Wednesday, 23 February 2022

the link between Communists and world Bank?

 కమ్యూనిష్టులు ప్రపంచ బ్యాంకు మధ్య లింకేమిటీ? 

// the link between Communists and world Bank?

 

మనదేశంలో ఒకప్పుడు పాలక పార్టీలకు గట్టి ప్రత్యామ్నాయంగా కనిపించిన కమ్యూనిష్టు పార్టీల  ప్రాభవం ఇప్పుడు మసకబారిపోయింది. తెలంగాణలో సాయుధపోరాటాన్ని నడిపామని ఘనంగా చెప్పుకునే కమ్యూనిస్టులకు ఈరోజు ఆ రాష్ట్ర శాసనసభలో ప్రవేశంలేదు. 1955 ఎన్నికల్లో అధికారాన్ని చేపడుతున్నంతగా భయపెట్టిన కమ్యూనిస్టులకు కొత్త ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఇప్పటి వరకు ఒక్క సీటు కూడ లభించలేదు. దాదాపు మూడు దశాబ్దాలు ఏలిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఇప్పుడు ఒక్క శాసన సభ్యుడు కూడ లేడు. కొత్త తరం చాలా ఉత్సాహంగా రాజకీయాల్లోనికి వస్తున్నదిగానీ కమ్యూనిస్టు పార్టీలలోనికి మాత్రం  చేరడంలేదు.

 

  భారత దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గిపోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న మనకు తరచూ ఎదురవుతుంటుంది.

 

వర్తమాన భారతదేశంలో  కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటివి; అంతర్గత కారణాలు రెండోవి బాహ్య కారణాలు.

 

దేశంలో వర్గ సమాజాన్ని సమూలంగా నిర్మూలించాలనే గొప్ప ఆశయంతో భారత కమ్యూనిస్టు పార్టి ఆవిర్భవించింది.  దీని వ్యవస్థాపకులు గొప్ప విద్యావంతులు, గొప్ప అంకిత భావం కలవారు. 1948-52 మధ్య కాలంలో  ఉమ్మడి కమ్యూనిస్టుపార్టి సాయుధ పోరాట పంథాను కూడ కొనసాగించింది.

 

భారత కమ్యూనిస్టు పార్టి నాయకుల్లో ప్రధాన లోపం సృజనాత్మకత. మార్క్సిస్టు మూల సూత్రాలని లెనిన్ రష్యాకు, మావో చైనాకు అన్వయించడంలో  ప్రదర్శించిన సృజనాత్మకతను  భారత కమ్యూనిస్టు నేతలు అందుకోలేక పోయారు. ఈ లోపంతో,  కొన్నాళ్ళు రష్యా మార్గంలోనూ, కొన్నాళ్ళు చైనా మార్గంలోనూ నడిచారు. రష్యాలో లెనిన్ జాతుల సమస్యను గుర్తించడంలో చూపిన చొరవను కమ్యూనిస్టు నాయకత్వం భారత దేశంలో కులాలు, మతాల విషయంలో చూపించలేకపోయింది. మరోవైపు దేశరాజకీయాల్లో మతాల్ని పట్టించుకుని సావర్కారిస్టులు, కులాన్ని పట్టించుకుని అంబేడ్కరిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారు.

 

కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గడానికి ప్రపంచ బ్యాంకు గుణాత్మకమైన పాత్రను పోషించింది.  దేశంలో నూతన ఆర్ధిక విధానం ప్రవేశించినపుడు నిజానికి కమ్యూనిస్టులకు చేతినిండా పని దొరకాలి. అలా జరగలేదు. అదే సమయంలో రష్యా విభజన, చైనా పతనంతో భారత కమ్యూనిస్టు పార్టీలు కుంగిపోయాయి. భారత దేశాన్ని విప్లవ కేంద్రంగా భావించక రష్యానో, చైనానో విప్లవకేంద్రాలుగా భావించిన ఘోర తప్పిదానికి ఫలితం ఇది.

 

సమిష్టి ఆదర్శాలను తొలగించి వ్యక్తి ప్రయోజనాలను ప్రోత్సహించడానికి ప్రపంచ బ్యాంకు అనేక సృజనాత్మక పథకాలను రూపొందించింది. ఈ పథకాలకు రెండు లక్ష్యాలు వుంటాయి. మొదటిది; పెట్టుబడీదారుల సంపదను అపారంగా పెంచడం. రెండోది; సామాన్య ప్రజల్ని కమ్యూనిజానికి దూరం చేయడం. ఈ పథకాలన్నీ అనుకున్న ఫలితాలను గొప్పగా సాధించాయి. వాటిని తట్టుకునే మార్గాలు కమ్యూనిస్టు నాయకులకు తోచలేదు. కమ్యూనిస్టుల తప్పిదాలు అంతటితో ఆగలేదు. 1970వ  దశకంలో చారు మజుందారీయుల  ధాటిని తట్టుకోవడానికి  కాంగ్రెస్ కు దగ్గరయిన చారిత్రక తప్పిదం కమ్యూనిస్టుల నెత్తిన వుంది. 1990వ దశకంలో కమ్యూనిస్టులు అంతకు మించిన చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. ప్రపంచ బ్యాంకు పథకాలకు తానే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఘనంగా చెప్పుకునే చంద్రబాబుతో జతకట్టారు. ఎవర్ని వ్యతిరేకించాలో వారితోనే జతకలిస్తే ప్రజలు గమనిస్తారు.

 

2004లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినపుడు వామపక్షానికి వాలిన మధ్యేవాదులతో (లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్) కేంద్రంలో యూపిఏ-1 ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం నుండి వామపక్షాలు తప్పుకోవడం ఇంకో చారిత్రక తప్పిదం. మధ్యేవాదులు కుడిపక్షానికి వాలడంతో (రైట్ ఆఫ్ ద సెంటర్)  యూపిఏ-2 ప్రభుత్వం ఏర్పడింది. దానికి లాజికల్ కొనసాగింపే కుడిపక్షాలు నేరుగా ప్రభుత్వాలను ఏర్పరచడం. 

 

మరోవైపు, తుపాకిని భుజం మీద నుండి దించము అని చెప్పే మావోయిస్టులు సహితం కుల పీడితులకు, మత పీడితులకు ఒక విశ్వాసాన్ని కల్పించలేకపోయారు.

 

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచాలి, సినిమా టిక్కెట్ల ధరలు పెంచాలని ఉద్యమాలు చేసేవాళ్ళను జనం నమ్మరు. ఎన్నికల్లో ఆ పార్టీలకు పడుతున్న ఓట్లే దీనికి గీటురాయి.

 

మతోన్మాదుల్ని నిజాయితీగా ఎదుర్కోగలిగిన శక్తి సామర్ధ్యాలు దేశంలో కమ్యూనిస్టులకే వుందని జనం ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నారు. కమ్యూనిస్టు పార్టీల  యంత్రాంగం ఆ దిశగా కృషిచేస్తే  వాటికి మళ్ళీ ఒక మహర్దశ రావచ్చు.

 

27 ఫిబ్రవరి 2020

No comments:

Post a Comment