Saturday 12 January 2013

Media & Muslims


మీడియా  - ముస్లింలు

డానీ 

సమస్త మానవాళికీ శాంతి కలుగుగాక!

మిత్రులారా! వేదికపైన నా పక్కనా, వేదిక కింద నా ముందూ, నాకన్నా యోగ్యులూ, అనుభవజ్ఞులు అనేకులు వున్నారనే స్పృహతో, వినయంగా నా అభిప్రాయాల్ని మీ ముందు వుంచుతున్నాను. నా వ్యక్తీకరణ శైలిలో కొంచెం ఆవేశం వుంటుందేమోగానీ, ఇక్కడున్నవాళ్ళ గౌరవానికి మాత్రం ఏమాత్రం లోటు వుండదు.

సమాజంలోని వాస్తవ సమస్యల్ని ప్రసార మాధ్యమాలు  ప్రతిబింబించేలా చేయడం ఎట్లా? అన్నది ఇప్పుడు ఈ వేదిక సంధించిన ప్రశ్న. ఈ వేదికను ఏర్పాటు చేసింది ముస్లిం సమాజం గనుక ఈ ప్రశ్నను రెండు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు. ప్రసార మాధ్యమాలు ముస్లింల వాస్తవ సమస్యల్ని ప్రతిబింబించడం లేదనే అభియోగం ఇందులో మొదటి అంశంకాగా, ప్రసార మాధ్యమాలలో ముస్లిం వ్యతిరేకతను తగ్గించాలనే ఆకాంక్ష ఇందులో రెండవ అంశం.

నా వరకైతే వీటిల్లో రెండవ అంశమే ప్రాణప్రదమైనది. ఎందుకంటే, కూర్చొని అభియోగాలు చేసినంత మాత్రాన ప్రపంచంలో ఏదీ మారదు. మనకు నచ్చనిదాన్ని మార్చాలి. మార్చాలంటే అందులోకి దిగాలి. నీళ్లలోకి దిగకుండా నదీ ప్రవాహగతిని మార్చడం కాదుకదా, కనీసం ఈత నేర్చుకోవడం కూడా సాధ్యంకాదు.  "విమర్శనాయుధాన్ని ఎంత గొప్పగా వాడినా ఆయుధ విమర్శ లేకుండాపోదు. భౌతిక పరిస్థితుల్ని భౌతిక పరిస్థితులతోనే మార్చాలి". 

మీడియాను మీకు సానుకూలంగా మార్చుకోవడానికి ముందు మీడియా పనితీరును అర్ధం చేసుకోవాలి. నాలాంటి అసమ్మతివాదుల్ని కాకుండా, గౌరవనీయులైన సంపాదకులు ఎవరినైనా మీరు ఆహ్వానించి వుంటే, మీడియా ఆదర్శాల గురించి వాళ్ళు  గంభీరమైన ఉపన్యాసాల్ని ఇచ్చివుండేవారు.  సత్యమేవ జయతే అనే హరిశ్చంద్రుని సూక్తితో మొదలెట్టి,   17,18  శతాబ్దాలకు చెందిన యూరప్ ఉదారవాదులు జాన్ లాక్, వాల్టెర్, రూసో  ల నుండి  వందల కొద్ది ప్రవచనాలను తీసుకువచ్చి మీముందు వల్లించేవారు.   " నీ అభిప్రాయాలతో నేను ఏకీభవించకపోవచ్చుకానీ, నీ భావప్రకటనా స్వేచ్చను పరిరక్షించడానికి నా ప్రాణాలనైనా ఇస్తాను " అన్న వాల్టేర్ ఆదర్శాలపట్ల నాకు అపారమైన గౌరవం వుంది. అయితే, ఆ ఆదర్శాలకూ  ఇవ్వాల్టీ మీడియా ప్రయోజనాలకూ ఏమాత్రం సంబంధం లేదనిమాత్రమే నేను మనవి చేసుకుంటున్నాను.

చెప్పుల కంపెనీ చెప్పులు ఉత్పత్తి చేస్తుంది. చక్కెర ఫ్యాక్టరీ చక్కెర   ఉత్పత్తి చేస్తుంది. మరి మీడియా సంస్థలు దేన్ని ఉత్పత్తి చేస్తాయి? ఈ ప్రశ్న పైకి చాలా తేలిగ్గా కనిపించవచ్చుగానీ, నిజానికి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువుకాదు. మీడియా వ్యవస్థకు చెందిన మార్మికత అంతా ఈ ప్రశ్నకు సమాధానంలోనే వుంది.

మీడియా సంస్థలు వార్తల్ని ఉత్పత్తి చేస్తాయి అని మీలో కొందరు అనవచ్చు. మీడియా సంస్థలు వార్తల్ని చాటుతాయిగానీ, వార్తల్ని ఉత్పత్తి చేయవు. కొన్ని సందర్భాల్లో వార్తల్ని సృష్టించినా అది ఉప ఉత్పత్తేతప్పా, ప్రధాన ఉత్పత్తికాదు.  చక్కెర, చెప్పులు వగయిరాలని  దుకాణాల్లో పెట్టి అమ్మినట్టు మీడియా సంస్థలు వార్తల్ని అమ్ముతాయా? ఇతర సరుకుల్లాగే వార్తాపత్రికల్ని స్టాండ్స్‌లో కొంటున్నామని మీలో కొందరు అనుకోవచ్చు. అదీ నిజం కాదు. ఇరవై పేజీల రంగుల పత్రిక ఉత్పత్తి వ్యయం ఒక్కో కాపీకి ఇరవై రూపాయలకన్నా ఎక్కువగా వుంటుంది. పాఠకులు అందులో ఐదవ వంతు కూడా చెల్లించరు. అలా చెల్లించేది కూడా రవాణా ఖర్చులకే సరిపోతుంది. మీరు చెల్లించే వెల మీడియా సంస్థకు తిరిగివెళ్ళదు.  వార్తా పత్రికల్ని కొనడానికి పాఠకులు చెల్లించేది కేవలం రవాణా ఖర్చులు మాత్రమే. ఎలక్ట్రానిక్ మీడియా విషయంలో కూడా ప్రేక్షకులు చెల్లించేది చేరవేత (క్యారియర్)  ఖర్చులే.  కొన్ని పెయిడ్ న్యూస్‌ఛానల్స్ కూడా వున్నాయిగానీ, దానివల్ల వాటికి  వసూలయ్యేది కూడా చాలా తక్కువ.

ఈ నష్టాల వివరాల్లోకి మరింత లోతుగా వెళ్ళకుండా, మీడియా సంస్థలకు లాభాలు ఎక్కడ నుండి వస్తాయి? అని ఆలోచించడం సమంజసంగా వుంటుంది. అప్పుడు, మీడియా సంస్థల ప్రధాన ఉత్పత్తి ఏమిటీ? అనే  మొదటి ప్రశ్నే మళ్ళీ మన ముందుకు వస్తుంది. మిమ్మల్ని మరింత సేపు ఊరించకుండా నేనే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. పత్రికలు పాఠకుల్ని, రేడియోలు శ్రోతల్నీ, టీవీ న్యూస్ ఛానళ్ళు  ప్రేక్షకుల్నీ సమీకరిస్తాయి. ఆలా సమీకరించిన పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకుల్ని ప్రకటనదారులకు అమ్మడం ద్వార మీడియా సంస్థలు లాభాలు సంపాదిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులకు వినియొగదారుల్ని సేకరించిపెట్టే సేవల్ని మీడియా సంస్థలు అందిస్తాయి. మీడియా  పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులు ఓటర్లు కూడా కనుక రాజకీయ పార్టీలు కూడా మీడియా సంస్థల సేవల్ని వినియోగించుకుంటాయి.

మీడియా వ్యవస్థ అన్నది నాలుగు స్థంభాలాట. అందులో మీడియా యజమానులు, కార్పొరేట్ కంపెనీలు, రాజకీయపార్టీలు,  మీడియా సిబ్బంది, పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలు  వుంటారు. వీళ్లందరు ఈ ఆటలో స్టేక్‌హోల్డర్లు. ఈ వ్యవస్థలో ఇప్పటి స్థితిగతులు నచ్చనివాళ్ళు, దాన్ని మార్చాలంటే తప్పక అందులో భాగస్వాములు కావాలి. అంటే ఏదో ఒక స్టేక్‌హోల్డర్ కావాలి. బ్యాటింగో, బౌలింగో, ఫీల్డింగో చేతకాకపోతే, కనీసం గ్యాలరీలోనో, ఇంట్లో టీవీ ముందో ప్రేక్షకులైనా  కాకపోతే ఎవ్వరూ క్రికెట్ ఆటను మార్చలేరు.

ప్రసార మాధ్యమం అనేది అన్ని వ్యాపారాల్లాగే ఒక వ్యాపారం. కాకపొతే, కొంచెం సంక్లిష్టమైన వ్యాపారం. వాణిజ్య వార్త అనేది కిరసనాయిల్ లా సబ్సిడీ సరుకు. ఒక చోట నష్టానికి అమ్మి, ఇంకోచోట లాభాలుగా మార్చుకోవాలి. ఏ వ్యాపారానికి అయినా వాణిజ్య నియమాలే వుంటాయి. మీడియా వ్యవస్థలో వ్యాపారేతర విలువల్ని ఆశించడం అమాయకత్వం.

వార్తను ఉత్పత్తిచేసేవాళ్ళు (మీడియా యాజమాన్యం), వార్త ఫలాలని వినియోగించుకునేవారు (కార్పొరేట్ కంపెనీలు, రాజకీయా పార్టీలు వగయిరాలు)  మీడియా వ్యవస్థను శాసిస్తూంటారు. ఈ రెండు పాత్రల్లో దేన్నీ నిర్వర్తించే స్థితిలో నేటి ముస్లింలు లేరు. ఇక సిబ్బంది కావడమో , అదీ కుదరకపోతే హీనపక్షం పాఠకులో, ప్రేక్షకులో, శ్రోతలో కావడం ఒక్కటే ముస్లింల ముందున్న  అవకాశం.

సిబ్బందిగా చేరినంత మాత్రాన, వార్తల్లో ముస్లింలకు న్యాయం జరుగుతుందని నేను భావించలేను.  లక్స్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు లక్స్ సబ్బుమాత్రమే తయారు చేయాలి. లైఫ్ బోయ్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు లైఫ్ బోయ్ సబ్బుమాత్రమే తయారు చేయాలి. భావప్రకటనా స్వేఛ్ఛ అనేది మీడియా వ్యవస్థను శాసించే రెండు శక్తులకేగానీ, మీడియా కార్మికులు, పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలకు  కాదు. ఒకరిది చెప్పే హక్కు. ఇంకొకరిది వినే హక్కు. ఈ విషయంలో అనవసర అపోహలు వుండడం మంచిదికాదు.

మీడియా వ్యవస్థలో ఏ స్థంభం దగ్గర కూడా ముస్లింలు లేకపోతే ఏమవుతుందీ? మీడియా వ్యవస్థ ముస్లిమేతర వ్యవస్థగా మారిపోతుంది.  ముస్లిమేతర మీడియా వ్యవస్థలో ముస్లిం సానుకూల వార్తలు ఎలాగూరావు. వీలున్నప్పుడు ముస్లిం వ్యతిరేక వార్తలు కూడా వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నది అదే.

ఏ మీడియా సంస్థ అయినా  'తన' పాఠకులు / ప్రేక్షకులు / శ్రోతలని రంజింప చేయాలనే అనుకుంటుంది. సరిగ్గా ఈ కారణంవల్లనే 'తన' వాళ్ళకు రుచించని విషయాలని ప్రసారం చేయడానికి ఇష్టపడదు.  అవి నిజాలైనాసరే వాటిని తొక్కిపెడుతుంది. ఇక్కడ 'తన' అనేది, స్థూలంగా భావసారూప్యం కలిగిన సమూహం అని అర్ధం చెప్పుకోవచ్చు.  ఆ సమూహం ఒక పార్టి, కులం, మతం, ప్రాంతం, భాష వగయిరా ఏదైనా కావచ్చు.  అయితే,  ఏ మీడియా సంస్థ అయినా అబధ్ధాలు ప్రచారం చేస్తుందని నేను అనుకోను; మరీ బరి తెగించిన సందర్భాల్లోతప్ప.

ఇప్పుడు దక్షణాది రాష్ట్రాల్లో దాదాపు అన్ని పార్టీలకూ న్యూస్ ఛానళ్ళున్నాయి. ఇవన్నీ తమతమ పార్టీలకు ప్రచారం చేసిపెడుతుంటాయి. తమిళనాడులో 2006 ఎన్నికల్లో, అప్పటికి అధికారంలోవున్న ఏ‌ఐడి‌ఎంకే ఓడిపోయింది. ఆ పార్టీ అధినేత్రి జయలలిత స్వంత  టీవీ ఎన్నికల కౌంటింగ్ కవరేజి ఎలా చెయ్యాలి? డీ‌ఎంకే గెలుస్తున్నట్టు చెప్పడం వాళ్ళకు ఇబ్బంది. ఏ‌ఐడి‌ఎంకే  పార్టీ ఓడిపొతున్నదని చెప్పడం అంతకన్నా ఇబ్బంది. దానితో, వాళ్ళు ఒక  అపధ్ధర్మ ఫార్మూలా కనిపెట్టారు. గెలిచిన ఏ‌ఐడి‌ఎంకే ఎమ్మెల్యేల వార్తల్ని మాత్రమే ప్రసారం చేస్తూ ఆ రోజంతా గడిపారు. నిజానికి ఈ చర్యవల్ల వాళ్ళు అబధ్ధం ఏమీ చెప్పలేదు. కానీ, డీ‌ఎంకే గెలుస్తున్నదన్న నిజాన్ని దాచారు. ఇప్పుడు ఇలాంటి అపధ్ధర్మ ఫార్మూలాని అనేక మీడియా సంస్థలు పాటిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్ళడానికి ముందు నేను ఇంకో విషయాన్ని మీ ముందుకు తీసుకు రావలసివుంది.

ఈ రోజూ శ్రీమతి యాన్నె రిడ్లె ప్రసంగాన్ని వీడియో కాన్ఫెరెన్స్‌లో వినడం నాకు రెండు విధాలుగా ఆనందంగావుంది. మొదటిది, మీడియా వ్యవస్థ మీద వారి అభిప్రాయాలను తెలుసుకోవడం. రెండోది, అంతకన్నా ముఖ్యమైనది. ఒక సాంప్రదాయ ముస్లిం సంస్థ ఒక మహిళ ప్రసంగాన్ని టీవీలో ప్రసారం చేయడం నాకు ఎంతగానో నచ్చింది. ఇదొక అతి సాధారణ విషయంగా చాలా మందికి కనిపించవచ్చుగానీ, నా వరకైతే గొప్ప పరిణామం. ఎందుకంటే, ముస్లింలు ఫొటోలు దిగరు, సినిమాలు చూడరు, టీవీ చూడరు అనే అభిప్రాయం బయటి ప్రపంచంలో బలంగావుంది. ఇలాంటి అభిప్రాయం ప్రబలంగా వుంటే ఒక ప్రమాదం పొంచివుంటుంది. ముస్లింలు ఎలాగూ కనరు, వినరు, చదవరు కనుక వాళ్ల గురించి ఏది రాసినా ఎలా రాసినా ఎవరూ పట్టించుకోరనే ధీమాతో మీడియా సంస్థలు కొన్ని దుస్సాహసాలు చేయవచ్చు. అవి ఎలావుంటాయో చెపుతాను.

మీడియా ముస్లింల గురించి పట్టించుకోవడంలేదు అనేది సరికాదు. మీడియా కఛ్ఛితంగా ముస్లింలను పట్టించుకుంటుంది. కాకపోతే, ముస్లింల మీద గౌరవాన్ని పెంచే అంశాలను తక్కువగానూ, ముస్లింల మీద గౌరవాన్ని తగ్గించే అంశాలను ఎక్కువగానూ ప్రచారం కల్పిస్తుంది. దీనికి కారణం ఏమిటంటే, మీడియా పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలు ముస్లిమేతరులే అనే అభిప్రాయం బలంగా వుండడమే. ఈ అపోహను ముందు మీరు బద్దలు గొట్టాలి. తన పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో వున్నారని తెలిస్తే మీడియా తనంతట తానుగా సర్దుకుంటుంది.

టెర్రరిజం అనేది ఏ సామాజికవర్గానికైనా సరే అత్మహత్యా సదృశ్యం అవుతుంది. శతృవును అంతం చేస్తానని ఉనికిలోనికి వచ్చి చివరకు మిత్రులనే అది అంతం చేస్తుంది. ఇప్పుడు అన్ని మతాల్లోనూ టెర్రరిష్టులు పుట్టుకువస్తున్నారు. ఆకుపచ్చ, నీలం, తెలుపు, కాషాయం వగయిరా అన్ని రంగుల్లో వాళ్ళు కనిపిస్తున్నారు.  ముస్లిమేతర అతివాదులు ముస్లింలందరూ టెర్రరిష్టులే అన్నట్టు ప్రచారం చేస్తుంటారు. వాళ్ళలో కొందరు ఉదారులు మొన్నటి దాక   "ముస్లింలందరూ టెర్రరిస్టులుకాదుగానీ,  టెర్రరిస్టులందరూ ముస్లింలే"                     అనేవారు. ఇప్పుడు  ఉదారులకు ఆ అవకాశం కూడా  పోయింది. దేశంలో కాషాయ టెర్రరిష్టులు పుట్టుకు వచ్చారు. హైదరాబాద్‌లో మనకు రెండు రకాల టెర్రరిష్టు  సంఘటనలున్నాయి. లుంబినీపార్క్ పేలుళ్ళ వెనక ఆకుపచ్చ టెర్రరిష్టులుంటే, మక్కా మసీదు పేలుళ్ళ వెనక కాషాయ టెర్రరిష్టులున్నారు. అయితే, ఈ సందర్భంలో మీడియా చేసే   తుంటరి పని ఏమంటే, లుంబినీపార్క్ పేలుళ్ళ గురించి పదేపదే మాట్లాడి సమాజంలో ముస్లింలపట్ల ద్వేషం పెరగడానికి దోహదం చేస్తుంది. మరోవైపు మక్కా మసీదు పేలుళ్ళను మరుగున  పడేస్తుంది.

గత ఏడాది హైదరాబాద్ మాదన్నపేట, కూర్మగడ్దలోని శ్రీహనుమాన్‌జీ మందిర్ గోడ పైకి కొందరు దుండగులు గోమాంసాన్ని విసిరి పారిపోయారు. ఇతర మతాల దేవతల్ని అపవిత్రం చేయడం అనేది దుండగ చర్య. తద్వార ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవచ్చని కొందరు నాయకులు ఆశిస్తారు. అయితే, ప్రజలు ఎన్నడూ రాజకీయ నాయకులు అనుకున్నంత మూర్ఖులుకారు. ప్రజల్లో చైతన్యం పెరిగేకొద్దీ ఒకరి దేవతల్ని మరొకరు అవమానించే సంఘటనలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఎవరి దేవతల్ని వారే అవమానించుకుని ఆ నేరాన్ని అవతలి పక్షం వైపుకు నెట్టేసే మరీ దుర్మార్గపు సాంప్రదాయాలు వచ్చాయి. కూర్మగడ్ద సంఘటన తరువాత నగర పోలీసులు సహజంగానే ముస్లిం సామాజికవర్గానికి చెందిన కొందరు యువకుల్ని అరెస్టుచేసి జ్యూడీషియల్ రిమాండుకు పంపించారు. ఈ వార్త అన్ని తెలుగు, ఇంగ్లీషు, హిందీ పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఆ తరువాత అసలు వాస్తవం బయటపడింది. హిందూ సామాజికవర్గానికి చెందిన నలుగురు యువకులు ఈ దుశ్చర్యకు పాల్గొన్నట్టు పోలీసులు కనుగొన్నారు. అప్పటికి నెల రోజుల క్రితం మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో, తెలంగాణ సెంటిమెంటును అధిగమించి, ముస్లీం వ్యతిరేక సెంటిమెంటును రెచ్చగొట్టడంలో సంఘ్‌పరివారం సఫలీకృతమైంది.  బీజేపి అభ్యర్ధి గెలిచాడు. మహబూబ్‌నగర్ ఫార్మూలాను హైదరాబాద్‌లో ప్రయోగించాలని భావించిన సంఘ్‌పరివార శక్తులు కూర్మగడ్డ సంఘటనకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. ఈ వార్త ఇంగ్లీషు పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. కానీ, ప్రముఖ తెలుగు పత్రికలు మాత్రం ఈ వార్తను  ప్రచురించలేదు.

ఇంగ్లీషు పత్రికలకూ, తెలుగు పత్రికలకూ తేడా ఏమిటీ? అని మిత్రులు నన్ను అడగవచ్చు. ముస్లిం పాఠకులు; చదివితే ఉర్దు పత్రికలు చదువుతారు. లేకపోతే, ఇంగ్లీషు పత్రికలు చదువుతారు అనేది మార్కెట్ వర్గాలు తేల్చిన విశ్లేషణ. ఆ తరువాత వాళ్ళ ప్రాధాన్యత తెలుగు పేపర్లు. వాళ్ళు హిందీ పేపర్లు అస్సలు చదవరు. హైదరాబాద్‌లో హిందీ పేపర్లని మార్వాడీలు, ఇతర ఉత్తరాది వారు చదువుతారు. అందువల్ల ఇతర  భాషా పత్రికల్లో కన్నా హిందీ భాషా పత్రికల్లో ముస్లిం వ్యతిరేకత మనకు కొంచెం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. మరోవైపు, ఇంగ్లీషు పత్రికల్లో ముస్లిం వ్యతిరేకత సాపేక్షంగా తక్కువగా కనిపిస్తుంది.     

దీన్నిబట్టి మనకు అర్ధం అయ్యేదేమంటే, మీడియా సంస్థల పాలసీని మార్కెట్  నిర్ణయిస్తుంది. ప్రతి మీడియా సంస్థకూ స్వంత వాణిజ్య వ్యూహం వుంటుంది. దాన్నిబట్టి ఆ మీడియా సంస్థ పాలసీ తయారు అవుతుంది. ఎవర్ని పొగడాలి? ఎవర్ని తిట్టాలి? అనేది అలా నిర్ణయం అవుతుంది. అందువల్ల యాజమాన్యంగా మారలేకపోయినా, కేవలం పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలుగా మారడంవల్ల కూడా ముస్లింలు మీడియాను సానుకూలంగా మార్చుకోవచ్చు.  

మీడియాలో ముస్లింలకు కార్యనిర్వాహక పదవులు అంత సులభంగా దక్కకపోవచ్చు. అయితే, దిగువస్థాయి ఉద్యోగాలకు మతం ఎన్నడూ అడ్దంకికాదు. నైపుణ్యాన్ని సంపాదించుకోవడం ముఖ్యం. నైపుణ్యాన్ని ఏ ప్రమోటరూ వదులుకోడు.

అన్నింటికన్నా ముఖ్యం ఏమంటే, సమాజాన్ని మతప్రాతిపదికన చీల్చాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి శక్తులు ఇరువైపులా వున్నాయి.  హిందూత్వకు ప్రాతినిధ్యం వహించే ఒక పార్టీ నాయకత్వంలో ఏర్పడిన రాజకీయ కూటమి గతంలో కేంద్రంలో అధికారాన్ని సాగించింది.  ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల్లో  ఆ కూటమి అధికారంలో వుంది. అలాంటి అవకాశం ముస్లిం మతవాద పార్టీలకు ఎప్పటికీరాదు. మతతత్వ రాజకీయాలతో అధికారాన్ని చేపట్టే అవకాశం ముస్లింలకు కూడా వస్తుందని మిమ్మల్ని ఎవరైనా ఊరించవచ్చు. అలాంటి భ్రమల్లో వుండవద్దు; పడవద్దు.

మిమ్మల్ని ప్రధాన స్రవంతి నుండి తప్పించాలని హిందూత్వ శక్తులు భావిస్తున్నాయి.  ఇక మీకు మీరుగానే ప్రధాన స్రవంతి నుండి తప్పుకోవడం అంటే అర్ధం ఏమిటీ? మీరే హిందూత్వశక్తుల ప్రయోజనాలను నెరవేరుస్తున్నారని అర్ధంకాదా? ఇది సామాజిక ఆత్మహత్య అవుతుంది.  హిందూత్వవేరు, హిందువులు వేరు. దేశంలోని ప్రతి హిందువూ దేశంలో హిందూమతరాజ్యం రావాలని కోరుకోవడంలేదు. హిందువుల్లో అత్యధికులు మతసామరస్యాన్నే కోరుకుంటున్నారు. వాళ్ళతో, ఆత్మీయ సంబంధాలను చురుగ్గా కొనసాగించండి.  అదే మన ఉనికికి ప్రాణవాయువు.

ముగించడానికి ముందు సాంకేతికపరమైన కొన్ని అంశాల్ని ప్రస్తావించాల్సివుంది. మాస్ మీడియా అంటే పత్రికలు, టీవీ, రేడియో మాత్రమేకాదు. సినిమా, డాక్యుమెంటరీలు కూడా ప్రసార మాధ్యమాలే. వాటిని సమర్ధంగా వినియోగించే మార్గాలను అన్వేషించండి. కేవలం పాతిక వేల రూపాయలతో ఒక వీడియో కెమేరా కొనుక్కుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. బ్రాడ్‌కాస్టింగ్ స్థాయి కెమేర లక్షన్నర రూపాయల్లో దొరుకుతుంది.  వెబ్‌సైట్లు, సోషల్‌నెట్‌వర్కులు కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతున్నాయి. యూట్యూబ్‌లో పిల్లలు పెట్టిన కథనాలు లిబియా తదితర దేశాల్లో భూకంపాలు సృష్టించాయి. అవి మీరు చేయలేరా? పాత్రికేయ సమాజం ఇప్పటికి కూడా షొయబుల్లా ఖాన్ ను తలచుకుంటూ వుంటుంది. అంతటి ప్రభావాన్ని చూపిన ఇమ్రోజ్ పత్రిక్కి పెట్టిన పెట్టుబడి ఎంత? మీలో కొంచెం ఆర్ధిక వెసులుబాటు వున్నవాళ్ళు ఎవరు తలుచుకున్నా అలాంటి పత్రిక వారం రోజుల్లో బయటికి వస్తుంది.

మీడియా సంస్థను నెలకొల్పడం ఒక అంశం. మీడియా సంస్థలకు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం మరో అంశం. మీడియా సంస్థల్లో ఉద్యోగాలు చేయడం ఇంకో అంశం. మీడియాకు పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలు కావడం ఇంకో అంశం. ఫ్రీ లాన్సర్లుగా మీడియాలో పనిచేయడం, ఇంటి నుండే మీడియాను నడపడం ఇంకో అంశం. ఇన్ని రకాల అవకాశాల్లో మీ సౌలభ్యాన్నిబట్టి, మీ శక్తినిబట్టి దేనినైనా ఎంచుకోండి. అసలు విషయం ఏమిటంటే, గట్టి ప్రభావాన్ని వేయండి!.

 (జమాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ లో నిర్వహించిన ’’ఇస్లాం వసంతం’’ సదస్సులో,  ’మీడియా - ముస్లింలు’ అనే అంశంపై, జనవరి  12, 2013 న చేసిన ప్రసంగం పూర్తిపాఠం)  


        

1 comment:

  1. నాదొక సందేహం. ఆవు మాంసం ముట్టనివాళ్ళలో ఎంత మంది ఆవు చర్మంతో కుట్టిన చెప్పులు వేసుకోవడం లేదు? రైతులు ముసలి ఆవులని (పాలివ్వని ఆవులని) కసాయివాళ్ళకి అమ్మేస్తారు. కసాయివాళ్ళు మాంసం కోసి, చర్మాన్ని చెప్పులు కుట్టేవాళ్ళకి అమ్మేస్తారు. ఆ చర్మంతో కుట్టున చెప్పులే మనం వేసుకుని తిరుగుతున్నాం.

    ReplyDelete