Wednesday, 23 September 2026

Gen-Z movement and the Muslim Civil Society

 

*జెన్ జీ – ముస్లిం సమాజానికి కొత్త గొంతు*.

*డానీ*

*సమాజ విశ్లేషకులు*

 

ఈ రోజు నా వ్యాసాన్ని ప్రచురించిన తెలుగుప్రభకు ధన్యవాదాలు.




 

బొద్దింకల నిరసనలకు సింహాసనం వణికి, కేంద్ర విద్య మంత్రి రాజీనామా చేశాక  జెన్-జి ఉద్యమం మీద అనేక పీడిత సమూహాలకు కొత్త ఆశలు చిగురించాయి. ఆ ఉద్యమ నేత దళితుడు అయిన అభిజిత్ డిప్కే  నేటి హీరోగా మారాడు.  అతను చెయ్యాల్సిన పని చేసేశాడు. సింహాసనం మీద ప్రజలకు  ఉండే భయాన్ని పోగొట్టేశాడు.  ఆ తరువాత అతను ఇంకా ఏమి చేయగలడు? ఏమి చేయలేడు? అనేవి ఉహాగాలకు సంబంధించిన అంశాలు. జెన్  - జి  ఉద్యమం మీద కొత్త ఆశలు పెట్టుకున్న సమూహాల్లో ముస్లింలు కూడా వున్నారు. విచిత్రం ఏమంటే, జెన్ జీ ఉద్యమం తొలుత అరబ్ దేశాల్లోనే పుట్టింది. మొదట్లో దాన్ని ‘అరబ్ వసంతం’ (Arab Spring) అనేవారు.

 

మనం మరచిపోతున్నాంగానీ యువతరం తిరుగుబాటు చేయడం మనకు కొత్త కాదు. 1970లలో  నక్సలైట్ ఉద్యమం చెలరేగింది. రెండవ ప్రపంచ యుద్ధం, భారత దేశ స్వాతంత్య్రం   తరువాత పుట్టిన బేబీ బూమర్స్  చాల చురుగ్గా అందులో పాల్గొన్నారు. 1990 ల  వరకు  ఆ ఉద్యమం ఒక ఉత్తేజంతో సాగి సమాజం మీద  మంచి  ప్రభావాన్ని చూపింది. ఆ తరువాత సమాజంలో వచ్చిన గుణాత్మక పరిణామాల్ని అర్ధం చేసుకోలేక అది బలహీనపడింది.  2026 లో ఆ దశ ముగిసింది.

 

బేబీ  బూమర్స్ ఉద్యమ ముగింపు జెన్ జి ఉద్యమ ఆరంభం ఒకే సంవత్సరంలో జరగడం కొందరికి యాదృచ్చికంగా కనిపించవచ్చు. కానీ, రెండింటి మధ్య ఒక సంబంధం ఉంటుంది. ప్రపంచంలో ఏదీ ఒంటరిగా వుండదు. ప్రతిదీ మరో దానితో సంబంధంలో వుంటుంది. అదే అంటాలజి. సమాజం అనేది వ్యక్తుల సమాహారం మాత్రమే కాదు. సంబంధాల సమాహారం. సంబంధాలు స్థిరమైనవి కావు. నిరంతరం చలనంలో వుంటాయి. పరిమాణాత్మక చలనం గుణాత్మకంగా మారినపుడు చారిత్రక దశలు కూడ మారుతాయి. కొత్త దశ కొత్త  వైరుధ్యాలను సృష్టిస్తాయి. కొత్త వైరుధ్యాలను గుర్తించినవాళ్ళే సమాజంలో మార్పులు తేగలరు.

 

1990లలో తూర్పు యూరోప్ దేశాలు సోషలిజాన్ని వదిలి పెట్టుబడిదారి విధానం లోనికి వెళ్ళిపోయాయి. సోవియట్  రష్యా పతనమైంది. వామపక్స్ఢ రాజకీయాలకు ఆమోదాంశం సంశయంగా మారింది. ఇండియాలో రాజకీయాలు  ఎడమ వైపుకు  సాగుతున్న ప్రయాణాన్ని ఆపి కుడివైపుకు మళ్ళాయి. అద్వానీ రామ్ రథయాత్ర మొదలెట్టారు. కుల వ్యవస్థను వెనక్కు నెట్టి మత వ్యవస్థ ముందుకు రావడం మెదలెట్టింది. పీపుల్స్ వార్ లో కొండపల్లి సీతారామయ్యను బహిష్కరించారు. గ్యాట్ చర్చలు ముగిసి ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది. దేశంలో నూతన ఆర్థిక విధానాలోచ్చాయి.  ఇవన్నీ ఒకటి  మరోదానితో సంబంధం గల అంశాలు.

 

భారత కమ్యూనిస్టు పార్టీలలో రాడికల్ గా భావించే మావోయిస్టు పార్టి కొత్త వైరుధ్యాలను కనిపెట్టలేకపోయింది. దాని మైండ్ సెట్ నూరేళ్ల క్రితపు చైనా  సామాజిక వ్యవస్థను దాటి ఆలోచించలేకపోయింది.  గతంలో జీవించేవాళ్ళు సహజంగానే గతమైపోతారు.

 

కుల వ్యవస్థ మత వ్యవస్థగా మారుతున్నప్పుడు అన్ని శిబిరాల్లోనూ మార్పులు వస్తాయి.  హిందూ సామాజిక వ్యవస్థలో కులాలుంటాయి.  నిలువు అంతస్తుల దొంతర వుంటుంది. కులాల మధ్య ఘర్షణ వుంటుంది. ఈ ఘర్షణను తగ్గించి, లేదా వాయిదా వేసి, కొన్ని స్ట్రక్చరల్ సర్దుబాట్లు చేసుకుని  ఓట్ల కోసం విశాల హిందూ సంఘటనను   నిర్మించే పని  1990లలోనే ఆరంభమయింది.  అది బాబ్రీమసీద్ కూల్చివేతలోనూ కనిపించింది; గుజరాత్ అల్లర్లలోనూ కనిపించింది. ఇప్పుడూ కనిపిస్తున్నది.

 

భారతదేశంలో ముస్లిం సమాజం చాలా కాలంగా  ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. వారిపై ఆరోపణలు వస్తాయి. వారు వివరణ ఇవ్వాలి. వారిపై అనుమానాలు వ్యక్తమవుతాయి. వారు తమ దేశభక్తిని నిరూపించుకోవాలి. ఎక్కడో జరిగిన సంఘటనకు, ఎప్పుడో జరిగిన చరిత్రకు,  మరెక్కడో జరిగిన నేరానికి కూడా  భారతీయ ముస్లింలను సమాధానం చెప్పమంటారు.

 

పాకిస్తాన్‌ ఏజెంట్లు. బంగ్లాదేశీయులు. రోహింగ్యాలు. లవ్ జిహాద్. ల్యాండ్ జిహాద్. బీఫ్. హలాల్. హిజాబ్. CAA. NRC, మార్కజ్, కరోనా జిహాద్ … ఇలా ఆరోపణల జాబితాకు అంతం ఉండదు. ముస్లిం సమాజం ఎక్కువగా రక్షణాత్మకంగానే ఉండిపోతుంది.  ఆ సమాజం సమాధానం ఇవ్వదు. ఇచ్చినా అది ప్రజలకు వినిపించదు. రకరకాలుగా గొంతు నొక్కేస్తారు.

 

భారతీయ ముస్లిం సమాజం మీద సాగుతున్న దుష్ప్రచారం కొత్తది కాదు. అయితే సోషల్ మీడియా యుగంలో దాని వేగం పెరిగింది. ఒక ఆరోపణను వందసార్లు చెబితే అది “నిజంలా కనిపిస్తుంది.  ఇదే పోస్ట్-ట్రూత్ రాజకీయాల ప్రమాదం. మార్కజ్ సమావేశాన్ని “కోవిడ్ జిహాద్గా చిత్రీకరించిన సందర్భాన్నిక దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక సమాజాన్ని మొత్తంగా అనుమానాస్పదంగా చిత్రీకరించడం ఎంత ప్రమాదకరమో ఆ అనుభవం చూపించింది.

 

బీఫ్ విషయంలోనూ అదే జరుగుతోంది.   మాంసాహారం తినడం ఒక మతాచారంగానూ  శాకాహారం మాత్రమే తినడం మరో మతాచారంగానూ  సరళీకరించి ప్రచారం చేస్తున్నారు. భారత సమాజంలోని  ఆహారపు అలవాట్లలోని వాస్తవ వైవిధ్యాన్ని కప్పిపుచ్చుతున్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని “వాళ్ళు శ్రావణ మాసంలో మటన్ తింటూ ఇతరుల మనోభావాలను గాయపరుస్తున్నారు అంటే ఏం చేయాలీ?  హిందూ సమాజంలో అత్యధికులు మాంసాహారులనే వాస్తవం ఎక్కడ తలదాచుకోవాలి.  హిందువులందరూ మాంసాహారం మానేస్తే మార్కెట్ క్రాష్ అయ్యి చికెన్, మటన్ ధరలు వంకాయలు, సొరకాయల ధరలతో సమానమైపోవా?

 

బీఫ్ నిందలు మోయలేక ముస్లింలు దాన్ని త్యజించారు.  ఆవును జాతీయ పశువుగా ప్రకటించమని సూచించారు.  ప్రభుత్వం ఆ పని చేయగలుగుతుందా?  ప్రపంచ బీఫ్ ఎగుమతుల్లో ఇండియాది అగ్రస్థానం,  ఇండియాలో ఉత్తరప్రదేశ్ ది అగ్రస్థానం.  అంతేకాదు ఎలక్టోరల్ బాండ్స్ ద్వార బిజెపికి భారీ విరాళాలు ఇచ్చినవారిలో  బీఫ్ ఎక్స్పోర్టర్లు ఉండడాన్ని ఎలా అర్దంచేసుకోవాలీ? అయినా, ఈ కపటాన్ని ముస్లింలు ప్రశ్నంచలేకపోయారు.

 

అయితే,  2026లో వెలుగులోనికి వచ్చిన  జెన్ -జీ, మరీ ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టి  ఆధ్వర్యంలో సాగిన విద్యార్ధి యువజన నిరసనోద్యమం, ఈ రాజకీయ సంభాషణలో  ఒక కొత్త మలుపును చూపించింది. అది ముస్లిం పౌర సమాజానికి  ఒక కొత్త గొంతు ఇచ్చింది. ముస్లింలు గొంతెత్తి అడగలేకపోతున్న ప్రశ్నల్ని అదే అడుగుతోంది.   రక్షణాత్మక స్థితి నుంచి ఎదురు ప్రశ్న వేసే వరకు ఎదిగే ధైర్యాన్ని ముస్లిం సమాజానికి ఇచ్చింది.

 

నువ్వు పాకిస్తానీవి అని నిందిస్తే ముస్లింలు బిత్తరపోయేవారు. ఇప్పుడు మస్లీంల పక్షాన జెన్ – జీ అడుగుతోంది. అంత కన్నా చిన్న పిల్లలు అడుగుతున్నారు. “పాకిస్తాన్ వెళ్ళి బిర్యానీ తిని వచ్చింది ఎవరూ?” ఎదురు ప్రశ్న వేస్తున్నారు.  “జబ్ జబ్ మోదీ డర్తాహై – హిందూ ముస్లిం కర్తాహై’ అని రాజకీయ గుట్టును విప్పి చెపుతున్నారు.

 

ముస్లిం యువకుడు అంటే అనుమానం,  ముస్లిం వ్యాపారి అంటే అనుమానం, ముస్లిం పౌరుడు అంటే అనుమానం. వాళ్లందర్నీ ముందుగా బోనులో నిలబేడతారు. వాళ్లు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి.

 

రైళ్ళల్లో, బస్సుల్లో, విమానాల్లో, రోడ్ల మీద, ఉత్సవాల్లో లేదా ఇంట్లో దూరి, ఎవరయినా ఎక్కడయినా ముస్లింల మెడపట్టుకుని  నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని బెదిరించవచ్చు.  మత స్వేఛ్ఛ, భావప్రకటనా స్వేఛ్ఛ, రాజ్యాంగ హక్కులు మొదలయిన వాటితో లించింగ్ ముఠాలకు పనిలేదు.

 

ముస్లింల మీద నిందలు  ఇటీవల చిత్రమైన మలుపు తిరిగాయి.  ముస్లింలు బీఫ్ వదిలేస్తే, సంఘ్ పరివార సభ్యులే ఆవుల్ని వధించి ఆ నేరాన్ని ముస్లింల మీద నెట్టేస్తున్నారు. ముస్లిం యువకుల్ని లవ్ జిహాద్ కేసుల్లో ఇరికించడానికి సంఘ్ పరివార నేరలే తమ చెల్లెళ్లను ముస్లిం యువకులకు ఎరవేయమని ప్రోత్సహిస్తున్నారు.  కథ ఎక్కడ మొదలయ్యి ఎక్కడికి చేరింది.

 

మీడియా మారింది. ప్రేక్షకుడు కూడా మారాడు. ఇప్పటి వరకు ప్రజాభిప్రాయాన్ని ఉత్పత్తిచేసే శక్తి  పెద్ద మీడియా సంస్థల చేతుల్లో ఉండేది.

ఆ మీడియా సంస్థలు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మెలిగేవి.  వాచ్ డాగ్ లు లాప్ డాగులు అయిపోయాయి.  దీనికి హిందూ అనువాదం గోదీ మీడియా. సాధారణ ప్రజానీకం దీన్ని మోదీ మీడియా అనుకుంటున్నారు.

 

          ముస్లింలు, శిక్కులకు విజిబిలిటి ఎక్కువ. వందమందిలో పదిమంది వున్నా వాళ్ళే కనిపిస్తారు. అందువల్లే, షాహీన్ బాగ్ ఉద్యమాన్ని బుర్ఖావాలాలు, పాకిస్తానీయులు అని నిందలేసి అణిచివేశారు. రైతు ఉద్యమాన్ని “ఖలిస్తానీలు అని ఆరోపించి తరిమేశారు. ఈ రెండు అనుభవాలు ముస్లిం సమాజానికి ఒక పాఠాన్ని నేర్పాయి. :బొద్దింకల ఉద్యమంలో వాళ్ళు అతి ఉత్సాహంగా పాల్గొననూ లేదు; అలాగని ఉద్యమానికి దూరంగానూ లేరు.  కర్ణాటకకు చెందిన ఆఫ్రీన్ నవాజ్ సిజెపి కోర్  టీమ్  సభ్యురాలు, ఆ పార్టికి జాతీయ కార్యదర్శిగా వుంటున్నారు.  ఘాజియాబాద్ కు చెందిన ముహమ్మద్ జునైద్ జంతర్ మంతర్ క్యాంపులో ప్రధాన వాలంటీర్ గా పనిచేశాడు.

 

 విద్య ఎవరి సమస్య ? ముస్లింలది మాత్రమేనా? కాదు. నిరుద్యోగం ఎవరి సమస్య? ముస్లింలది మాత్రమేనా? కాదు. ఆర్థిక అసమానతలకు మతం ఉండదు. అందుకే ముస్లిం పౌర సమాజం తన ప్రత్యేక సమస్యలపై మాట్లాడటంతో పాటు, దేశంలోని సాధారణ ప్రజల సమస్యలపై కూడా మాట్లాడి తీరాలి.  ప్రజలందరి సమస్యల కోసం పరిష్కారం పోరాడినపుడే వాటిల్లో భాగంగా ముస్లింల  ప్రత్యేక సమస్యలు కూడ పరిష్కారం అవుతాయి. జెన్-జీ ఉద్యమం నుండి ముస్లిం సమాజం నేర్చిన పాఠం ఇది.

 

17 సెప్టెంబరు 2026

No comments:

Post a Comment