Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Monday, 3 July 2023
*ముస్లిం అస్తిత్వాన్ని మావోయిస్టులు సహితం సహించలేకపోతున్నారా?*
*ముస్లిం అస్తిత్వాన్ని మావోయిస్టులు
సహితం సహించలేకపోతున్నారా?*
సామ్యవాదాన్ని,
ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ఏ రాజకీయ పార్టి అయినా వర్తమాన చారిత్రక దశలో ఫాసిస్టు
వ్యతిరేక పోరాటాలు సాగించాలని ప్రజలకు పిలుపు ఇస్తుంది. “డానీ పోస్టు-మోడర్నిజంకు
వ్యతిరేకంగా మార్క్సిజం-లెనినిజం-మావోయిజంలను ఎత్తిపడదాం” అంటూ సిపిఐ (మావోయిస్టు)
పార్టి పిలుపిచ్చింది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో మతమైనారిటీలు ముందు పీఠిన
వుంటారు. మావోయిస్టులకు అది
నచ్చినట్టులేదనుకుంటా.
ఫాసిజం
మాత్రమేకాదు; ప్రస్తుతం దేశ రాజకీయరంగాన్ని కుదిపేస్తున్న ఉమ్మడి పౌరస్మృతి కూడ
వీరికి పట్టినట్టులేదు. అస్తిత్వ సమూహాల, మైనారిటీ మత సామాజికవర్గాల సమస్యలు
సంకుచిత అంశాలని మావోయిస్టులు భావిస్తూ వుండవచ్చు.
‘కమ్యూనిజం
వేరు; కమ్యూనిస్టు పార్టి వేరు’, సూత్రధారి ఆర్యసమాజ్, పాత్రధారి కాంగ్రెస్,
కాల్బలం కమ్యూనిస్టు పార్టి’ శీర్షికలతో రాసిన రెండు వ్యాసాల్లోనూ ఆనాటి ఉమ్మడి
కమ్యూనిస్టు పార్టి తెలంగాణ నాయకత్వాన్ని విమర్శించాను. అప్పటికి మావోయిస్టు
పార్టి కాదుకదా దానికి మాతృకలు అయిన పీపుల్స్ వార్, సివోసిలు కూడ పుట్టలేదు. పైగా,
నాటి తెలంగాణ పార్టి నాయకత్వం మీద సివోసి నేత కొండపల్లి సీతారామయ్య బహిరంగ సభల్లో
విరుచుకు పడేవారు. అలాంటిది; మావోయిస్టు పార్టి నామీద ఒక ప్రకటన జారీచేయడం కొంచెం
ఆశ్చర్యకరం.
పెట్టుబడీదారీ
వ్యవస్థలో ఉత్పత్తి అత్యున్నత స్థాయికి చేరాక మాత్రమే పెట్టుబడీదారులు ఫ్యాక్టరీ
కార్మికులు బరిగీసి ఒకరికొకరు ఎదురుబదురుగా నిలబడి వర్గపోరాటం చేస్తారు అని
మార్క్స్ వివరించాడు. అంటే, అంతకు పూర్వపు వివిధ చారిత్రక దశల్లో పీడిత,
పీడక వర్గాలు అనేక రూపాల్లో వర్గ పోరాటాలు సాగిస్తూ వుండేవి అనేది
ఆయన అవగాహన. దాన్ని ఆయన చాలా విస్తారంగా వివరించాడు. "ఇప్పటి వరకు అస్తిత్వంలోవున్న
సమస్త సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే" (“The history of all
hitherto existing societies is the history of class struggles”) అనే ప్రకటనతో
ఆరంభం అవుతుంది మార్క్స్-ఏంగిల్స్ రాసిన
కమ్యూనిస్టు ప్రాణాళిక.
మనదేశంలో
మావోయిస్టు పార్టి పుట్టక ముందు నుండే కాదు ప్రపంచంలో అసలు కమ్యూనిస్టు పార్టి
పుట్టక ముందు నుండి కూడ వర్గ పోరాటం వుంది. ఇంకా మాట్లాడితే, వర్గ సమాజం
పుట్టినప్పటి నుండే వర్గపోరాటం కొనసాగుతోంది. నా మీద ప్రకటన జారీచేసిన వారు
కమ్యూనిస్టు ప్రణాళిక తొలి అధ్యాయాన్ని కాదుకదా అందులోని తొలి వాక్యాన్ని కూడ చదివి వుండరు.
ఇంగ్లండ్
లో ఆనాడున్న ఉన్నతస్థాయి పారిశ్రామిక
వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మార్క్స్ కొన్ని విశ్లేషణలు, పరికల్పనలు
చేశాడు. ఇంగ్లండ్ అంతాగా ఫ్యాక్టరీ ఉత్పత్తి వ్యవస్థ అభివృధ్ధి చెందని రష్యా కోసం
ఒక సృజనాత్మక పోరాట పంథాను లెనిన్ అభివృధ్ధి చేశాడు. మావో ఇంకో అడుగు ముందుకేశాడు.
అసలు పారిశ్రామిక విప్లవం ఆరంభంకాని చైనాలో తన సృజనాత్మకతతో ఇంకో తరహా పోరాట
పంథాను రూపొందించాడు. నాటి భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతంలో పారిశ్రామిక అభివృధ్ధి
సాగుతోంది. ఆంధ్రా, బెంగాల్ రాష్ట్రాల్లో వ్యవసాయిక రంగం అభివృధ్ధి చెందుతోంది.
ఇక్కడ రష్యా, చైనాలకు భిన్నమైన విప్లవపంథా రూపొందాలి. పైగా, ఆసియా ఉత్పత్తి విధానం,
భారత దేశంలో కుల వ్యవస్థ భిన్నమైనవి, ప్రత్యేకమైనవి అని స్వయంగా మార్క్సే
చెప్పియున్నాడు. 1857 నాటి సిపాయిల తిరుగుబాటు కాలం నుండి ఒక దశగా, 1947లో దేశ
విభజన తరువాత మరో దశగా దేశంలో హిందూ ముస్లిం పంచాయితీ ఒకటి సాగుతున్నదని కమ్యూనిస్టు
పార్టీలు గుర్తించి తీరాలి. అలాంటి సూచనలు మావోయిస్టు ప్రకటనలో లేవు.
భారత
సమాజపు ప్రత్యేకతల్ని పరిగణన లోనికి తీసుకుని మార్క్సిస్టు మూల సూత్రాలను
అన్వయిస్తూ ఒక స్వతంత్ర విప్లవ పంథాను రూపొందించే బాధ్యతను భారత కమ్యూనిస్టు
పార్టీల నాయకులు ఎవ్వరూ ఇప్పటి వరకు చేపట్టలేదు
అనేది ఒక బలమైన అభియోగం. మహారాష్ట్ర పారిశ్రామికాభివృధ్ధి ప్రభావం వున్నవాళ్ళు
రష్యామార్గం అన్నారు, ఆంధ్రా, బెంగాల్ వుయవసాయరంగ ప్రభావం వున్నవారు చైనామార్గం
అన్నారు. అంతేతప్ప, భారతమార్గం అన్నవారు ఒక్కరూ లేరు.
లెనిన్
మావోల తరువాత కమ్యూనిస్టు నాయకుల బలహీనతల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూవచ్చిన ప్రపంచ
బ్యాంకు, గ్యాట్ ఏకమై ప్రపంచ వాణిజ్య సంస్థను నెలకొల్పి ఐటి విప్లవానికి ద్వారాలు
తెరిచాయి. అప్పటి వరకు చైనా రష్యాలను కాపీకొట్టి బతికేసిన వివిధ దేశాల కమ్యూనిస్టు
పార్టీలు కొత్త సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలియక చేతులు ఎత్తేశాయి. ఈ క్రమం 1980
మధ్యలో ఆరంభమై 1990 మధ్యలో ముగిసింది.
మనం
జాగ్రత్తగా గమనిస్తే గ్యాట్ ఉరుగ్వే రౌండ్ చర్చలు ఆరంభం, ప్రపంచ పెట్టుబడీదారులు
హేతువాదాన్ని వదిలి మెజారిటీ మతాలతో జతకట్టడం, ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో
కల్లోలం, వాయువ్య రాష్ట్రాల్లో సంక్షోభం, ఢిల్లీలో శిక్కుల ఊచకోత, సంఘపరివారం రథయాత్రలు,
తూర్పు యూరోప్ పతనం, సరళీకరణ,
ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) ఆర్ధిక విధానాల విజృంభణ, రష్యా విఛ్ఛిన్నం, బాబ్రీ
మసీదు కూల్చివేత, గ్యాట్ ఒప్పందంపై సంతకాలు ప్రపంచ ఆర్ధిక సంస్థ ఆవిర్భావం అన్నీ ఆ ఆ పదేళ్ళలోనే జరిగాయి.
ఇది
మాక్రో లెవల్. మైక్రో లెవల్లో ఇంకొంచెం పరిశీలిస్తే మీనాక్షిపురం మత మార్పిడులు,
కారంచేడు హత్యాకాండ, కెజి సత్యమూర్తిని పీపుల్స్ వార్ బహిష్కరించడం, ఆ తరువాత కొండపల్లిని
సీతారామయ్యను కూడ పార్టీ నుండి పంపించివేయడం వగయిరాలన్నీ ఈ కాలంలోనే జరిగాయి.
దాదాపు
65 సంవత్సరాలు ఎదురు చూసిన అస్తిత్వ సమూహాలకు ఈ దశలోనే కమ్యూనిస్టు పార్టీల మీద
నమ్మకం పూర్తిగా పోయింది. పెత్తందారీ సామాజికవర్గాల్లోని చిన్న భాగం ఒకటి అప్పటి
వరకు కమ్యూనిస్టు పార్టీల్లో ప్రముఖంగా వుండేది. LPG ఆర్ధిక దశలో దానికి కమ్యూనిస్టు పార్టీలతో
అవసరం తీరిపోయింది. అది బయటికి పోయింది.
భారత
కమ్యూనిస్టు పార్టీల చారిత్రక విషాదం ఏమంటే అస్తిత్వ సామాజికవర్గాలను అవి పీడిత సమూహాలుగా
గుర్తించవు; అస్తిత్వ యేతర సామాజికవర్గాలకు ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో పనిలేదు.
నిజానికి కమ్యూనిస్టు పార్టిల నాయకులకన్నా గొప్ప సృజనాత్మకత కలిగిన మార్స్కిస్టు ఆలోచనాపరులు
ఎందరో కమ్యూనిస్టు అభిమానులుగా వుంటారు. వాళ్లంటే కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఒక
రకం ఫోబియా. వాళ్ళను పెటీ-బూర్జువాలుగా చిత్రించి వివక్షను కొనసాగిస్తూ వుంటుంది.
కమ్యూనిస్టు
అభిమానులు, పార్టీ కార్యకర్తలు, పోరాటాల్లో పాల్గొన్నవారూ, ధన, మాన, ప్రాణాల్ని
త్యాగం చేసినవారు చాలా గొప్పవారు. వాళ్లు చాలా నిజాయితీగా వ్యవహరించారు. మనం స్వాతంత్ర్యంగా
చెప్పుకుంటున్నది అధికార మార్పిడి మాత్రమే అనే అవగాహనతో సాగిన మొదటి దశ కమ్యూనిస్టు
పోరాటాలకు, నిరుద్యోగం, ధరల పెరుగుదల భరించ శక్యంగా లేనికాలంలో సాగిన రెండవ దశ కమ్యూనిస్టు
(నక్సలైట్) పోరాటాలకు సమాజంలో గొప్ప
స్పందన లభించింది. ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడినా ఫలితం దక్కలేదంటే దానికి
బాధ్యత దళపతులదే. ఆ దళపతులు చేతగాక (inept) ఓడిపోయారా? లేక ప్రజా పోరాటాలకు ఉద్దేశ్యపూర్వకంగా
ద్రోహాన్ని తలపెట్టారా? (betrayal) అనేదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న.
నక్సల్
బరీ ఉద్యమానికి ముందు సాగిన తెలంగాణ, తెబాగా, పున్నప్రావాయిలార్, వర్లీ తదితర
పోరాటాలన్నీ కమ్యూనిస్టు పార్టీ నాయకుల ‘రివిజనిస్టు’
పోకడల కారణంగానే నీరుగారాయని మావోయిస్టు పార్టి అంటున్నది. నేనూ ఆ రెండు
వ్యాసాల్లో ఆ ముక్కే రాశాను. ఈ మేరకు మా
మధ్య ఏకాభిప్రాయం వున్నది!.
ఇంతకీ
రివిజనిజం అంటే ఏమిటీ? In the context of the communist movement,
revisionism refers to the advocacy or implementation of policies that deviate
from or revise the original principles, doctrines, or goals of Marxism-Leninism
అంటూ
దీనికో పెద్ద నిర్వచనం ఇవ్వవచ్చు. మనకు అంత ఇంగ్లీషు వద్దులే అనుకుంటే ఒక్క
ముక్కలో ‘అన్యవర్గ భావజాలం’ అనుకోవచ్చు.
అన్యవర్గం
అంటే ఏమిటీ అంటూ ఇక్కడ ఇంకో నిర్ధిష్ట ప్రశ్న ఎదురవుతుంది. “తెలంగాణలో రైతుకూలీ
రాజ్య స్థాపన” కోసం సాగుతున్న పార్టీకి
నాయకులుగావున్నవాళ్ళు భూస్వాముల ప్రతినిధులుగా ఆలోచించారు అనేది ఒక ఆరోపణ. ముస్లింలు
కూడ పాల్గొంటున్న పోరాటంలో నాయకులు ముస్లిం వ్యతిరేకతను ప్రదర్శించారు అనేది ఇంకో ఆరోపణ.
మావోయిస్టు పార్టి మొదటి ఆరోపణను మార్క్సిస్టు విమర్శ అంటోంది; రెండో ఆరోపణను పోస్ట్
–మోడర్నిస్టు విమర్శ అంటోంది.
తెలంగాణ
పోరాటానికి ‘మేధోసరోవరం’గా పని చేసిన కామ్రేడ్స్ అసోసియేషన్ లో ముస్లింలు కూడ
వున్నారు అంటే సరిపోదు; ముస్లింలే అత్యధికులుగా వున్నారు అన్నా సరిపోదు; అందులో ఇద్దరు
ముగ్గురుతప్ప మిగిలినవాళ్ళందరూ ముస్లింలు అంటేనే వాస్తవం చెప్పినట్టు అవుతుంది. ఈ వాస్తవాన్ని స్వీకరించడానికి మావోయిస్టు
పార్టి సిధ్ధంగా లేదు.
మావోయిస్టు
పార్టి ప్రకటనలో నీచస్థాయి వక్రీకరణలు కొన్ని వున్నాయి, కమ్యూనిస్టు పార్టి
నాయకత్వాన్ని విమర్శిస్తే కమ్యూనిస్టుల్ని కమ్యూనిజాన్నీ మార్క్సిజాన్నీ విమర్శించినట్టు చిత్రించారు. సువిశాల నైజాం సంస్థానం గురించి
మాట్లాడితే దాన్ని తెలంగాణకు పరిమితం చేశారు. నైజాం సంస్థానంలోని నాలుగు భాగాల్లో
తెలంగాణ ఒకటి. ఆ తెలంగాణలోని ఎన్నిజిల్లాలు తాలూకాల్లో సాయుధపోరాటం జరిగిందనేది
మరో భౌగోళిక పార్శ్వం. ముందు ఈ భౌగోళిక వాస్తవాన్ని వారు తెలుసుకోవాలి. మత కారణంతో ఆర్యసమాజ్, రాజకీయ కారణంతో కాంగ్రెస్ మొత్తం నిజాం సంస్థానాన్ని ఇండియన్
యూనియన్ లో విలీనం చేయదలిచాయంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఎందుకు ఉక్రోషం వస్తోందీ? నైజాం విలీనం కాగానే కమ్యూనిస్టు
పార్టి నాయకత్వం పోరాట విరమణ ప్రకటించింది. దానివల్ల ఆర్యసమాజ్, కాంగ్రెస్ ల బృహత్
పథకానికి ఎలాంటి మేలూ జరగలేదు అనడానికి మావోయిస్టుల దగ్గర ఎదైనా వాదన వుందా? నైజాం
విలీనానికి కమ్యూనిస్టు పార్టి కాల్బలంగా తన సేవల్ని అందించిందంటే వీరికి వచ్చిన
ఇబ్బంది ఏమిటీ?
“అస్తిత్వవాదం
లేదా మతవాదం యొక్క దృక్పథం నుండి మార్క్సిజాన్ని విశ్లేషణ చేయడం అనేది మార్క్స్
వాదానికి విరుద్ధమైనది” అంటూ వీరొక ప్రవచనం చేశారు. అసలు అస్తిత్వ, మతవాదాల దృక్పథం నుండి మార్క్సిజాన్ని విశ్లేషణ చేయమని
వీరిని ఎవరు ఎప్పుడు అడిగారూ? మనదేశ జాతి, మత, కుల, తెగ వ్యవస్థల్ని మార్క్సిస్టు
దృక్పథంతో వర్గ విశ్లేషణ చేయమని మాత్రమే అస్తిత్వ సమూహాలు కోరుతున్నాయి. అది మీకు
సాధ్యమవుతుందోలేదో చెప్పండి. కనీసం, మనదేశంలో ఒక జాతిని మరోజాతి, ఒక మతాన్ని మరో
మతం, ఒక కులాన్ని మరోకులం, ఒక తెగను మరోతెగ అణిచివేస్తున్నదో లేదో పరిశీలించి చెప్పమంటే
వీళ్ళు ఇంతగా ఎందుకు భయపడుతున్నారూ?
వర్తమాన
సమాజంలో కమ్యూనిస్టు పార్టీలకన్నా అస్తిత్వ సమూహాలు విశాలంగా ఆలోచిస్తున్నాయి. తమ విముక్తి
కోసం పోరాడుతూనే కార్మికవర్గంతోసహా ఇతర సమూహాల విముక్తి కోసం కూడ కలిసి పనిచేస్తున్నాయి.
ప్రస్తుతం
మావోయిస్టుల కార్యకలాపాలు దంతేవాడ జిల్లాలో చురుకుగా సాగుతున్నట్టు మీడియా ద్వార
అర్ధం అవుతోంది. ఈ సందర్భంగా మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడగాలి. మార్క్స్ రహాస్యంగా
మీ చెవిలో చెప్పినట్టు అక్కడ ఏ ఫ్యాక్టరీ
యజమానులకు వ్యతిరేకంగా ఏ కార్మికుల పక్షాన మీరు పోరాడుతున్నారూ? మీరు ఆదివాసుల పక్షాన
పోరాడుతున్నట్టు ప్రకటనలు చూస్తున్నాము. ఆదివాసులు
అస్తిత్వ సమూహాలని మీకు తెలీదా? లేక మీరు కూడ మాలాగే అస్తిత్వ సమూహాలతో ‘అపవిత్ర
కలయిక’ చేసుకుని అక్కడ “మార్క్స్ వాదానికి విరుద్ధమైన” కార్యకలాపాలు సాగిస్తున్నారా?
మీరు చరిత్రను మరిచిపోయి వుంటారుగానీ 1855-56 మధ్యలో సాగిన సంతాల్ తిరుగుబాటుగానీ,
1969లో మొదలయిన నక్సల్ బరీ ఉద్యమంగానీ సామాజికంగా అస్తిత్వ పోరాటాలే. అక్కడ మీకు అస్తిత్వ
వాదంతో ఇబ్బంది లేదు. బహుశ, మీకు దేశంలో ముస్లిం అస్తిత్వంతో మాత్రమే అభ్యంతరం
వున్నట్టుంది. అలా అయితే ఈ లోకంలో మీ దాయాదులు చాలామంది వున్నారు.
ఈ
సందర్భంగా మీకు ఒక చారిత్రక సంఘటనను
గుర్తు చేయాలి. ఫాసిజాన్ని రష్యాకన్నా ముందుగా 1943లోనే ఓడించింది ఉత్తర
ఆఫ్రికా ఖండంలోని లిబియా, ఈజిప్టు ముస్లిం దేశాలే. ‘ఓమర్ ముఖ్తార్’ సినిమా చూసి
వుంటారుగా. ఇక ముందు ప్రకటనలు విడుదల చేసే సమయంలో ఒకసారి వాస్తవాలను సరి చూసుకుంటూ
వుండండి.
అస్తిత్వ
సమూహాలవి చాలా చిన్నచిన్న కోరికలు. చిన్నచిన్న లక్ష్యాలు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడం వంటివన్న
మాట. మీవి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు; “దున్నేవానికే భూమి నినాదంతో సాగే -
వ్యవసాయిక విప్లవం ఇరుసుగా గల - నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం”;
దానికోసం ఓ శతాబ్దంపాటు సుదీర్ఘకాల సాయుధ పోరాటాలు చేయడం వంటివి.
గడిచిన
50 ఏళ్ళలో మీ కార్యక్రమ లక్ష్య సాధనలో ఎన్ని
అడుగులు ముందుకు వేశారో ఓ నివేదిక ప్రచురిస్తే బాగుంటుంది. అంతేగానీ, మీకే అర్ధం
కాని మార్క్సిజం, మోడర్నిజం, పోస్ట్- మోడర్నిజం వంటి విషయాల మీద ప్రకటనలు చేస్తే అంత నప్పవు.
డానీ
ముస్లిం
ఆలోచనాపరుల వేదిక (MTF)
4
జులై 2023
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment