Tuesday, 11 July 2023

BJP is an ungerminated seed in AP

 

BJP is an ungerminated seed in AP

ఏపిలో బిజెపి మొలకెత్తని విత్తనం

డానీ

(సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు)

 

బిజెపి అంటే భారతీయ జనతా పార్టి.  నిజానికి దాన్ని ఉత్తర భారతీయ జనతా పార్టి అనాలి.  ఇంకా చెప్పాలంటే హిందీ బెల్ట్ రాజకీయ పార్టి అనాలి. దక్షణ  భారత దేశంలో  దాని  ప్రభావం ఎప్పుడూ పెద్దగా లేదు. హిందీ బెల్ట్ లో బిజెపికి సానుకూలమైన అంశం హిందీ వీరాభిమానం; అదే దానికి దక్షణ భారత దేశంలో ప్రతికూల అంశం.

 

యూరప్ లో భాషా జాతి రాజ్యాలు (Linguistic Nation State) ఏర్పడ్డట్టు ఇండియాను కూడ హిందీ భాషా జాతి రాజ్యంగా రూపొందించాలనే బలమైన కోరిక సంఘపరివారానికి అనాదిగా వుంది. ఇప్పుడు బిజెపి ఉమ్మడి పౌర స్మృతిని ప్రతిపాదించడం వెనుక కూడ ఆ అంశం దాగివుంది. భారత దేశం నిజానికి ఒక ఉపఖండం. ఇది అనేక భాషల నిలయం. ప్రత్యేక భాష మాట్లేడేవాళ్లందరూ తమది ప్రత్యేక జాతి అని సగర్వంగా చెప్పుకుంటారు.  తమిళజాతి, తెలుగు జాతి, తెలంగాణ జాతి వగయిరా. బిజేపి హిందీని వదలలేదు; అది దక్షణాదిలో విస్తరించనూలేదు.

 

ఉత్తరప్రదేశ్(80), బీహార్ (40), మధ్యప్రదేశ్(29), రాజస్తాన్ (26) ఝార్ఖండ్ (14), పంజాబ్ (13), చత్తీస్ గడ్ (11) హర్యాణ (10) ఢిల్లీ (7). జమ్మూకశ్మీర్ (6), ఉత్తరాఖండ్ (5), హిమాచల్ ప్రదేష్ (4) మొత్తం 245 లోక్ సభ స్థానాలున్న 12 రాష్ట్రాలను హిందీ హార్ట్ ల్యాండ్ ప్రాంతం అంటున్నారు. ఈ ప్రాంతాల్లోనే బిజెపికి ఎక్కువ సీట్లు వస్తున్నాయి.

 

మహారాష్ట్ర (48), గుజరాత్ (26), గోవా (2), దామన్-డయ్యు (1), దాద్రా-నగర్ హవేలీ (1) – మొత్తం 78 లోక్ సభ స్థానాలున్న 3 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలను పశ్చిమ భారతం అంటున్నారు. ఇక్కడ కూడ బిజెపి కి గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కాయి. పశ్చిమ బెంగాల్ (42), ఒడిశా (21) మొత్తం 63 సీట్లున్న రెండు రాష్ట్రాలను తూర్పు భారత దేశం అంటున్నారు. ఈ ప్రాంతంలో బిజెపికి సగం సీట్లు కూడ పూర్తిగా రాలేదు.  

 

          అస్సాం (14), త్రిపుర (2), మణిపూర్ (2), మేఘాలయా (2), సిక్కిం (1), నాగాలాండ్ (1), మిజోరం (1)- మొత్తం 23 సీట్లున్న ఏడు రాష్ట్రాలను ఈశాన్య భారతం అంటున్నారు. ఇక్కడ కూడ బిజెపి బలం సగం మాత్రమే.

 

తమిళనాడు (39), కర్ణాటక (28), ఆంధ్రప్రదేశ్ (25), కేరళ (20), తెలంగాణ (17), పాండిచెర్రి (1) మొత్తం 130 సీట్లున్న ఆరు రాష్ట్రాలను దక్షణ భారతదేశం అంటున్నారు. ఇవిగాక ఇతర కేంద్రపాలిత ప్రాంతాలయిన అండమాన్-నికోబార్, లక్షద్వీప్ లో చెరో ఒక స్థానాలున్నాయి.

 

యూరప్ లో ‘లాప్ డాగ్ మీడియా’ (lap dog media) అనే మాటను వాడుతుంటారు. అంటే ప్రభుత్వాధి నేత  ఒళ్ళో కుక్కపిల్ల వంటి మీడియా అన్నమాట.  మన దేశంలో మోదీజీ ఒళ్ళో మీడియాను  గోదీ (గోద్ + మోదీ) మీడియా అంటున్నారు. సీనియర్ జర్నలిస్టు రవీశ్ కుమార్ హిందీలో ఈ పదబంధాన్ని సృష్టించారు.  గోదీ మీడియా ప్రచారంతో హిందీ బెల్ట్ లో బిజెపి చాలా బలంగా వుందని దక్షణాదివాళ్ళు భావిస్తుంటారు. దక్షణాదిలో బిజెపి విస్తరిస్తున్నదని ఉత్తరాది వారు భావిస్తుంటారు. వాస్తవం ఏమంటే  అటు ఉత్తర భారత దేశంలోనూ ఇటు దక్షణ భారత దేశంలోనూ మోదీజీ- అమిత్ షాల ‘డబల్ ఇంజిన్’ పాలన మీద ఏవగింపు వేగంగా పుంజుకుంటున్నది.

 

          వరుసగా రెండుసార్లు అధికారంలోవున్న పార్టీ మీద ప్రజల్లో కొంత అసంతృప్తి వుండడం సహజం. మోదీజీ-అమిత్ షాల పాలన మీద ఆ సంతృప్తి  చాలా తీవ్రంగా వుందనే సంకేతాలొస్తున్నాయి. మోదీజీ ప్రభుత్వం కార్పొరేట్లను నెత్తికి ఎక్కించుకుని కార్మికుల్ని, సామాన్య ప్రజల్ని నిర్లక్ష్యం చేసిందనే మాట చాలా కాలంగా వున్నదే. విచిత్రం ఏమంటే వాణిజ్య వ్యాపార వర్గాలు సహితం ఇటీవల బిజెపి పాలన మీద అసంతృప్తితో వున్నాయి. హిందూ-ముస్లిం చీలిక రాజకీయాలతో సామాజిక శాంతి దెబ్బతిన్నది. సామాజిక శాంతి లేనప్పుడు మార్కెట్లో కొనుగోలు ఉత్సాహం తగ్గిపోతుంది. ఇది వాణిజ్యం మీద గట్టి ప్రభావాన్ని చూపుతుంది. ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో హిజబ్-హలాలా వగయిరా వివాదాలను లేవనెత్తి బిజెపి చేసిన హడావిడిని బిజెపి అనుకూల వాణిజ్య వ్యాపార వర్గాలు సహితం ఏవగించుకున్నాయి. అక్కడ బిజెపి ఓటమికి తమవంతు పాత్రను నిర్వహించాయి.

 

          హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వరుస విజయాలతో కాంగ్రెస్ ఉత్సాహంగా వుంది. క్రికెట్ లో రెండు వరుస బంతుల్లో ఇద్దరు బ్యాటర్ల వికెట్లను కూలిస్తే మూడో దాన్ని హ్యాట్రిక్ బంతి అంటారు. కాంగ్రెస్ ఇప్పుడు అలాంటి ఊపు మీద వుంది. మరోపైపు, రెండు వరుస పరాజయాలతో బిజెపి శ్రేణులు కుంగుబాటులో వున్నాయి.

 

త్వరలో ఛతీస్ గడ్, మధ్యప్రదేశ్ , రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిల్లో ఏ ఒక్కదాన్ని అయినా  కాంగ్రెస్ తన ఖాతాలో  వేసుకుంటే  హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుంది. ఇటీవలి కాలంలో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎమేజ్ పెరుగుతుండడాన్నీ, మోదీజీ-షాల ఇమేజ్ తగ్గుతుండడాన్ని మనం చూస్తున్నాం.

 

 ఈలోగా బిజెపికి పెట్టని కోటలాంటి హిందీ హార్ట్ ల్యాండ్ లోనే భారీగా సీట్లు తగ్గబోతున్నట్టు ఆ పార్టి అంతర్గత సర్వే నివేదికలు  హెచ్చరించినట్టు వార్తలొచ్చాయి. ఆ కలవరం ఆ పార్టి జాతీయ నాయకత్రయం - మోదీజీ, షా, నడ్డా – ముఖాల్లో మాటల్లో  స్పష్టంగానే కనిపిస్తున్నది. హిందీ బెల్ట్ లోటును దక్షణాది రాష్ట్రాల్లో పూడ్చుకోవాలని కమలనాధులు ప్రణాళికలు రచిస్తున్నారు. దక్షనాది రాష్ట్రాల ఓటర్లను ఆకర్షించడానికి సాక్షాత్తు   ప్రధాని మోదీజీయే రంగంలోనికి దిగి రామేశ్వరం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి.

 

ప్రస్తుతం మీడియాలో  ప్రచారం జరుగుతున్నట్టు రామేశ్వరం లోక్ సభ నియోజకవర్గంకాదు;  దక్షణ తమిళనాడులోని రామానాధపురం లోక్ సభా నియోజకవర్గంలో అదొక మునిసిపల్ పట్టణం. హిందువుల పుణ్యక్షేత్రం. భారత్-శ్రీలంకల మధ్య ‘సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టు’ నిర్మాణం జరుగుతున్నది అక్కడే. ప్రస్తుతం కెఇ నాజర్ ఖాన్ మునిసిపల్ ఛైర్మన్ గా వున్నారు.

 

రామానాధపురం లోక్ సభ  స్థానానికి ప్రస్తుతం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు చెందిన నవాస్ కనీ అనే నవాజ్ ఖాన్ ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఏఐఏడిఎంకేకు చెందిన అన్వర్ రజా  రామానాధపురం లోక్ సభా నియోజకవర్గం నుండి గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ బిజెపి అభ్యర్ధులు మూడవ స్థానంలో నిలవగా, 2019 ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచారు.

 

దక్షణ భారత దేశంలోని ఆరు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల  బిజెపికి లోక్ సభ సభ్యులు లేరు. కేరళలో జీరో, తమిళనాడులో జీరో, పాండిచేరిలో జీరో, ఆంధ్రప్రదేశ్ లో జీరో. కర్ణాటకలో 25 అభ్యర్ధులు, తెలంగాణలో 4 అభ్యర్ధులు మాత్రమే బిజెపికి వున్నారు. మొత్తం 130  లోక్ సభ స్థానాలుంటే, బెజెపికి వున్నది కేవలం 29 మంది ఎంపిలు మాత్రమే.  దక్షణాది ఆరు రాష్ట్రాల్లో ఒక్క చోట కూడ బిజెపి ప్రభుత్వం లేదు.  మొన్నటి వరకు కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం వుండేది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కూడ  బిజెపి ఓడిపోయింది.

 

“కాంగ్రెస్ లేని భారత దేశం”, “కాంగ్రెస్ ముక్త్ భారత్” అనేవి బిజెపికి చాలా ఇష్టమైన రాజకీయ నినాదాలు. కర్ణాటకలో ఓటమితో ‘బిజెపి ముక్త్ దక్షణ భారత దేశం’ ఇప్పటికే సాకారం అయ్యింది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టి కేంద్రంలో ఓడిపోతే ‘బిజెపి ముక్త్ సంపూర్ణ భారత దేశం’ ఏర్పడుతుందనే మాట అప్పుడే ప్రచారంలోనికి వచ్చేసింది.  

 

          బిజెపి ప్రభుత్వం దక్షణాది  రాష్ట్రాల మీద వివక్ష చూపుతోందనే మాట తమిళనాడు, పాడిచ్చేరిల్లో దాదాపు ఒక ఉద్యమ నినాదంగా కొనసాగుతోంది. . ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోను కేంద్రం మీద వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక ప్రజల నాడి ఇటీవలనే వ్యక్తం అయింది. లోక్ సభ ఎన్నికలు జరిగితే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడున్న స్థానాల్ని నిలబెట్టుకోవడం కూడ బిజెపికి పెద్ద సవాలు కావచ్చు. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ నేలల్లో బిజెపి మొలకెత్తని విత్తనం. కమలం ఇక్కడ ఎన్నికలకు పనికిరాని పువ్వు. ఈ పరిస్థితుల్లో, బిజెపి మిషన్ సౌత్ ఇండియా చరిత్రను తిరగరాస్తుందా? చూడాలి!

 

రచన : 11 జులై 2023

ప్రచురణ :  సాక్షి, 19 జులై 2023 



https://epaper.sakshi.com/Home/ShareArticle?OrgId=197aae444fa&imageview=1&standalone=1&fbclid=IwAR2VZevFuWKtuL2t-ZV4i-zqUQEeZSFNjEcLYurJoEdnbGbOO4nO-N34Kp4

No comments:

Post a Comment