Friday, 22 May 2026

End of the beef Politics - *బీఫ్ పాలిటిక్స్ కు ముగింపు!*

 అయ్యా ! ఈ వ్యాసాన్ని ప్రచురణకు త్వరగా పరిశీలించండి.

మీకు ప్రచురించడం కుదరకపోతే ఆ విషయాన్ని వెంటనే తెలుపండి.

మరో ప్రచురణకర్తను ఆశ్రయిస్తాను.

-        డానీ  

 

*బీఫ్ పాలిటిక్స్ కు ముగింపు!*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

“గోవధను నిషేధించండి!”, “ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి” అంటూ భారత ముస్లింలే డిమాండు చేస్తారని కొద్ది రోజుల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉండరు. కానీ రాజకీయాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు జరిగి కొత్త చరిత్రను సృష్టిస్తుంటాయి.

 

దారుల్ ఉలుమ్ దేవ్ బంద్ కు చెందిన మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ ఇచ్చిన పిలుపుతో ఈ చర్చ కొత్త మలుపు తిరిగింది. కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల నుండి కూడా మద్దతు స్వరాలు వినిపించడంతో “గోవధ నిషేధం” అంశం ముస్లిం సమాజంలోనేగాక దేశంలోనే ఒక కొత్త చర్చగా మారుతోంది. కోల్‌కతాలోని నఖోడా మసీద్ ఇమామ్ మౌలానా ముహమ్మద్ షఫీఖీ ఖాసిం దీనిని “హిందూ-ముస్లిం మతసామరస్య ఉద్యమం”గా అభివర్ణించారు.

 

బీఫ్ రాజకీయంలో ఒక పెద్ద వైరుధ్యం భారత సమాజంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బీఫ్ ఎగుమతిదారులలో భారతదేశం ఒకటి. కొన్నిసార్లు బ్రెజిల్ ను కూడా అధిగమించి అగ్రస్థానంలో నిలిచిన సందర్భాలున్నాయి. ఏటా దాదాపు 16 లక్షల టన్నుల బీఫ్ మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఇండోనేషియా తదితర దేశాలకు ఇండియా నుండి ఎగుమతి అవుతోంది. ఇవి ప్రధానంగా ముస్లిం దేశాలు కనుక బీఫ్ ను ఇస్లాం సాంప్రదాయం ప్రకారం  ‘హలాల్’  చేసి అధికారిక వ్యవస్థల ద్వారా రాచమార్గంలోనే ఎగుమతి చేస్తారు.

 

ముస్లిం దేశాలకు ఎగుమతి చేస్తారు కనుక ప్రత్యేక ఆకర్షణ కోసం బీఫ్ ఎగుమతి సంస్థల పేర్లు ఎక్కువగా అరబ్బీ భాషలో వుంటాయి. ఈ పేర్లను చూసి వాటి ప్రమోటర్లు ముస్లింలు ‘మాత్రమే’ అయ్యుంటారు అనుకునే అవకాశం ఎక్కువ. ఇది వ్యాపారం కనుక ఇందులో అన్ని మతాలవాళ్ళూ వున్నారు. అహింసావాదులుగా భావించే జైనులు సహితం ఇందులో వున్నారు. వీటిల్లో కొన్ని సంస్థలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బిజెపి  ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్టు ఆరోపణలున్నాయి. అంతేగాక, సాక్షాత్తు బిజెపి ప్రముఖ నాయకులే బీఫ్ ఎగుమతి వ్యాపారంలో వున్నట్టు ఇటీవల కొన్ని వార్తలొచ్చాయి.  విచిత్రం ఏమంటే, “ఏక్ గాయి భీ నహీ కటేగీ” అని వేదికల నుండి అరవీర భయంకరంగా అరిచే యోగీ ఆదిత్య నాధ్ గారి ఉత్తరప్రదేశ్ నుండే బీఫ్ ఎక్కువగా ఎగుమతి అవుతుంది.

 

అదే సమయంలో, దేశంలో సాంఘీక పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా వుంది. బీఫ్ తింటూ హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని బిజెపి ఢిల్లీ నాయకుల నుండి గల్లీ లీడర్ల వరకు నిత్యం ముస్లింలను సోషల్ కోర్టుల్లో దోషులుగా నిలబెడుతుంటారు. కేవలం బీఫ్ అనే అనుమానంతో  — చేతి సంచిలో పావుకిలో వుందనో, స్కూటర్ టిక్కీలో అరకిలో తీసుకెళ్తున్నారనో, ఇంట్లో ఫ్రిజ్‌లో కేజీ దాచారనో — ముస్లింలపై దాడులు,  హత్యలు చేసిన సంఘటనలు కూడ వున్నాయి. ఇలాంటి సంఘటనల్లో  పాల్గొన్న అల్లరి మూకలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా, చట్టం వారిని కఠినంగా శిక్షించకపోగా మినహాయింపులు (లీగల్ ఇంప్యూనిటి) ఇస్తూ వచ్చింది. ఒక విధంగా ప్రొత్సహిస్తూ వచ్చింది.

 

సమాజం బోనులో ముస్లింలను నిరంతరం దోషులుగా నిలబెట్టడానికి సంఘపరివారం దశాబ్దాలుగా బీప్ ఆరోపణలు చేస్తున్నది. హిందువులు దైవంగా భావించి పూజించే గోవుల్ని ముస్లింలు తింటున్నారనేది ప్రధాన ఆరోపణ.

 

బీఫ్ కు మనదేశంలో అనేక పర్యాయ పదాలున్నాయి. ముస్లింలు తింటే దాన్ని ఆవు మాంసం అంటారు. అధికారికంగా ఎగుమతి చేసే సమయంలో దాన్ని ఎద్దుమాంసం, గేదె మాంసం, దున్న మాంసం (కారా బీఫ్) అంటారు.

 

అనేక జంతువులు, జీవులు మనకు  హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో దేవతలుగా దర్శనమిస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి  అవతారాల్లోనే తాబేలు, చేప, వరాహం, సింహం వున్నాయి. చేపల్ని ప్రైవేటు సంస్థలతోపాటూ ప్రభుత్వరంగ సంస్థలు కూడ మార్కెటింగ్ చేస్తుంటాయి. ప్రాసెస్ చేసిన పందిమాంసం (బేకన్) తయారీ, పంపిణి పనుల్ని అనేక రాష్ట్రాల్లో యానిమల్ హజ్బెండ్రీ శాఖ, మీట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లు నిర్వహిస్తుంటాయి. వీటిల్లో ఎక్కడా ముస్లింలతో వివాదంలేదు. అందుకే ఆ జీవులు రాజకీయానికి పనికి రాలేదు. సమస్యల్లా ఆవుతోనే.

 

భారతదేశంలో ఆవు రాజకీయం రోజురోజుకూ విస్తరిస్తోంది. దేశంలో సాంప్రదాయంగా 15-20 శాతం మాత్రమే శాఖాహారులు, 80-85 శాతం మాంసాహారులు. ఈశాన్య రాష్ట్రాలతోపాటూ కశ్మీర్, బెంగాల్, కేరళ, తెలంగాణాల్లో మాంసాహారులు 90 శాతం కన్నా ఎక్కువ అని గణాంకాలు చెపుతున్నాయి.  కానీ, ముస్లీంలు మాంసాహారులు, హిందువులు  శాకాహారులు అంటూ ఇప్పుడు ఒక కొత్త ధార్మిక విభజన జరుగుతోంది. “మీరు మాసం తింటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారు” అని ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు దేశ ప్రభుత్వాధినేత అనేంత వరకు పోయింది వ్యవహారం. ఇది అక్కడ కూడ ఆగలేదు. దేశం ఎవరయినా టీ తాగినాసరే వాళ్ళు గో -హంతకులు అని ఈమధ్య ఓ సాధ్వీ ప్రవచనకర్త ప్రకటించారు. ముస్లింలు ఏ వృత్తి చేపట్టినాసరే అది గోహత్యతో సమానమని వీరు ముద్ర వేస్తున్నారు.

 

దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 80 శాతానికి పైగా బిజెపి అధికారంలో వున్నాయి.  గోవధ నిషేధం తన విధానం అంటూ ప్రతి సందర్భంలోనూ బిజెపి ప్రకటిస్తూ వుంటుంది. కానీ, జాతీయ స్థాయిలో అలాంటి చట్టాన్ని మాత్రం తీసుకునిరాదు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించదు. ఇదో రాజకీయం. నిరంతరం ‘హేట్ ముస్లిం’ విధానాలను కొనసాగిస్తేనేగానీ ఎన్నికల్లో హిందూ సమాజం ఓట్లు పడవని ఆ పార్టీకి తెలుసు.

 

ఈశాన్య రాష్ట్రాలో బిజెపిది ఇంకో పాలసీ. అక్కడ బీఫ్ కు అనుమతి ఇస్తేనే ఓట్లు పడతాయి. ఈ ద్వంద్వాన్ని బిజెపి అడ్డగోలుగా సమర్ధించుకుంటుంది. వాళ్ళు తినేది ‘జెర్సీ ఆవు’నేగానీ భారత సంతతికి చెందిన ‘దేశీఆవు’ కాదని ఒక వివరణ ఇస్తుంది. ఈ వివరణ కొందరికి విచిత్రంగానో, అసంబధ్ధంగానో కనిపించవచ్చు కానీ,  ఇది నిజం. బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు ప్రొఫెసర్ సుధాంశు త్రివేది ఇటివల మీడియాకు ఈ విషయంలో ఒక స్పష్టత నిచ్చారు. భారత సంతతికి చెందిన మూపురం (hump)గల ఆవులకే పవిత్ర మాతా స్థానం వుంటుందనీ, మూపురంలేని జెర్సీ ఆవులకు మాతా స్థానం వుండదు అనేది వారి వివరణ.  

 

            భారత దేశీ ఆవులకు మూపురం వుంటుంది; జెర్సీ ఆవులకు మూపురం వుండదు. దేశీ ఆవులకు మెడ కింద చర్మం వదులుగా వుంటుంది; జెర్సీ ఆవులకు బిగుతుగా వుంటుంది. కాళ్లు సన్నగా పొడవుగా వుంటాయి, బండగా పొట్టిగా వుంటాయి. కొమ్ములు చెవుల్లోనూ తేడాలు కనిపిస్తాయి. సన్నగా ఎత్తుగా వుంటాయి, బండగా పొడుగ్గా వుంటాయి.

 

ముస్లీంలు గోహత్యకు దూరంగా వుండాలని నిర్ణయించుకోవడం భారత సాంఘీక పరిణామంలో కొత్త అధ్యాయం. ఇతర రాష్ట్రాల ముస్లింలు సహితం ఇక గోమాంసానికి దూరంగా వుండడానికి సిధ్ధం అవుతున్నారు. ‘నో బీఫ్’  ఇప్పుడు ముస్లింల కొత్త ఉద్యమం.  ఈదుల్ అజ్హా (బక్రీద్) సందర్భంగా ఖుర్బానీ కోసం ఆవులను కొనరాదని కొన్ని వర్గాల ముస్లింలు పిలుపునివ్వడం కూడా ప్రభావాన్ని చూపుతోంది. కోల్ కతా, హైదరాబాద్ సంతలకు పశువుల్ని తెచ్చిన కాపర్లు ముస్లింల బహిష్కరణ పిలుపుతో తీవ్ర నిరాశకు గురయ్యారు. బీజేపీ నాయకుల్ని వాళ్ళు  శాపనార్థాలు పెట్టడం మొదలెట్టారు.

 

మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే, ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి వంటి హిందూ ఆధ్యాత్మిక నాయకులు కూడా  కొంతకాలంగా గోవధ నిషేధ చట్టాన్ని తేవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, కొంతమంది ముస్లిం మౌలానాలు, హిందూ స్వామీజీలు ఒకే నినాదంతో మతసామరస్య వేదికపై నిలిచి  భారత రాజకీయ ఆధ్యాత్మిక రంగంలో కొత్త అధ్యాయానికి నాందీ పలకవచ్చు. 1857 నాటి భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత మళ్ళీ ముస్లిం మౌలానాలు, హిందూ స్వామీజీలు కలిసి నడిపే ఒక మహత్తర ఉద్యమం ఒకటి దేశంలో రూపుదిద్దుకుంటున్నది అనవచ్చు.

 

ఇది దేశవ్యాప్తంగా ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది — “బీఫ్ పాలిటిక్స్” అనే దీర్ఘకాలిక వివాదాన్ని కొత్త దిశలోకి మళ్లించే ప్రయత్నం ప్రారంభమైంది. ఇది షాహీన్ బాగ్ ఉద్యమాన్ని మించి వుధృతంగా మారే అవకాశాలున్నాయి.

            ముస్లింలు బీఫ్ మానేస్తే పశువుల్ని పోషించే హిందూ సమూహాల కులవృత్తి దెబ్బ తింటుందనీ,  వాళ్లు సామూహికంగా  స్థానభ్రంశానికి గురవుతారని కూడ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సమాజంలో బీఫ్ అమ్మే గాయ్ ఖసాబ్ లు కూడ వృత్తిని కోల్పోయే మాట కూడ నిజమే. అయితే, అప్పుడు ఎగుమతులకు మరింత ఎక్కువ బీఫ్ అందుబాటులోనికి వస్తుంది. అరబ్ ముస్లింలకు హలాల్ బీఫ్ ఎగుమతి, ఇక్కడి ముస్లీంలు బీఫ్ తింటే ద్వేష రాజనీతి ఎలాగూ మన పాలసీగా వుందిగా! 
23-05-2026

No comments:

Post a Comment