పసునూరి రవీందర్,
’అప్రజాస్వామిక ఆధిపత్య సభలు’ వ్యాసం బాగుంది.
ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరించిన వాళ్లల్లో నేనూ ఒకడ్ని.
మీ సమస్య తెలుగు, తెలంగాణ. మీ సమస్యను నేను సహృదయంతో అర్ధం చేసుకుంటాను. మీ ఉద్యమాన్ని మనస్పూర్తిగా సమర్ధిస్తాను.
నా సమస్య మీ సమస్యకన్నా పెద్దది. తెలంగాణ భాషకన్నా ఇప్పుడు ఉనికి ప్రమాదంలో వున్నది ఉర్దూ భాషకు. ఉర్దూను బతికించుకుందాం అనే ఆలోచనని పక్కన పెట్టి, ఇతర భాషల్ని మాతృభాషగా స్వీకరించేవాళ్ళు ఇప్పుడు ఉర్దు జాతిలో (తెలుగుజాతి, తెలంగాణ జాతిలా ఉర్దూ జాతి) పెరుగుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం.
తెలంగాణ భాషను పరిరక్షించడం కోసం పొరాడేవాళ్ళున్నారు. అది నాకు ఆనందాన్ని కలిగించే అంశం. ఉర్దూ భాషను పరిరక్షించడం కోసం పొరాడేవాళ్ళు పరిసరాల్లో కనిపించడం లేదు. ఇది బాధాకరం.
తెలంగాణ ఉద్యమ ప్రకటిత ఆశయాలపట్ల నాకు సంపూర్ణ ఏకీభావం వుంది.
అయితే, అస్థిత్వవాద వుద్యమాల్లో ఒక ప్రమాదం పొంచి వుంటుంది. ఉద్యమాలు విజయవంతం అయ్యే దశల్లో స్థానిక పాలకవర్గాలు / ఆధిపత్యకులాలు సమిష్టిగా అధికారాన్ని చేజిక్కించుకుని పాత అణిచివేతను మరింత ఉధృతంగా సాగిస్తాయి. ఇలాంటి ఉదాహరణలు గతంలో ఎన్నో ఉన్నాయి.
తెలంగాణ పెత్తందారీ కులాల ప్రతినిధులు తెలంగాణ భాషకు చేసిన/ చేస్తున్న ద్రోహాన్ని మీ వ్యాసంలో ప్రస్తావించడం బాగుంది. ఇది సరైన ఆలోచన.
తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని బలహీనవర్గాలు క్రమంగా పెత్తందారీ కులాలకు వదిలేస్తున్నాయి అని అంటే ఎవరికైనా అభ్యంతరం వుండవచ్చు. కానీ, తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని పెత్తందారీ కులాలు/వర్గాలు క్రమంగా ఆక్రమించుకుంటున్నాయి అని అంటే ఎవరికి అభ్యంతరం వుండాల్సిన పనిలేదు.
తెలంగాణ ఉద్యమంలో అలాంటి పోకడల్ని చూసినపుడు నేను చాలా ఆందోళనకు గురౌతాను. బలహీనవర్గాలకు వ్యతిరేక శక్తులు, ఉర్దూ వ్యతిరేక శక్తులు, ముస్లిం వ్యతిరేక శక్తులు ఉద్యమ నాయకత్యాన్ని చేపడితే, రాబోయే ఫలితం, ముస్లింలకూ, ఉర్దూ జాతికీ, ఇప్పటికన్నా భయంకరంగా వుంటుంది. అదే నా భయం.
No comments:
Post a Comment