Wednesday 5 July 2023

UCC should be dealt with tactics but not with emotions

 'ఉమ్మడి పౌరస్మృతి : ఉద్వేగంకాదు, ఉపాయం ముఖ్యం

  

అహ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)


ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC) మీద 30 రోజులలోగా తమ అభిప్రాయాలను, సూచనలను తెలపాలని భారత 22వ లా కమిషన్ జూన్ 14న ప్రభావిత సమూహాలు, మత సంస్థలను, ప్రజలను కోరింది. పక్షం రోజుల్లోనే 8.5 లక్షల మంది స్పందించారని లా కమీషన్ ఛైర్మన్ రితు రాజ్ అవస్థి ప్రకటించారు. 

గతంలో, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బల్బీర్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని 21వ లా కమీషన్ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని పరిశీలింది. కుటుంబచట్టంలో సంస్కరణలు అనే అంశం మీద 2018 ఆగస్టు 31న ఒక విధాన పత్రాన్ని విడుదల చేస్తూ “ ప్రస్తుత పరిస్థితిలో మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతి  అవసరమూ లేదు, కోరదగ్గదీ కాదు (neither necessary nor desirable) అన్నది. 


భోపాల్ లో జూన్ 27న   జరిగిన బిజేపి పోలింగ్ బూత్ బాధ్యుల సమావేశంలో పోలింగ్ నిర్వహణ మీద  దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోదీజి  ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటి లా కమీషన్ ప్రతిపాదనను, భోపాల్ లో మోదీజీ ప్రసంగాన్ని కలిపి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి పౌర స్మృతి బిజెపి ప్రచారాస్త్రంగా మారబోతున్నదని అర్ధం అవుతోంది.


భారత సమాజంలో సాంస్కృతికంగా అనేక మత సమూహాలున్నాయి. 2021 జనాభా లెఖ్ఖల్లో హిందూ, ముస్లిం, క్రీస్టియన్, బౌధ్ధ, శిఖ్, జైన మతాల్ని మాత్రమే గుర్తించారు. తమను ప్రత్యేక ఆచార వ్యవహారాలుగల మతాలుగా గుర్తించాలని అనేక సమూహాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇవిగాక, దేశంలోని ఆది సమూహాలు ఒక్కొక్కటి ఒక్కోరకం మతాచారాలను పాటిస్తుంటాయి. ఉమ్మడి పౌర స్మృతి అన్నది ఈ సమూహాలన్నింటి ఉమ్మడి వ్యవహారం. 


వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత తదితర అంశాల మార్గదర్శక సూత్రాలను పౌరస్మృతి అంటారు. ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశంలోని సమస్త సమూహాల సాంస్కృతిక ఆచార వ్యవహారాల నుంచి మేలైన వాటిని స్వీకరించి ఒక ఆదర్శ జీవన విధానాన్ని రూపొందిస్తారని మనం సాధారణంగా భావిస్తాం. కానీ, అలా జరుగుతున్నట్టు లేదు. 


“ఒక ఇంట్లో ఇద్దరు సభ్యులుండి ఇద్దరికీ చెరో చట్టంవుంటే ఆ ఇల్లు నడవదు” అన్నారు ప్రధాని. ఇద్దరికీ ఉమ్మడి చట్టం వుండాలన్నారు. ప్రధాని అక్కడితో ఆగారుగానీ, వారి కింది స్థాయి బిజెపి నేతలు మాత్రం అలా ఆగడంలేదు. కొంతకాలంగా మనుస్మృతిని రాజ్యాంగంగా ప్రకటిస్తాం అంటున్నట్టు, ఉమ్మడి పౌర స్మృతిని తెచ్చి తీరుతాం అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. దానితో మనుస్మృతినే ఉమ్మడి పౌర స్మృతిగా ప్రకటిస్తారనే అపోహ కూడ ప్రబలింది. 


ఇప్పుడే ఈ అంశాన్ని ముందుకు తేవడంలో ఒక ముఖ్య రాజకీయార్ధిక ప్రయోజనం వుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మణిపూర్ లో చెలరేగుతున్న ఆశాంతి కార్పొరేట్లకు ఇబ్బందికరంగా మారింది. దేశ వ్యాప్తంగా గిరిజనుల ప్రత్యేక హక్కుల్ని రద్దు చేయాలని వారు ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారు.  మనలో చాలా మంది జమ్మూ-కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదానూ రద్దు చేయడం ముస్లిం సమస్యగా భావిస్తారు. కశ్మీర్ ఒక లోయ అనీ, అక్కడ నివాసముంటున్న వారిలో అత్యధికులు గిరిజనులని మరచిపోతారు. 


ప్రధాని ఇద్దరు సభ్యుల కుటుంబం అనడంలో ఒక మెలిక వుంది.  ఇది హిందూ ముస్లింల వివాదం అని వారొక సంకేతాన్నిచ్చారు. ఇదొక ఎన్నికల ఎత్తుగడ. భారతదేశాన్ని బహుళ సంస్కృతుల, బహుళ మతాల సమాహారంగా బిజేపిగానీ, దానికి సైధ్ధాంతిక కేంద్రమయిన ఆరెస్సెస్ గానీ గుర్తించవు. నిజానికి భారతదేశం వెయ్యిమంది సోదరుల దేశం. 


మరోవైపు, మన రాజ్యాంగం ప్రకారం అయితే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు స్వతంత్ర ప్రతిపత్తి గలవి. ఈ మూడు వ్యవస్థలు కలిసిపోతే అది నియంతృత్వానికి దారి తీస్తుందని రాజ్యాంగ నిర్మాతలు అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేసివున్నారు.  వాళ్లు భయపడినట్టుగానే శాసన వ్యవస్థే మిగిలిన రెండు వ్యవస్థల్ని నియంత్రిస్తున్నట్టు ఇటీవలి అనుభవాలు చెపుతున్నాయి. అందువల్ల ఉమ్మడి పౌర స్మృతిని  సమాజ శాంతి, దేశాభివృధ్ధి  కోసం తెస్తున్నారా? లేక రాజకీయలబ్ది కోసం  తెస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి  22వ లా కమీషన్  సహితం మినహాయింపుకాదు. 


 

2019 ఎన్నికలకు ముందు ‘ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్’ (తక్షణ ముమ్మారు తలాక్)  అంశాన్ని బిజేపి ప్రముఖంగా ముందుకు తెచ్చింది. దానిని రద్దు చేయడమేగాక, శిక్షార్హమైన నేరంగా ప్రకటిస్తానంది. దానివల్ల ముస్లిం సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నది వేరే విషయం. మోదీజీ ముస్లింలను వేధిస్తున్నారు; మధ్యయుగాల్లో ముస్లిం పాలకులు హిందువుల మీద సాగించిన అణిచివేతకు ప్రతీకారంగా  ఇప్పుడు వారి సంతతి మీద కక్ష తీర్చుకుంటున్నారు  అనే సందేశం మాత్రం చాలా బలంగా జనం లోనికి వెళ్ళింది. ఆ ఎన్నికల్లో బిజెపి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన  ఓట్ల సమీకరణకు  ఈ ప్రచారం బాగా తోడ్పడింది. 


బహుళ పార్టి వ్యవస్థగల పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో అధికారాన్ని గెలవాలంటే 51 శాతం మ్యాజిక్ ఫిగర్ ను దాటాల్సిన  అవసరం లేదు. 37.36 శాతం ఓట్లు వచ్చినా తిరుగులేని ఆధిపత్యం అనిపించుకోవచ్చు. తమ ప్రకటిత ప్రత్యర్ధి సమూహాలైన ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, ఇతర ఆలోచనాపరులు, వీరికి మద్దతునిచ్చే రాజకీయ పార్టిలకు కలిపి మొత్తంగా 20 శాతం ఓటర్లు కూడ వుండరని బిజెపి వ్యూహకర్తల అంచన. మిగిలిన 80 శాతం ఓటర్లలో మెజారిటీ తమ పక్షమే అన్న ధీమా వారిది. 


తక్షణ ముమ్మారు తలాక్ చెప్పిన వారిని జైలుకు పంపిస్తుంటే ముస్లిం మహిళలు తమకు మద్దతుగా నిలుస్తున్నారని మోదీజి-అమిత్ షాజీ చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో పోలింగ్ తీరును గమనిస్తే వారుచెప్పినట్టు 80 శాతంగా వున్న హిందూ సమాజంలోనే వారికి సగం ఓట్లు కూడ పడలేదని చాలా సులువుగానే అర్ధం అవుతుంది. 


భారత రాజ్యాంగం  న్యాయమూ, స్వేఛ్ఛా, సమానత్వము, సోదరభావం వంటి ఆదర్శాలను  ప్రకటించి ఊరుకోలేదు. వాటిని ప్రతిఒక్కరు సంపూర్ణగా ఆస్వాదించేలా హామీ ఇవ్వడానికి రెండు దశల కార్యక్రమాన్నీ ఇచ్చింది. ఇందులో మొదటిది; ప్రాధమిక హక్కులు, రెండవది ఆదేశిక సూత్రాలు. 1976లో 42వ సవరణ ద్వార ప్రాధమిక విధులు అనే మూడవ అధ్యాయం కూడ ఇందులో చేరింది. 


సమానత్వ హక్కు (ఆర్టికల్స్ 14-18), స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్స్ 19-22), దోపిడీ వ్యతిరేక హక్కు (ఆర్టికల్స్ 23-24), మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్స్ 25-28), రాజ్యాంగ పరిష్కారాల హక్కు (ఆర్టికల్ 32) అనేవి  ప్రాధమిక హక్కులు. ప్రభుత్వంలో అధికారంలో వున్నది ఏ రాజకీయ పార్టీ అయినా ప్రాధమిక హక్కులకు ఎలాంటి భంగం రానివ్వ కూడదు. 


ప్రాధమిక హక్కుల్ని సంతృప్త స్థాయి వరకు పరిరక్షించిన తరువాత ప్రభుత్వాలు ఆదేశిక సూత్రాలను కూడ పాటించడానికి ప్రయత్నించాలి   అనేది రాజ్యాంగ సభ అభిప్రాయం. "ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 44 భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర స్మృతిని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం  ప్రయత్నించాలి అని చెపుతోంది. రాజ్యాంగం అమలు లోనికి వచ్చినప్పటి తరువాత మన దేశంలో ఉమ్మడి శిక్షా స్మృతి కొనసాగుతోంది.  అయితే, సాంస్కృతిక వైవిధ్యం కారణంగా దేశంలోని ప్రతి సమూహానికీ తమవైన ప్రత్యేక పౌరస్మృతులు కొనసాగుతున్నాయి. 


ఉమ్మడి పౌరస్మృతి స్వరూప స్వభావాలు, విధివిధానాలు ఎలావుంటాయో రాజ్యాంగబధ్ధ స్థానాల్లో వున్నవారు ముందు ఒక విధాన పత్రాన్ని ప్రకటించాలి. దాని మీద చర్చలు, సంప్రదింపులు జరిగాక అందరికీ ఆమోదయోగ్యమైన పౌరస్మృతి రూపొందుతుంది. బాధ్యతగల స్థానాల్లో వున్నవారెవరూ ఈ బాధ్యతను నిర్వర్తించడంలేదు. మనుస్మృతిని ఉమ్మడి పౌరస్మృతిగా మారుస్తున్నారనే ప్రచారమే తమకు 2024 లోక్ సభ ఎన్నికల్లో లాభిస్తుందని సంతోషిస్తున్నారు. “భారత దేశంలో ఇక ఒకే మతం” అని ‘గోది’ మీడియా అప్పుడే భారీ  ప్రచారాన్ని  మొదలెట్టేసింది. 


ఒకవేళ నిజంగానే మనుస్మృతిని ఉమ్మడి పౌరస్మృతిగా మార్చాలనుకుంటే దానిని వ్యతిరేకించే సమూహాలు భారత దేశంలో అనేకం వుంటాయి.  క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులు మాత్రమేగాక హిందూసమాజంలో అంతర్భాగంగా పరిగణిస్తున్న  ఎస్టిలు, ఎస్సీలు, బిసిలు సహితం దాన్ని వ్యతిరేకిస్తాయి. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోనికి వస్తే; సామాజిక వివక్ష కారణంగా అనేక సమూహాలు ఇప్పుడు పొందుతున్న ఉద్దీపన చర్యలన్నీ రద్దు అవుతాయనే ఆందోళన కూడ కొట్టిపడేయదగ్గది కాదు. 


ఈ సందర్భంగా, ముస్లీం ధార్మిక నాయకులు కొందరు తమలో చాలాకాలంగా కొనసాగుతున్న అభద్రత, భయాందోళనల కారణంగా అనాలోచితంగా బిజెపి పన్నిన ఉచ్చులో పడిపోతున్నారు. న్యాయవ్యవస్థలో తేల్చుకోవాల్సిన అంశాల మీద రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శలు చేస్తున్నారు.  కొందరయితే మనుస్మృతికి బదులు ఇస్లాం షరియాను ఉమ్మడి పౌర స్మృతిగా ప్రకటించాలని కోరుతున్నారు.  దక్షణ భారత ముస్లిం లా బోర్డు (SIMPLB)  అధ్యక్షులు రషీద్ షరీఫ్ అయితే ఏకంగా షరియాను ఉమ్మడి పౌర స్మృతిగా అమలు చేస్తే దేశంలో అవినీతి, భ్రష్టాచారాలు అంతమైపోతాయని, సామాజిక శాంతి నెలకొంటుందని అంటున్నారు. 


సరిగ్గా ఇలాంటి ప్రకటననే ముస్లిం ధార్మిక నాయకుల నుండి బిజెపి వ్యూహకర్తలు ఆశించారు. వారు కోరుకున్నట్టే వీరు చేస్తున్నారు. ముస్లింలకు అవకాశం ఇస్తే షరియాను ముందుకు తెస్తారని హిందూ సమాజాన్ని భయపెట్టడానికి రషీద్ షరీఫ్ వంటివారి ఆవేశ ప్రకటనలు తోడ్పతాయి.  ఇలాంటి వారిని agent provocateurs అంటారు.  అంటే వీళ్ళు ముస్లింల పక్షాన వీరోచిత పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తారు. చాలా ఉద్రేకంగా ఉపన్యాసాలిస్తారు. సమాజంలో ముస్లింలను అనాగరీకుల చిత్రించడానికి మాత్రమే ఇలాంటి అతివాదం ఉపయోగపడుతుంది. ఆ విధంగా వీరు రాజకీయాల్లో ముస్లిం వ్యతిరేకులకు సహాయ పడతారు.  


కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్రాస్ల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించే ఉత్సాహంలో వుంది. మరోవైపు బిజెపి వరుస ఓటములతో నిరుత్సాహంలో వుంది. అయితే ఎన్నికల్లో గెలవడానికి బిజెపి ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వుంటుంది. మధ్యయుగాల నుంచి ఒక బైనరీని ముందుకు తెస్తుంటుంది. అమిత్ షా 2019 లోక్సభ ఎన్నికల్లో పీష్వా బాజీరావు – అహ్మద్ షా దుర్రానీల మధ్య పోటీ పెట్టారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాని మోదీజీ శివాజీ – ఔరంగజేబ్ల మధ్య పోటీ పెట్టారు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో అమిత్ షా రాణి అబ్బక్క – టిప్పూ సుల్తాన్ల మధ్య పోటీ పెట్టారు. రేపు 2024 ఎన్నికల్లో ఓటర్లను మనుస్మృతి కావాలా? ఇస్లాం షరియా కావాలా? అని అమిత్ షా అడగడానికి రషీద్ షరీఫ్ వంటివారి ప్రకటనలు దోహదం చేస్తాయి.

ఉమ్మడి పౌరస్మృతి  ఎంతమాత్రం ముస్లింలు ఒక్కరి సమస్య కాదు. బిజెపి-ఆరెస్సెస్  సామాజిక విధానాలకు బాధిత సమూహాలు అనేకం వున్నాయి. ముస్లింలు  ఆ సమూహాలతో సంవాదం సాగించాలి. ఒక  విస్తృత ఐక్య సంఘటనను నిర్మించాలి. అంతే తప్ప ఉద్వేగంతో, షరియాను ఉమ్మడి పౌరస్మృతిగా మార్చాలని మతిమాలిన ప్రకటనలు చేయకూడదు. 


(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)  కన్వీనర్)

ప్రచురణ : 5 జులై 2023 (ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ) 


https://www.andhrajyothy.com/2023/editorial/common-sense-of-civic-memory-its-not-the-emotion-its-the-strategy-that-matters-1097489.html


https://epaper.andhrajyothy.com/Home/FullPage?eid=182&edate=05/07/2023&pgid=471803



No comments:

Post a Comment