Thursday 17 February 2022

హిజబ్ వివాదం – మార్క్సిస్టు, అంబేడ్కరిస్టుల అవగాహన

హిజబ్ వివాదం – మార్క్సిస్టు, అంబేడ్కరిస్టుల అవగాహన

హిజబ్ వివాదం మొదలయ్యాక చాలామంది చాలా వ్యాసాలు రాశారు.సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున పోస్ట్స్, కామెంట్స్, ట్రోల్స్ వగరాలు ఉధృతంగా సాగుతున్నాయి.వీటన్నింటిలో, తెలుగులో ఇద్దరు ఆలోచనాపరులు రాసిన రెండు వ్యాసాలు నాకు బాగా నచ్చాయి.వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగానూ నాకు చాలా సన్నిహితులు.వీరిలో మొదటివారు భార్గవ గడియారం.వీరు‘న్యూ సోషలిస్టిక్ ఇనీషియేటివ్’సమూహంలో సభ్యుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్సిస్టు.రెండవ వారైన జిలుకర శ్రీనివాస్ ద్రవిడ బహుజన సమితి నాయకులు.మరో మాటల్లో చెప్పాలంటే అంబేడ్కరిస్టు.

సామాజికవర్గాల పరంగా భార్గవ గడియారం యజమాని కులానికి చెందినవారు; జిలుకర శ్రీనివాస్ శ్రామిక కులానికి చెందినవారు.హిజబ్ వివాదం మీద సిధ్ధాంతాల పరంగా, సామాజికవర్గాల పరంగా భిన్నమైన అస్తిత్వాలు కలిగిన ఇద్దరు ఆలోచనాపరుల  ప్రతిస్పందన ఈ రెండు వ్యాసాలు. నడుస్తున్న వివాదాన్ని లోతుగా సమగ్రంగా అర్ధం చేసుకోవడానికి భార్గవ గడియారం, జిలుకర శ్రీనివాస్ ల వ్యాసాలు తోడ్పడతాయి.

18 ఫిబ్రవరి 2022

మతసామరస్య రాజ్యాంగ వ్యతిరేకులకు

మన దేశంలోఒక భూభాగాన్ని ఇచ్చేస్తే మంచిది!

 

డా. జిలుకర శ్రీనివాస్

ద్రవిడ బహుజన సమితి

 

నాగసాధువులు కుంభమేళకు దిగంబరంగా వస్తారు.మీ లింగాలను మాకు చూపిస్తారా?అని ఎవరూ గాయ పడలేదు.పైగా వాళ్ల లింగాలకు భక్తులు పూజలు చేస్తారు.ఆ పనిని ఎవరూ వ్యతిరేకించలేదు.నాగసాధువులకు వస్త్రధారణ వుండాలని ఎవరూ ఉద్యమం చేయలే.

 

జైన మతంలో దిగంబరులు, శ్వేతాంబరులు అనే శాఖలు వున్నాయి.దిగంబరులు నగ్నదేహంతో సంచరిస్తారు.ప్రవచనం చేస్తారు.వారి లింగాలకు జైన స్త్రీలు పూజలు చేస్తారు.అది తప్పని, మీరు బట్టలు ధరించాలని ఏ సంస్థా ఉద్యమించలేదు.అది వారి సంప్రదాయం అని గౌరవించాము.

బౌద్ధులు కాషాయాంబరం ధరిస్తారు.బౌద్ద సన్యాసులు ధరించే చీవరాలు కొద్దిగా నిండుగానే వుంటాయి కానీ అవి కూడా స్త్రీల వస్త్రధారణను స్ఫురిస్తాయి.

చినజీయరు, పరిపూర్ణానంద ఇద్దరూ ఆడవాళ్ల మాదిరి చీరలు చుట్టుకుంటారు.మాటిమాటికి పైటను సర్దుకుంటారు.ఏకంగా రామానుజుల వారి విగ్రహాన్ని చూడ్డానికి వొచ్చిన దేశ ప్రధానికి పసుపురంగు చీర కట్టించి దర్శనం చేయించారు చిన జీయర్.అది వారి సంప్రదాయం అని అంతా గౌరవించాము.ఆ చీర ధరించడానికి అన్ని అర్హతలు వారికి వున్నాయని అంగీకరించాము.

గర్భగుడిలోనే కాదు, కల్యాణ మండపంలో కూడా పూజారి పెళ్లి కూతురి ముందు అర్ధనగ్నంగా కూచొని వివాహం జరిపిస్తాడు.అది సంప్రదాయం అని వధూవరుల తల్లిదండ్రులు ఆయన్ని అమితంగా గౌరవిస్తారు.అనాచారం అని ఎవరూ అనుకోరు.

రాజస్థాన్ మార్వాడీ స్త్రీలు ముఖం కనిపించకుండా ముసుగు ధరిస్తారు.రాజస్తాన్ గాయని భన్వరీదేవికి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది.అమె ముసుగుతోటే పాటలు పాడుతుంది.ఆమెతో కలిసి పాప్ పాడిన కౌర్ పూర్తిగా షాట్స్, స్లీవ్ లెస్ టాప్ వేసుకొని పాడింది.ఆ వీడియో సాంగ్ ను కోట్లాది మంది చూశారు.

విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవలలో హీరోయిన్ ముసుగులేకుండా మగాళ్ల ముందు ధర్మప్రశస్తి గురించి వాదించి, ముసుగు వేసుకోనందుకు పశ్చాత్తాపంతో అగ్నిప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటుంది. అది సనాతన ధర్మ గొప్ప తనమని పండితులు గర్వించారు.

ఒంటికి సూర్యరశ్మి తాకితేనే ఏ అనారోగ్యం రాదని గ్రహించిన పాశ్చాత్యులు బీచులలో దిగంబరంగా తిరుగుతారు.అది ఆధునికత దుష్ప్రభావం అనుకుంటారు. ఆర్నెళ్లు గడ్డగట్టే చలికాలంలో యూరపు, అమెరికాలో దళసరి వస్త్రాలు,  గొడ్డుచర్మాలతో తయారు చేసిన బట్టలు వేసుకుంటారు.

ఎడారి వేడితాపానికి తాళలేక సౌదీ అరేబియా దేశంలో మగాళ్లు నిండైన దవళ వస్త్రాలు, నెత్తిమీద టర్బన్ ధరిస్తారు.ఆడవాళ్ళ గురించి చెప్పక్కర్లేదు.

సిక్కు మగాళ్లు తలపాగా ధరిస్తారు.సిక్కు ఆడవాళ్లు నెత్తిమీద ముసుగు వేసుకుంటారు.అది వారి సంప్రదాయం.

సిక్కోలు (శ్రీకాకుళం) స్త్రీలు రవికెలు వేసుకోరు.చీరెపైటను ఎదమీద నిండుగా కప్పుకుంటారు.దాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు.

కేరళలో నంబూద్రి బ్రాహ్మణులు ట్రావెంకోర్ రాజుల సహకారంతో స్త్రీలు రవికె ధరించడాన్ని నిషేధించడమే కాదు, వాళ్ల రొమ్ముల మీద పన్నులు వేశారు.అమ్మ నంగేళి ఆ రెండు వక్షోజాలను కోసి పన్ను వసూలు చేయడానికి వచ్చిన వాళ్ల చేతిలో పెట్టి కన్నుమూసింది.ఆ దెబ్బతో నాడార్ జాతి సాయుధ పోరు చేసి ఆ దుర్మార్గానికి చరమగీతం పాడింది.అయినా ఇప్పటికీ కేరళ స్త్రీలలో సంప్రదాయవాదులు పైటను వేసుకోరు.

నేను ముప్పై యేళ్ల కింద చత్తీస్‌గఢ్ అడవులలో పర్యటించినప్పుడు కోయ, గుత్తికోయ స్త్రీలను మొలకు చిన్న గుడ్డతో, పురుషులను కూడా అలాగే చూశాను.ఇప్పుడు మావోయిస్టుల వల్ల వాళ్లు నిండుగా బట్టలు వేసుకుంటున్నారు.

ఆఫ్రికా దేశాలలో బట్టలు వేసుకోవడం తెలియని జాతులు చాలా వున్నాయి.ఆడవాళ్లు పైభాగాన్ని అనాఛాదితంగా వుంచుకొని సామూహికంగా నర్తించే వీడియోలు ఎన్నో చూశాము.ఆదిమ తెగల సంప్రదాయాలు ఆధునిక కాలంలో కూడా కొనసాగుతున్నాయి.

కాబట్టి బహుళ సంస్కృతుల బహుళవస్త్రధారణ సంస్కృతులను గుర్తించే ఒక పరంపర వేల యేళ్లుగా కొనసాగుతుంది.రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక రాష్ట్రంలో ఎన్నికలలో గెలుపు కోసం హిజాబ్ మీదనో నఖాబ్ మీదనో వివాదం రేపి లబ్ధి పొందాలని చూసే పద్ధతి సమాజానికి మేలు చేయదు.దేశ నిర్మాణం మతాల వారి విభజన వల్ల జరగదు.ఆర్ఎస్ఎస్ వాదనలు, బిజెపి వాదనలు దేశాన్ని అనేక ముక్కలుగా చేసి, అరాచకం ప్రబలడానికి దోహదం చేస్తుంది.హిందూ ఇండియా, ముస్లిం ఇండియా, దళిత్ ఇండియా, బిసి ఇండియా, ట్రైబల్ ఇండియా, వుమెన్ ఇండియా, క్రిస్టియన్ ఇండియా అని విడగొట్టాలని ఆ పార్టీ లక్ష్యం లా వుంది.

నాకేమనిపిస్తుంది అంటే, రాజ్యాంగ వ్యతిరేకులకు, సనాతనవాదులకు ఒక ప్రత్యేక భూభాగాన్ని ఒక దేశంగా ఇచ్చేస్తే బిజెపి శాంతించేలా వుంది.నిత్యానంద కైలాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఆర్ఎస్ఎస్ కు ఒక దేశాన్ని ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందేమో ఆలోచించండి.

11 ఫిబ్రవరి 2022

 

పెజావర్ స్వామి ఈ రోజు బతికి ఉన్నట్లైతే...

ఉడుపి ముస్లిం బాలికల తరుఫున గొంతు విప్పి ఉండేవాడు.

 

భార్గవ జి.

న్యూ సోషలిస్ట్ ఇనీషేటివ్ (NSI)

 

హిందువులూ ముస్లింలూ శతాబ్దాలుగా పరస్పర మైత్రితో సహకారంతో కలిసి బతుకుతున్న నగరాలనూ ,ప్రాంతాలనూ జాగ్రత్తగా టార్గెట్ చేసుకుని అక్కడి హిందువుల్లో ముస్లింలపై ద్వేషం నింపే పనిని RSS గత కొన్ని దశాబ్దాలుగా చేస్తూవచ్చింది. మతకలహాలనూ ,హత్యాకాండనూ ఆర్గనైజ్ చేస్తూ సామాజిక సమరసతను ఒక పద్ధతి ప్రకారం నాశనం చేస్తూ తన రాజకీయాలను నిర్మించుకుంటూ వచ్చింది.

దక్షిణాదిలో RSS అలా టార్గెట్ చేసిన ఒక ముఖ్య ప్రాంతం ఉడుపి ,మంగళూరు ప్రాంతం. దీన్నే తుళు నాడు అని కూడా పిలుస్తారు.

ఈ ప్రాంతంలోకి ఇస్లాం మతం అరబ్ వ్యాపారుల ద్వారా 7 వ శతాబ్దంలో అడుగు పెట్టింది.అంటే అరబ్ ద్వీపకల్పం బయట ఇస్లాం పరిచయమైన తొలి ప్రాంతాలలో ఇది ఒకటి.తుళునాడుకు చెందిన ఒక స్థానిక సముద్ర వ్యాపార తెగ ఇస్లాం స్వీకరించింది.బియరీ ముస్లింలు అని వీరికి పేరు.ఈ తెగ ముస్లింలు సమర్థులైన వ్యాపారులు. తుళు మాతృభాషగా  సమాజంలో అన్ని ఇతర మతాలతో గొప్ప స్నేహ సంబంధం ఉన్నవారు. తమ సముదాయం విద్యలో ,ఆరోగ్యంలో, ఆర్థిక స్థితిలో ఉన్నత స్థానం చేరుకోవాలనే పట్టుదల కల ముందు చూపుకల వారు. వీరికీ స్థానిక ఉడుపి లోని మధ్వాచార్య శాఖకు చెందిన పెజావర్ మఠంతో శతాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. కర్నాటకా లో బీజేపి అధికారంలోకి వచ్చాక ఆ సమాజాన్ని మతపరంగా విభజించి శాశ్వత ద్వేషాగ్నిలో ముంచెత్తాలని నిర్ణయించుకుని ముస్లిం వ్యతిరేక దుష్ప్రచారాన్నీ ద్వేషాన్నీ ఉధృతంగా ప్రచారంచేయడం ప్రారంభించారు.

ఈ దుర్మార్గాన్ని సహించలేక పోయిన పెజావర్ మఠ స్వామి హిందూత్వ ఫాసిస్టు మూకల చెంప ఛెళ్ళు మనేట్లుగా ప్రఖ్యాత ఉడుపి కృష్ణ మందిర ప్రాంగణంలో స్థానిక ముస్లిం సముదాయానికి 2017 రంజాన్ మాసంలో " సౌహార్ద ఇఫ్తార్ విందు " ఇచ్చాడు.స్వయంగా అతిథులకు ఆహారం వడ్డించాడు.

అప్పుడు ఈ BJP మూకలు స్వామి హిందువుల మనోభావాలు దెబ్బతీసాడు, మఠం సాంప్రదాయాలను ఉల్లంఘించాడు అని కేకలు వేయడం ప్రారంభించారు.వారి అరుపులను లెక్ఖ చేయని పెజావర్ స్వామి ఒక పది పాయింట్ల జవాబు ఇచ్చి బీజేపీ ఫాసిస్టు మూక ముక్కు బద్దలు కొట్టాడు.ఆ పది పాయింట్లు ఇవే.

1.          ఉడుపి కృష్ణ మందిర భోజన శాల అన్ని మతాల కులాల వారికి తెరిచే ఉంటుంది. శతాబ్దాలుగా ఉన్న ఈ పద్ధతినే నేను పాటిస్తాను. ఇఫ్తార్ విందు అందుకే ఇస్తాను.

2.          ఆకలి గొన్నవాడికి అన్నం పెట్టడం కన్నా మించిన ధార్మికత లేదు. ధర్మశాస్త్రాలన్నీ ఇదే చెబుతున్నాయి. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింకు ఆహారం ఇవ్వడం తప్పు ఎలా అవుతుంది ? నీవు ఒకరిని మనఃస్ఫూర్తిగా స్నేహితుడని భావించాక వారిని నీ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వకుండా ఎలా ఉండగలవు ?

3.          దేశంలోని అన్ని మత సముదాయాలు శాంతియుతంగా కలసిమెలసి బతికినప్పుడే దేశానికి మేలు జరుగుతుంది. అధిక సంఖ్యాకులైన హిందువులపైనే ఈ సమరసతను కాపాడే బాధ్యత ఉంటుంది. ఈ శాంతి వల్ల ఎక్కువ మేలు జరిగేది కూడా  హిందువులకే.

4.          మధ్వాచార్యుడు తన కాలం నాటి ముస్లిం సుల్తాన్లతో స్నేహంగా ఉండేవారు. హిందూ ముస్లిం ఐక్యతను నొక్కి చెప్పేవారు. నేను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాను.

5.          మంత్రాలయ మఠం అనుభవిస్తున్న భూములు ఆనాటి సుల్తాన్లు ఆదరంతో ఇచ్చిన విరాళాలు. సత్యబోధ స్వామీజీ సుల్తాన్ కు సలహాలు ఇచ్చేవారే. రెండు సముదాయాల స్నేహబంధం కొరకు మన పూర్వీకులు నడిచిన బాటలోనే నేను నడుస్తాను.

6.          ముస్లిం సోదరులు గతంలో ఎన్నోసార్లు గంగావతి ,భత్కళ్ ,కాసరగోడులలో వారి ధార్మిక కార్యక్రమాలకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఎంతో గౌరవించారు. వారిని తిరిగి నా ఇంటికి పిలవడం కనీస సంస్కారం. కనీస మర్యాద. ఈ సంస్కారం కన్నా ,మర్యాద కన్నా ఏ మతం గొప్పది కాదు.

7.          ఇఫ్తార్ విందు తరువాత భోజన శాలలో వారు నమాజ్ చదివారు. దాన్ని మీరు ఘోర అపచారంగా అరుస్తున్నారు. వారు నమాజ్ చదివింది గర్భగుడిలో కాదు. ప్రజలందరికీ ప్రవేశమున్న సార్వజనిక ప్రాంగణంలో. నమాజ్ అన్నది ఈశ్వర ప్రార్థన. అది హిందువులకు ,హిందూమతానికీ వ్యతిరేకమైనది కాదు. ఇఫ్తార్ తరువాత ఈశ్వర ప్రార్థన చేయడం వారి సాంప్రదాయం . దాన్ని గౌరవించడం మన నేర్చుకోవలసిన సంస్కారం.

8.          ఈ మఠం జరిపిన గొప్ప కార్యక్రమాలన్నింటి వెనక ముస్లిం సోదరులు ఇచ్చిన భూరి విరాళాలున్నాయి. మఠంలో ఈ రోజు ఉన్న అనేక సదుపాయాలు ,వస్తు సామాగ్రిలో ముస్లింల దాతల ఔదార్యం ఉంది. గతంలో ఈ మఠం పై హిందువుల్లోనే వైరి వర్గాల వారు దాడి చేసినప్పుడు అనేకసార్లు మఠానికి అండగా నిలబడి స్థానిక ముస్లిం సోదరులే రక్షణ కల్పించారు. అందువల్ల ముస్లిం లకు ఈ ఆశ్రమ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.

9.          బీఫ్ తినే ముస్లింలను మందిర ప్రాంగణంలోకి ఎలా ఆహ్వానించానని మీరు అడుగుతున్నారు. బీఫ్ ముస్లింలే కాదు అనేకమంది హిందువులు కూడా తింటారు. ఆహార అలవాట్ల గురించి ప్రేమగా మాట్లాడాలి. అంతే తప్ప హింసాకాండ ద్వారా కాదు.

10.       నేను నా మతాన్ని దీక్షతో పాటిస్తాను. అలాగే ఇతరులు వారి మతాన్ని ఆచరించుకోవడాన్ని గౌరవిస్తాను. నేను హిందువుల కోసమే పని చేస్తాను. కానీ ఇతర మతస్తులందరినీ నా స్నేహితులుగా భావిస్తాను.

ఇలాంటి సమరస భావాలున్న హిందూ సనాతన స్వామిని ఎవరైతే దూషించారో... ఆ ఫాసిస్టు హిందూత్వ శక్తులే... ఈ రోజు ఉడుపి కాలేజీల్లో ముస్లిం ఆడపిల్లలను వేధిస్తున్నారు.

పెజావర్ స్వామి ఈ రోజు బతికి ఉన్నట్లైతే... ఉడుపి ముస్లిం బాలికల తరుఫున గొంతు విప్పి ఉండేవాడు.

ఒక ధార్మిక మతాచార్యుడు ప్రదర్శించిన పరమత సహనం , లౌకికతత్వం , సద్భావంలో కనీసం 1%... బీజేపీ ఫాసిస్టు మూకలను దృఢంగా ఎదిరించడంలో ఒక సనాతన స్వామి చూపిన నైతిక స్థైర్యంలోకనీసం 1% కూడా చూపలేక ... తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికీ... తమ లోపల దాగి ఉన్న మతతత్వ భావాలను దాచుకోవడానికీ నిరంతరం లౌకికవాదులను ,లిబరల్స్ ను ఆడిపోసుకునే.. వెన్నెముకే లేని ,విలువలే లేని సోకాల్డ్ విద్యావంతుల ముఖంపై ఈ దేశ చరిత్ర ఖాండ్రించి ఉమ్మేస్తుంది.

12 ఫిబ్రవరి 2022


No comments:

Post a Comment