*బొద్దింకల ఉద్యమం దేనికి ప్రతీకా?*
ఈరోజు నా వ్యాసాన్ని ప్రచురించిన సాక్షి దినపత్రికకు ధన్యవాదాలు.
*డానీ*
*సమాజ, రాజకీయ విశ్లేషకులు*
భారత
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా
నిరుద్యోగుల్ని బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారు. దేశంలోని మొత్తం యువత గురించి
తాను ఆ మాటలు అనలేదనీ, ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు
చేశానని రెండు రోజుల తరువాత వారు ఒక వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, బొద్దింకలు అనే
మాటను జెన్ జీ యువత వైరల్ గా మార్చేసింది. “అవును. మేము బొద్దింకలమే” అని
ప్రకటించుకుంది. ఇది కేవలం మీమ్ రాజకీయమా?
లేక వ్యవస్థలపై యువతరంలో పేరుకుపోతున్న అసహనానికి కొత్త రూపమా?
ఉద్యోగాలులేని యువతరం మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ
యాక్టివిజంలోకి వచ్చి కొందర్ని టార్గెట్ చేస్తున్నదని మే 15న ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్
సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ముఖ్యంగా “బొద్దింకలు”
అనే పోలిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి
ప్రశ్నించే హక్కు ఇచ్చిందని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి శత్రుత్వం కాదని అనేక మంది స్పందించారు. మనకు
నచ్చనివాళ్ల భావ ప్రకటనా స్వేఛ్ఛను కూడా మనం గౌరవించి తీరాలి. లేకుంటే భావప్రకటనా
స్వేఛ్ఛను మనమే విశ్వసించడం లేనట్టే అనే అర్ధంలో అమెరిక సామాజిక కార్యకర్త నోవమ్
చోమ్స్కీ అన్న మాట మళ్ళీ వైరల్ అయ్యాయి.
ఉద్యమకాలంలో
అవమానం కూడా ఒక్కోసారి ఆత్మగౌరవ గుర్తింపుగా
మారిపోతుంది. నగ్జల్బబరీలో ఆదివాసుల సాయుధ
పోరాటాన్ని ఆరంభించినవాళ్లు సిపిఐ – మార్క్సిస్టు - లెనినిస్టులు. కిట్టనివాళ్లు
వాళ్లను నక్సలైట్లు అని విమర్శించేవారు. “అవును మేము నక్సలైట్లమే” అంటూ వాళ్లు సగర్వంగా ప్రకటించుకోవడం మొదలెట్టారు. “మేము
మాల”, “మేము మాదిగ” వంటి ఆత్మగౌరవ ప్రకటనల్ని కూడ మనం చూశాం. ఇది సోషల్ మీడియా
యుగం కనుక వేగం మరింత ఎక్కువ. ఇప్పుడు “బొద్దింక” అనే మాట కొత్త రాజకీయ మీమ్‌గా
మారింది. వేలాది మంది యువత “అవును. మేము బొద్దింకలం” అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు
బొద్దింక ఫోటోలతో టీ షర్టులు ధరించి రీల్స్ చేస్తున్నారు. ఫ్రెంచ్ తత్వవేత్త మైఖేల్
ఫుకాల్ట్ “అధికారం ప్రతిఘటనను సృష్టిస్తుంది” అన్న సిద్ధాంతం ఇప్పుడు గట్టిగానే
పనిచేస్తోంది. అధికార భాష ఎంత కఠినంగా మారితే ప్రతిస్పందన అంత వైరల్ అవుతుంది.
బోస్టన్ యూనివర్సిటీ విద్యార్ధి అభిజీత్ దీప్కే సరదాగా
‘కాక్రోచ్ జనతా పార్టి’ అంటూ ఒక పోస్టు పెట్టాడు. అది వైరల్ అయిపోయింది. కొన్ని
గంటల్లోనే ఆ పార్టీలో యాభై వేల మంది చేరిపోయారు. తరువాత కోటి మంది అయ్యారు. ఇదేమీ ఒక
రాజకీయ పార్టి కాకపోవచ్చు కానీ, ఇది ఈతరం భావోద్వేగాలకు అద్దం పడుతోంది. ముఖ్యంగా,
విద్యావంతులైన పట్టణ యువత ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతోనూ భావోద్వేగంగా కనెక్ట్
కాలేకపోతున్నదని ఈ వైరల్ స్పందన చెపుతోంది.
స్థిరమైన రాజకీయ ఐడెంటిటీలు కరిగిపోతున్న కాలం ఇది. అస్థిర కార్మికవర్గం అస్థిర
రాజకీయ భావాలనూ సృష్టిస్తుంది.
కొత్త
పరిణామాల వెనుకనున్న అసలు నేపథ్యం తీవ్రమైన నిరుద్యోగం. పరీక్షాపత్రాల లీకులు, ఉద్యోగాల కొరత, కాంట్రాక్ట్ కల్చర్,
పెరుగుతున్న పోటీ యువతలో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. భారతదేశంలో ప్రపంచంలోనే
అతిపెద్ద యువ జనాభా ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉపాధి సంక్షోభం కూడా ఉంది.
కొత్త
తరాల్లో కొత్త
ఆలోచనలు రావడం సహజం; పాత ఆలోచనల నుండి బయటపడటమే పెద్ద కష్టం. పాత రాజకీయ భాష కొత్త యువతను ఆకట్టుకోవడంలేదు. అందుకే మీమ్స్,
వ్యంగ్యం, డిజిటల్ క్యాంపెయిన్లు కొత్త రాజకీయ వ్యక్తీకరణలుగా మారుతున్నాయి.
బొద్దింకల గురించి ఎన్నో కథలున్నాయి. ఉన్నాయి. “న్యూక్లియర్
యుద్ధం వచ్చినా చివరికి మిగిలేది బొద్దింకలే” అనే మాట దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది.
జీవశాస్త్ర పరంగా చూసినప్పుడు బొద్దింకలు అద్భుతమైన జీవన సామర్థ్యం కలిగిన జీవులు.
కోట్ల సంవత్సరాలుగా ఇవి అంతరించకుండా కొనసాగుతున్నాయి. మంద్ర స్థాయిలో రేడియేషన్‌ను
తట్టుకునే సామర్ధ్యం కూడా వీటికి ఉందనడానికి సైంటిఫిక్ ఆధారాలున్నాయి. అందుకే
ఇప్పుడు యువత “మమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడినా మేము బతుకుతాం, తిరిగి లేస్తాం”
అని ధీమాగా అంటోంది.
ఒకప్పుడు ఉద్యమాలు వీధుల్లో మొదలయ్యేవి. ఇప్పుడు అవి మీమ్
పేజీల్లో మొదలవుతున్నాయి. ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్‌లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్,
యూట్యూబ్ షార్ట్‌లు — ఇవే ఇప్పుడు కొత్త పోరాట
వేదికలు. టునీషియా, లిబియా అరబ్
స్ప్రింగ్, అమెరికాలో “వాల్ స్ట్రీట్ ను
ఆక్రమించండి”, హాంగ్‌కాంగ్ ఉద్యమాలు,— అన్నీ డిజిటల్ మీడియా ప్రభావాన్ని చూపించాయి.
ఇప్పుడు భారతదేశంలో కూడా జెన్-Z అదే దారిలో వెళ్తోంది. వ్యంగ్యం ఇప్పుడు వినోదం
మాత్రమే కాదు, అది ఒక నిరసన గళం.
ఈ బొద్దింకల వివాదం మరో పెద్ద ప్రశ్నను కూడా లేవనెత్తింది — ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతమా? దానికి సమాధానం కాదనే! రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టే దాని విలువ ఉంటుంది అన్నాడు అంబేడ్కర్. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం అవసరం. అదే సమయంలో వాటికి అకౌంటబిలిటీ కూడా అవసరం. సోషల్ మీడియాలో యువత అంటున్నదేమిటీ? - “ప్రశ్నించడం దేశద్రోహం కాదు.” అది నిజమేకదా!!
కాక్రోచ్
జనతా పార్టి నిజంగానే ఎన్నికల బరిలోనికి దిగుతుందా లేదా అనేవి ఇప్పుడు చర్చ కాదు.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టం; ఇది ఒక తరపు అసంతృప్తికి అద్దంపడుతోంది. రాజకీయ
పార్టీలు, మీడియా, న్యాయవ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థలపట్ల యువతలో పెరుగుతున్న ఆక్రోశాన్ని
ఇది వ్యక్తం చేస్తోంది. చరిత్ర చాలా రకాలుగా పునరావృతం అవుతుంది. ఈసారి అది
ప్రహసనంగా కనిపించవచ్చుగానీ దాని వెనుక తీవ్ర ఆక్రోశం దాగుంది. దాన్ని గుర్తించడం
ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే యువతను అవమానిస్తే అనర్ధాలే జరగవచ్చు.
రచన : 20 మే 2026
.png)
No comments:
Post a Comment