The problems of the ruling classes can be solved by the ruling classes themselves.
Does it need the support of Marxists, leftists and revolutionaries?
దానికి మార్క్సిస్టులు, వామపక్షాలు, విప్లవపక్షాల మద్దతు దేనికీ?
కార్మికవర్గానికేకాదు పాలకవర్గానికి కూడ సమస్యలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల
జీతభత్యాల పెంపు సమస్య పాలకవర్గానికి సంబంధించిన శాసన, పరిపాలన అనే రెండు విభాగాల మధ్య
తలెత్తిన వివాదం. ఇది వర్గ పోరుకాదు. అంచేత ఒక ప్రదర్శన, రెండు సభలు, మూడు సమావేశాలతో
ఈ వివాదం సమసిపోతుంది. మరోవైపు, వందల ప్రదర్శనలు
వేల సభలు డజన్ల కొద్ది సమావేశాలు జరిపినా ప్రజల కష్టాలు శ్రామికుల సమస్యలు ఏమాత్రం
పరిష్కారం కావు.
నాదెండ్ల భాస్కరరావు-ఎన్టీరామారావు వివాదం ఒకే పాలకవర్గానికి - కాస్త లోతుగా
మాట్లాడితే ఒకే సామాజికవర్గానికి - చెందిన రెండు ముఠాల మధ్యన తలెత్తిన సమస్య. దానికి
పాలకవర్గాలు ‘ఆగస్టు విప్లవం’ అని పేరు పెట్టుకున్నాయి. విప్లవం పేరు వినగానే వామపక్షాలు దాన్ని పూనకం వచ్చినట్టు అతిగా నెత్తికి
ఎక్కించుకున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏమిటో ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళు 1989
ఎన్నికల్లో ఎన్టీ రామారావును చిత్తుగా ఓడించారు. అవమాన భారంతో ఎన్టీ రామారావు చాలా
రోజులు శాసనసభ సమావేశాలకు కూడ వెళ్ళలేదు.
‘ఆగస్టు విప్లవం’ విజయవంతమైన తరువాత ఎన్టీ రామారావు రాష్ట్రంలో ఆటాపాటా
అన్నింటికీ బంద్ పెట్టారు. ఒక ఏడాది లోపే 1985లో కారంచేడులో ‘జులై నరమేధం’
సాగింది. ఎన్టీ రామారావు ‘ఆగస్టు విప్లవం’ను సమర్ధించినందుకు కొండపల్లి సీతారామయ్యను సాటి విప్లవకారులు
చాలా గట్టిగానే విమర్శించారు. 1985లో పీపుల్స్ వార్ లో చీలికకు ఇదీ ఒక కారణం.
ప్రాంతీయ సెంటిమెంటు అంశాన్ని కాస్సేపు పక్కన పెడితే తెలంగాణ ఉద్యమం కూడ సారాంశంలో
పాలకవర్గాల అంతర్గత పోరే. అప్పటి వరకు ఆంధ్రా ప్రాంతపు పాలకవర్గాల నాయకత్వంలో తెలంగాణ
ప్రాంతీయ పాలకవర్గాలు పనిచేసేవి. తెలంగాణ ప్రాంతీయ పాలకవర్గాల నాయకత్వంలో ఆంధ్రా ప్రాంతపు
పాలక వర్గలు కలిసి పని చేయాలనేది కొత్త ఏర్పాటు. అంతే తప్ప తెలంగాణలో పాలకవర్గ స్వభావం
ఏమీ మారదు. మహా అయితే గత ప్రభుత్వాల్లో రెడ్డి సామాజికవర్గం నాయకత్వంలో వెలమ సామాజికవర్గం
వుండేది. ప్రస్తుత ప్రభుత్వంలో వెలమ సామాజికవర్గం
నాయకత్వంలో రెడ్డి సామాజికవర్గం వుంటోంది. మిగిలిదంతా సేమ్ టు సేమ్.
ఏపీలో టిడిపి, వైసిపి రెండూ ఒకే పాలకవర్గానికి
చెందిన రెండు రాజకీయ సమూహాలు. వాటి మధ్య పార్టీ బేధాలుంటాయిగానీ వర్గ బేధాలు వుండవు
కదా! టిడిపిలో కమ్మ సామాజికవర్గం నాయకత్వంలో మిగిలిన సామాజికవర్గాలు వుంటాయి. వైసిపిలో రెడ్డి సామాజికవర్గం
నాయకత్వంలో మిగిలిన సామాజికవర్గాలు వుంటాయి.
రాజకీయ పార్టీలకు తమదైన ఒక విధానం వుంటుంది. టిడిపిది సంపద పెరుగుదల విధానం. వైసిపిది
సంక్షేమ విధానం. చంద్రబాబు భద్రలోకాన్ని నమ్ముకుని రాజకీయాలు నడిపేవారు. జగన్
అభద్రలోకాన్ని నమ్ముకుని రాజకీయాల్ని నడుపుతున్నారు. మిగిలినదంతా సేమ్ టు సేమ్.
తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ ప్రజలకు దక్కినా దక్కకపోయినా అందరికన్నా ముందుగా
తమకు దక్కుతాయని ఎన్జీవోలకు స్పష్టంగా తెలుసు. తెలంగాణ ప్రాంతీయ పాలకవర్గాల నిధులతోపాటు,
ఎన్జీవోల నిధులే తెలంగాణ ఉద్యమాన్ని స్పాన్సర్ చేశాయి. మరోవైపు, ఆంధ్రా ప్రాంతంలో మొదలైన ‘సమైక్యాంధ్రా” ఉద్యమానికి కూడ అలానే కిరణ్ కుమార్
రెడ్డి ప్రభుత్వం నుండి, ఎన్జీవోల నుండి ప్రోత్సాహం లభించింది. అదొక ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ
ముందుగా లబ్దిపొందింది ప్రభుత్వోద్యోగులే.
తాను అధికారంలోనికి వస్తే రైతుల రుణమాఫీ చేస్తూ తొలి సంతకం చేస్తానన్న
చంద్రబాబు ప్రభుత్వోద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. రైతుల రుణాన్ని ఐదు
కిస్తీలుగా మార్చి, తన పరిపాలనా కాలంలో మూడు కిస్తీలు మాత్రమే చెల్లించారు. ప్రజలు
ఆయన్ను అవమానకరంగా ఓడించారు. చంద్రబాబు
ముద్దు బిడ్డలుగా ఓ వెలుగు వెలిగిపోయిన ప్రభుత్వోద్యోగులు కూడ ఆయన్ను
ఆదుకోలేకపోయారు.
తమ ఉనికినే తుడిచివేసేందుకు ముంచుకు వస్తున్న ముప్పును సరిగ్గా అంచనావేయలేని నక్సలైటు నాయకులు
బేషరతుగా మద్దతు ఇవ్వడంతో తెలంగాణ ఉద్యమానికి అదనపు ఆమోదాంశం లభించింది. ఆ హోరులో మాలాంటి
వాళ్ళు ఇచ్చిన మద్దతు ఒక్కటే కౌంట్ అయ్యిందిగానీ మేము పెట్టిన షరతుల్ని వ్యక్తం చేసిన
అనుమానాల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు.
తెలంగాణ ఉద్యమం సాగుతున్న తీరు మీద మావోయిస్టు నాయకుల్లో కొందరికి కొన్ని అనుమానాలు వుండివుండవచ్చు. అయితే, ఇది రెండు ప్రాంతాలకు చెందిన పెట్టుబడీదారీ వర్గాల
మధ్య ఘర్షణ అని ఎవరూ స్పష్టంగా సూత్రీకరించలేదు.
తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడీదారీవర్గమే లేనట్టు, ఆంధ్రా ప్రాంతంలో మాత్రమే
పెట్టుబడీదారీవర్గం వున్నట్టు వ్యవహరించారు. తీరా తెలంగాణ వచ్చాక కేసిఆర్ ఆంధ్రా- తెలంగాణ
పెట్టుబడీదారులు భాయిభాయి అన్నారు. ప్రపంచ తెలంగాణ మహాసభల్ని కాకుండ ప్రపంచ తెలుగు
మహాసభలు నిర్వహించారు.
ఆంధ్రా ప్రాంతంలోవున్న బేస్ ను నక్సలైట్లే పోగొట్టుకున్నారు. వాళ్ళకు తెలంగాణలో
వున్న బేస్ ను కేసిఆర్ తీసేశారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్జీవో హోమ్ లు వెలిగిపోతూ వుండేవి. వారానికి రెండు మూడు
పెద్ద పెద్ద సభలు జరుగుతూ వుండేవి. సభల తరువాత బిర్యానీ దావతులు సాగేవి. స్టార్ స్పీకర్లలో
ఒకరుగా హరగోపాల్ వుండేవారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎన్జీవో హోమ్ లో మీటింగులకు బంద్ పెట్టారు.
తెలంగాణ ఉద్యమానికి సర్వశక్తులు ఒడ్డిన వరవరరావు అరెస్టును ఖండించడానికి మీటింగు పెడితే
ఎన్జీవో హోమ్ లో అడుగుపెట్టడానికి ముందే హరగోపాల్ ను అరెస్టు చేశారు.
(నాంపల్లి ఎన్జీవో హోం ఆవల గాంధీభవన్ ను ఆనుకొని వున్న టీ క్యాంటిన్ లో కూర్చున్న
వారినీ అరెస్టు చేశారు. అప్పుడు అరెస్టు అయిన వారిలో Raghavachary Maringanti కూడ వున్నారు. ఆరోజు సభలో నేనూ ఒక ఉపన్యాసకుడ్ని. ఆ క్యాంటీన్
కు కూడ వెళ్ళాను. రానున్న ప్రమాదాన్ని కనిపెట్టి తృటిలో అరెస్టును తప్పించుకున్నాను.)
ఆ తరువాత వరవరరావును విడుదల చేయాలని కోరే గొంతుకలే తెలంగాణలో మూగబోయాయి. వాళ్ళే
ఇప్పుడు ప్రభుత్వోద్యోగుల ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు.
తెలంగాణ వుద్యమానికి పొలిటికల్ జేయేసీ కన్వీనర్ గా ఒక వెలుగు వెలిగిన ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఇప్పుడు ఎక్కడా? ఆయన ప్రారంభించిన
తెలంగాణ జనసమితి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కూడ కొట్టలేదు. నల్గొండ, వరంగల్,
ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేస్తే మూడవ
స్థానం మాత్రమే దక్కింది.
ఒక దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసిఆర్ ప్రకటించగానే తెలంగాణలో ‘మోస్ట్
ఎలిజిబుల్ దళిత్‘ తానే అని గద్దర్ ఉబ్బితబ్బిబ్బయిపోయారు. ‘ఇన్ కమింగ్ సియం’గా కొన్నాళ్ళు
ఓ వెలుగు వెలిగిపోయారు. కేసిఆర్
ఆయన్ను తీర్ధయాత్రలకు పంపించేశారు.
హరగోపాల్, కోదండరామ్, గద్దర్ లతో అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేశాను. వాళ్ళ మీద నాకు ఇప్పటికీ అభిమానమే వుంది. మన కళ్ళముందు
కనిపిస్తున్న అనుభవాల నుండి ఏమైనా నేర్చుకోవాలా? వద్దా?. దీర్ఘకాలిక ప్రజా సమస్యల్ని పరిష్కరించడంకన్నా పాలకవర్గాల
తాత్కాలిక తగువుల్ని పరిష్కరించడం మీదనే వామపక్షాలు ఎక్కువ ఆసక్తిని కనపరుస్తున్నాయనే
అనుమానం నాకు తరచూ కలుగుతోంది.
మార్క్సిస్టులు, వామపక్షాలు, విప్లవపక్షాలు పరిష్కరించాల్సింది ప్రజల సమస్యల్ని.
ఆ రంగంలో వీరు విజయాలను చవిచూసి చాలాకాలం అయింది. ఏదో ఒక విజయం కోసం తపిస్తున్న వీరు పాలకవర్గాల సమస్యల్ని
పరిష్కరించి ఒక బూటకపు విజయానందాన్ని ఆస్వాదిస్తున్నారు. దీనికోసం వాళ్ళు ప్రభుత్వస్వామ్యాన్ని
ప్రజాస్వామ్యంగా చూపిస్తున్నారు. వీలున్న చోట ప్రభుత్వోద్యోగుల్ని కార్మికులుగా చిత్రిస్తున్నారు.
ఒక మహానేత అయితే “ప్రభుత్వం పన్నులు వసూలు చేసేది ప్రభుత్వోద్యోగుల జీతాలు చెల్లించడానికే”
అని సెలవిచ్చారు. ఇంకో నేత “ప్రభుత్వోద్యోగులు ప్రజలు” అని నిర్ధారించారు. మరో కార్మిక
సంఘాల నేత “జీతాలు తీసుకునేవారంతా కార్మికులే” అని ఒక కొత్త కార్మికవర్గ సిధ్ధాంతాన్ని
ప్రవేశపెట్టారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ ఆదానీ కూడ తమ సంస్థల
నుండి జీతాలే తీసుకుంటారు. మన మహా వీరులు రేపు వారి జీతాల పెంపు కోసం కూడ వీరోచిత పోరాటం
చేస్తారు. ప్రభుత్వాలు చేయదలిచిన పనినే వామపక్షాలు
చేసిపెడితే శాంతి భద్రతలకు అంతకన్నా కావలసింది ఏమిటీ?
కార్మిక నాయకుల్లో పాలకవర్గాల సమస్యల్ని పరిష్కరించే ఆసక్తీ నైపుణ్యం పెరిగేకొద్దీ
పాలితుల సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యం ఆసక్తి అంతరించిపోతుంది. వాళ్ళు అప్పుడప్పుడు
పాలితుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నాలు కూడ చేస్తుంటారు. కానీ, నైపుణ్యం, చిత్తశుధ్ధి,
ఆసక్తి కొరవడి ప్రకటిత ఫలితాలను రాబట్టలేరు.
ఒక్క ప్రదర్శనతో ప్రభుత్వోద్యోగుల సమస్యను పరిష్కరించేసినట్టు వాళ్ళు వంద ప్రదర్శనలు చేసినా నిరుద్యోగులకు ఉపాధిని కల్పించలేరు.
పాలకవర్గాల సమస్యల్ని వామపక్షాలు ఎక్కువగా నెత్తికి ఎక్కించుకోవడం మొదలెట్టాక
సహజంగానే ప్రజలు వారికి దూరం అయిపోతారు. పార్టీ
ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తమకు మేలు అనిపించే పధ్ధతుల్ని ప్రజలు అనుసరిస్తున్నారు.
సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీలను గెలిపిస్తున్నారు. సంక్షేమాన్ని అటక ఎక్కించిన
పార్టీలను ఓడిస్తున్నారు. అధికారంలో వున్న రాజకీయ పార్టీల చేత ప్రజలకు అనుకూలంగా పని
చేయించే పరికరాలు పార్టీ ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో లేవు. ప్రజలకున్న
అవకాశం ఒక్కటే తమకు నచ్చని పార్టిని ఎన్నికల్లో ఓడించడం. వాళ్ళు ఆ పనే చేస్తున్నారు.
వివిధ పార్టీల మీద ప్రజలకున్న అభిప్రాయాన్ని
కొలవడానికి ఇప్పట్లో మనకున్న భారమితి ఎన్నికల ఫలితాలు ఒక్కటే.
ఉద్యోగులు సహజంగానే యజమాని కులాల మనస్తత్వంతో
వుంటారు. పేదల మీద, నిరుద్యోగుల మీద వారికి చాలా తక్కువ చూపు వుంటుంది. ఉద్యోగస్వామ్యంలో
చాతుర్వర్ణం వుంటుంది. క్లాస్ ఒన్, టూ, త్రీ, ఫోర్ వుంటాయి. ఇంతటి విభజన జరగడానికి
ముందే 1942లో అంబేడ్కర్ ఉద్యోగస్వామ్యాన్ని కొత్త కులవ్యవస్థ అన్నాడు. అణిచివేతను,
ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఉద్యోగస్వామ్యం రూపంలో యజమాని కులాలకు కొత్త వేదిక దొరికిందన్నాడు.
నిస్సహాయులు నిరుపేదల కోసం చేపట్టిన నవరత్నాలు సంక్షేమ పథకాలని ఉద్యోగ నేతలు
పదేపదే అపహాస్యం చేయడాన్ని మనం ఇటీవల ప్రతిరోజూ చూశాం. నిస్సహాయులు నిరుపేదలు, నిరుద్యోగులు, అస్థిర కార్మికుల
మీద ఇంతటీ ద్వేషాన్ని వెళ్ళ గక్కుతున ప్రభుత్వోద్యోగులు విధి నిర్వహణలో నిస్సహాయులతో
ఎంతటి నిర్లక్ ష్యాన్ని ప్రదర్శిస్తారో ఊహించడం కష్టం ఏమీ కాదు.
ప్రభుత్వోద్యోగులు తమ జీతభత్యాలను పెంచమని అడుగుతున్నప్పుడు కార్పొరేట్లకు ప్రభుత్వాలు
ఇచ్చే పన్నురాయితీలను, ప్రోత్సాహకాలనూ ప్రస్తావించడం గమనార్హం. కార్పొరేట్లను స్వంతబిడ్డల్లా
చూసుకున్నట్టే తమనూ చూసుకోవాలని ఉద్యోగులు
చాలా స్పష్టంగానే అడుగుతున్నారు. నిజానికి
ఏ ప్రభుత్వం అయినా కార్పొరేట్లకు మేళ్ళు చేయాలనుకున్నప్పుడు ఆ పనిని ఉద్యోగుల చేతుల
మీదుగానే చేయిస్తుంది. కార్పొరేట్లకు ప్రభుత్వం
తలపెట్టే మేళ్ళకు చట్టబధ్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసేది ఉద్యోగులే. అలా చేస్తే,
ఆ వరసలో తమ జీతాలు కూడ పెరుగుతాయనే స్వంత లాభం దృష్టి ఉద్యోగులకు ఉంటుంది.
ఉద్యోగుల జీతాలు పెరగ్గానే వాటిని చూపి శాసన సభ్యులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు
తమ జీతభత్యాలను పెంచుకుంటారు. మరలా శాసన సభ్యులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులకు పెరిగిన
జీతభత్యాలను చూపి ఉద్యోగులు కూడ తమ జీతభత్యాలను పెంచుకుంటారు. ఇదో వరస. ఇదో అంతులేని
కథ. లూపింగ్.
ఈ సందర్భంలో కార్ల్ మార్ క్స్ చెప్పిన రెండు మాటల్ని గుర్తుచేయడం అవసరం. ‘బ్యూరాక్రసీ
అనేది పౌరసమాజంలోనికి చొచ్చుకుని వచ్చిన రాజ్యం” అన్నాడాయన. కార్పొరేట్లు, బ్యూరాక్రసీ
ఇద్దరూ పైకి ప్రత్యర్ధులుగా కనిపిస్తూ లోపల
ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ బలపడతారు అన్నాడు. ఆయన అంతటితో ఆగలేదు ఇంకా చాలా చెప్పాడు. కార్పొరేట్లకూ, కార్పొరేట్ల
ప్రభుత్వానికీ సేవలు చేసీచేసీ ప్రభుత్వోద్యోగులు కార్పొరేట్ స్వభావాన్ని సంతరించుకుని
క్రమంగా శ్రామిక వ్యతిరేక స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. అలాంటి యంత్రాంగాన్ని సమూలంగా
నాశనం చేయకుండ కొత్త సమాజం ఎక్కువ కాలం నిలబడదు అని పారీస్ కమ్యూన్ వైఫల్యం మీద రాసిన
విశ్లేషణలో కార్ల్ మార్ క్స్ హెచ్చరించాడు.
కమ్యూనిస్టు భావాలు కలిగిన వాళ్ళు ఏ రంగంలో అయినా వుండవచ్చు. వివిధ ప్రభుత్వ
శాఖల్లో పనిచేసేవాళ్ళేగాక ప్రజావ్యతిరేక విభాగం అయిన పోలీసుల్లోనూ కమ్యూనిస్టు భావాలు
కలిగిన వాళ్ళు వుంటారు. వాళ్ళకు బహుళ అస్తిత్వాలు వుంటాయి. ప్రభుత్వ అస్తిత్వం కమ్యూనిస్టు
అస్తిత్వం. సమస్య వచ్చినపుడు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా స్పందిస్తున్నారా? లేక కమ్యూనిస్టులుగా స్పందిస్తున్నారా? అనేది ముఖ్యం. వాళ్ళు ఏ అస్తిత్వంతో
మాట్లాడుతున్నారన్నదే గీటురాయి.
చాతుర్వర్ణ వ్యవస్థకు బయట ఎస్సీలు, ఎస్టీలు వున్నట్టు ఉద్యోగస్వామ్యం బయట కాంట్రాక్టు
వర్కర్లు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్, వాలంటీర్లు వగయిరాలు వుంటారు. పెట్టుబడీదారులకు వ్యతిరేకంగా
శ్రామిక పోరాటాలు, యజమాని కులాలకు వ్యతిరేకంగా శ్రామిక కుల పోరాటాలు మొదలయినట్టు, సమీప
భవిష్యత్తులో ప్రభుత్వోద్యోగులకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు మొదలవుతాయి.
9-2-2022
No comments:
Post a Comment