Tuesday, 1 September 2026

న్యూయార్క్‌లో వేదాంతం! భారతదేశంలో మౌనం!!

 న్యూయార్క్‌లో వేదాంతం!  భారతదేశంలో మౌనం!!

డానీ

సమాజ విశ్లేషకులు 




ఆరెస్సెస్ సర్సంగ్ ఛాలక్ మోహన్ భగవత్  న్యూయార్క్‌లో మాట్లాడారు. చాలా గొప్పగా మాట్లాడారు. మానవత్వం ఒక్కటన్నాడు. సత్యం ఒక్కటన్నారు. మతాలు వేరైనా, మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే అన్నారు.  వైవిధ్యం ప్రకృతి నియమమన్నారు. ఏకత్వం ప్రకృతి సత్యమన్నారు. వైవిధ్యాన్ని అంగీకరించాలన్నారు. దాన్ని అందరూ గౌరవించాలి, . రక్షించాలి అన్నారు. 


వినడానికి ఎంత గొప్పగా ఉంది! కానీ ఒక చిన్న ప్రశ్న. ఈ మాటలు న్యూయార్క్‌లోనే ఎందుకు అంటున్నారూ? భారతదేశంలో ఎందుకు అనడం లేదూ?


భారతదేశంలో వైవిధ్యాన్ని ఎవరు రక్షించాలి? మతసామరస్యాన్ని ఎవరు కాపాడాలి? దేశంలో ద్వేషం వ్యాపిస్తున్నప్పుడు ఎవరు మాట్లాడాలి? ఒక మత సమూహం భయంతో జీవిస్తున్నప్పుడు “మనందరం ఒక్కటే” అని ఎవరు చెప్పాలి?


మోహన్ భగవత్  మరో గొప్ప మాట చెప్పారు. ధార్మిక వైవిధ్యాన్ని రక్షించాలని పిలుపిచ్చారు. వైవిధ్యం అలంకారమన్నారు. దాన్ని అందరూ  అంగీకరించాలన్నారు. గౌరవించాలన్నారు. రక్షించాలన్నారు. 


ఇక్కడా అదే ప్రశ్న.  అయితే భారత్‌లో పరిస్థితి ఏమిటీ? వైవిధ్యాన్ని ఎవరు కూలదోస్తున్నారూ? ఎవరు రక్షిస్తున్నారూ? 


మసీదులు కూలుతున్నప్పుడు, ముస్లింల వాణిజ్య భవనాలు బుల్‌డోజర్ల కింద నలిగిపోతున్నప్పుడు, అల్పసంఖ్యాక సమూహాలకు చెందిన పేదల ఇళ్లు శిథిలమై పోతున్నపుడు, ఆ సమూహాలను తప్పుడు కేసులతో వేధిస్తున్నప్పుడు, “లవ్ జిహాద్” పేరుతో యువకులను వెంటాడుతున్నప్పుడు, ఆవుల అక్రమ రవాణా పేరుతో ముస్లింలపై కేసులు పెడుతున్నప్పుడు, మూకలు దాడులు చేస్తున్నప్పుడు, నడి రోడ్ల మీద లించింగ్‌లు సాగుతున్నప్పుడు వైవిధ్యాన్ని రక్షించాలి అన్న భగవత్ ఎక్కడున్నారూ?  బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసు నిందితుల్ని  పూల మాలలతో సత్కరిస్తున్నపుడు మోహన్ భాగ్వత్ ఈ హితవులు పలికితే బాగుండేది. పైగా, అలా సన్మానించినవారు భగవత్ అనుచరులే.  ఇదేమి ద్వంద్వ నీతీ?  ‘మాటల్లో సమానత్వం. మైదానంలో మౌనం’!! 


భగవత్ న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ ఉపన్యాసంలో  ఒక గొప్ప ప్రకటన చేశారు. “భారతదేశంలో ముస్లింలు ఉండకూడదని భావించే హిందువులు నిజమైన హిందువులు కాదు” అన్నారు. అది నిస్సందేహంగా గొప్ప మాట.


కానీ, ఒక  గొప్ప మాట చెప్పడం ఒకటి. ఆ మాటను తన అనుచరులు పాటించేలా చేయడం మరోటి. మాట్లాడటం ఒకటి. చర్య తీసుకోవడం మరోటి. వేదాంతం చెప్పడం ఒకటి. చెప్పిన వేదాంతాన్ని సమాజ ఆచరణలో పెట్టడం మరోటి.


మోహన్ భగవత్ తో సమస్య ఇక్కడే. వారు ప్రపంచానికి మతసామరస్యాన్ని బోధిస్తారు. కానీ భారతదేశంలో ద్వేషం వ్యాపించినప్పుడు

అంతే తీవ్రంగా ఖండిస్తారా? అల్పసంఖ్యాక మత సమూహాల మీద హింసాత్మక దాడులు సాగుతున్నప్పుడు తమ సంస్థాను, తన అనుచర గణాన్ని అయినా  నిలదీస్తారా? తన అనుచర సమూహాల్లో విద్వేష ప్రచారం సాగించే వారి మీద చర్యలు తీసుకుంటారా? మౌన ప్రేక్షకుడిలా వుండిపోతారా? 


ఇవే అసలు ప్రశ్నలు. ఎందుకంటే - నిశ్శబ్దం కూడా ఒక రాజకీయ భాషే. ముఖ్యంగా, మీ మాటకు బరువు ఉన్నప్పుడు. మీ సంస్థకు దేశవ్యాప్తంగా విసృత ప్రభావం ఉన్నప్పుడు. మీ భావజాలం అధికార రాజకీయాలను ప్రభావితం చేస్తున్నప్పుడు. మీ మౌనం కేవలం మౌనం కాదు. అది ఒక రాజకీయ వైఖరి.


మోహన్ భగవత్ ది ఒక ప్రత్యేకమైన రాజకీయ శైలి. వారి మాటల్లో ఆవేశం తక్కువ. వేదాంతం ఎక్కువ. సంస్కృతి ఎక్కువ. మానవత్వం ఎక్కువ. “మనమంతా ఒక్కటే” అన్న తత్వం ఎక్కువ. వారి మాటల్ని వింటుంటే ఒక ఆధ్యాత్మిక గురువు మాట్లాడుతున్నట్టుంటుంది. ఓ ప్రవచనకారుడిలా, ఓ వేదాంతిలా కనిపిస్తుంటారు. అది వారి ప్రయత్నం.


కానీ,  దేశ రాజకీయాల దగ్గరకు రాగానే – ప్రశ్నలు, సమాధానాలు అన్నీ మారిపోతాయి. ఆ వేదాంతం ఎక్కడికి పోతోంది? వారి మానవత్వం మాటల్లోనే ఎందుకు మిగిలిపోతోంది? వైవిధ్యరక్షణ ఉపన్యాసాల్లోనే ఎందుకు ఉండిపోతోంది?  భారత సమాజంలోని వైవిధ్యానికి భద్రత కల్పించడంలో వారి సంకల్పం ఎందుకు కనిపించదు? ఇది మొహన్ భగవత్ వ్యక్తిత్వంలోని పెద్ద వైరుధ్యం. వారికి వేదాంతం ఒక ముఖం. రాజకీయ మౌనం మరో ముఖం. 


న్యూయార్క్‌లో వైవిధ్యం గొప్పది అంటారు మరి భారతదేశంలో? విదేశాల్లో వైవిధ్యం అందంగా కనిపిస్తుంది. అమెరికాలో వివిధ మతాల వారితో సమావేశాలు మంచిగుంటాయి. ప్రపంచ మతసామరస్యం గురించి మాట్లాడటం గొప్పగా వుంటుంది.  కానీ, ఆ ఆదర్శాలనూ, ఆ ప్రమాణాలనూ భారతదేశంలో అమలు చేయాలి కదా? అదే అసలు పరీక్ష.


మతసామరస్యం అంటే పదిమంది భిన్నమతాచార్యులు ఒక  వేదిక మీద కూర్చోవడం మాత్రమే కాదు; వాళ్ళు బలహీన సమూహాల పక్షాన నిలబడాలి, బాధితులకు న్యాయం చేయాలి. ఎక్కడయినా సరే ద్వేషాన్ని ఖండించాలి. మూక హింసను ఆపాలి. న్యాయాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని గట్టిగా కోరాలి.  బుల్‌డోజర్ రాజకీయాలను ప్రశ్నించాలి. తప్పుడు ఆరోపణలతో సాగే  వేధింపుల్ని  ఖండించాలి.  ఇవేవీ  చేయకుండా  “మానవత్వం ఒక్కటే; మతాల లక్ష్యం ఒక్కటే ” అని చెప్పడం ఎంతవరకు సబబూ?


భారత అధికార రాజకీయాలను గమనిస్తే ఒకే శిబిరం నుండి మూడు భిన్నమైన భాషలు కనిపిస్తాయి. మూడు వేర్వేరు శైలులు. మూడు వేర్వేరు ముఖాలు.


మోహన్ భగవత్; వేదాంతం మాట్లాడతారు. సంస్కృతి మాట్లాడతారు.  మానవత్వం మాట్లాడతారు. ధార్మిక వైవిధ్యం గురించి మాట్లాడతారు.

నరేంద్ర మోదీ; ప్రజాస్వామ్య భాష మాట్లాడతారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” అంటారు. అందరికీ అభివృద్ధి ఫలాలు దక్కాలి అంటారు. అందరికీ అవకాశాలు అంటారు. 


అమిత్ షా. అధికార భాష మాట్లాడతారు. విపక్షాలపై రాజకీయ దాడుల భాష మాట్లాడతారు. నిరసనల మీద కఠిన చర్యల హెచ్చరికలు చేస్తుంటారు. 


అంటే— ఒకరు వేదాంతం. మరొకరు అభివృద్ధి. ఇంకొకరు అధికారం.  మూడు ముఖాల మధ్య  అదే వైవిధ్యం. ముగ్గురి లక్ష్యాల మధ్య అదే ఏకత్వం.  ఒకే భాజాలనికి, ఒకే లక్ష్యానికి  భగవత్ నైతిక ముఖం ఇస్తారు; మోదీ అభివృధ్ధి భాషను జోడిస్తారు. అమిత్ షా అధికార ముఖాన్ని ప్రదర్శిస్తారు.  


నాటి హెగ్దేవార్ నుండి ఇప్పటి మొహన్ భగవత్  వరకు ఆరెస్సెస్ సర్సంగ్ ఛాలకులు అందరిదీ ఒకటే మాట. తమది మత సంస్థ కాదు; రాజకీయ సంస్థకాదు; కేవలం సేవా సంస్థ అని వారంటుంటారు. వాళ్ళ ఆచరణను దగ్గరగా గమనించేవారెవరయినా  ఆరెస్సెస్ ను స్థూలంగా  మత రాజకీయాలకు సేవలందించే సంస్థ అనే నిర్ధారణకు వస్తారు. మత విశ్వాసాలు వేరు; మత రాజకీయాలు వేరు  అని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 


ప్రపంచ వేదికల మీద మతసామరస్య విలువల గురించి మాట్లాడటం సులభం. భారతదేశంలో మతసామరస్యం కోసం నిలబడటం కష్టం. న్యూయార్క్ లో ప్రకటించిన ఆదర్శాలను ఇకముందు భారత్ లో భగవత్ ఏ మేరకు ఆచరిస్తారన్నది ఇప్పుడు ప్రాణప్రదమైన ప్రశ్న. 


1 సెప్టెంబరు 2026

No comments:

Post a Comment