*’చావు నీళ్ళు’ కు ప్రాణం పోసిన సయ్యద్ నశీర్ అహ్మద్*
యాధృఛ్ఛికమేగావచ్చు ఈ వారం 1857నాటి భారత
ప్రధమ స్వాతంత్ర్య పోరాటం గురించి రెండు పుస్తకాలు
చదివే అవకాశం దక్కింది. కారంచెడు మృతవీరులకు నివాళి అందించడానికి జులై 17న చీరాల వెళూతూ,
ప్రయాణంలో చదవడానికి ‘The Indian Rebellion of 1857’ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళాను.
ఇంటికి చేరే సయమానికి సయ్యద్ నశీర్ అహమ్మద్ కొత్త పుస్తకం ‘అండమాను జైలు ముస్లిం స్వాతంత్ర్య
సమరయోధులు’ పుస్తకం వచ్చివుంది.
భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాటం జరిగి వందేళ్ళు అయిన సందర్భంగా పీపుల్స్
పబ్లిషింగ్ హౌస్ 1957లో ప్రచురించిన వ్యాసాల సంకలనం మొదటి పుస్తకం. దీనికి పిసి జోషి
ఎడిటర్ గా వ్యవహరించారు. ఇందులో 15 గొప్ప వ్యాసాలున్నాయి. అందులో జోషి రాసిన దాదాపు
వంద పేజీల అద్భుత వ్యాసం కూడ వుంది.
భావి భారత సమాజ సమీకరణ ఎలా వుండాలో 1857
నాటి భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాటం నిర్ధారించింది. హిందూ - ముస్లింలు స్థానికులు
ఆంగ్లేయులు పరాయివాళ్లు అనే ప్రాదేశిక జాతీయవాద
భావన చాలా బలంగా ముందుకు వచ్చింది. 1920లలో కొందరికి ఈ ప్రాదేశిక జాతీయవాద నార్మేటివ్
నచ్చలేదు. వాళ్లు కొత్తగా సాంస్కృతిక జాతీయవాద సిధ్ధాంతాన్ని బయటికి తెచ్చి ప్రచారంలో
పెట్టారు. దీనికోసం చరిత్రను తిరగరాయడం మొదలెట్టారు.
సాంస్కృతిక జాతీయవాద
నార్మెటివ్ తో రాసే చరిత్రలో గాంధీజీ మొదటి జాతీయ ద్రోహి. వినాయక్ దామోదర్ సావర్కర్
తొలి జాతీయ వీరుడు. ముస్లింలు అంటే పరాయివాళ్లు, కుట్రదారులు, దేశద్రోహులు, ఉగ్రవాదులు.
ఇలా తలకిందులు చేసిన
చరిత్రను మరలా కాళ్ళ మీద నిలబెట్టే ఒక చారిత్రక బాధ్యతను నశీర్ అహమ్మద్ చాలాకాలం క్రితమే
తన భుజాలకు ఎత్తుకున్నాడు. అనేక పుస్తకాలు రాశాడు; ప్రచురించాడు, కొన్నింటిని ఉచితంగానూ పంపిణీ చేశాడు. ఆ పరంపరలో వచ్చిన కొత్త పుస్తకం
ఇది. అలనాటి అండమాను జైలులో శిక్షలు అనుభవించిన ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను
ఈ పుస్తకం తెలుపుతుంది.
ప్రపంచంలో మనకు ఎర్రసముద్రం,
పచ్చసముద్రం, పసుపుపచ్చ సముద్రం, తెల్లసముద్రం, గులాబీసముద్రం (పింక్ లేక్), నల్ల సముద్రం
వగయిరాలున్నాయి. అండమాన్ – నికోబర్ దీవుల్లో వున్నది నల్ల సముద్రం కాదు; నల్ల నీళ్ళు.
హిందీలో ‘కాలాపానీ’ అంటారు. ‘చావునీళ్లు’ అన్నమాట. అండమాన్ సెల్యూలార్ జైలుకు పంపడం
అంటే చావండి అని ఆర్డర్ వేయడమే. మన ముస్లిం
స్వాతంత్ర్యయోధులు చావునీళ్ళలో సాగించిన బతుకుపోరాటాన్ని 9 అధ్యాయాలతో కూడిన మూడు వందల
పేజీల పుస్తకంలో నశీర్ అహమ్మద్ పదిల పరిచాడు.
పుస్తకాన్ని పూర్తిగా
చదివాక వివరమైన సమీక్ష రాస్తాను. అందరూ చదవాల్సిన పుస్తకం అని మాత్రం చెప్పగలను.
20 జులై 2023
No comments:
Post a Comment