Tuesday, 12 May 2026

*ముస్లింల మీద క్రిమినల్ ముద్రలు*

 

*కాలధార*

 

*ముస్లింల మీద క్రిమినల్ ముద్రలు*

 

*డానీ*

*సమాజ రాజకీయ విశ్లేషకులు*

 

 

         ఉదయం నిద్రలేచి సెల్ ఫోన్ ఆన్ చేయగానే మనం 2026లో వున్నామనీ,  ఈరోజు మే 12 అని చెపుతుంది. ఆ తరువాత టీ తాగుతూ దినపత్రికల పేజీలు తిరగేస్తుంటే మాత్రం మనం మధ్యయుగాల్లొ వున్నట్టు అర్ధం అవుతూవుంటుంది. నిజానికి మనం మధ్యయుగాలకు  ముందు కాలంలో వుంటున్నట్టు కూడ అనిపిస్తుంది.  మనకు స్పీడు ఎక్కువ. చాలా వేగంగా ఆదిమ కాలాల్లోనికి పరుగులు తీస్తుంటాం. నాగరీకంగా వుండడం మనకు నచ్చదు. అనాగరికంగా వుండడం మనకు ఇష్టం. అందరూ బుధ్ధిగా వుంటే వార్తలు లేక మీడియాకు ఎంత కష్టం?

 

         1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆధునిక రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1956 జనవరి 26 నుండి అది అమలు లోనికి వచ్చింది. ఏడాదిన్న క్రితం మనం రాజ్యాంగపు వజ్రోత్సవాన్ని కూడ జరుపుకున్నాం.  కానీ, నిజంగానే రాజ్యాంగ ఆదర్శాలను ఆచరిస్తున్నామా?

 

         రాజ్యాంగం రావడానికి ముందు బ్రిటీష్ వలస పాలన వుండేది. భారత  పౌర సంస్కృతి లోనికి వేలు పెట్టడానికి బ్రిటీష్ వాళ్ళు సహితం కొంచెం భయపడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ నేరస్మృతి బ్రిటీష్ దే వుండాలంటూనే, పౌరస్మృతిని మాత్రం దేశీయులకే వదిలేశాడు. ముస్లిం సమాజం ఖురాన్- హదీసులు తమ పౌరజీవితానికి ప్రామాణికం అని చెప్పుకోగా, మనుస్మృతి తమకు ప్రామాణికం అని హిందువుల ప్రతినిధులు చెప్పుకున్నారు. వాళ్ల కోరిక మేరకు A Code of Gentoo Laws పేరుతో 1776లో మనుస్మృతి అమల్లోనికి వచ్చింది.  విద్యావేత్త సర్ విలియం జోన్స్  దీనిని 1794లో ఇంగ్లీషు లోనికి అనువాదం చేశాడు.

 

మనుస్మృతిలోని వర్ణాధారిత శిక్షా విధానం తరువాత యూరోపియన్ మితవాద తత్త్వవేత్తల దృష్టిని ఆకర్షించింది. సమాజాన్ని అసమాన హక్కుల ఆధారంగా విభజించే ఆలోచనలు యూరోప్లోని కొన్ని నిరంకుశ రాజకీయ ధోరణులకు పరోక్ష మేధో ఆధారాలుగా మారాయని కొందరు విమర్శకులు విశ్లేషిస్తారు. అలా ఇటలీ, జర్మనీల్లో చెలరేగిన ఫాసిజం, నాజిజం వంటి భావజాలాల మూలాలను కూడ భారతీయ వర్ణవ్యవస్థలో వెతికే వాదనలు ఉన్నాయి.

            శిక్షలకు సంబంధించి మనుస్మృతిలో వున్న ఆదేశాలన్నింటినీ ఇప్పుడు ఉటంకించాల్సిన అవసరంలేదుగానీ,  ఆ శిక్షాస్మృతి పాటించే ప్రాధమిక  నియమాన్ని అర్ధం చేసుకుంటేచాలు. ఇద్దరు వ్యక్తులు చేసిన నేరం ఒక్కటే అయినప్పటికీ  పైవర్ణాల వారికి  తక్కువ శిక్ష, కింది వర్ణాల వారికి పెద్ద శిక్ష అనేది మనుస్మృతి విధించిన నియమం. దీనినే ఇప్పుడు మన సమాజం ముస్లింల విషయంలో పాటిస్తున్నది. హిందువులకు చిన్న శిక్ష, ముస్లింలకు పెద్ద శిక్ష.

 

         ఓ ముస్లిం అబ్బాయి ఓ హిందూ అమ్మాయిని  ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే అది లవ్ జిహాద్. అది ఆ కుర్రాడ్ని నడిరోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపాల్సినంత నేరం.  వాళ్లిద్దరు ఒక కార్పొరేట్ ఆఫీసులో సహోద్యోగులు అయ్యుంటే అది కార్పొరేట్ జీహాద్. వాళ్ళిద్దరూ ఓ మెడికల్ కాలేజీలో చదువుతుంటే అది మెడికల్ జిహాద్. వాళ్ళేమయిన ఇల్లు కట్టుకుంటే జమీన్ జిహాద్, ఘర్ జిహాద్. బతకడానికి బన్నులు అమ్ముకుంటే బన్ జిహాద్, బేప్సార్ జిహాద్. ఇందుగలదు అందులేదనే సందేహమే వద్దు. ఈ జిహాద్ ఎందెందువెతికినా అందందే వుండును.

 

                  కుంభమేళాలో ‘మొనాలిసా’గా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక ట్రైబల్ అమ్మాయికి పెద్దలు పెళ్ళి కుదిర్చారు. ఆ పెళ్ళి ఆమెకు ఇష్టంలేదు. తన సన్నిహితుడు సినీ నటుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్ళి చేసుకుంది. అంతే. ఈ సంఘటనలో ముస్లిం పేరు కనిపించడంతో సనాతనుల మనోభావాలు గట్టిగా దెబ్బతిన్నాయి. మొనాలిసాను కిడ్నాప్ చేశాడనీ, పైగా ఆమె మైనర్ గనుక అతని మీద పోక్సో కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపాలని సనాతనుల సంఘాలు రోడ్డుకెక్కాయి. ఆమె నిజంగానే మైనర్ అయ్యుంటే ఆమెకు పెళ్ళీ చేయతలపెట్టిన తల్లిదండ్రుల్ని ముందు అరెస్టు చేయాలి. ఇంత చిన్న లాజిక్కును ఎలా మర్చిపోయారబ్బా? 

 

ఇప్పుడు ఇంకో పోక్సో కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై  ఓ మైనర్  మీద అత్యాచారం చేశాడనే ఆరోపణ వచ్చింది. నిందితుని తండ్రి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో మొదట్లో కేసు కట్టడానికి తెలంగాణ పోలీసులు తటపటాయించారు. నిందితుడు ముస్లిం కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సనాతన మహిళామణులు నీరసం వచ్చి నిద్రపోయారు.

 

సహజంగానే తన కొడుకు నిర్దోషనీ బండి సంజయ్ మీడియా ముందు బోలెడు బాధపడ్డారు. అయితే, బండి భగీరథ్ మరీ నోట్లో వేలు పెట్టినా కొరకడం తెలీని అమాయకుడుకాదనీ, గతంలో కొందరి వేళ్ళు కొరికిన చరిత్ర అతనికి వుందని తెలిసినవాళ్ళు గుర్తు చేస్తున్నారు.  ప్రస్తుతం భగీరథ్ పరారీలో వున్నాడనీ, తండ్రి చెప్పినంత అమాయకుడు కాడు కనుక తెలివిగా  ట్రేస్ కాకుండా సెల్ ఫోన్ స్విచాఫ్ చేశాడని కూకట్ పల్లి డిసిపి రితిరాజ్ మీడియాకు తెలిపారు.

 

నిజానికి ఈకేసు జాతీయ రాజకీయాలను కూడ ప్రభావితం చేసిందనే వాదన ఒకటుంది. అధికార పర్యటనకు మే 10న హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వేదిక మీదనే కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. తనతో చేతులు కలిపితే బోలెడు అభివృధ్ధి సాధించవచ్చని ఒక ఆఫర్ కూడ ఇచ్చారు.  ఫలితంగా రేవంత్ రెడ్డి ఈ కేసులో అంటీ ముట్టనట్టు వ్యవహరించారనే కథకం కూడ చక్కర్లు కొట్టింది. అంతిమంగా భగీరథ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రేవంత్.

 

విచిత్రం ఏమంటే బండి భగీరథ్ ను రక్షించడానికి తెలుగు మీడియా సంస్థలు నడుం బిగించాయి. కొన్ని సంస్థలు, జరిగిన సంఘటనను ‘హానీ ట్రాప్’ గా చిత్రించాయి. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని కుట్రదారులుగా ప్రచారం చేశాయి. బాలిక మైనర్ అయినప్పుడు హానీ ట్రాప్ ఆరోపణ చెల్లదనే కనీసపు ఇంగితం కూడ ఈ మీడియా సంస్థలకు లేకపోయింది. మైనర్ బాలికను అడ్డుపెట్టి ఆమె తల్లియే హానీ ట్రాప్ నడిపించిందనేంత వరకు సోషల్ మీడియా కథనాలు వెళ్ళాయి. నిందితుడినే బాధితుడిగా చిత్రించే అతి తెలివినీ ప్రదర్శించాయి.

 

ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక అక్షరం స్థానాన్ని శబ్దం ఆక్రమించడంతో  పాత్రికేయ విలువలు క్రమంగా క్షీణిస్తున్నాయనే ఆరోపణలు, ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగానే వున్నాయి. మన దేశంలో అవి మరీ దిగజారాయి. తెలుగు మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా, ఏ స్థాయికి పడిపోయిందో కొలవడం కూడా కష్టమే.

 

భారత ముస్లింలలో నేరస్తులు వుండరని ఎవరూ అనరు. ముస్లింలలోనూ నేరస్తులు తప్పక వుంటారు. కానీ నేరస్తులందరూ ముస్లింలే అని చెప్పడానికీ, ఎక్కడ ఏ నేరం జరిగినా అందులో ముస్లింలు వున్నారని ప్రచారం  సాగించడానికి చాలా పెద్ద వ్యవస్థ పని చేస్తున్నది.

 

ప్రతిదానికీ ముస్లింలను బోనెక్కించడానికి ప్రయత్నించడంకన్నా నమ్మకమైన గణాంకాలతో ఎవరయినా ముందుకు రావచ్చు. దేశంలో జరిగే ప్రతినేరాన్నీ నమోదు చేయడానికి కేంద్రంలో హొంశాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వుంటుంది. అది ప్రతి సంవత్సరం తన నివేదికను విడుదల చేస్తుంటుంది.

 

ఇటీవల విడుదలైన ఎన్ సి ఆర్ బి నివేదిక  2024వ సంవత్సరంలో దేశంలో శిక్షార్హమైన నేరాలు 60 లక్షల వరకు జరిగాయని పేర్కొంది. వీటిల్లో అత్యాచారాలు 29,536. లైంగిక వేధింపులు 48, 3030. భార్యల మీద భర్తల డౌర్జన్యం 1,20, 227. వరకట్న హత్యలు 5,737. మహిళల అదృశ్యం 67,829 కేసులు.

 

ఈ కేసులన్నింటిలోని గణాంకాల్ని మత ప్రాతిపదికన వర్గీకరిస్తే ఏ సామాజిక సమూహంలో ఎంతమంది నేరస్తులు వున్నారో  సులువుగా తెలిసిపోతుంది. ఎవరు ఎక్కువ నేరస్త స్వభావం కలిగివున్నాడో తేలిపోతుంది.

 

ఆ ప్రయత్నం చేయనంతకాలం అణగారిన మత సమూహాల మీద క్రిమినల్ ముద్రలు వేస్తూనే వుంటారు.  

 

రచన: 12-05-2026

 

No comments:

Post a Comment