Friday, 29 May 2026

*అరబ్ వసంతం నుండి సీజేపీ దాక*

 

*అరబ్ వసంతం నుండి సీజేపీ దాక*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

ఈరోజు నా వ్యాసాన్ని ప్రచురించిన  తెలుగుప్రభకు ధన్యవాదాలు.

 

కాలధార




 

సామాజిక కార్యకర్తల సమావేశాల్లో సాధారణంగా వినిపించే ఒక అసంతృప్తి ఏమంటే ఉద్యమాల్లో ముస్లింలు కలసి రావడంలేదని. ఇదొక సెలెక్టివ్ మెమోరీకి సంబంధించిన అంశం. ముస్లింలు రోజువారీ నిరసన ప్రదర్శనల్లో పాల్గొనని మాట నిజమేగానీ, సమయం వచ్చినపుడు వాళ్ళు మిగిలినవాళ్ళకన్నా చాలా చురుగ్గానే కదులుతారు.  

 

ఇతర అంశాలను స్పృజించే ముందు ఎవరయినా గమనించాల్సిన అంశం ఏమంటే భారత ముస్లింలు ప్రధాన స్రవంతి సమూహం కాదు. వాళ్ళు ఉపస్రంవతి సమూహం. ఇటాలియన్ తత్వవేత్త ఆంటోనియో గ్రామ్షీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఒక సబాల్టర్న్ గ్రూపు అది. ఆర్థికంగా వెనుకబడిన, సాంస్కృతికంగా అణచివేయబడిన, ఆధిపత్య అధికార వ్యవస్థల నుండి బహిష్కరణకుగురైన, తమ గోడు వినిపించుకోవడానికైనా  చట్టసభల్లో దాదాపు ప్రాతినిధ్యంలేని ఒక అల్పసంఖ్యాక సామాజిక సమూహాం అది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల సంచలనాత్మక ఫలితాలను చూసిన మే నెల అంతకన్నా సంచలనాత్మకంగా రెండు వార్తల్ని వెలుగులోనికి తెచ్చింది. The International Hepato-Pancreato-Biliary Association Chines chapter సదస్సు ప్రస్తుతం వూహాన్ లో జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ గౌస్ ఈ సమావేశంలో పాల్గొనడానికి చైనా వెళ్ళారు. ఆ సమయంలో హైదరాబాద్ లో ఓ పేషెంటుకు అత్యవసరంగా Ureteral reimplantation Surgery చేయాల్సి వచ్చింది. డాక్టర్ గౌస్ దాదాపు ఏడు వేల కిలో మీటర్ల దూరం నుండి విజయవంతంగా టెలీ రోబోటిక్ సర్జరీ నిర్వహించారన్న వార్త దినపత్రికల మొదటి పేజీల్లో వచ్చింది. ఆ పక్కనే మరో వార్త కూడ వచ్చింది. కోల్కతా జిల్లాలోని కాషీపూర్ –బెల్గాచియా  నియోజకవర్గం నుండి గెలిచిన బిజేపి ఎమ్మెల్యే రితేష్ తివారి తాను ముస్లింలకు ఒక్క చిన్నపని కూడ చేసిపెట్టనని శపథం చేశారు.  చివరకు పంక్చర్లు వేసుకుని బతికే అవకాశం కూడ ఇవ్వనంటూ బాబా భోలేనాధ్ విగ్రహం సాక్షిగా ఒట్టు వేశారు.

ముస్లింలు పంక్చర్లు మాత్రమే వేస్తారా? 19వ శతాబ్దం ఆరంభానికి ముందే ‘మైసూరియన్’ రాకెట్లను సృష్టించిన టిప్పూ సుల్తాన్ ను ఏ ఖాతాలో వేయాలీ? అమెరికాలోని నాసా కేంద్రంలో టిప్పూ సుల్తాన్ చిత్రపటాన్ని చూసి ఉత్తేజాన్ని పొంది భారత దేశానికి అగ్నీ, పృధ్వీ వంటి బాలిస్టిక్ మిస్సైల్స్ ను సృష్టించిన ఎపిజె కలాంను ఏ లెఖ్ఖలో వేయాలీ? 

ముస్లింలకు సమస్తరంగాల్లో జీవనోపాధి లేకుండా చేస్తాం. ఎన్నికల్లో పోటీ చేయనివ్వం; పోటీ చేసినా గెలవనివ్వం. అసలు, ఓటు హక్కునే తీసివేస్తాం, ఆరోపణలు వస్తే చాలు విచారణలు లేకుండానే బుల్డోజర్లతో శిక్షించేస్తాం అంటూ మెజారిటీ సమూహానికి చెందిన అధికారవర్గం బాహాటంగా ప్రకటనలు చేస్తున్నా ఘనత వహించిన ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు ముస్లింలను పట్టించుకునది ఏ మేరకూ? భారత మతవ్యవస్థలో ముస్లింలను శ్రామికవర్గంగా ప్రకటించకపోయినాసరే కనీసం అణగారిన సమూహంగా ప్రకటించిన వామపక్ష పార్టీ ఏదయినావుందా? వేడి పాలతో నోరు కాల్చుకున్నవాళ్లు చల్లని మజ్జిగను కూడ  ఊదిఊది తాగుతారు. ఆ స్థితిలో పడిపోయారు భారత ముస్లింలు. సామాజిక సంఘాలు, వాటి కార్యకర్తలు, నాయకుల్ని చూస్తే ముస్లింలకు భయం, ఆందోళన, అనుమానం.

 

దీని అర్ధం ముస్లిం సమూహం సామాజిక మార్పుకు వ్యతిరేకమైనదని కానేకాదు. ఇస్లాం పుట్టుకలోలే అనేక సామాజిక విప్లవాలున్నాయి.  తెగల ఆధిపత్యం, బానిసత్వం, సంపద కేంద్రీకరణ, ఆర్థిక

దోపిడీ, లింగ వివక్ష, పుట్టుకతో వచ్చే అహంకారం వగయిరా సాంఘీక ఆచారాలకు వ్యతిరేకంగా ఇస్లాం ఆవిర్భవించింది. అది ఏకకాలంలో ఆధ్యాత్మికమైనది; సామాజికమైనది.

 

నిరుపేదలు, నిస్సహాయుల పట్ల దయగలిగి వుండండి. బానిసల్ని విముక్తిచేయండి. వర్ణబేధాల్ని పాటించకండి. సంపదను ఒకే చోట పోగుపడనియ్యవద్దు. అందులో, న్యాయమైన భాగాన్ని పేదలకు పంచండి. అలాంటి సత్ప్రవర్తనే గొప్ప ఆరాధనా మార్గం వంటి ఇస్లాం ఆదేశాలు ముస్లిం సముదాయాల్లో సామాజిక న్యాయ పోరాటాలను  ప్రోత్సహించాయి. సమాజంలో సమానత్వం కోసం పోరాడుతూ ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ దేవునికి ప్రీతిపాత్రులు కావచ్చని ధార్మిక ముస్లింలు నమ్ముతారు. సామాజికన్యాయ సాధన కూడ దైవారాధన మార్గమే కనుక దానికోసం నాస్తికులు కావల్సిన అవసరం లేదని కూడా వాళ్లు భావిస్తారు. ఇరాన్ కు చెందిన ముస్లిం ఆలోచనాపరుడు అలీ షరియతీ ఇస్లాంను ఒక విముక్తి సిద్ధాంతంగా మలిచాడు. (ఇస్లామిక్ లిబరేషన్ థియాలజీ!) అతని దృష్టిలో నిజమైన ఆధ్యాత్మికత సమాజంలో దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా నిలబడాలి. అందుకే చరిత్రలో మనకు మతం రెండు రూపాల్లో కనిపిస్తుంది. మొదటిది; అధికారానికి ఊడిగం చేసేది; రెండోది; బాధితుల పక్షాన నిలిచే నైతిక శక్తి. ఈ రెండు ధోరణుల మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం.

 

8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు ప్రపంచ విజ్ఞాన కేంద్రాలు ముస్లిం ప్రపంచంలోనే ఉండేవి అంటే అతిశయోక్తికాదు. ఇరాక్ లో బాగ్దాద్, స్పెయిన్ లో కార్డోబా, ఈజిప్టులో కైరో నగరాలు విజ్ఞానశాస్త్ర, తత్వ, వైద్య పరిశోధనలకు నిలయాలయ్యాయి. ప్రపంచ ఆధునిక భావాలకు పుట్టినిల్లుగా భావించే ఫ్రెంచ్ విప్లవం ముందుకు తెచ్చిన న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం అప్పటికే ఇస్లాంలో వున్నాయి. ఇస్లామిక్ స్వర్ణయుగంగా భావించే ఈ కాలం మనకు చెప్పిన గొప్ప సత్యం ఏమిటంటే — ప్రశ్నించే తత్త్వాన్ని కాపాడుకున్న సమాజాలు విజ్ఞాన రంగంలో  ముందుకు వెళ్తాయి అని.

 

సమాజంలో సమానత్వం కోసం పోరాడుతూ ఆధ్యాత్మికతను కూడ కాపాడుకోవచ్చా? అనేది ముస్లిం సమాజం నిరంతరం ఎదుర్కొనే ధార్మిక మీమాంస.  అది సాధ్యమే అని చాలాసార్లు చాలామంది నిరూపించారు.

 

భారత స్వాతంత్ర్య ప్రధమ సంగ్రామానికి బహద్దూర్ షా నాయకత్వం వహించాడనీ, 1920లో ఏర్పడిన భారత జాతీయ కమ్యూనిస్టు పార్టి వ్యవస్థాపక కార్యదర్శి మొహమ్మద్ షఫీఖీ సిధ్ధీఖి అని చాలా మందికి తెలుసు. కానీ ఆయా చారిత్రక సందర్భాల్లో వాళ్ళే ఆ పాత్రను ఎందుకు పోషించారు అనే సందేహం మాత్రం చాలా మందికి వచ్చి వుండదు.

 

ఇక వర్తమానానికి వద్దాం. నరేంద్ర మోదీ – అమిత్ షాల హయాంలో ఏపుగా పెరిగిన  కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ను ఎలా ఎదుర్కోవాలో తెలీక విపక్షాలు సతమతమౌతున్న కాలంలో వాళ్లకు ఒకదారి చూపించింది ముస్లిం మహిళలే. అదే, పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) ను వ్యతిరేకిస్తూ మొదలయిన  షాహీన్ బాగ్ నిరసనోద్యమం. దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో ఒక వేదికను నిర్మించి, ప్రశాంతంగా కూర్చొని నిరసన తెలిపే ఒక వినూత్న విధానాన్నీ వాళ్ళు రచించారు. ఒక మైనారిటీ సమూహమైన ముస్లిం మహిళలు ఉద్యమం చేస్తుంటే మరో మైనారిటీ సమూహమైన శిక్కు మహిళలు కదలి వచ్చి షాహీన్ బాగ్ లో ఉచిత భోజనం (లంగర్)  ఏర్పాటు చేశారు.

 

షాహీన్ బాగ్ ఒక కొత్తరకం ఉద్యమం.  దీనికి నాయకులు లేరు. సంయుక్త కార్యాచరణ కమిటిలేదు. కార్యవర్గం లేదు. అందరూ నాయకులే. అందరూ కార్యకర్తలే. షాహీన్ బాగ్ ఉద్యమం ఇచ్చిన స్పూర్తితోనే సరిగ్గా అదే పధ్ధతుల్లో ఢిల్లీ నగర శివార్లలో లంగరుతోసహా నిరసనోద్యమాన్ని చేపట్టారు భారత  రైతులు. ఈ పరిణామాల్ని, అనుబంధాల్నీ  మరచిపోవడం న్యాయం కాదు.

 

ఇప్పటి డిజిటల్ యుగంలో నిరసనోద్యమాల రూపం సారం రెండూ మారిపోయాయి. టునీషియాలో 2010 డిసెంబర్‌లో రోడ్డు మీద పండ్లు అమ్ముకునే  ఒక చిరువ్యాపారి మొహమ్మద్ బొవాజిజిని ట్రాఫిక్ పోలీసులు దారుణంగా కొట్టారు. ఆ అవమానాన్ని భరించలేక అతను అక్కడికక్కడే ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ సంఘటన మీద టునీషియా యువత తీవ్రంగా స్పందించింది. అవినీతి, నియంతృత్వం, నిరుద్యోగం, యువతలో పేరుకుపోయిన నిస్పృహ — ఇవన్నీ కలిసి ఒక్కసారిగా పేలాయి. స్మార్ట్ ఫోన్ల సహాయంతో  వాళ్ళ ఆక్రోసం  ప్రపంచం నలుమూలలకు చేరింది. నెలరోజుల్లోనే టునీషియా ప్రభుత్వం పడిపోయింది. దేశాధ్యక్షుడు బెన్ అలీ దేశం వదిలి పారిపోయాడు.

 

అమెరికా చరిత్రకారిణి హన్నా అరెండెట్ చెప్పినట్టు ప్రజలు ప్రభుత్వానికి విధేయంగా వుండడం మానేసిన క్షణాణ అధికార భవనాలు కూలిపోతాయి.

 

ఆ తరువాత యువతరం నిరసన సెగలు ఈజిప్టును తాకాయి. కైరోలోని తాహరీర్ స్క్వేర్లో లక్షల మంది యువకులు ప్రదర్శనగా వచ్చారు. ముఫ్ఫయి యేళ్ళుగా నిరాఘాటంగా అధికారాన్ని చెలాయిస్తున్న హోస్నీ ముబారక్ రాజీనామా చేసి గద్దె దిగి వెళ్ళిపోయాడు. ఇదే పధ్ధతి నిరసనోద్యమం లిబియాలో అంటుకోగా అధ్యక్షుడు మువమ్మర్ గడాఫీ గద్దె దిగడమేగాక హత్యకు గురయ్యాడు. ఆ వెంటనే సిరియా, ఎమెన్, బహెరెన్  లో కూడా యువతరం నిరసన సెగలు గట్టిగా తాకి అక్కడి ప్రభుత్వాలను మార్చేశాయి.  ఇవన్నీ అరేబియన్ దేశాలు కనుక సమాజశాస్త్రవేత్తలు యువతరం నిరసనోద్యమాలకు ‘అరబ్ స్ప్రింగ్’  అని పేరు పెట్టారు. తెలుగులో మనం ‘అరబ్ వసంతం’ అనుకోవచ్చు. ఈ యువగాలులు  ఇతర దేశల్లోనికి ప్రవేశించినపుడు జెన్ –జీ అనే పేరు వచ్చింది. అవి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లను తాకి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇండియాలోనూ ప్రవేశించాయి.

 

ప్రపంచ రాజకీయ చరిత్రలో యువతరం నిరసనలు  యుద్ధాలకంటే పెద్ద మార్పుల్ని చాలా వేగంగా తీసుకొచ్చాయి. అయితే,  అరబ్ వసంతాలు నియంతల వ్యవస్థల్ని సమర్ధంగా నిర్మూలించినంతగా  ఒక ఆదర్శవంతమైన కొత్త వ్యవస్థల్ని నిర్మించలేకపోయాయి. ఇది వీటి బలహీనత. నియంతృత్వాన్ని నిర్మూలించే టెక్నాలజీ వాళ్ళ దగ్గర చాలా వుంది. ఒక ఆదర్శ సమాజాన్ని నిర్మీంచే సిధ్ధాంతం ఇప్పుడు వాళ్ళకు కావాలి!!

 

రచన : 26-05-2026

ప్రచురణ :  27 మే 2026

No comments:

Post a Comment