Wednesday, 23 February 2022

the link between Communists and world Bank?

 కమ్యూనిష్టులు ప్రపంచ బ్యాంకు మధ్య లింకేమిటీ? 

// the link between Communists and world Bank?

 

మనదేశంలో ఒకప్పుడు పాలక పార్టీలకు గట్టి ప్రత్యామ్నాయంగా కనిపించిన కమ్యూనిష్టు పార్టీల  ప్రాభవం ఇప్పుడు మసకబారిపోయింది. తెలంగాణలో సాయుధపోరాటాన్ని నడిపామని ఘనంగా చెప్పుకునే కమ్యూనిస్టులకు ఈరోజు ఆ రాష్ట్ర శాసనసభలో ప్రవేశంలేదు. 1955 ఎన్నికల్లో అధికారాన్ని చేపడుతున్నంతగా భయపెట్టిన కమ్యూనిస్టులకు కొత్త ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఇప్పటి వరకు ఒక్క సీటు కూడ లభించలేదు. దాదాపు మూడు దశాబ్దాలు ఏలిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఇప్పుడు ఒక్క శాసన సభ్యుడు కూడ లేడు. కొత్త తరం చాలా ఉత్సాహంగా రాజకీయాల్లోనికి వస్తున్నదిగానీ కమ్యూనిస్టు పార్టీలలోనికి మాత్రం  చేరడంలేదు.

 

  భారత దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గిపోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న మనకు తరచూ ఎదురవుతుంటుంది.

 

వర్తమాన భారతదేశంలో  కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటివి; అంతర్గత కారణాలు రెండోవి బాహ్య కారణాలు.

 

దేశంలో వర్గ సమాజాన్ని సమూలంగా నిర్మూలించాలనే గొప్ప ఆశయంతో భారత కమ్యూనిస్టు పార్టి ఆవిర్భవించింది.  దీని వ్యవస్థాపకులు గొప్ప విద్యావంతులు, గొప్ప అంకిత భావం కలవారు. 1948-52 మధ్య కాలంలో  ఉమ్మడి కమ్యూనిస్టుపార్టి సాయుధ పోరాట పంథాను కూడ కొనసాగించింది.

 

భారత కమ్యూనిస్టు పార్టి నాయకుల్లో ప్రధాన లోపం సృజనాత్మకత. మార్క్సిస్టు మూల సూత్రాలని లెనిన్ రష్యాకు, మావో చైనాకు అన్వయించడంలో  ప్రదర్శించిన సృజనాత్మకతను  భారత కమ్యూనిస్టు నేతలు అందుకోలేక పోయారు. ఈ లోపంతో,  కొన్నాళ్ళు రష్యా మార్గంలోనూ, కొన్నాళ్ళు చైనా మార్గంలోనూ నడిచారు. రష్యాలో లెనిన్ జాతుల సమస్యను గుర్తించడంలో చూపిన చొరవను కమ్యూనిస్టు నాయకత్వం భారత దేశంలో కులాలు, మతాల విషయంలో చూపించలేకపోయింది. మరోవైపు దేశరాజకీయాల్లో మతాల్ని పట్టించుకుని సావర్కారిస్టులు, కులాన్ని పట్టించుకుని అంబేడ్కరిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారు.

 

కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గడానికి ప్రపంచ బ్యాంకు గుణాత్మకమైన పాత్రను పోషించింది.  దేశంలో నూతన ఆర్ధిక విధానం ప్రవేశించినపుడు నిజానికి కమ్యూనిస్టులకు చేతినిండా పని దొరకాలి. అలా జరగలేదు. అదే సమయంలో రష్యా విభజన, చైనా పతనంతో భారత కమ్యూనిస్టు పార్టీలు కుంగిపోయాయి. భారత దేశాన్ని విప్లవ కేంద్రంగా భావించక రష్యానో, చైనానో విప్లవకేంద్రాలుగా భావించిన ఘోర తప్పిదానికి ఫలితం ఇది.

 

సమిష్టి ఆదర్శాలను తొలగించి వ్యక్తి ప్రయోజనాలను ప్రోత్సహించడానికి ప్రపంచ బ్యాంకు అనేక సృజనాత్మక పథకాలను రూపొందించింది. ఈ పథకాలకు రెండు లక్ష్యాలు వుంటాయి. మొదటిది; పెట్టుబడీదారుల సంపదను అపారంగా పెంచడం. రెండోది; సామాన్య ప్రజల్ని కమ్యూనిజానికి దూరం చేయడం. ఈ పథకాలన్నీ అనుకున్న ఫలితాలను గొప్పగా సాధించాయి. వాటిని తట్టుకునే మార్గాలు కమ్యూనిస్టు నాయకులకు తోచలేదు. కమ్యూనిస్టుల తప్పిదాలు అంతటితో ఆగలేదు. 1970వ  దశకంలో చారు మజుందారీయుల  ధాటిని తట్టుకోవడానికి  కాంగ్రెస్ కు దగ్గరయిన చారిత్రక తప్పిదం కమ్యూనిస్టుల నెత్తిన వుంది. 1990వ దశకంలో కమ్యూనిస్టులు అంతకు మించిన చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. ప్రపంచ బ్యాంకు పథకాలకు తానే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఘనంగా చెప్పుకునే చంద్రబాబుతో జతకట్టారు. ఎవర్ని వ్యతిరేకించాలో వారితోనే జతకలిస్తే ప్రజలు గమనిస్తారు.

 

2004లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినపుడు వామపక్షానికి వాలిన మధ్యేవాదులతో (లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్) కేంద్రంలో యూపిఏ-1 ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం నుండి వామపక్షాలు తప్పుకోవడం ఇంకో చారిత్రక తప్పిదం. మధ్యేవాదులు కుడిపక్షానికి వాలడంతో (రైట్ ఆఫ్ ద సెంటర్)  యూపిఏ-2 ప్రభుత్వం ఏర్పడింది. దానికి లాజికల్ కొనసాగింపే కుడిపక్షాలు నేరుగా ప్రభుత్వాలను ఏర్పరచడం. 

 

మరోవైపు, తుపాకిని భుజం మీద నుండి దించము అని చెప్పే మావోయిస్టులు సహితం కుల పీడితులకు, మత పీడితులకు ఒక విశ్వాసాన్ని కల్పించలేకపోయారు.

 

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచాలి, సినిమా టిక్కెట్ల ధరలు పెంచాలని ఉద్యమాలు చేసేవాళ్ళను జనం నమ్మరు. ఎన్నికల్లో ఆ పార్టీలకు పడుతున్న ఓట్లే దీనికి గీటురాయి.

 

మతోన్మాదుల్ని నిజాయితీగా ఎదుర్కోగలిగిన శక్తి సామర్ధ్యాలు దేశంలో కమ్యూనిస్టులకే వుందని జనం ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నారు. కమ్యూనిస్టు పార్టీల  యంత్రాంగం ఆ దిశగా కృషిచేస్తే  వాటికి మళ్ళీ ఒక మహర్దశ రావచ్చు.

 

27 ఫిబ్రవరి 2020

Sunday, 20 February 2022

Save the Tri Colour National Flag

సర్వధర్మ ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని రక్షించుకుందాం!

 -        డానీ

 1.        పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక బ్యూటీ వుంటుంది. అధికారంలో వున్న పార్టిలు ఐదేళ్ళకు ఒకసారి ప్రజల మద్దతును తిరిగి పొందాల్సి వుంటుంది. ఎన్నికల పరీక్షలో పాస్ అవ్వాల్సి వుంటుంది.  

 

2.        అధికారంలోవున్న పార్టీలకూ, అధికారంలోనికి రావాలని అశపడుతున్న పార్టీలకు తొలి కర్తవ్యం ఒక్కటే; సామాజిక శాంతిని కాపాడడం.

 

3.        రాజ్యాంగం రాజకీయ సమానత్వాన్ని సమకూర్చిందిగానీ సామాజిక, ఆర్ధిక రంగాల్లో సమానత్వాన్ని సమకూర్చలేదు.  సామాజిక, ఆర్ధిక రంగాల్లో సమానత్వాన్ని సాధించనంతకాలం సమాజంలో అశాంతి వుంటుంది.

 

4.        సాంఘీక ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని సాధించినపుడే సమాజంలో శాంతి నెలకొంటుంది. అంచేత సమాజంలో శాంతిని  పునరుధ్ధరించడం అనేది ఎన్నికల వాగ్దానాల్లో, ఎన్నికయిన ప్రభుత్వాల కర్తవ్యాల్లో అతి ముఖ్యమైనది అవుతుంది.

 

5.        ఈ లక్ష్యాలని రాజకీయ పార్టిలు తమవైన పధ్ధతుల్లో అనేక అంశాలుగా మార్చి ప్రచారం చేస్తాయి. సామాజిక శాంతిని తాము ఏఏ పధ్ధతుల్లో సాధించ బోతున్నాయో చెపుతాయి.

 

6.         వీటిల్లో మొదటివి, అణగారిన సమూహాల ఆర్థిక ఆదాయ లోటును భర్తీ చేయడానికి ప్రత్యక్ష్యంగా  మేలు చేసే కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం. ఈ పథకాల్లో కొన్ని సమిష్టిగా మేలు చేసేవీ వుంటాయి. మరికొన్ని వ్యక్తిగతంగా మేలు చేసేవీ వుంటాయి. రెండోవి, దేశంలో సాధారణ అభివృధ్ధి కోసం మౌళిక నిర్మాణ రంగంలో కొత్త  ప్రాజెక్టుల్ని చేపడతామని ప్రకటించడం.

 

7.        ఎన్నికల ప్రచార ఘట్టంలో అధికార పార్టిలకు ఒక అదనపు బాధ్యత వుంటుంది.  పై రెండు విభాగాల్లో కొత్త పథకాలను ప్రకటిస్తే సరిపోదు; తమ పాలనా కాలంలో ఆ రెండు విభాగాల్లో తాము సాధించిన విజయాలను ప్రజలకు  వివరించాల్సి వుంటుంది.

 

8.        గోల్వాల్కర్ రాజకీయ సంతతి అయిన బిజెపిది ‘మనం – వాళ్ళు’ అనే విభజన సిధాంతం. ‘We and they division’.

 

9.        అంచేత  సాంఘీక రంగంలో శాంతిని పరిరక్షిస్తాననిగానీ, ఆర్ధిక రంగంలో సమానత్వాన్ని సాధిస్తాననిగాని చెప్పడం బిజెపికి సిధ్ధాంత రీత్యా సాధ్యంకాదు. 

 

10.   ఈ గొడవలేవీ లేకుండ, ఓటర్లను మత ప్రాతిపదిక మీద చీల్చి రాజకీయంగా లబ్ది పొందే సులభ పధ్ధతుల్ని భారతీయ జనతా పార్టి అనుసరిస్తున్నది.

 

11.   ఏదో ఒక మత అంశాన్ని వివాదంగా మార్చడం పార్టికి ఎన్నికల ఎత్తుగడగా మారిపోయింది. ఈ ఎత్తుగడలతో ఆ పార్టి అనేక విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

 

12.   ఉత్తరప్రదేశ్  ఎన్నికలు 80-20 సమూహాల మధ్య పోటి అని సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారు. 80 అంటే హిందూ సమూహం; 20 అంటే మైనారిటీల సమూహం.

 

13.   రాచరిక వ్యవస్థలో కత్తితో అధికారాన్ని సాధిస్తే, ప్రజాస్వామిక వ్య్వస్థలో ఓటుతో అధికారాన్ని సాధిస్తారు. రాచరికానికీ, ప్రజాస్వామ్యానికీ మధ్య అంతకు మించిన ఒక కీలక తేడా వుంది; మైనారిటీ అభిప్రాయాన్ని గౌరవించాలి; మైనారిటీ సమూహానికి రక్షణ కల్పించాలి.

 

14.   మైనారిటీ అభిప్రాయాన్ని గౌరవించకపోతే, మైనారిటీ సమూహాలకు రక్షణ కల్పించకపోతే ప్రజాస్వామ్యం మళ్ళీ రాచరిక వ్యవస్థగా మారిపోతుంది.

 

 

15.   ప్రజల్ని మతప్రాతిపదిక మీద చీల్చడానికి బిజెపి ప్రతి ఎన్నికల్లో ఒక కొత్త నినాదాన్ని  ముందుకు తెస్తుంది.

 

16.   ఒకసారి, భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందంటుంది. ఇంకోసారి, పురాణ పురుషుడు శ్రీరామునికి ఆశ్రయం లేదంటుంది. విడాకులు ప్రకటించిన ముస్లిం భర్తల్ని కఠినంగా శిక్షించే చట్టాన్ని తెచ్చి ముస్లిం మహిళల్ని  ఆదుకుంటానని ఒక ఎన్నికల్లో అంటుంది. ఇంకో ఎన్నికల్లో  ముస్లిం మహిళలు తలకు గుడ్డ కట్టుకుంటే హిందూ మతానికి ముప్పు ముంచుకు వస్తుందని అంటుంది.

 

17.   నొవమ్ చోమ్స్కి ఎడ్వర్డ్ ఎస్ హెర్మన్ తో కలిసి 1988 లో Manufacturing Consent: The Political Economy of the Mass Media అనే పుస్తకాన్ని రాశాడు. మీడియా 'ఆమోదాంశాన్ని తయారు చేయుట' అని దాని అర్ధంఇప్పుడువివాదాన్ని తయారు చేయుట' (Manufacturing Conflict) అనేది బిజెపి విధానం అయిపోయింది. వివాదాల్ని సృష్టించడంలో ఉద్దండులయిన  అతిరథులు, మహారథులు  ఆ పార్టీలో చాలామంది వున్నారు.

 

18.   మనదేశంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలంటే ఒక విధంగా మినీ లోక్ సభ ఎన్నికలే. అంత పెద్దది ఆ రాష్ట్రం.

 

19.   ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం అయింది. ఆపైన, రాష్ట్రంలో కులమత చిచ్చుల్ని రగిల్చి సామాజిక అశాంతిని రగిల్చింది.

 

20.   ఉత్తర ప్రదేశ్ లో తమ పార్టిని మళ్ళీ గట్టెంక్కించడానికి కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం ఒక కుట్రపూరిత ప్రణాళికను రచించింది. ముస్లిం మహిళల హిజబ్ ధారణ అంశాన్ని కొత్త వివాదంగా మార్చింది.

 

21.   హిజబ్ అంటే స్థూలంగా ముస్లింల ధార్మిక వస్త్రధారణ. ఇది ముస్లిం డ్రెస్సింగ్ కోడ్ అన్నమాట. ముస్లిం మహిళలు, పురుషులు కూడ హిజబ్ నియమాలను పాటించాలి.  

 

22.   మత సమూహాలు అన్నింటిలోనూ సాధారణంగా పురుషులకన్నా స్త్రీలే మతాచారాల్ని పాటిస్తుంటారు.  దీనికి ముస్లిం సమాజం కూడ మినహాయింపు ఏమీకాదు. అంచేత హిజబ్ సాంప్రదాయం ముస్లిం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

 

23.   ఇప్పటి నిర్దిష్ట వివాదంలో అంటే ముస్లిం మహిళల తలగుడ్డ. ఇదొక సాంస్కృతిక అంశం.

 

24.   ముస్లిం మహిళల సాంస్కృతిక ఆచారాన్ని ఒక ధార్మిక వివాదంగా మార్చి రాజకీయంగా లబ్ది పోందాలని ఇప్పుడు బిజెపి ఆశిస్తోంది.  

 

25.   ముస్లిం మహిళలు హిజబ్ ను ధరిస్తే దేశంలో హిందూమతానికి ముప్పు ముంచుకు వస్తుందని పార్టి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని సాగిస్తోంది.

 

26.   బిజెపి విద్యార్ఢి విభాగం అయిన ఏబివిపి సభ్యులు విద్యాలయాల్లో హిజబ్ ధరించిన మహిళల్ని వేధిస్తున్నారు. ముస్లిం మహిళల హిజబ్ కు పోటీగా హిందూ విద్యార్ఢులకు  కాషాయ కండువాలు, కాషాయ టోపీలు పంపిణీ చేశారు. .  దానితో విద్యాలయాల లోపల బయట  ఒక ఉద్రిక్త వాతావరణమ నెలకొంది.  

 

27.   ఈ వ్యవహారం అంతటితో ఆగలేదు. విద్యాసంస్థల ఆవరణల్లో జాతీయ జెండాలకు పోటీగా కాషాయ జెండాలను ఆవిష్కరించే కొత్త సాంప్రదాయాన్ని సంఘీయులు కర్ణాటకలో ఆరంభించారు.

 

28.   మన జాతీయ జెండ జాతియోద్యమంలో పుట్టింది. స్వత్రంత్ర్య భారతదేశం సర్వమతాల సామరస్యంతో వర్ధిల్లాలనేది స్వాతంత్ర సమరయోధుల ఆశయం. వాళ్ళ మహత్తర ఆశయానికి ప్రతీకగా మువ్వన్నెల జెండ రూపు దిద్దుకుంది.

 

29.   మన జాతీయ పతాకలోని కాషాయం హిందూ మతాని ప్రతీక. తెలుపు క్రైస్తవ మతాని ప్రతీక, ఆకుపచ్చ ఇస్లాం మతానికి ప్రతీక.  అశోక చక్రం బౌధ్ధమతానికి ప్రతీక.

 

30.   జాతీయ జెండా నుండి ఆకుపచ్చ, తెలుపు రంగుల్ని, అశోక చక్రాన్ని తొలగించి దాన్ని మొత్తంగా కాషాయ జెండాగా మార్చే ప్రయత్నాలను బిజెపి మొదలెట్టింది.

 

31.   పైకి ఇది జాతీయ జెండాలో కొన్ని రంగుల్ని తొలగించే వివాదంగా కనిపిస్తున్నదిగానీ. నిజానికి ఇది అల్పసంఖ్యాక మత సమూహాల అస్తిత్వ సమస్య.

 

32.   భారత దేశం నుండి ముస్లింలు, క్రైస్తవులు, బౌధ్ధుల్ని తరిమేస్తామని సంఘీయులు జాతీయ జెండా రూపంలో ఒక సామాజిక హెచ్చరిక చేస్తున్నారు.

 

33.    కర్ణాటక పంచాయితీ శాఖామంత్రి కే. ఎస్. ఈశ్వరప్ప అయితే ఏకంగాభవిష్యత్తులో కాషాయ జెండాయే మన జాతీయ జెండా అవుతుంది” అని ప్రకటించారు. “కాషాయ జెండాను ఎర్రకోట మీద ఎగురవేస్తాంఅని వారు ధిమా వ్యక్తం చేశారు.  

 

34.   ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి జాతీయ జెండాను రద్దు చేస్తున్నట్టు సదరు మంత్రి ప్రకటించారు.

 

35.   ముస్లిం మహిళల హిజబ్ ను తొలగిస్తామంటూ మొదలయిన ప్రతీఘాత ఆందోళన ఏకంగా జాతీయ జెండానే తొలగించేస్తాం అనే వరకు వెళ్ళిపోయింది. ఎవరూ ఎప్పుడూ ఇంత ఘోరంగా జాతీయ జెండాను అవమానించు వుండరు.  

 

36.   ‘ఇతరులు’ పొరపాటున గానీ ఏమరుపాటున గానీ తప్పుగా వ్యవహరించినా జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగిపోయిందని బిజెపి నేతలు చాలా పెద్ద రాద్దాంతం చేస్తుంటారు.

 

37.   ఇప్పుడు సాక్షాత్తు బిజెపికే  చెందిన ఒక రాష్ట్ర మంత్రి జాతీయ పతాకాన్ని రద్దు చేసేస్తాం కాషాయ పతాకాన్ని ఎర్రకోట మీద ఎగురవేస్తాం అంటున్నారు.  అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలీ?

 

38.   రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకుని రాజ్యాంగ పదవుల్ని చేపట్టకుండ సదరు మంత్రి మీద జీవితకాల నిషేధం విధించాలి.

 

39.   ఎబివిపి సభ్యులు కాషాయ ఖండువాలతో కాలేజీలకు రావడం తో కొన్ని చోట్ల వారిని మనువాదులంటూ అంబేడ్కరిస్టులు అడ్డుకున్నారు. నీలం రంగు కండువాలు ధరించి జై భీమ్ నినాదాలు ఇచ్చారు.

  

40.   కర్ణాటనలో అంబేడ్కరిస్టులు ముస్లిం మహిళలకు మద్దతుగా నిలవడాన్ని ఒక మహత్తర పరిణామంగా భావించాలి.

 

41.   న్యాయమూ, స్వేఛ్ఛ, సమానత్వము, సోదరభావాల్ని ప్రధాన ఆదర్శాలుగా ప్రకటించే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బిజెపి నేతలు చాలా కాలంగా అంటున్నారు. అసమానత్వాన్ని బలంగా ప్రబోధించే  మనుస్నృతిని  కొత్త రాజ్యాంగంగా ప్రకటిస్తామని కూడ వారు తరచూ తమ అభిలాషను వ్యక్తం చేస్తూనే వున్నారు.

 

42.   ఇప్పుడు వాళ్ళు సర్వమత సామరస్యాన్ని బోధించే త్రివర్ణ పతాకాన్ని రద్దు చేసే పనిలోపడ్డారు.

 

43.   ఈ రాజకీయ, ఆర్థిక నేపథ్యంలో  మత అల్పసంఖ్యాకులు, ఉప సంస్కృతులకు చెందిన విశాల ప్రజా సమూహాలు ఏకమై మతసామరస్య భారత రాజ్యాంగాన్ని, సర్వధర్మ ప్రతిక అయిన త్రివర్ణ పతాకాన్ని రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది.

 

44.    దీని కోసం మేధావులు, కవులు, కళాకారులు, ఆలోచనాపరులు, సామ్యవాదులు, ఉదారవాదులు,  మత సామరస్యవాదులు, పౌరహక్కులు, మానవహక్కులు, సామాజిక కార్యకర్తలందరితో ఒక విశాల వేదిక ఏర్పడాల్సిన అవసరం ముందుకు వచ్చింది.   

 

45.   Forum for Subaltern Cultures, Forum for cultural plurality అనే పేర్లు ప్రస్తుతం పరిశీలనలో వున్నాయి.

 

46.   ఈ సందర్భంగా రాజకీయంగా, సామాజికంగా ప్రాణప్రదమైన ఒక అంశాన్ని స్పష్టం చేయాల్సి వుంది.

 

47.   ప్రస్తుతం దేశంలోని విభిన్న మత అల్ప సంఖ్యాక వర్గాల మధ్య మంచి అవగాహన వుంది.

 

48.   షాహీన్ బాగ్ ఉద్యమ సందర్భంగానూ, రైతుల ఆందోళన సందర్భంగానూ అల్ప సంఖ్యాక సమూహాల మధ్య ఐక్యత మరింతగా బలపడింది.

 

49.   మిత్ర సమూహాల మధ్య కూడ వివాదాలు తలెత్తుతూ వుంటాయి.  మత అల్ప సంఖ్యాక సమూహాల మధ్య ఏదైనా సమస్య తలెత్తితే దాన్ని అంతర్గతంగానే పరిష్కరించుకునే సహృద్భావ వాతావరణం ఇప్పుడు పుష్కలంగా వుంది.  

 

50.   నిజానికి మత అధికసంఖ్యాకులతో అయినా సరే ఏదైన సమస్య వస్తే  దానిని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి అనేదే నేటి ముస్లిం సమాజపు అవగాహన.

 

51.   వివాదం మరీ ముదిరితే దాన్ని న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని ముస్లిం సమాజం భావిస్తోంది. అత్యున్నత న్యాయస్థానాల ధర్మాసనాలు ఇచ్చే తీర్పుల్ని గౌరవించాలనేది ముస్లిం పెద్దల ఏకాభిప్రాయం.

 

52.   తరచూ దుష్ప్రచారం జరుగుతున్నట్టు ముస్లింలు ఇబ్బంది పడుతున్నది సాధారణ హిందూ సమాజంతో కానేకాదు. హిందూ ముస్లిం సమూహాల మధ్య అనాదిగా మతసామరస్యం వుంది. అది చిరకాలం వర్ధిల్లుతుంది.

 

53.   ఎన్నికల్లో లబ్ది పొంది రాజ్యాధికారాన్ని కొనసాగించడానికి కొన్ని శక్తులు హిందూ ముస్లింల మధ్య మత చిచ్చు రగిల్చడానికి తరచూ ప్రయత్నిస్తున్నాయి. హిందూ సమూహాల్లో మతోన్మాదాన్ని  రెచ్చగొట్టే రాజకీయ పార్టీలతో మాత్రమే ముస్లింలకు ఇబ్బంది వుంది.

 

54.   రూపంలో ఇది సామాజిక సమస్యగా కనిపిస్తున్నదిగానీ సారాంశంలో ఇది రాజకీయ సమస్య. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజకీయార్ధిక సమస్య.

 

55.   సమాజంలో మత వైషమ్యాలను రెచ్చగొట్టి దక్కించుకున్న ఈ రాజకీయార్ధిక ఆధిపత్యాన్ని బిజెపి నిజంగానే హిందూ సామాజికవర్గాల అభివృధ్ధి  కోసం వినియోగిస్తూ వున్నదా? అంటే ? లేదు.

 

56.   సమాజంలో మత వైషమ్యాలను రెచ్చగొట్టి దక్కించుకున్న ఈ రాజకీయార్ధిక ఆధిపత్యాన్ని బిజేపి అస్మదీయ కార్పొరేట్లకు భారీ మేళ్ళు చేసి పెట్టడానికి ఉపయోగిస్తున్నది.

 

57.   వర్తమాన భారతదేశంలో ఒకవైపు, కార్పొరేట్ల సంపద అపారంగా పెరిగిపోతుంటే మరోవైపు నిరుపేదల సంఖ్య అంతకన్నా వేగంగా  పెరిగిపోతున్నది.

 

58.   అలా నిరంతరం పేదరికం కోరల్లో చిక్కుకుంటున్న వారిలో మత అల్పసంఖ్యాకులు ఒక్కరే లేరు.  మత అధిక సంఖ్యాకులైన హిందువులు సహితం చాలా పెద్ద సంఖ్యలో  వుంటున్నారు.

 

59.   బిజెపి, ఆరెస్సెస్ కార్యకలాపాలను ఎదుర్కోవడానికి తామూ మతోన్మాద చర్యల్ని చేపట్టాలని ప్రచారం చేసేవారు ముస్లిం సమాజంలోను వున్నరన్నది నిజం. వాళ్ల సంఖ్య చాలా చిన్నదే కావచ్చుగానీ వాళ్ళ ఆలోచనా సరళి చాలా ప్రమాదకరమైనది.

 

60.   మైనారీటీలకు టెర్రరిజం పనికిరాదనీ, అది మొత్తం ముస్లిం సమాజానికి ఆత్మహత్య కారకం అవుతుందని గతంలో అనేకసార్లు చెప్పాను. ఇప్పుడు మరింత గట్టిగా చెపుతున్నాను. ఏదాశంలో అయినా సరే ఉగ్రవాదంతో మైనారీటీలు సాధించేది ఏమీవుండదు; వుభయ భ్రష్టత్వం తప్ప.   

 

61.    మన సమాజంలో చెలరేగుతున్న రాజకీయార్ధిక సమస్యలకు మనం రాజకీయార్ధిక పరిష్కారాలని కనుగొనాలి.

 

62.   ముస్లిం సమాజం ప్రస్తుతం ఆ ప్రయత్నంలో వుంది. దీనికి ఇతర మత అల్పసంఖ్యాకులతోపాటు సాధారణ హిందూ సమాజం కూడ సహృదయంతో కలిసివచ్చినపుడే అందరికీ మేలు జరుగుతుంది.

 

63.   న్యాయము, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావం అని రాజ్యాంగంలో చదువుకుని మురిసిపోతే సరిపోదు; వాటిని ఆస్వాదించడం కోసం తపించాలి; ఉద్యమించాలి.  

 

64.   అల్పసంఖ్యాకుల మీద సాంస్కృతిక దాడుల్ని ఖండిద్దాం!

 

65.   మతసామరస్య భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం!

 

66.   సర్వధర్మ ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని రక్షించుకుందాం!

 

(హిజబ్ వివాదం మీద ముస్లిం థింకర్స్ ఫోరం (MTF) 19 ఫిబ్రవరి 2022 న విజయవాడలో  నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో  సమర్పించిన కీనోట్ ఆధారంగా)