*దేశభక్తికీ మతభక్తికీ మధ్య వందేమాతరం!*
*డానీ*
*సమాజ విశ్లేషకులు*
ఈరోజు నా వ్యాసాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికకు ధన్యవాదాలు.
నేలతల్లికి వందనం. “మా తుఝే సలాం! వందే మాతరం!” అనడం దేశభక్తి. కానీ, దేశభక్తి వేరు; దేవతారాధన వేరు. మౌలికమైన ఈ తేడాను అర్థం చేసుకోకపోతే వందేమాతరం పాట మీద సాగుతున్న వివాదం అర్థం కాదు. ఈ వివాదం నిన్న మొన్న మొదలైనది కాదు. దాని వేర్లు 19వ శతాబ్దంలోనే ఉన్నాయి.
1857 నాటి సిపాయిల తిరుగుబాటు భారత జాతియోద్యమ చరిత్రలో కీలక ఘట్టం. దానినే చాలామంది భారత ప్రధమ స్వాతంత్ర్య సమరం అనికూడ అంటారు. దానికి సన్నాహకంగా, ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరణకు వ్యతిరేకంగా 1855లో ఆదివాసి సంతాల్ తిరుగుబాటు, అంతకు ముందు 1763లో సన్యాసులు-ఫకీర్ల తిరుగుబాట్లు జరిగాయి. హిందూ సన్యాసుల తిరుగుబాట్లకు పండిట్ భాబని చరణ్ పాథక్, దేవీ చౌధురాని తదితరులు నాయకత్వం వహించగా, ముస్లిం ఫకీర్ల తిరుగుబాటుకు మజ్నూ షా, మూసా షా తదితరులు నాయకత్వం వహించారు. ఆ తిరుగుబాట్లలో మాతృభూమి విముక్తి అనే భావనతోపాటు హిందూ ముస్లిం ఐక్యత కూడ బలంగా వ్యక్తం అయింది.
ఆ తిరుగుబాట్లన్నీ విఫలమైనప్పటికీ పరిపాలన విధానాలలో చాలా మార్పులు వచ్చాయి. భారత ఉపఖండంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి, 1858లో భారతదేశం నేరుగా బ్రిటిష్ క్రౌన్ పాలనలోకి వెళ్లింది. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ తొలి వైస్రాయ్ కూడ అయ్యి జంటపదవుల్ని నిర్వహించారు.
ఈ మూడు తిరుగుబాట్ల పరాజయాలు భారతీయులకు కొన్ని గుణపాఠాల్ని నేర్పినట్టే, వీటిల్లో వ్యక్తమైన మతసామరస్యంవంటి అంశాలు వలస పాలకులకు కూడ మరికొన్ని గుణపాఠాల్ని నేర్పాయి. భారత సమాజంలోని ప్రధాన మత సమూహాలను విభజించి పరిపాలనా ప్రయోజనాలకు అనువుగా ఉపయోగించే విధానాలు రూపొందాయి. హిందూ, ముస్లింలు మళ్ళీ ఏకం కాకుండా చూసుకోవడం తమకు శ్రేయస్కరం అని బ్రిటీష్ పాలకులు భావించడం మొదలెట్టారు. “విభజించి పాలించు” అనే పదబంధం ఆ కాలం లోనే వెలుగులోనికి వచ్చింది.
సిపాయిల తిరుగుబాటు అనంతర కాలానికి చెందిన బంకించంద్ర ఛటర్జీ బెంగాలీ సాహిత్యంలో సుప్రసిధ్ధులు. 1858లో బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన ఆయన 19వ శతాబ్దం చివరి వరకు డిప్యూటి మేజెస్ట్రేట్ వంటి పెద్ద పదవుల్ని నిర్వర్తించారు. 1870ల మధ్యలో, దేశమాతను దుర్గామాత, కాళికాదేవి వంటి శక్తిస్వరూపులుగా కొనియాడుతూ శిష్ట బెంగాలీ, సంస్కృత పదాలతో వందే మాతరం పాట రాశారు. నిరక్షారాశ్యులు ఎలాగూ ఆ పాటను పాడలేరు; అక్షరాశ్యులు సహితం ఆ కఠిన పదజాలాన్ని సులువుగా ఉఛ్ఛరించలేరు. 1882లో ఆయనే రాసిన ఆనందమఠ్ నవలలో దాన్ని చేర్చారు.
బంకించంద్ర తాను జీవిస్తున్న బ్రిటీష్ వలస పాలనను ఆ నవలలో చిత్రీకరించలేదు. అప్పటికి దాదాపు వందేళ్ళ క్రితం బెంగాల్లో నెలకొన్న కరువు, ఆర్థిక సంక్షోభాల కాలంలో సాగిన “సన్యాసి–ఫకీర్ తిరుగుబాట్లను తన నవలకు నేపథ్యంగా తీసుకున్నారు.
అయితే, ఆనందమఠ్ లో బంకించంద్ర అలనాటి సన్యాసి–ఫకీర్ ఉద్యమాన్ని కూడ సంపూర్ణంగా చిత్రించలేదు. ఒక చారిత్రక ఉద్యమంలోని ముస్లిం ఫకీర్ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, కథను ప్రధానంగా హిందూ సన్యాసుల చుట్టూ నిర్మించారు. కొండొకచో అప్పటి ముస్లిం పాలకుల మీద వ్యతిరేకతను కూడా ప్రదర్శించారు. మాతృభూమి విముక్తి కోసం హిందూ సన్యాసులు మాత్రమే పోరాడారన్నట్టు కథనాన్ని నడిపారు. ఈ నేరేటివ్ సమగ్రమైనదికాదు. పాక్షిక సత్యం. సెలెక్టివ్ ఫ్యాక్ట్!
ఆనందమఠ్ నవలకు ఎంచుకున్న పాత్రలు హిందూ సన్యాసులవే కనుక వాళ్ళు కాళీక, దుర్గా తదితర హిందూ దేవతా విగ్రహాలను పూజించడం, వాళ్లనే భారతమాతగా భావించడం ఎవరికీ అసహజంగా అనిపించలేదు.
ఆ తిరుగుబాట్లలో ముస్లిం ఫకీర్లు కూడ వున్నారనే వాస్తవాన్ని గుర్తించినపుడు, వాళ్ల భిన్నమైన ఆరాధనా పధ్ధతుల్ని వేరుగా చిత్రీంచాల్సి వుండేది. రెండు భిన్న మత దృక్పథాలకు చెందిన సమూహాలు తమతమ ధార్మిక విధుల్ని పాటించుకుంటూనే, మాతృదేశ విముక్తి కోసం ఉమ్మడి శతృవుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారనే సందేశం వచ్చేది. కానీ అలా జరగలేదు. ముస్లిం ఫకీర్లు కూడ మాతృభూమి విముక్తి కోసం పోరాడారన్న వాస్తవాన్నీ ఆ నవల దాచిపెట్టింది. కట్టుకథల్ని, పాక్షిక సత్యాల్ని వాస్తవ చరిత్రగా భావిస్తున్న కాలం కనుక ఆ నవలే వాస్తవిక చరిత్రగా చెలామణి అయిపోతోంది.
మాతృభూమిని గౌరవించడం వేరు; మాతృభూమిని దుర్గామాతగా భావించి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ విగ్రహాన్ని పూజించడం వేరు. ముస్లింల విశ్వాసం తౌహీద్ — ఏకేశ్వరోపాసన. వాళ్ళు మరో దేవుళ్ళను విశ్వశించరు. విగ్రహాలను పూజించరు. వందేమాతరం పాట మొదటి రెండు చరణాల్లో కనిపించే భారత ప్రకృతి, సస్యశ్యామలత, మాతృభూమి సౌందర్యం వర్ణనలతో ఎవరికీ ఇబ్బందిలేదు. తరువాతి నాలుగు చరణాల్లో దేశాన్ని హిందూ దేవతల ప్రతీకగా మార్చడంతో వివాదానికి ఆస్కారం ఏర్పడింది.
1905 నాటి బెంగాల్ విభజన వ్యతిరేక స్వదేశీ ఉద్యమంలో ‘వందే మాతరం’ పోరాట నినాదంగా మారింది. ముస్లింలు సహితం ఆ నినాదాన్ని గట్టిగా సమర్ధించారు. అదే సమయంలో ఆ పాటలోని తదుపరి నాలుగు చరణాల్లో చిత్రించిన హిందూమత ప్రతీకలపై ముస్లింవర్గాల్లో అభ్యంతరాలు కూడా తీవ్రంగానే వ్యక్తం అయ్యాయి.
“లకుమ్ దీనకుమ్ వలియదీన్” అనేది ముస్లిం మత సామరస్య విధానం. అది ఖురాన్ ఆదేశం. "మీకు మీ ధర్మం, నాకు నా ధర్మం" అనేది దాని అర్ధం. ఎవరి మతాచారాలను వాళ్లు పాటించుకోవచ్చు. అధిక సంఖ్యాకుల మతాచారాల్ని అల్పసంఖ్యాకులు పాటించాలని వత్తిడి చేస్తేనే వివాదం మొదలవుతుంది.
ఇక్కడ స్వామి వివేకానంద అభిప్రాయం అత్యంత ముఖ్యమైనది. 1898 జూన్ 10న ఒక మిత్రునికి రాసిన లేఖలో హిందూమతం, ఇస్లాంల ఐక్యతే భారత భవిష్యత్తుకు ఆశ అంటూ, “వేదాంత మేధస్సు, ఇస్లాం శరీరం” వంటి ప్రసిద్ధ ఉపమానాన్ని వారు ఉపయోగించారు. అంటే భారత జాతీయత ఒక మత సమూహపు ఆధిపత్యంగా కాక, భిన్న సంప్రదాయాల సమన్వయంగా ఉండాలని వివేకానంద సూచించారు.
ఇక్కడ రవీంద్రనాథ్ టాగోర్ అభిప్రాయం కూడ కీలకమైనది. 1937లో వందే మాతరం పాట మీద జరిగిన చర్చలో ఆయన మొదటి రెండు చరణాల్లో మాతృభూమి సౌందర్యాన్ని కీర్తించే అంశం అందరికీ ఆమోదయోగ్యంగా వుంటాయని, అయితే తరువాతి చరణాల్లోని హిందూ దేవతా ప్రతీకలు మాత్రం ముస్లింలకు అభ్యంతరకరంగా ఉండవచ్చని హెచ్చరించారు. ఇది ముస్లింలకేకాదు శిక్కులు, క్రైస్తవులు, బౌధ్ధులు, నాస్తికులు, కమ్యూనిస్టులకు సహితం అభ్యంతరకర అంశమే.
విశ్వకవి సూచనమేరకు కాంగ్రెస్ జాతీయ కార్యక్రమాల్లో వందేమాతరం పాటలోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ తదితర జాతీయోద్యయ నాయకులు, ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనిని సంఘపరివారం ఇప్పుడు ముస్లిం బుజ్జగింపు, ముస్లిం సంతుష్టీకరణ అని విమర్శిస్తున్నది.
1923లో సావర్కర్ హిందూత్వ సిద్ధాంతాన్ని మాతృభూమి–పుణ్యభూమి ప్రమాణాలతో కొత్త రాజకీయ భాషలో నిర్వచించారు. తరువాత, ఆరెస్సెస్ రెండవ సర్సంగ్ ఛాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ తదితర హిందూత్వ ఆలోచనాపరులు ఆ భావజాలాన్ని మరింత విస్తరించారు. ముస్లింల పుణ్యభూమి భారతదేశం బయటవుంటున్నదన్నది వారి విమర్శ.
మక్కా, మదీనా, అల్-అక్సా మసీదు ముస్లింలకు పవిత్ర స్థలాలు. కానీ, ఒక పవిత్ర క్షేత్రం ఒక దేశంలో ఉండటం వల్ల ఆ దేశమే వారి రాజకీయ మాతృభూమి అవుతుందని చెప్పడం సరికాదు. ఇప్పటి సౌదీ అరేబియాను తమ పుణ్యభూమి అని ముస్లింలు భావించరు. మక్కాలోని కాబా వేరు; సౌదీ అరేబియా దేశం వేరు. ఇక్కడ ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని సాగిస్తున్నవారే సౌదీ అరేబియా వెళ్ళి యువరాజును ఆలింగనం చేసుకుని ఆ ఫోటోలను గొప్పగా మిడియాలో పెట్టుకుంటున్నారు. ఇదేం బూటకం! భారత ముస్లింల జన్మభూమి, కర్మభూమి, పౌరభూమి, మరణభూమి. మదర్ ల్యాండ్ – ఫాదర్ ల్యాండ్ అన్నీ భారతదేశమే.
రాజ్యాంగ సభ కూడా ఈ సున్నితత్వాన్ని అర్థం చేసుకుంది. సభాధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతం (anthem)గానూ, వందే మాతరం పాటలోని మొదటి రెండు చరణాలను జాతీయ పాట (song)గానూ ప్రకటించగా దాన్ని సభ చప్పట్లతో ఆమోదించింది. ఆ సభలో ఇప్పటి బిజెపికి పూర్వ సంస్థల నాయకులు సహితం వున్నారు.
వర్తమాన భారత ప్రభుత్వ అధినేతలు భవిష్యత్తులోకన్నా గతంలోనే ఎక్కువగా జీవిస్తున్నారు. వాళ్ళు చెప్పే గతం కూడ సెలెక్టివ్ మెమొరీ. ఒక భాగాన్ని చెపుతారు మరో భాగాన్ని దాచిపెడతారు. వందేమాతరం పాట పాడించి ముస్లింల చేత దుర్గామాత పూజ చేయిస్తామంటే హిందూ సమాజంలోని కొందరికి ఆనందం కలగవచ్చు. అది రాజకీయంగా బిజెపికి లాభించవచ్చు. ఇది అందరికీ కనిపిస్తున్న దృశ్యం. కనిపించని దృశ్యం మరొకటుంది.
హిందూవుల పవిత్ర దేవతలైన దుర్గా కాళిమాత తదితరుల్ని రాజకీయాల్లోనికి తీసుకునివస్తే, కొన్ని విపరీత పరిణామాలు జరుగుతాయి. దిగజారిన రాజకీయాలు దేవతల పవిత్రతను కూడ దిగజారుస్తాయి. ఆ పరిణామం మొదలయింది కూడ.
ముందు నటులు, నర్తకుల్ని దేవతలుగా మేకప్ చేస్తున్నారు. ఆ తరువాత వాళ్ల చేత తీన్మార్ డాన్సులు చేయిస్తున్నారు. ఇంకా జుగుప్సాకర, చౌకబారు అసభ్య అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. ఇటీవల కలకత్తాలో నిర్వహించిన కవాడి ఉత్సవంలో ప్రదర్శించిన కాళీమాత నృత్యం వీడియాలూ వైరల్ అయ్యాయి. వాటిని చూస్తే, రాజకీయ లబ్ది కోసం వాళ్లు మతాన్ని ఏస్థాయికి దిగజార్చగలరో సులువుగా అర్ధం అవుతుంది. దీన్ని సభ్యతగల హిందూ సమూహాలు ఆమోదిస్తాయని కూడ అనుకోలేం. వాళ్లు స్పందిస్తారు. తప్పక వ్యతిరేకిస్తారు.
ఇక్కడ కొన్ని చారిత్రక సంఘటనల క్రోనోలాజీని ఒకసారి మననం చేసుకోవడం మంచిది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905లో స్వదేశీ ఉద్యమం మొదలయ్యింది. వందేమాతరం నినాదం ప్రతిద్వనించింది. దాని నాలుగు చరణాల మీద తీవ్ర వివాదం మొదలైంది. ముఖ్యంగా తూర్పు బెంగాలుకు సంబంధించిన ముస్లింలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది. 1947లో దేశవిభజన సందర్భంగా తూర్పు బెంగాల్ తూర్పు పాకిస్తాన్ గా మారింది. 1971లో తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర బంగ్లాదేశ్ గా మారింది. గమనించే వాళ్ళకు ఈ క్రోనోలాజీ చాలా చెపుతుంది.
సారాంశం ఏమంటే వందే మాతరం నినాదం, వందే మాతరం ఉద్యమం, వందే మాతరం పాట - మూడూ ఒకటి కావు.
15 సెప్టెంబరు 2026
ABN , Publish Date - Sep 27 , 2026
.png)
No comments:
Post a Comment