హిజబ్ వివాదం కర్ణాటక నుండి ఆంధ్రాకు కూడ వ్యాపించిందా?
లేదు. లేదు. లేదు.
“హిజబ్ వివాదం కర్ణాటక నుండి ఆంధ్రాకు కూడ వ్యాపించింది కదా?” అని ఈ రోజు నన్ను ఒక పెద్ద టీవీ ప్రతినిధి అడిగారు. ఆ సంఘటన ఒక “అపార్ధము, సమాచార లోపము” (misunderstanding and communication gap) అని నేను కొట్టి పడేశాను. ఆ విలేకరి నన్ను ఒక పట్టాన వదలలేదు. మూడు నాలుగు రకాలుగా మార్చి అదే ప్రశ్నను పదేపదే అడిగాడు. “ప్రస్తుతం దేశంలోని మత అల్ప సంఖ్యాక వర్గాల మధ్య మంచి అవగాహన వుంది. మా మధ్య ఏదైనా సమస్య తలెత్తితే మేమే పరిష్కరించుకోగలం. మీడియా ముందుకో, పోలీసుల దగ్గరికో వెళ్ళాళ్సిన పని లేదు” అన్నాను.
నిజానికి మత అధికసంఖ్యాకులతో ఏదైన సమస్య వచ్చినా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే నేటి ముస్లిం సమాజపు అవగాహన. మరీ వివాదం ముదిరితే దాన్ని న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని, న్యాయస్థానాల తీర్పుల్ని గౌరవించాలని ముస్లిం పెద్దలు భావిస్తున్నారు.
ముస్లింలు ఇబ్బంది పడుతున్నది హిందూ సమాజంతో కానేకాదు. హిందూ ముస్లిం సమూహాల మధ్య అనాదిగా మతసామరస్యం వుంది. అది చిరకాలం వర్ధిల్లుతుంది. ఎన్నికల్లో లబ్ది పొంది అధికారాన్ని కొనసాగించడానికి హిందూ సమాజంలో మతతత్త్వాన్ని రెచ్చగొడుతూ రెండు మత సమూహాల మధ్య చీలికల్ని సృష్టిస్తున్న రాజకీయ పార్టీలతో మాత్రమే ముస్లింలకు ఇబ్బంది వుంది. రూపంలో ఇది సామాజిక సమస్యగా కనిపిస్తున్నదిగానీ సారాంశంలో ఇది రాజకీయ సమస్య. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజకీయార్ధిక సమస్య. రాజకీయార్ధిక సమస్యలకు రాజకీయార్ధిక పరిష్కారాలని కనుగొనే ప్రయత్నంలో ప్రస్తుతం ముస్లిం సమాజం వుంది.
విజయవాడ లయోలా కాలేజీలో ఫిబ్రవరి 17న ఒక చిన్న సంఘటన జరిగింది. కొన్ని రాజకీయ పార్టిలు దీన్ని పెద్దది చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టికి తమవంటూ స్వంత మీడియా సంస్థలున్న కాలం ఇది. దీన్ని సాకుగా తీసుకుని ముస్లిం, క్రైస్తవ సమూహాల మధ్య తగవు పెట్టడానికి తద్వార వ్యక్తిగత లబ్ది పొందడానికి అటూ ఇటూ కొందరు రంగంలో దిగినట్టు సమాచారం. ప్రైవేటు పంచాయితీలకు పుట్టినిల్లు విజయవాడ. వాటికి విరుగుడు కూడ విజయవాడ వాసులకు తెలుసు. ఇలాంటి గుంటకాడ నక్కలతో జాగ్రత్తగా వుండాలని ముస్లిం సమాజాన్నీ, క్రైస్తవ సమాజాన్ని కూడ వినయంగా కోరుతున్నాను.
డానీ (అహ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ)
కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక
Muslim Thinkers Forum (MTF)
Mobile : 90107 57776
18 ఫిబ్రవరి 2022
No comments:
Post a Comment