Saturday, 8 July 2023

Meeting Opposing Proposed Uniform Civil Code (UCC) - మేకలకు తోడేళ్ళు సమానత్వం బోధిస్తున్నాయి !

ఈరోజు నా ప్రసంగం

ఉమ్మడి పౌర స్మృతి :

మేకలకు తోడేళ్ళు సమానత్వం బోధిస్తున్నాయి !

Common Civic Code :Wolves teaching equality to goats!

 

Meeting Opposing Proposed Uniform Civil Code (UCC)

Balostav Bhavan, Vijayawada

8th July 2023 Saturday

Danny Talking Points

Duration : 20-25 Mnts.

 

వేదిక మీదున్న-

వేదిక ముందున్న-

పెద్దలందరికీ

 

జై భీమ్ !

జై మీమ్ !

 

మిత్రులారా!

 

1.      ఉమ్మడి పౌరస్మృతిని చట్టబధ్ధం చేయబోతున్నట్టు బిజెపి హఠాత్తుగా ఒక హడావిడిని మొదలెట్టింది.

 

2.      పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ బాధ్యులు సంకేతాలను ఇస్తున్నారు.

 

3.      ఇదేమీ కొత్త విషయంకాదు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి రామమందిర నిర్మాణం, కశ్మీర్ కు ప్రత్యేకహోదా రద్దు, ఉమ్మడి పౌరస్మృతి చట్టం – ఈ మూడూ మొదటి నుండి బిజెపి నినాదాలే.

 

4.      వీటిల్లో రెండింటిని ఇప్పటికే పూర్తి చేశారు.  ఇప్పుడు మూడోది కూడ వస్తున్నది. వస్తుంది. ఎందుకంటే ఎలాంటి బిల్లులనైనా పాస్ చేయుంచుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం లోక్ సభలో బిజెపికి వున్నది.

 

5.      రాజ్యసభలో బిల్లు పాస్ చేయుంచుకోవడానికి  ఓ పదో ఇరవయ్యో ఓట్లు బిజెపికి తగ్గవచ్చు. విపక్ష పార్టీలను బుజ్జగించో భయపెట్టో తన దారికి  తెచ్చుకోవడం బిజెపికి బాగా తెలుసు.

 

6.      సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW), ఇంటెల్లిజెన్స్ బ్యూరో (IB), డిఫెన్స్ ఇంటెల్లిజెన్స్ ఏజెన్సీ (DIA), డైరెక్టోరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెల్లిజెన్స్ (DRI) వంటి కేంద్ర నేర పరిశోధనా సంస్థల్ని వాడడం బిజెపికి అధికారంతో అబ్బిన  విద్య.

 

7.      ఇవిగాక, తన రాజకీయార్ధిక ప్రయోజనాలను సాధించుకోవడానికి రిజర్వు బ్యాంకు, సెబి, ఎన్నికల కమీషన్, చివరకు సుప్రీం కోర్టును ప్రయోగించడంలోనూ బిజెపికి గొప్ప నేర్పు వుంది.

 

8.      మోదీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధి మీద కిందికోర్టు విధించిన శిక్ష మీద స్టే ఇవ్వడానికి గుజరాత్ హైకోర్టు నిన్న నిరాకరించింది. సుప్రీం కోర్టు కూడ స్టే ఇవ్వదని మనం ఇప్పుడే బల్లగుద్ది చెప్పవచ్చు. ఇది జ్యోతిష్యంకాదు.  రేపు ఏం జరగబోతున్నదో మనకు ముందే తెలిసిపోతున్నది.

 

9.      చాలా మందికి జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA)లో బిజెపితో పాటు ఏఏ రాజకీయ పార్టీలు వున్నాయో  తెలియదు.

 

10. కానీ పైన పేర్కొన్న సంస్థలన్నీ బిజెపికి రాజకీయ ప్రయోజనాన్నీ, బిజెపి స్పాన్సర్లకు ఆర్ధిక లబ్దినీ చేకూర్చడానికే పని చేస్తున్నాయని చెప్పడానికి అనేక ఉదాహరణలు వున్నాయి.

 

11. ఈ సంస్థల్ని  మనం ఎన్డీయే సభ్య పార్టిలు అనవచ్చు. 

 

12. ఈ సంస్థల సహకారంతో రాజ్యసభలో  విపక్షనేతల్ని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలయినట్టు అప్పుడే మనకు  స్పష్టంగా సంకేతాలు  కనిపిస్తున్నాయి.

 

13. ఈ బిల్లు ముసాయిదాను (Draft Copy) ఇప్పటి వరకు ప్రచురించలేదు. ముందస్తుగా తెలుపకుండానే  కీలకమైన బిల్లుల్ని పార్లమెంటులో అప్పటి కప్పుడు ప్రవేశపెట్టి  పాస్ చేయుంచుకునే సాంప్రదాయం బిజెపికి వుంది.

 

14. గతంలో జమ్ము కశ్మీర్  కు రాష్ట్ర స్థాయినీ, ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పుడూ పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచి ఇలాంటి సస్పెన్స్ గేమ్ నడిపారు.  ఇప్పుడూ ఆలాగే చేయవచ్చు.

 

15. ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలనే ఆదేశాలు రాజ్యాంగంలోనే వున్నాయని ప్రధాని మోదీజీ, హోంమంత్రి అమిత్ షా గుర్తు చేస్తున్నారు.

 

16. నిజమే. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో 44వ అధీకరణం ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలని సూచించింది.

 

17. భారత రాజ్యాంగంలోని నాలగవ అధ్యాయంలో 36 నుండి 51వ అధీకరణల వరకు 16 ఆదేశిక సూత్రాలున్నాయి.

 

18. సమానత్వం, సామాజిక న్యాయం, లౌకిక తత్త్వం, మతసామరస్యం, సంపద కొందరి దగ్గరే పోగుపడిపోకుండా అందరికీ  సమాన పంపిణి, 14 సంవత్సరాల వరకు అందరికీ నిర్బంధ విద్య, శాస్త్రీయ అవగాహన పెంపు – ఈ బాధ్యతలన్నీ ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలే. 

 

19.  ఇవన్నీ వదిలి పెట్టి మీరు నేరుగా 44కు ఎందుకు వెళ్ళిపోయారూ? దీనిబట్టే మీ కుట్ర అర్ధం అయిపోతున్నది.

 

20. ఏదైనా కొత్త చట్టాన్ని తెస్తున్నపుడు దాని ఆవశ్యకతను ప్రభుత్వం ప్రకటించాలి. ఫలానా సమూహం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల్ని పరిష్కరించడానికి కొత్త చట్టాన్ని  తెస్తున్నట్టు వివరించాలి. ఈ ప్రభుత్వం అలాంటి లాంచనాలను వదిలేసింది.

21. వర్తమాన భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం వున్నాయి. పేదరికం, నిరుద్యోగం, అవినీతి, నిత్యావసర ధరల పెరుగుదల, మండుతున్న వంట గ్యాస్, పెట్రోల్ ధరలు. మీరు విధించిన జిఎస్ టి, ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టడం, దేశ సంపదను మీ అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెడ్డం, పెద్ద పెద్ద బ్యాంకుల దివాళ, మహిళల మీద అత్యాచారాలు. వీటిని పరిష్కరించమని దేశప్రజలు మిమ్మల్ని కోరుతున్నారు.

 

22. ముందు వాటి మీద దృష్టి పెట్టండి. వాటిని పరిష్కరించండి.

 

23. వీటిల్లో ఒక్కదాన్ని కూడ పరిష్కరించకుండా ఉమ్మడి పౌరస్మృతి దేశానికి అత్యవసర చట్టంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారూ? దేశంలో పై సమస్యలన్నీ తలెత్తడానికి కారణం ఉమ్మడి పౌర స్మృతి లేకపోవడమేనని మీరు చెప్పదలిచారా? 

 

24. సరే ఇప్పుడు అడుగుతున్నాం. ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని తేవాలని మిమ్మల్ని ఏ సమూహాలు కోరాయి?

 

25.  బాబాసాహెబ్ బిఆర్ అంబేడ్కర్ కూడ ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా మాట్లాడారని ప్రధాని, హోంమంత్రి తమవాదనలకు సమర్ధనగా గుర్తుచేస్తున్నారు.

 

26. నవంబర్ 4, 1948న రాజ్యాంగ పరిషత్‌లో మాట్లాడుతూ ఉమ్మడి పౌర స్మృతిని బిఆర్ అంబేడ్కర్ సమర్ధించిన మాట వాస్తవం.

 

27. 1927 డిసెంబరు 25న మహద్ పోరాటం సందర్భంగా అంబేడ్కర్ మనుస్మృతిని బాహాటంగా తగులబెట్టిన మాట కూడ వాస్తవం కాదా?  

 

28. మనుస్మృతి అప్పట్లో సాంస్కృతికంగా హిందూ సమాజంలో పౌర స్మృతిగా చెలామణి అవుతుండేది.

 

29. మనుస్మృతి ద్వార కొనసాగుతున్న సామాజిక అసమానతలను అధిగమించాల్సిన అవసరాన్ని అంబేడ్కర్ నొక్కి చెప్పారు.

 

30. రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం  ఆదర్శాలు హక్కులు  ప్రజలందరికీ చేరడానికి వివక్షాపూరిత అంతస్తుల దొంతర వంటి పౌరస్మృతులు  అడ్దంకిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

 

31. భారత రాజ్యాంగం అమల్లోనికి రాగానే 1950 జనవరి చివర్లో బొంబాయిలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ “భారత దేశంలో మనుయుగం అంతరించింది; ప్రజాస్వామిక యుగం ఆరంభం అయింది” అని ప్రకటించారు.

 

32.    ఇప్పుడు ప్రజాస్వామిక యుగాన్ని నాశనం చేసి మనుయుగాన్ని పునరుధ్ధరించే ప్రయత్నాలు చేస్తున్నవారు అంబేడ్కర్ ను ఉటంకించడం కపటంతప్ప మరేమీ కాదు.

 

33.    అంబేడ్కర్ చెప్పింది వేరు; ఇప్పుడు జరుగుతున్నది వేరు. అంబేడ్కర్ చెప్పినదానికి పూర్తి విరుధ్ధంగా ఇప్పుడు జరుగుతున్నది.

 

34.    రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలకన్నా ముఖ్యమైనవి ప్రాణప్రదమైనవి  ప్రాధమిక హక్కులు.

 

35.    మనకు స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావాలు ప్రాధమిక హక్కులుగా వున్నాయి.

 

36.    రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన తీరులో వీటిని అమలు పరుస్తున్నారా? అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది.

 

37.    ప్రాధమిక హక్కుల్ని కాలరాస్తూ, ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వుంది.

 

38.    ఇప్పుడు మహత్తరమైన మన భారత రాజ్యాంగం తోడేళ్ళ చేతుల్లో వుంది. మేకలు రాజ్యాంగాన్ని నమ్ముతాయిగానీ తోడేళ్ళను నమ్మలేవు కదా?

 

39.    భారత రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చ ఉమ్మడి పౌరస్మృతి డ్రాఫ్ట్ ఎలా వుంటుందీ? దాని వల్ల సమాజంలో కొందరికి కలిగే ప్రయోజనాలేమిటీ? అనేవి ఎంత మాత్రం కాదు. దాన్ని ఎవరూ ఏ ఉద్దేశ్యంతో తెస్తున్నారూ? ఎలా  అమలు పరుచబోతున్నారూ?  అనేదే ముఖ్యం.

 

40.    ఈ తెలివి కూడ మాకు అంబేడ్కర్ నుండే అబ్బింది. రాజ్యాంగాల గురించి  అంబేడ్కర్ ఒక మాటన్నారు. “రాజ్యాంగం ఎంత చెడ్డదయినా మంచి పాలకుల చేతుల్లో పడితే అది గొప్పదయిపోతుంది; అలాగే రాజ్యాంగం ఎంత గొప్పది అయినా చెడ్డ పాలకుల చేతుల్లో పడితే అది చెడిపోతుంది.” అన్నారు.

 

41.    చెడ్డ పాలకులు మంచి చట్టాన్ని తెస్తారని మేము ఎలా నమ్మేదీ?

 

42.    వేదిక మీద జవహర్ అలీ వంటి సీనియర్ అడ్వకేట్లున్నారు. ఇప్పుడు నేను రాజ్యాంగం గురించి, చట్టాల గురించీ మరింతగా మాట్లాడడం సబబుకాదు. ఇక ముందు సామాజిక రాజకీయ అంశాలకే పరిమితం అవుతాను.

 

43.    మనకు 75 సంవత్సరాలుగా  ఉమ్మడి నేర స్మృతి వుంది. “చట్టం ముందు అందరూ సమానమే” అనేది దీని ఆదర్శం. ఇది నిజమేనా?  ఆ మాటల్ని నమ్మే స్థితిలో మన అనుభవాలున్నాయా?

 

44.    బిస్కిస్‌ బానో  నుండి ఉన్నావో  వరకు ముస్లింల మీద అత్యాచారం జరిపిన కేసుల్లో  నిందితులకు   బిజెపి  మద్దతుగా నిలుస్తూనే వుంది.

 

45.    చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసినవారు, అతి  క్రూరంగా హత్యలు చేసినవారు, మతకల్లోలాలను సృష్టించినవారు మరునాడు బెయిల్ తీసుకుని మన మధ్య తిరుగుతున్నారు. దోషులు పరపతి గలవారయితే వాళ్ళను అరెస్టు చేయడానికి కేంద్ర నిఘా సంస్థలు సహితం భయపడడాన్ని మనం చూస్తున్నాం. అండిగిందే ఆలస్యం అన్నట్టు న్యాయస్థానాలు బెయిళ్ళు మంజూరు చేసేస్తున్నాయి. కొన్ని కేసుల్లో అయితే నిస్సంకోచంగా నిర్దోషులని తీర్పు చెప్పేస్తున్నాయి. 

 

46.    వాళ్లకు సన్మానాలు జరుగుతున్నాయి. వాళ్ళు శాసన సభ్యులుగా ఎన్నికై చట్ట సభల్లో ప్రవేశిస్తున్నారు. మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. వాళ్ళే రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్నారు.

 

47.    మరోవైపు న్యాయమూర్తులు సహితం పదవీ విరమణ తరువాత దక్కే పదవులకు ఆశపడి కీలకమైన కేసుల్లో ప్రభుత్వానుకూల తీర్పులు చెపుతున్నారు.

 

48.    మరోవైపు, చిన్నచిన్న  నేరాల్లో చిక్కుకుని ఏళ్ళ తరబడి బెయిలు సహితం రాని వేలాది మంది నిరుపేదల్నీ మనం చూస్తున్నాం.

 

49.    నేను కొన్ని సోషల్ ప్రాజెక్టుల్లో సర్వేలు నిర్వహించి గణాంకాలను విశ్లేషించే సెఫాలజిస్ట్ (psephologist) గా పనిచేశాను.  

 

50.    ఏదైనా సెంట్రల్ జైలులో  మొత్తం ఖైదీల జాబితా తీసుకుని  సామాజికవర్గ విశ్లేషణ చేయండి. వాళ్లలో నిస్సందేంగా ఎస్టి, ఎస్సీ, బిసి, మైనారిటీలు అత్యధికులుగా వుంటారు.

 

51.    అలాగే దేశంలో ఇప్పటి వరకు జరిగిన భారీ కుంభకోణాల జాబితా తీయండి. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగవేతదారుల జాబితా తీయండి.

 

52.    నిందితుల్ని ఎస్టి, ఎస్సీ, బిసి, మైనారిటీ, ఓసిలుగా వర్గీకరణ చేయండి. వాళ్లలో ఎస్టి, ఎస్సీ, బిసి, మైనారిటీలు అతి తక్కువగా వుంటారు.

 

53.    ఇదీ మన ఉమ్మడి నేర స్మృతి అమలు తీరు. దీన్నిబట్టి చెప్పవచ్చు రేపు ఉమ్మడి పౌరస్మృతి అమలు తీరు ఎలావుంటుందో.

 

54.    ఉమ్మడి పౌరస్మృతిని ఎస్టి, ఎస్సి, బిసి, మైనారిటీలను  వేధించడానికి వాడుతారని అనుమానం రాకపోతే మన మెదళ్ళు పనిచేయడం లేదని అర్ధం.

 

55.    కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి మీద ఇప్పుడు హడావిడి చేయడానికి రెండు కారణాలున్నాయి.

 

56.    మొదటిది ఆర్ధిక కారణం. మన మెగా కార్పొరేట్లు సముద్రాన్నీ, ఆకాశాన్ని ఇప్పటికే మింగేశారు. దేశంలో ఓడరేవులన్నీ వారివే,  ఎయిర్ పోర్టులన్నీ వారివే. కంపెనీలన్నీ వారివే.

 

57.    ఇప్పుడు ఖనిజ నిక్షేపాలున్న భూములు, అటవీ సంపద మీద వారి కన్ను పడింది.

 

58.    ప్రపంచీకరణ యుగంలో ఈ గ్లోబ్  మీద అత్యంత పీడిత సమూహాలు ముస్లింలు, ఆదివాసులు.

 

59.    ముస్లిం దేశాల్లో చమురు నిల్వలున్నాయి, ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ నిక్షేపాలున్నాయి.

 

60.    మన దేశంలో ఎస్టీల జనాభా 9 శాతం వుంటుంది.  అయితే, వారి ఆధీనంలో సాంప్రదాయికంగావుంటూ వస్తున్న భూమి విస్తీర్ణం దాదాపు 25 శాతం వుంటుంది.

 

61.    అవి మెగా కార్పొరేట్లకు దక్కాలంటే  అడవిపై ఆదివాసులకున్న ప్రత్యేక హక్కుల్ని రద్దు చేసి లైన్ క్లియర్ చేయాలి.

 

62.    కొత్త చట్టానికి మణిపూర్ అల్లర్లు Immediate provocation అనే మాట కూడ వినిపిస్తోంది.

 

63.    రెండవ కారణం; రాజకీయాలకు సంబంధించినది.

 

64.    నేను ముందే చెప్పినట్టు దేశంలో సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా మారిపోయింది.

 

65.    ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళి గడిచిన పదేళ్ళళో ఇవీ మేము చేసిన గొప్ప పనులు. ఇంకో ఐదేళ్ళు ఇలాంటి పనులే ఇంకాస్త ఎక్కువగా చేస్తాము మాకు ఓటు వేయండి అని చెప్పుకునే ధైర్యం ఈరోజు బిజెపికి లేదు.

 

66.    హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వరుస విజయాలను సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు హ్యాట్రిక్ గెలుపు మూడ్ లో వుంది. మరోవైపు, బిజెపి హ్యాట్రిక్ ఓటమి భయంలో వుంది. అది స్పష్టంగా కనిపిస్తోంది.

 

67.    పైగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆపైన లోక్ సభ ఎన్నికలు తరుముకు వస్తున్నాయి.

 

68.    ఎన్నికలకు ముందు బిజెపి సాధారణంగా రెండు పనులు చేస్తుంది.

 

69.    మొదటిది, ఓటర్లలో ఏదో ఒక తీరుగా కుహనా దేశభక్తిని రెచ్చగొడుతుంది.   

 

70.    గత లోక్ సభ ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 15న పుల్వామాలో భారత సైనికుల మీద టెర్రరిస్టులు  దాడి చేస్తే, దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని బాలకోట్ మీద భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నడిపిందని అప్పట్లో ‘గోదీ’ మీడియా ఊదర్గొట్టేసింది.  

 

71.    కానీ, అదంతా  కేంద్రప్రభుత్వం ఆడిన  ఒక నాటకం (Stage Coup) అని సాక్షాత్తు అప్పటి జమ్మూ-కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అంటున్నారు.

 

72.    రెండోది, మధ్యయుగాల నుండి హిందూ- ముస్లిం బైనరీ ఒకదాన్ని సృష్టించి  ప్రయోగిస్తుంది.

 

73.    బైనరీ అంటే ఏమిటో మీలో చాలామందికి తెలుసు. కొందరికి తెలియకపోయినా కొంపలేం మునిగిపోవు. సామాన్యుల భాషలో చెప్పాలంటే మత ద్వేషాన్ని పెంచడం అన్నమాట.

 

74.    2019 లోక్ సభ  ఎన్నికల్ని అమిత్ షా మూడవ పానిపట్టు యుధ్ధం అని ప్రచారం చేశారు. పీష్వా బాజీరావు – అహ్మద్ షా దుర్రానీల మధ్య పోటీ పెట్టారు. ఇది 1761 నాటి మాట.

 

75.    గత ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీజీ శివాజీ – ఔరంగజేబ్ ల మధ్య పోటీ పెట్టారు. ఇది 1680 కన్నా ముందు మాట.

 

76.    అమిత్ షా ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాణి అబ్బక్క – టిప్పూ సుల్తాన్ ల  మధ్య పోటీ పెట్టారు. 1799 కన్నా ముందుమాట.

 

77.    రేపు 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇలాంటి హిందూ-ముస్లిం బైనరీ కోసం బిజెపి మధ్యయుగాల్లో  అన్వేషిస్తున్నది.

 

78.    ఉమ్మడి పౌర స్మృతి కావాలా? ఇస్లాం షరియా కావాలా? అని అడగడానికి ఆ పార్టి సిధ్ధం అవుతోంది.

 

79.    ఇంతకీ బిజెపి మార్కు ఉమ్మడి పౌర స్మృతి ఎలావుండబోతున్నదనేది ఒక చర్చ.

 

80.    ఉత్తరాఖండ్ లో ఇటీవల ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పౌరీ పట్టణ మునిసిపల్ ఛైర్మన్ యశ్ పాల్ బేనామ్  ఆ రాష్ట్రంలో ప్రముఖ బిజెపి నాయకుడు. అతని కుమార్తె మోనిక తన స్నేహితుడు అయిన మోనిస్ అనే ఓ ముస్లిం యువకుడ్ని ప్రేమించింది.

 

81.    కూతురి ప్రేమను యశ్ పాల్ అర్ధం చేసుకుని వారి పెళ్ళికి ఆమోదం తెలిపాడు.  ఈ ఏడాది మార్చి 28న పెళ్ళికి ముహూర్తం పెట్టి  వెడ్డింగ్ కార్డులు ముద్రించి బంధు మిత్రులకు పంచిపెట్టాడు. అది వైరల్ అయింది.

 

82.    భైరవ సేన, భజరంగ్ దళ్ వీధుల్లోనికి వచ్చి హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికి వీల్లేదని నిరసన ప్రదర్శనలు చేశాయి. ‘లవ్ జిహాద్’ ను ప్రోత్సహిస్తున్నారంటూ యశ్ పాల్ ను అతని కుమార్తెను, కాబోయే అల్లుడినీ బెదిరించాయి. దానితో యశ్ పాల్  భయడి పెళ్ళిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు.

 

83.    హిందూ ముస్లిం యువతరం మతాంతర, కులాంతర, తెగాంతర  వివాహాలు చేసుకోవడం ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ అత్యంత సహజమైన వ్యవహారంగా మారింది. ఎక్కువ సందర్భాల్లో ఇలాంటి పెళ్ళిళ్ళు తల్లిదండ్రులకు నచ్చవు.

 

84.    సంఘపరివారం దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నది. అదొక ఓటు బ్యాంకును సృష్టిస్తున్నది.  

 

85.    కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తేగానే ముందు తమ రాష్ట్రంలోనే అమలుపరుస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అప్పుడే ఒక ప్రకటన చేశారు.

 

86.    సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయి ద్వార ఒక డ్రాప్ట్ కాపీ కూడ సిధ్ధం చేయించారు.

 

87.    బయటికి వచ్చిన వార్తలనుబట్టి ఇందులో ఏడు అంశాలున్నాయి.

 

88.    బహుభార్యత్వం రద్దు.

 

89.    ముస్లిం సమాజంలో హలాల, ఇద్దత్ రద్దు.

 

90.    విడాకుల విషయంలో భార్యాభర్తలకు సమాన హక్కులు.

 

91.    సహజీవనం చేసే జంటలు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి.

 

92.    కుటుంబ నియంత్రణ తప్పనిసరి.

 

93.    వివాహ వయస్సు 21 సంవత్సరాలు.

 

94.    పెళ్ళికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

 

95.    సహజీవనం చేసేవారు ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తప్పని సరిగా తెలియపరచాలి అనివుంది. తెలియపరిస్తే సరిపోతుందా? లేక వారి అనుమతిని కూడ తీసుకుని తీరాలా అనేది ఇంకా స్పష్టంకాలేదు.

 

96.    ప్రేమ వివాహాలు, మతాంతర, కులాంతర  వివాహాలను రద్దు చేస్తారు. సహజీవనానికి పరిమితులు విధిస్తారు. సింగిల్స్ సంబంధాలను అదుపు చేస్తారు అని అర్ధం అవుతోంది.

 

97.    సింగిల్స్ అనేది మన దేశంలో ఇప్పుడు వేగంగా పెరుగుతున్న సమూహం. 2011 జనాభా లెఖ్ఖల ప్రకారం దేశంలో విహాహ బంధంలో లేకుండా వుంటున్నవారు 11 శాతం. 2021 జనాభా లెఖ్ఖల అంచనా ప్రకారం ఈ సమూహం 20 శాతం. అంతే ముస్లింలు, క్రాస్తవులు, శిక్కులు, బౌధ్ధుల కన్నా వీరి జనాభా ఎక్కువ.

 

98.    ఉమ్మడి పౌర స్మృతి గొప్ప ఆదర్శంకదా? బలమైన జాతి నిర్మాణానికి ఒకే చట్టం ఒకే సంస్కృతీ సాంప్రదాయాలు అవసరంకదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

 

99.    పుస్తకాలను ఎక్కువగానూ, సమాజాన్ని తక్కువగానూ చదివేవారు తమంతతాముగా రూపొందించుకునే ఆదర్శాలివి. 

 

100.         వారితో కాస్సేపు మాట్లాడితే  ఒకే సంస్కృతి కావాలనీ కొంచెం సాగదీసి ఒకే మతం వుండాలనీ అనగలరు. ఆ తరువాత మరింత సాగదీసి ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే నాయకుడు వగయిరాలు వరుసగా వల్లించేయగలరు.  ఇవన్నీ మనం చాలా కాలం క్రితం ‘బంచ్ ఆఫ్ థాట్’లో చదువుకున్న విషయాలే.   

 

101.         మనం తరచుగా మరచిపోతున్నదేమంటే యూరప్ లో నెపోలియన్ ప్రవచించినట్టు భారత దేశం భాషా జాతి రాజ్యం కాదు. (Linguistic nation state).

 

102.         అనేక భాషలు, మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆరాధానా పధ్ధతులు, జాతులు కలిసి జీవించే   సువిశాల ఉపఖండం భారత దేశం. బహుళ సంస్కృతుల కారణంగానే మనం 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచుకున్నాముగానీ  భాషా ప్రయుక్త దేశాన్ని కోరుకోలేదు.

 

103.         ఉత్తరాఖండ్ ప్రభుత్వం బయట పెట్టిన అంశాలు ప్రాధమికమైనవి మాత్రమే.  కేంద్ర ప్రభుత్వ బిల్లు చాలా విస్తారంగా వుండవచ్చు.

 

104.         వారికి సామాజిక శాంతికన్నా రాజకీయ ప్రయోజనం ముఖ్యం.  ముస్లింలను వేధించబోతున్నాము అనే సంకేతాలను ప్రజల్లోనికి బలంగా పంపాలన్నది వారి వ్యూహం.

 

105.         మధ్యయుగాల్లో ముస్లిం పాలకులు హిందువుల మీద సాగించిన అణిచివేతకు ప్రతీకారంగా  ఇప్పుడు వారి సంతతి మీద సంఘపరివారం కక్ష  తీర్చుకుంటున్నది   అనే మాటను జనం మెద్దళ్ళ లోనికి ఎక్కించడం వారి లక్ష్యం.

 

106.         దానివల్ల ఓట్ల ధృవీకరణ జరిగి  అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అది గొప్పగా తోడ్పడుతుందని వాళ్ళ నమ్మకం. 

 

107.         ముస్లిం మహిళల మీద మోదీజీ ఎంతో జాలిని కురిపిస్తుంటారు. దేశంలో ముస్లిం జనాభా 15-16శాతం. దేశ జనాభాలో ముస్లిం మహిళలు 8 శాతం. వారిలో మోది చెపుతున్న షరియా బాధితులు  ఒక శాతం అయినా వున్నారా? వాళ్లెపుడయినా షరియాను మార్చమని ప్రభుత్వాన్ని కోరారా?  

 

108.         ప్రతి సమూహాపు పౌరస్మృతుల్లోను ప్రత్యేకతలు, భిన్నత్వం వుంటాయి.  ఆధునిక ప్రమాణాలతో పోల్చుకుంటే కొన్ని ప్లస్ లు కొన్ని మైనస్ లు వుంటాయి. మైనస్సులు మాత్రమే వుంటే ఆ సమూహం కొనసాగదు. ప్లస్సులూ వుంటాయి గాబట్టే ఆ సాంప్రదాయం కొనసాగుతూ వుంటుంది.

 

109.         ఇస్లాం సామాజిక విప్లవాన్ని గురించి మాట్లాడడానికి ఇది సంస్దర్భమూ కాదు; దానికి నేను పూర్తి సమర్ధుడినీ కాదు. కానీ, ఆ అంశం మీద ఇంతగా రాజకీయ చర్చ జరుగుతోంది గాబట్టి మూడే మూడు అంశాలను గుర్తు చేస్తాను.

 

110.          6-7 శతాబ్దాల్లోనే వితంతు పునర్వివాహం, స్త్రీలకు ఆస్తి హక్కు, రాజకీయ హక్కు కల్పించింది ఆ పౌరస్మృతి. భారతదేశాన్ని పాలించిన మహిళా చక్రవర్తి రజియా సుల్తాన. ఆమె ముస్లిం అని అందరికీ తెలుసుగానీ ఆమె బానిస వంశస్తురాలని చాలా మందికి తెలీదు. (Mamluk Dynasty).

 

111.         తండ్రి ఆస్తి పంపకాల్లో కొడుకులకు రెండు భాగాలు, కూతుళ్ళకు ఒక భాగం ఇవ్వడం ద్వార స్త్రీ వివక్ష చూపుతుందనే విమర్శ ఒకటుంది.

 

112.         బయటి వారికి తెలియని సూక్ష్మం  ఏమంటే  కుమార్తెల వాటా సంపూర్ణ హక్కు. కొడుకుల వాట బాధ్యతలతో కూడిన హక్కు. తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమార్తెలది కాదు కొడుకులది.

 

113.         ఈ సందర్భంగా పౌరస్మృతికీ, రాజకీయ అధికారానికీ మధ్యన వుండే ఒక అనుబంధాన్ని వివరించాల్సివుంది.

 

114.         ఇస్లాం షరియాలో బహుభార్యత్వానికి సమర్ధన వుంది. కానీ, వెయ్యికి ఒక్కరు కూడ దాన్ని పాటించరు. హిందూ పౌర స్మృతిలో బహుభార్యత్వానికి సమర్ధన లేదు. కానీ ముస్లింలకన్నా ఎక్కువశాతం హిందువులు బహుభార్వత్వాన్ని పాటిస్తారు.

 

115.         దీని అర్ధం ఏమంటే, అధికారంలోవున్న సమూహం న్యాయ సమర్ధనలేని పనులూ చేయగలదు. అధికారంలో లేని సమూహాలు న్యాయసమర్ధన వున్న పనులూ చేయలేవు.

 

116.         అయ్యా ప్రధాన మంత్రిగారూ! అరశాతం, పావు శాతం జనాభా గురించి సమయాన్ని వృధాచేయకుండ 140 కోట్ల మంది భారత ప్రజల గురించి ఆలోచించండి ప్లీజ్!

 

117.         ఉమ్మడి పౌర స్మృతి అన్నది ఇక ఎంత మాత్రం ముస్లిం సమస్య మాత్రమేకాదు.

 

118.         ఇది సామాన్య ప్రజలు అందరి సమస్య. ప్రజాస్వామికవాదులు, సామ్యవాదులు, సాంస్కృతిక బహుళత్వాన్ని కోరుకునే వారందరి సమస్య. సాంస్కృతిక బహుళత్వాన్ని కాపాడుకోవాలి అనుకునేవారందరి సమస్య.

 

119.         ఈరోజు ఉదయం నా ప్రసంగానికి తుది మెరుగులు దిద్దుకుంటుండగా హిందూ దినపత్రికలో ఒక వార్త చదివాను. ‘Uniform Civil Code and the infinite variety of custom’ శీర్షికతో ప్రీమియం స్టోరీగా అది అచ్చయింది.

 

120.         యూనిఫాం సివిల్ కోడ్ కోసం ప్రధాన మంత్రి చూపిస్తున్న ఆతృత మీద దేశంలోని వివిధ ఆదివాసి సమూహాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  

 

121.         తమ సంస్కృతి సాంప్రదాయాలకు ముప్పు ముంచుకు వచ్చిందని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదొక ఉద్యమంగా  మారుతోందనేది ఆ కథనం.  

 

122.         మణిపూర్ తో సహా ఏడు ఈశాన్య రాష్ట్రాల నుండి ఝార్ఖండ్ ఛతీస్ గడ్‍, ఒరిస్సా వరకు ఈ ఉద్యమం విస్తరించే అవకాశాలున్నాయి. 

 

123.         బిజేపి కపటాన్ని అందరం కలిసికట్టుగానే ఎదుర్కోవాలి. బాధిత సమూహాలన్నీ ఏకం కావాలి.

 

124.         ఇప్పుడు సమస్య ఉమ్మడి పౌరస్మృతిని ఎలా వుండబోతున్నదనేది కాదు. దాన్ని ఎవరు రూపొందిస్తున్నారూ? ఎందుకు రూపొందిస్తున్నారూ? ఎలా అమలు చేస్తారన్నదే ముఖ్యం.

 

125.         అమలు చేసేవాళ్ళు పీడకులని మనకు తెలుసు. పీడకులు తెచ్చే చట్టాల్ని నమ్మరాదని అంబేడ్కర్ హెచ్చరించాడు.  

 

126.         ఇప్పుడు ఏం చేయాలో ఆదివాసులకు కూడ తెలిసిపోయింది.

 

127.         అడవిలో చిచ్చు రాజుకుంది.

 

128.         మైదానంలో ఏం చేయాలో మనం ఆలోచిద్దాం.  

 

మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు

 

ఓపిగ్గా విన్నందుకు మీ అందరికీ

ధన్యవాదాలు.

 

ఏ. ఎం. ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) 

No comments:

Post a Comment