Saturday, 29 July 2023

To Whom Purandeshwari Targetting

 పురందేశ్వరి టార్గెట్ ఎవరూ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికర సందేహం వేగంగా చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టార్గెట్ ఎవరూ? జగనా? చంద్రబాబునా? అనేది ఆ సందేహం.   

పార్లమెంటరీ ప్రాతినిధ్య  ప్రజాస్వామిక రాజకీయాలంటేనే కులమతాల ప్రస్తావన వస్తుంది. ఏపి రాజకీయాల్లో కుల ప్రభావం మరీ ఎక్కువ. మనరాజకీయ నాయకులు బహిరంగ సభల్లోనే కొన్ని కులమతాలను  అక్కున చేర్చుకుంటారు; కొన్ని కులమతాలను తిట్టిపోతుంటారు. అయితే, రాజకీయాల్లో ఏ సామాజికవర్గమూ నూటికి నూరు శాతం ఒక పార్టి వెనుక వుండదు. పెద్ద భాగం ఒక పార్టికి మద్దతుదారులుగా వుంటే చిన్న భాగం వివిధ  పార్టీల అభిమానులుగా వుంటుంది.

రెడ్డి సామాజికవర్గంలో పెద్ద భాగం అధికార పార్టి అయిన  వైయస్సార్ కాంగ్రెస్ పార్టికి మద్దతు ఇస్తోంది. అందులో చిన్న భాగం ప్రతిపక్ష టిడిపితో సహా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తుంటుంది. అలాగే, కమ్మ సామాజికవర్గంలో పెద్ద భాగం ప్రధాన ప్రతిపక్ష పార్టి అయిన  తెలుగు దేశం పార్టికి మద్దతు ఇస్తోంది. అందులో చిన్న భాగం  వైయస్సార్ సిపితో సహా అనేక పార్టీలకు మద్దతు ఇస్తుంటుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు రెండు పార్టీలకు కొమ్ము కాస్తుండడంతో బిజెపి తన దృష్టిని మూడో పెద్ద సామాజిక వర్గమైన కాపుల మీద పెట్టింది. కొత్త రాష్ట్రం ఎర్పడ్డాక రాష్ట్ర బిజెపికి నాయకత్వం వహించిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందినవారే.

గత ఏడాది జరిపిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో జగన్ ఓసీల్లో రెడ్లు, కాపులకు మాత్రమే స్థానం కల్పించారు. ఓసిల్లో  ‘అగ్రవర్ణాలు’ అయిన బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యులకు ప్రస్తుత జగన్ కేబినెట్ లో స్థానం లేదు. అలాగే, వ్యవసాయ కులాలకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి కూడ స్థానం లేదు. రెడ్డి సామాజికవర్గంలో పెద్ద భాగం ఎలాగూ జగన్ వెంట వున్నది. కాపు సామాజికవర్గం నుండి కూడ ఒక పెద్ద భాగాన్ని ఆకర్షిస్తే పోల్ మేనేజ్మెంటుకు లెఖ్ఖ సరిపోతుందని జగన్ భావిస్తున్నారు.

బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యు సామాజిక వర్గాల్లో సగభాగం బిజెపికి అనుకూలురుగా వుంటున్నారు. మిగిలినవారు సగభాగం అన్నిపార్టిల్లోనూ కొనసాగుతున్నారు.

ముస్లిం, క్రైస్తవ, ఎస్టి, ఎస్సీ సమూహాల్లో అత్యధికులు గత ఎన్నికల్లో  వైసిపికి ఓట్లేశారు. జగన్ కు క్రైస్తవ మత మైనారిటి కోణం కూడ వుండడం దీనికి ప్రధాన కారణం.

జనాభాలో అధిక సంఖ్యాకులుగా భావించే వెనుకబడిన తరగతులకు చెందిన సమూహాలు దాదాపు చెరి సగం అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో వుంటున్నాయి. రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బిఎస్పీ పార్టీలు వున్నప్పటికీ ప్రస్తుతం వాటికి స్థిర ఓటు బ్యాంకు లేదు.

ఇవీ ఓ ఏడాది క్రితం వరకున్న సామాజిక సమీకరణలు.

గత ఎన్నికల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‍ ఈసారి పట్టుదలతో జనాన్ని కదిలిస్తున్నారు. ఆయన ఓటు బ్యాంకు గతంకన్నా పెరుగుతున్నది. ఆయన ప్రధానంగా కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షిస్తున్నారు. పైగా, తాను బిజెపి ఇచ్చే రోడ్ మ్యాప్ ను అనుసరిస్తున్నట్టు పదేపదే చెపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా  వుండేందుకు జనసేన, బిజెపి, టిడిపి కలిసి పోటీ చేస్తాయని వారంటున్నారు.

పురందేశ్వరి కొత్త పదవిని చేపట్టిన క్షణం నుండే  ముఖ్యమంత్రి జగన్ మీద పదునైన బాణాలను వదలడం మొదలెట్టారు. జనసేన పవన్ కళ్యాణ్ తో పొత్తు వుంటుందని వారు నిర్ధారించారుగానీ టిడిపి చంద్రబాబుని కూడ కలుపుకుని పోతాం అనలేదు. పొత్తుల విషయం తమ జాతీయ నాయకత్వం పరిధిలోని అంశం అంటూ తప్పుకున్నారు. వారు అక్కడితో ఆగలేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారని కుండబద్దలు కొట్టారు. ఇది రాజకీయంగా చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రకటన. జులై 28న నిర్వహించిన మీడియా సమావేశంలోనూ పురందేశ్వరి పాయింట్ల వారీగా జగన్ పరిపాల మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించారు. ఒకవైపు, జగన్ ను విమర్శిస్తూ, మరోవైపు చంద్రబాబును ఇరుకున పెడుతూ సాగుతున్న బిజెపి గేమ్ ప్లాన్ లక్ష్యం ఏమిటీ? అనే అంశం మీద ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలయింది.

కాపు సామాజికవర్గాన్ని సమీకరించే పనిలో పవన్ కళ్యాణ్ వున్నప్పుడు  తాము కమ్మ సామాజికవర్గాన్ని సమీకరించడం మీద దృష్టి పెట్టాలని బిజెపి వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఈ ఎత్తుగడలో భాగంగానే వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును తప్పించి కమ్మ సామాజికవర్గానికి చెందిన పురందేశ్వరిని రంగంలో దించారు. పురందేశ్వరి ఎంపికకూ మరికొన్ని కారణాలున్నాయి. ఆమె ఎన్టీ రామారావు పుత్రిక కావడాన టిడిపి వ్యవస్థాపకుని  సెంటిమెంటు పనికి వస్తుందనేది ఒక కారణం. వ్యక్తిగతంగా దగ్గుబాటి కుటుంబానికీ చంద్రబాబుకూ పడదనేది ఇంకో కారణం.

టిడిపిని వదలాల్సిన పరిస్థితి వచ్చినా  కమ్మ సామాజికవర్గం వైసిపిలో చేరే అవకాశాలు తక్కువ. అప్పుడు వాళ్ళు బిజెపిని ఎంచుకుంటారు. గత ఎన్నికల ఫలితాలు రాగానే, టిడిపి అధికారాన్ని కోల్పోయిందని తెలియగానే నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. అలాంటి పరిణామాలు  ఇప్పుడు ఎన్నికలకు ముందే చోటుచేసుకుంటాయని బిజెపి అంచనా వేస్తున్నది.

గత ఎన్నికల్లో 22 మంది లోక్ సభ సభ్యుల్ని గెలిపించుకున్నప్పటికీ, రాజ్యసభలో ప్రస్తుతం 12మంది సభ్యులున్నప్పటికి జగన్ ఢిల్లీలో స్వతంత్ర రాజకీయ ఉనికిని వదులుకుని బిజెపి సేవలో తరిస్తున్నారు.  అడిగినా అడక్కపోయినా పార్లమెంటు వుభయ సభల్లోనూ బిజెపికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. దానికి ప్రతిఫలంగా కేంద్ర కేబినెట్ లో ఒక్క మంత్రి పదవిని కూడ కోరలేదు.

ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడ  జగన్ పాలన మీద గట్టి ఆరోపణలు సంధించారు. వాటికి ఇప్పుడు పురందేశ్వరి మరింత పదును పెడుతున్నారు.

బిజెపి ఇంతగా ఆరోపిస్తున్నా వైసిపి గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నది. కొన్ని విబేధాలున్నా కేంద్రంలో బిజెపితోనే వుంటామని వైసిపి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చింది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనూ బిజెపితోనే వుండాలని ఎంపిలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. చేతిలో ఇంతమంది ఎంపీలు వున్నప్పటికీ ఎదురు తిట్లు తింటూ  బిజేపికి ఇంతటి ఉచిత సేవ చేస్తున్న పార్టి దేశంలో మరెక్కడా లేదు.

పవన్ కళ్యాణ్ సహకారంతో కాపు ఓటు బ్యాంకును కొల్లగొడుతూ,  పురందేశ్వరి వ్యూహాలతో చంద్రబాబు కాళ్ల కింది నేలను లాగేస్తే ఏపిలో తాము స్వంతంగానే ఓ పది పదిహేను లోక్ సభ సీట్లు గెలుచుకోవచ్చని బిజెపి ఆశిస్తోంది. మొత్తం 25 లోక్ సభ సీట్లలో 20  వాళ్ల టార్గెట్.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జగన్ ఎన్ని  సీట్లు గెలుచుకున్నా చివరకు అవి వచ్చి పడేవి తమ ఒళ్ళోనే కనుక వాటి గురించి బిజేపికి బెంగలేదు. వాళ్ళిప్పుడు చంద్రబాబుని తప్పించి టిడిపి ఓటు బ్యాంకును కొల్లగొట్టి స్వతంత్రంగా బలపడాలనుకుంటున్నారు.

డానీ

సీనియర్ జర్నలిస్టు  9010757776

రచన :  28 జులై 2023

No comments:

Post a Comment