Tuesday 8 February 2022

జాక్ లండన్ రచనా శైలి, జీవనశైలి రెండూ నాకు చాలా ఇష్టం.

జాక్ లండన్ రచనా శైలి, జీవనశైలి రెండూ నాకు చాలా ఇష్టం. 

Feb 2, 2022

 

జాక్ లండన్  నవలల్లో ‘ఉక్కుపాదం’ ను కమ్యూనిస్టులు ఎక్కువగా అభిమానిస్తారు. నాకు ‘ఉక్కుపాదం’ ఇష్టమేగానీ, ‘ద కాల్ ఆఫ్ ద వైల్డ్’ ఇంకా ఇష్టం.  ‘ఉక్కుపాదం’లో ప్రొటోగోనిస్టు చాలాసార్లు నేరుగా  మార్క్సిజం మాట్లాడుతాడు. అది ప్రతిబింబన శైలి. , ‘ద కాల్ ఆఫ్ ద వైల్డ్’ లో మార్క్సిజం ప్రతిఫలన శైలిలో వుంటుంది.

 

‘ద కాల్ ఆఫ్ ద వైల్డ్’ లోని మూడు సన్నివేశాలు నన్ను తరచూ హాంట్ చేస్తుంటాయి. నవల ఆరంభ ఘట్టాల్లో బందీ అయిపోయి, బలవంతంగా బానిస జీవిత్వాన్ని అంగీకరించడం మొదలెట్టిన బక్ (కుక్క) “ఇది దుడ్డుకర్ర రాజ్యం; ఇక్కడ దండనే చట్టం” అనడం గొప్ప జ్ఞానబోధ. నవల మధ్యలో   కాలువిరిగిన కుక్క ఈడ్చుకుంటూ వచ్చి స్లెడ్జి బండి కళ్ళెంలో తన స్థానంలో నిలబడే సన్నివేశం గుండెల్ని పిండేస్తుంది. నవల చివర్లో తనకు అన్యాయం చేసిన వాడిని చంపేసి  “ఈభూమి మీద వేటాడి చంపాల్సిన జీవుల్లో మొదటిది మనిషి” అన్నప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది.

 

1903లో రాసిన ‘కాల్ ఆఫ్ ద వైల్డ్’ అనేక భాషల్లో అనువాదమైంది. తెలుగులో కొడవటిగంటి కుటుంబరావుగారు ‘ప్రకృతి పిలుపు’ పేరుతో అనువదించారు. ఆ తరువాత కూడ  ఒకళ్ళిద్దరు అనువాదం చేసినట్టున్నారు. నేను ముందు కొకు అనువాదం చదివాను. ఆ తరువాత ఒరిజినల్ ఇంగ్లీషు వెర్షన్ చదివాను.

 

‘కాల్ ఆఫ్ ద వైల్డ్’ అనేక సార్లు సినిమాలుగా వచ్చింది. వీటిల్లో పీచర్ ఫిల్ములున్నాయి, యానిమేటెడ్ ఫిల్ములూ వున్నాయి. 1923లో మూకీ సినిమాగా వచ్చింది. 1935లో వచ్చిన సినిమాలో హాలివుడ్ మహా నటుడు క్లార్క్ గేబుల్ జాన్ థోర్నటన్ పాత్రను పోషించాడు. 1972లో వచ్చిన సినిమాలో బెన్ హర్ ఫేమ్ ఛార్లటన్  హేస్టన్ నటించాడు. 1997లోనూ ఈ నవలను సినిమాగా తీశారు.  2020లో వచ్చిన కొత్త వెర్షన్ లో జాన్ థోర్నటన్ గా హారిసన్ ఫోర్డ్, కుక్క బక్ గా టెర్రీ నోటరి మోషన్ క్యాప్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 

 

అలాస్కాలో బంగారం కోసం సాగిన అన్వేషణలో కష్టజీవుల దుర్భర జీవితాలను జాక్ లండన్ చిత్రించాడు.  ఈ సినిమాలో బక్ ఎదుర్కొన్న కొన్ని సన్నివేశాలకు హాస్యాన్ని జోడించే పనిచేశారు. ఆ భాగాన్ని వదిలేస్తే  ఇది తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం.  

 

జాక్ లండన్ నవలల్లో ప్రకృతి కూడా ఒక ముఖ్య పాత్రకదా. నేను ఇప్పటికే రెండుమూడుసార్లు చూశాను. రాత్రి మళ్ళీ చూశాను.

 

డెస్నీ హాట్ స్టార్ లో వుంది. మీరూ చూడండి.

No comments:

Post a Comment