Friday, 18 February 2022

ఇప్పుడు ముస్లిమేతరులకు కూడ హిజబ్ ఒక అవసరమైన వస్తువుగా మారింది.

 ఇప్పుడు ముస్లిమేతరులకు కూడ హిజబ్

ఒక అవసరమైన వస్తువుగా మారింది.

డానీ

పార్లమెంటరీ ఎన్నికలంటే ఏదో ఒక వంకతో  ఓటర్లను సమీకరించాలి. తమ వైఫల్యాలను గుర్తు చేయకుండా, తమ తప్పుల్ని ఎత్తి చూపకుండ, తమ అబధ్ధాలను ఎద్దేవ చేయకుండ ప్రజలు మళ్ళీమళ్ళీ తమనే ఎన్నుకోవాలంటే ఎన్నికలకు ముందు దేశం బయటో లోపలో  ఒక యుధ్ధం జరగాల్సిందేనని ఏలినవారు నమ్ముతున్నారు. జన సమీకరణకు మతోన్మాదాన్ని మించిన ఆయుధం లేదని బెనితో ముస్సోలినీ, ఆడాల్ఫ్ హిట్లర్ ప్రపంచానికి చాటి చెప్పారు.దానితో కార్పొరేట్లకు మరిన్ని మేళ్ళు చేసే అవకాశం పాలకులకు వస్తుంది.ఇతర సమూహాల మీద సాంస్కృతిక దౌర్జన్యాలను సాగించే అవకాశం అల్లరి మూకలకు వస్తుంది.

తలకు హెల్మెట్ పెట్టుకోకపోయినా, నోటికి ముక్కుకు గుడ్డ కట్టుకోకపోయినా పోలీసులు కేసులు రాస్తారు.తలకు గుడ్డకట్టుకుంటే సివిల్ పోలీసులుగా చెలామణి అవుతున్న అల్లరి మూకలు దాడులు చేస్తారు.మనం ఏం తినాలో, ఏం తొడగాలో, ఎలా పడుకోవాలో అన్నీ వాళ్ళే నిర్ణయిస్తారు.బట్టలే తొడక్కపోతే అనాగరీకం; సగం బట్టలు వేసుకుంటే కవ్వింపు; బట్టలు తీసేస్తే అరాచకం, నిండా బట్టలు కప్పుకుంటే ఛాందసం.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు కర్ణాటకలో హిజబ్ వివాదం మొదలయింది.హిజబ్ అంటే తలగుడ్డ. నిజానికి అనేక ఉత్తరాది, పశ్చిమాది రాష్ట్రాల్లో స్త్రీలు తలగుడ్డ వాడుతారు.దక్షణాది రాష్ట్రాల్లో కూడ మహిళా కూలీలు తలగుడ్డలు వాడుతారు.దీనికి అనేక ప్రాంతాల్లో అనేక పేర్లున్నాయి.ముస్లింలు హిజబ్ అంటారు.

ఇంగ్లీషులో మనం స్కార్ప్ అని పిలుస్తున్నదే ఉర్దూలో హిజబ్.  బ్లాక్ అండ్ వైట్  తెలుగు సినిమాల కాలం నుండే స్కార్ప్ వుంది. సావిత్రి, బి సరోజా, కృష్ణకుమారి వంటి అలనాటి హిరోయిన్లు స్టైలుగా స్కార్ప్ కట్టుకునేవారు.

అనేక సాంప్రదాయాలు ఆయా కాలమాన పరిస్థితుల్లో పుడతాయి. అరేబియా ఏడారి ప్రాంతంలొ ఒక అవసరంగా  హిజబ్ సాంప్రదాయం పుట్టి వుంటుంది. అదొక ఉపయోగిత వస్తువు.ఇప్పుడు ఎడారియేతర ప్రాంతాల్లోనూ ముస్లిమేతరులకు కూడ స్కార్ప్ ఒక అవసరమైన వస్తువుగా మారింది.వర్కింగ్ వుమెన్ అందరూ స్కార్ప్ వాడుతున్నారు. ఇటీవల హౌస్ వైవ్స్ కూడ బయటికి వచ్చినపుడు స్కార్ప్ కట్టుకుంటున్నారు.గాలికి తల చెదిరిపోతుందనే గాకుండ ఆకతాయిల నుండి రక్షించుకోవడానికి కూడ మహిళలు స్కార్ప్ వాడుతున్నారు.కొన్నాళ్ళ క్రితం అమ్మాయిల మీద వరుస యాసిడ్ దాడుల సంఘటనలు జరగడంతో స్కార్ప్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.  టెక్స్ టైల్  రంగంలో చీరల ఫాల్స్ తో పోటీగా ఇప్పుడు స్కార్ప్స్ అమ్ముడవుతున్నాయి.

కరోనా కాలంలో మాస్క్ అనివార్యమైన ధారణ వస్త్రం అయిపోయినట్టు అభద్రత కాలంలో మహిళలకు స్కార్ప్ కూడ అనివార్యమైన ధారణ వస్త్రంగా మారిపోయింది.

18 ఫిబ్రవరి 2022

No comments:

Post a Comment