక్షను 1976 డిసెంబరు
18 న 42 వ సవరణ ద్వార భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు. దానితో, మన
రాజ్యాంగ ప్రవేశిక "భారతీయులమైన మేము సంయుక్తంగా భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక,
ప్రజాస్వామిక, సర్వసత్తాక దేశంగా ఏర్పరచాలని నిర్ణయించాము" గా మారిపోయింది. 42 వ రాజ్యాంగ సవరణనే చాలామంది
మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. ఉద్యమ సాహిత్యం
భావిరాజ్యాంగం అవుతుందనడానికి ఇది గొప్ప ఉడాహరణ.
64
అయితే, భారత రాజ్యాంగ ప్రవేశికలోనికి సామ్యవాద ఆదర్శం
చేరిన సమయాన్ని గుర్తుచేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య
చరిత్రలో అత్యంత చీకటి రోజులుగా భావించే అత్యయిక పరిస్థితి (25 జూన్ 1975 నుండి 21 మార్చి 1977 వరకు) నాలుగో పాదంలో దీన్ని చేర్చడం
ఒక రాజకీయ వైచిత్రి! అణిచివేత, సంక్షేమ పథకాలు రెండూ నిరంకుశత్వానికి రెండు పార్శ్వాలు
అని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ.
65
ఉద్యమాల నుండి చట్టాల వరకు
ముగించడానికి ముందు, సమాజిక సంఘర్షణకూ, సాహిత్యానికీ,
చట్టాలకూ మధ్య కొనసాగే అనుబంధ క్రమాన్ని అర్ధం చేసుకోవాలి. మొగుడుపెళ్ళాలు ఒకటైపోయి
ఆనందంగా కాపురం చేస్తుంటే, స్త్రీవాదాలు, కుటుంబ చట్టాలు రావల్సిన పని వుండదు. కానీ,
వాస్తవ పరిస్థితి అట్లాలేదు గాబట్టే, స్త్రీవాదం వస్తుంది. స్త్రీవాద సాహిత్యం వస్తుంది.
ఆ వెనక గృహహింస నిరోధక చట్టాలు వస్తాయి. అట్లే, దళితవాదం వస్తుంది. దళితవాద సాహిత్యం
వస్తుంది. ఆ వెనక దళితులపై అత్యాచార నిరోధక చట్టాలు వస్తాయి. అలాగే, గిరిజనవాదం, గిరిజన
సాహిత్యం, గిరిజన హక్కుల పరిరక్షణ చట్టాలు వస్తాయి. అదేకోవలో, మత అల్పసంఖ్యాకవాదం వస్తుంది,
మతాల్పసంఖ్యాక సాహిత్యం వస్తుంది. ఆ వెనక, మతహింస నిరోధక బిల్లు (PCTV Bill - 2011) వస్తుంది.
66
ఈ క్రమం అంతా మనకు ఏం చెపుతోందీ? వర్గసమాజంలో ఒక
సమూహం మరో సమూహాన్ని అణిచివేస్తూ వుంటుంది. అ ఆనిచివేతను నిలవరించడానికి ఒక ప్రత్యేక
ఉద్యమం పుడుతుంది. ఆ ప్రత్యేక ఉద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ఒక ప్రత్యేక
ఉద్యమసాహిత్యం పుడుతుంది. ఆ ప్రత్యేక ఉద్యమాల, ఆ ప్రత్యేక సాహిత్యాల కృషి ఫలించినపుడు
పాత చట్టాలు అంతరించి, అంతకన్నా మానవీయమైన కొత్త చట్టాలు వస్తాయి. ఈ సరళి మరింత ఉధృతంగా
సాగితే వర్గసమాజమే అంతరించి వర్గాలులేని సమాజాలు అవతరిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే,
నేటి తిరుగుబాటు సాహిత్యమే రేపటి రాజ్యాంగం అవుతుంది.
67
ఇలాంటి సందర్భాల్లో, 19వ శతాబ్దపు ఇంగ్లీషు భావకవి,
పెర్సి బైషే షెల్లి అన్న మాటలు గుర్తుకొస్తాయి.
1821లో రాసిన ’ఏ డిఫెన్స్
ఆఫ్ పొయట్రి’ వ్యాసంలో, "కవులు, ఈ ప్రపంచానికి, అనధికార శాసనకర్తలు" అన్నాడు
షెల్లి. అంతకుముందు రాసిన ’ఏ ఫిలాసఫిక్ వ్యూ
ఆఫ్ రిఫామ్స్’ అనే మరో వ్యాసంలో, షెల్లీనే, కవుల పక్కన తత్వవేత్తల్ని కూడా చేర్చాడు.
ఆధునిక కళాసాహిత్య ప్రక్రియలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి కనుక, కథకులు, నవలాకారులు,
గాయకులు, చిత్రకారులు, రచయితలు, చివరకు ఉపన్యాసకుల్ని కూడా ఈ జాబితాలోనికి చేర్చవచ్చు.
అయితే, ప్రతి కవీ, రచయితా తమని తాము భావి రాజ్యాంగ
నిర్మాతలని అనేసుకుంటే కుదరదు. షెల్లి కూడా ఆనాటి విప్లవకర ఆలోచనా పరులైన థామస్ పేయిన్,
విలియం గాడ్విన్, స్త్రీవాది మేరీ వోల్స్టోనే క్రాఫ్ట్, ఫ్రెంచి తత్వవేత్త వోల్టేర్
తదితరుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాటలన్నాడు. దాని అర్ధం ఏమిటంటే, ఏ చారిత్రక దశలోనైనాసరే, పాలకుల్ని సమర్ధించే కవులు,
రచయితలు, కళాకారులు, ఆ చారిత్రక దశ మారగానే
కాలగర్భంలో కలిసిపోతారు. ప్రజా ఉద్యమాలను సమర్ధించేవాళ్ళే భావి రాజ్యాంగ నిర్మాతలు
అవుతారు. కొండగాలి నవల మనకు మరోసారి ఆ విషయాన్నే చెపుతుంది.
68
ఇటు న్యాయవ్యవస్థలోనూ, అటు సాహిత్యరంగంలోనూ పనిచేసేవాళ్ళ
ముందు ఈ ప్రపంచం ద్వారాలు తెరిచి నిలబడింది. యధాస్థితీ, మార్పుల మధ్య, పాలకులకూ, ప్రజలకు మధ్య, గతానికీ, భవిష్యత్తుకు
మధ్య, వాళ్ళు దేనినయినా ఎంచుకోవచ్చు.
69
(చట్టం సాహిత్యం అంశంపై, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్
మెంట్, హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ సదస్సులో,
12 ఫిబ్రవరి 2012న సమర్పించిన ఇంగ్లీషు ప్రసంగ
పాఠానికి తెలుగు అనువాదం)
హైదరాబాద్,
25 ఫిబ్రవరి 2012
No comments:
Post a Comment