Wednesday, 20 May 2026

I am afraid to go to Mecca -

 I am afraid to go to Mecca

*మక్కా కు వెళ్ళాలంటే నాకు భయం*.




 

ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ ఇవి ఐదూ ముస్లింలకు మౌలిక విధులు. మొదటి మూడింటికి ఎవ్వరికీ మినహాయింపులు లేవు. చివరి రెండింటినీ  ఆర్ధిక అవకాశాన్నిబట్టి పాటించాలి అనుకుంటాను.  

 

ఈమాన్ విషయంలో నాకు ఎప్పుడూ మరో ఆలోచనలేదు. నేను అల్లాను నమ్ముతాను. అల్లా దయ నా మీద బలంగా వుందని కూడ నమ్ముతాను. అనేక సందర్భాల్లో ప్రాణాపాయాల నుండి ఒక మెరికల్ గా నేను తప్పించుకున్నాను.

 

మార్క్సిస్టుగా వుంటూ అల్లాను నమ్మవచ్చా అనే సందేహం నాకు ఎప్పుడూ లేదు. కార్ల్ మార్క్స్ ను లండన్ లోని యూదుల హైగేట్ స్మశానంలోనే ఖననం చేశారు. మార్క్సిజం దైవ విశ్వాసానికి వ్యతిరేకం ఏమీకాదు.  రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ముస్లిం మార్క్సిస్టులు, ఇస్లామిక్ సోషలిస్టులు పెట్టుబడిదారీ విధానం, వలసవాదం, సామ్రాజ్యవాదం, ఫాసిజం, నాజీజంల మీద పోరాడారు. వీరు అణచివేతకు వ్యతిరేకం, న్యాయం, సమానత్వం అనే ఇస్లామిక్ సూత్రాలను మార్క్సిస్ట్ వర్గదృక్పథంతో జోడించి తిరుగుబాట్లు సాగించారు.

 

నమాజ్, రోజాల విషయంలో కొన్ని బద్దకాలున్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. కొన్ని బలహీనతలున్నాయి. అవన్నీ పూర్తిగా నా దోషాలు.  అందుకు నన్ను క్షమించాలి.  జకాత్, హజ్ నా ఆర్ధిక పరిధిలోని అంశాలు కావు.

 

“Feed the hungry, visit the sick, and free the captive if he is unjustly confined. Support anyone who is oppressed, whether Muslim or non-Muslim.” — Prophet Muhammad.

 

అనాధలు, వితంతువులు, నిస్సహాయుల విషయంలో దయగలిగి ప్రవర్తించంచండి అనే నియమాన్ని నేను ప్రతి సందర్భంలోనూ పాటించాను.  రాజ్యం నిరపరాధుల్ని బంధిస్తే వారి విడుదల కోసం పోరాడడం మన కర్తవ్యం అన్న ఆదేశం ఒక సామాజిక కార్యకర్తగా నాకు  ప్రేరణగా వుంటుంది. 

 

ఇండియా నా మాతృభూమి, నా కర్మభూమి, నా జీవన పుణ్యభూమి. ఒక దేశంగా సౌదీ అరేబియా ముస్లింలకు పుణ్యభూమి ఏమీ కాదు. ముస్లింల ధార్మిక పుణ్యస్థలాలు మక్కా, మదీనాలు.

 

సౌదీ అరేబియాతో నాకో అనుబంధం వుంది. మా మేనత్త (మానాన్నగారికి పెదనాన్న కుమార్తె) అఖ్తరి  జిద్దాలో సెటిల్ అయ్యారు. వారి భర్త సౌదీ అరేబియా కేంద్ర ప్రభుత్వంలో పెద్ద అధికారి. నా బాల్యంలో కొన్నేళ్లు అఖ్తరీ ఫుప్పుజాన్ దగ్గరే వున్నానంటా. తనకు నేనంటే పెద్ద కొడుకు అనే భావన వుండేది. ఇదంతా 1953 నాటి సంగతి.

 

1980లో ఇండియాకు వచ్చిన అఖ్తరీ ఫుప్పుజాన్ నన్ను తనతోపాటు సౌదీకీ తీసుకుపోతానన్నారు. అప్పట్లో నక్సలిజం పూనకంలోవున్న నాకు ఇండియా వదిలి వెళ్ళాలనిపించలేదు.  ఆ తరువాత ఎన్నడూ వేరే దేశంలో కాలుపెట్టనూలేదు.

 

మా అమ్మీని హజ్ యాత్రకు పంపించాము. మా దగ్గర కొన్ని డబ్బులు వచ్చే సమయానికే మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన వారి పేరున కూడ హజ్ జరిపించే అవకాశం వుందని తెలిసి, మానాన్నగారి పక్షాన మా మేనమామ మగ్బూల్ ను హజ్ యాత్రకు పంపించాము.

 

వైయస్ రాజశేఖర రెడ్డి హయంలో నేను ఒక రిపోర్టరుగా ముఖ్యమంత్రి పేషీ బీట్ చూసేవాడిని. అప్పట్లో షబ్బీర్ అలీ సమాచార శాఖా మంత్రిగా వుండేవారు. మైనారిటీ వ్యవహారాలనూ వారే చూసేవారు. మక్కాలో ఏపి  యాత్రికులకు హజ్ ఏర్పాట్లు చేయడం కోసం అధికారుల బృందం  ఒకటి స్పెషల్ ఫ్లయిట్ లో జిద్దా వెళ్ళీంది. హైదరాబాద్ నుండి కొందరు ముస్లిం రిపోర్టర్లను కూడ వారితోపాటు పంపించారు. అలా వెళ్ళే అవకాశం నాకు కూడ వచ్చింది.

 

హజ్ యేతర సందర్భాల్లో మక్కాను సందర్శించడాన్ని ఉమ్రా అంటారు. హజ్ అంతకాకున్నా ఉమ్రా కూడ గొప్ప పుణ్యకార్యమే. నాకు ధైర్యం చాలలేదు. ఉమ్రాకు వెళ్ళీ వచ్చిన తరువాత ఆ పవిత్రతను, నియమాలనూ  నిష్టను పాటించలేనని  భయం వేసింది. ఆమాటే మంత్రితో చెప్పి తప్పుకున్నాను.  

 

ఇప్పుడు ఆత్మీయ మిత్రులు, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటి (Muslim JAC)  కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్  హజ్ యాత్రకు వెళుతున్న సందర్భంగా నా హజ్ యాత్ర గురించి సోషల్ మీడియాలో కొంత చర్చ జరుగుతోంది. నేను హజ్ యాత్ర చేయాలని కొందరు ప్రతిపాదిస్తే, నన్ను మక్కా తీసుకుని వెళతానని మునీర్ గారు ప్రకటించారు.

 

నా ఉద్దేశ్యంలో మక్కా టూరిస్టు పాయింట్ కాదు. విమానం ఎక్కి దిగి అక్కడో వారం రోజులు వుండి వచ్చేస్తే సరిపోదు. అదొక నిబధ్ధత. అదొక క్రమశిక్షణ. అదొక నిష్ట. చెయ్యాల్సినవి చెయ్యకూడనివి చాలా పెద్ద జాబితా వుంటుంది. నాలో అంతటి క్రమశిక్షణ వుందా? అనేది నా అనుమానం. నామీద నాకు నమ్మకం కుదిరిన రోజూ ఉమ్రాకే కాదు హజ్ యాత్రకే వెళుతాను.

 

20 మే 2026

No comments:

Post a Comment