నిమ్మకాయల శ్రీరంగనాధ్ తో
ఉద్యమాల్లోనూ, వృత్తిలోనూ కలిసి పనిచేశాను.
నిమ్మకాయల శ్రీరంగనాధ్ నాకు నాలుగుదశాబ్దాలకు పైగా తెలుసు. మేమిద్దరం ఉద్యమాల్లోనూ, వృత్తిలోనూ కలిసి పనిచేశాం. 1979లో విజయవాడ మధూ కళ్యాణ మండపం ఎదురుగావున్న బాడవపేట వీధిలో చర్చి పక్కన ఇంట్లో నేనూ, పరుచూరి జమునగారు అద్దెకు వుండేవాళ్ళం. నేను కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని పీపుల్స్ వార్ లో రాడికల్ యూత్ లీగ్ కు జిల్లా అధ్యక్షునిగా వుండేవాడ్ని. జమునగారు తరిమిల నాగిరెడ్డి నాయకత్వంలోని యూసిసిఆర్ ఎంఎల్ లో పనిచేస్తుండేవారు.
మా ఇద్దరి రాజకీయాల్లో విబేధాలున్నప్పటికీ వ్యక్తులుగా సన్నిహితంగా వుండేవాళ్ళం. నిమ్మకాయల శ్రీరంగనాధ్ గారిది తూర్పుగోదావరి జిల్లా. వారూ, ఉప్పునూతల సాంబశివరావు (ఉసా) తరచూ జమునగారి కోసం వస్తుండేవారు. రంగనాధ్ గారికి రాజకీయార్ధికశాస్త్రం, నీటిపారుదలా వ్యవహారాల మీద మంచి పట్టు వుండేది. అప్పట్లో వారంతా తరిమెల నాగిరెడ్డిగారి ‘ఇండియా మార్టగేజ్డ్’ పుస్తకాన్ని ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో అనువదించే పనిలో వుండేవారు.
1985లో ఉదయం పత్రిక మొదలయ్యాక రంగనాధ్ గారు ప్రధాన స్రవంతి పాత్రికేయునిగా మారారు. తూర్పు గోదావరిజిల్లా ఆయన కార్యక్షేత్రం. నేను కూడ ఉదయం పత్రికతోనే ప్రధాన స్రవంతి మీడియాలో వ్యాసాలు రాయడం మొదలెట్టాను. 1988లో ఆంధ్రభూమి-డెక్కన్ క్రానికల్ తో వర్కింగ్ జర్నలిస్టుగా మారాను.
ఇద్దరి వృత్తి వ్యావృత్తి ఒక్కటే కనుక అనేక సభలు సమావేశాల్లో కలుస్తూ వుండేవాళ్ళం. నేను 1996లో ఏపి టైమ్స్ ఇంగ్లీష్ డైలీలో చేరినపుడు శ్రీరంగనాధ్ గారు అక్కడ స్టేట్ స్పెషల్ కరస్పాండెంట్ గా వుండేవారు. నేను అప్పుడు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల స్పెషల్ కరస్పాండెంట్ గా వుండేవాడిని. 1997 మధ్యలో వారు స్టేట్ బ్యూరో చీఫ్ అయ్యారు. అలా నేరుగా వారి కింద కొన్నాళ్ళు పనిచేశాను.
2002లో మళ్ళీ మేము (కొత్త) ఆంధ్రప్రభలో కలిశాం. రంగనాధ్ గారు న్యూస్ వింగ్ ఎడిటర్ గా వుండేవారు. నేను విజయవాడ-ఖమ్మంజిల్లాల బ్యూరో చీఫ్ గా వుండేవాడిని.
శ్రీరంగనాధ్
గారు ప్రపంచ బ్యాంకు ఆర్ధిక విధానాలకు వ్యతిరేకి. ప్రజాపక్షపాతి. ఆ రెండు
విధానాలనూ వారు చివరివరకు కొనసాగించారు.
వారి స్మృతికి నివాళి.
8-2-2022
No comments:
Post a Comment