“సకల శ్రామిక కులాల్లారా! ఏకంకడు!”
”సకల పీడిత మత సమూహాల్లారా! ఏకంకండు”
కమ్యూనిస్టు
ప్రణాళిక 2020 నాటి తెలుగు అనువాదానికి ప్రచురణ కర్తలు రాసిన ముందుమాటలో వర్తమాన సమాజాన్ని
'నయా ఉదారవాద యుగం' అంటూ పదే పదే పేర్కొనటం మీద తీవ్ర అభ్యంతరాన్ని
వ్యక్తం చేస్తూ దివి కుమార్ 22-2-2020న ఒక లేఖ రాశారు. దాన్ని వారే ఈరోజు రీ-పోస్ట్
చేశారు. దాని మీద నా స్పందన ఇది.
పెట్టుబడీదారీ
వ్యవస్థ లో అత్యంత అణగారిన సమూహం కార్మికులు అనేది మార్క్స్ అవగాహన. అందుకే కమ్యూనిస్టు
ప్రణాళిక చివరి వాక్యంలో "సకల దేశాల కార్మికులారా
ఏకంకండి!" అని పిలుపు ఇచ్చాడు. మార్క్స్ కాలం నాటి పెట్టుబడీదారీ వ్యవస్థ మరింత
దుర్మార్గంగా మారి తన కాలంలో సామ్రాజ్యవాద దశకు చేరుకుందని లెనిన్ గమనించాడు.
సామ్రాజ్యవాద
దశలో జాతులు కూడ తీవ్ర అణిచివేతకు, శ్రమదోపిడికి గురవుతున్నాయని లెనిన్ గుర్తించాడు.
అందుకే మార్క్స్ పిలుపును కొనసాగిస్తూ " సకల దేశాల కార్మికులారా, సకల పీడిత జాతుల్లారా
ఏకం కండి!" అని కొత్త పిలుపు ఇచ్చాడు.
లెనిన్ మార్క్సిజాన్ని అభివృధ్ధి చేశాడు; బలహీన పరచలేదు.
పెట్టీదారీవర్గం
మార్క్స్ కాలంకన్నా ఇప్పుడు benevolent గా మారిందనేది 2020నాటి కమ్యూనిస్టు ప్రణాళిక
తెలుగు అనువాదం ప్రచురణకర్తల అభిప్రాయం కావచ్చు. ఇది సిపిఐ, సిపియం సిధ్ధాంతకర్తల అభిప్రాయం
కూడ కావచ్చు. అంతటి ఉదార స్వభావం, దయాగుణం నేటి పెట్టుబడీదారుల్లో వామపక్షాలకు ఎక్కడ
కనిపించిందో?
1991లో
పివి నరసింహారావు-మన్మోహన్ సింగ్ ద్వయం నూతన ఆర్ధిక సంస్కరణల్ని చేపట్టారు. మార్కెట్
లో ఉత్సాహాన్ని నింపాలంటే ప్రభుత్వాలు పెట్టుబడీదారివర్గాల్ని ఇతోధికంగా ప్రోత్సహించాలనేది
దాని కార్యక్రమం. అప్పటి గ్యాట్ (GATT) ప్రభావంతో పెట్టుబడీదారీ వర్గం రూపొందించుకున్న
కార్యక్రమం ఇది. ఆనాడు మొదలయిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG) విధానాలే
దేశాన్ని ఫాసిజం వైపుకు నడిపించాయి. ఫాసిజం అంటే కార్పొరేట్లకు రాజ్యాధికారాన్ని అప్పగించడం.
ఈ మాటను మెనిటో ముస్సోలిని స్వయంగా అన్నాడు.
1995లో
గ్యాట్ ప్రపంచ వాణిజ్య సంస్థగా రూపాంతరం చెందింది. ప్రభుత్వాలు పెట్టుబడీదారివర్గాల్ని ప్రోత్సహిస్తే, భారీగా లాభాల్ని సంపాదించుకున్నాక
ఆ కార్పొరేట్లు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తారని
ఆనాటి ఆర్ధిక సంస్కర్తలు అన్నారు. దీనికి కార్పొరేట్ల సామాజిక బాధ్యత (Corporates
Social Responsibility (CSR) అంటూ అట్టహాసంగా ఒక పేరు పెట్టారు. అలా తాము నయా ఉదారవాదులం అవుతామని పెట్టుబడీదారి
వర్గం తన గురించి గొప్పగా చెప్పుకుంది. పెట్టుబడీదారీవర్గం తన గురించి గొప్పగా చెప్పుకున్న
మాటల్ని కమ్యూనిస్టు ఆలోచనాపరులు విమర్శనాత్మకంగాగాక యధాతధంగా స్వీకరించడం విచిత్రం.
ఇదొక చారిత్రక అపహాస్యం.
నిజానికి
ఇవ్వాల్టి బూర్జువావర్గపు దుర్మార్గపు పోకడలు మార్క్స్ కాలాన్నీ, లెనిన్ కాలాన్నీ దాటి
స్టాలిన్ కాలపు ఇటలీ, జర్మనీల ఫాసిస్టు స్థాయికి చేరుకున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ
– అమిత్ షాల రెండవ విడత పాలన మొదలయ్యాక, కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక,
CAA, NRC, NPRల వంకతో ముస్లిం పౌరసత్వానికే ఎసరు పెట్టాలని నిర్ణయించుకున్నాక కూడ మన
వామపక్ష మేధావులకు బూర్జువావర్గం ఉదారులుగా కనిపించడం విషాదం
భూస్వామ్య
వ్యవస్థతో పోలిస్తే తొలి నాళ్ళలో బూర్జువావర్గం నిస్సందేహంగా ఉదారమైనదే. దాన్ని ఎర్లి
కేపిటలిజం, ఎర్లి స్టేజ్ కేపిటలిజం అని అంటున్నారు.
తన గురించి కొంచెం మంచిగా చెప్పుకోవడానికి బూర్జువావర్గానికి ఒక అవకాశం వుండేది. ఇప్పుడు
ఆ ఛాన్స్ లేదు. అది ఇప్పుడు సకల దుర్గుణాల పుట్ట. చావడంతప్ప బతికే అర్హతలు లేవు. దీన్ని
లేట్ కేపిటలిజం, లేట్ స్టేజ్ కేపిటలిజం
అని అంటున్నారు.
కమ్యూనిస్టు
ప్రణాళిక చివరి నినాదాన్ని అభివృధ్ధి చేయడానికి లెనిన్ వాడిన మెధడాలజీని ఇప్పటి భారత
సమాజానికి అన్వయిస్తే అనేక కొత్త నినాదాల్ని
ఇవ్వాల్సి వుంటుంది. “సకల శ్రామిక కులాల్లారా! ఏకంకండు!” ”సకల పీడిత మత సమూహాల్లారా!
ఏకంకండు” వంటివి అన్నమాట.
కులం ప్రస్తావన
వచ్చినపుడు అంబేడ్కర్ ప్రస్తావన వచ్చి తీరాలి. శ్రామికవర్గ విముక్తి కోసం కార్ల్ మార్క్స్
ప్రతిపాదించిన సిధ్ధాంతాన్ని అభివృధ్ధిచేసి శ్రామిక కులాల విముక్తి కోసం వాడడమే అంబేడ్కరిజం.
అలాగే, శ్రామికవర్గ విముక్తి కోసం కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన సిధ్ధాంతాన్ని అభివృధ్ధిచేసి
శ్రామిక మతాల విముక్తి కోసం వాడాలి. మార్క్సిస్టులకు
అది నేటి చారిత్రక కర్తవ్యం.
కులాన్ని
గుర్తించం, మతాల్ని గుర్తించం అని మడి కట్టుకుని కూర్చున్న ఇప్పటి కమ్యూనిస్టు పార్టీలకు
“సకల శ్రామిక కులాల్లారా! ఏకంకడు!” ”సకల పీడిత మత సమూహాల్లారా! ఏకంకండు” వంటి నినాదాలు
ఇచ్చే శక్తి వుందా?
20-2-2022
No comments:
Post a Comment