Thursday, 10 September 2026

On Ganapati

 

గణపతి

సుదీర్ఘకాలం వున్నారు సరే; ఏంచేశారూ?

డానీ

సమాజ విశ్లేషకులు



 

నక్సలైట్ ఉద్యమంలో గణపతి పేరుతో ప్రసిద్ధులైన ముప్పాళ లక్ష్మణరావు అజ్ఞాత జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి వస్తున్నారనే  చర్చ మళ్ళీ మొదలైంది. అయితే, గణపతి బహిరంగ జీవితంలోకి తిరిగి వస్తారా? లేదా? అన్నదానికన్నా ఆయన గురించి చర్చించాల్సిన పెద్ద అంశాలు కొన్ని వున్నాయి.  

 

గణపతి 1990ల ప్రారంభంలో సిపిఐ- పీపుల్స్ వార్ నాయకత్వాన్ని చేపట్టారు. 2004లో ఆ పార్టి, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ తో విలీనం అయ్యి సిపిఐ-మావోయిస్టుగా ఏర్పడినప్పుడు,  దాని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆరేడేళ్ల క్రితం అనారోగ్యం, వృధ్ధాప్యం తదితర కారణాలతో ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు.

 

ఇంత సుదీర్ఘకాలం అజ్ఞాత జీవితాన్ని గడపడం సామాన్య విషయం కాదు. కుటుంబం, వ్యక్తిగత స్వేచ్ఛ, సాధారణ జీవితం తదితర సౌకర్యాలు  అన్నింటినీ వదిలి దశాబ్దాల పాటు ఉద్యమంలో అజ్ఞాత జీవితాన్ని గడపడం నిస్సందేహంగా ఒక గొప్ప  నిబద్ధత. ఆ త్యాగాన్ని అందరూ గుర్తించాలి. గౌరవించాలి.

 

కానీ,- నిబద్ధత ఒక్కటే నాయకత్వానికి కొలమానంకాదు. గతితార్కిక చారిత్రక భౌతికవాదం పరిమాణాన్ని మాత్రమే చూడదు; గుణాత్మక మార్పును కూడా చూస్తుంది. నాయకులు ఎన్ని సంవత్సరాలు గొప్ప పదవుల్లో ఉన్నారన్నది పరిమాణం. ఆ కాలంలో తాము నమ్మిన సిధ్ధాంతానికీ, చేపట్టిన ఉద్యమానికి, అంతిమంగా తామున్న సమాజానికి కొత్తగా ఏమీ జోడించారన్నదే ముఖ్య ప్రశ్నలు.  అదే గుణాత్మకం.

 

కొండపల్లి సీతారామయ్యను తప్పించి గణపతి పీపుల్స్ వార్ నాయకత్వంలోకి వచ్చిన 1990ల నుండి ఆయన పదవి నుండి తప్పుకున్న 2020ల వరకు సాగిన మూడు దశాబ్దాలు భారత దేశలోనేగాక ప్రపంచ చరిత్రలోనూ ఒక విశేష దశ.

 

ఈ దశలోనే, తూర్పు యూరప్‌లో సోషలిస్టు ప్రభుత్వాలు కూలిపోయాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది. అప్పటి వరకు స్థబ్దుగావున్న ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ తన ఆధిపత్యాన్ని విస్తరించింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. మార్కెట్, ప్రైవేట్ పెట్టుబడి, ప్రపంచ వాణిజ్యం కలిసి భారత ఆర్థిక వ్యవస్థను మార్చడం ప్రారంభించాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది; భారత్ దాని వ్యవస్థాపక దేశాలలో ఒకటిగా చేరింది.  ముందు  ఐటి, ఆ వెనక ఏఐ వచ్చి ఉత్పత్తి విధానాన్ని మార్చేశాయి.

 

ఇదే కాలంలో భారత రాజకీయార్ధిక సాంస్కృతిక రంగాల్లో మరో గుణాత్మక మార్పు వచ్చింది. అప్పటి వరకు లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ గా కొనసాగిన భారత రాజకీయాలు రైట్ ఆఫ్ ద సెంటర్ గా మారాయి. 1990లో అద్వానీ తొలి రథయాత్ర, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత దేశ రాజకీయాల దిశను మార్చాయి. పార్లమెంటరి ప్రజాస్వామ్యంలో మతపరమైన రాజకీయ సమీకరణ మొదలయింది.  ఒకవైపు వర్గ రాజకీయాలను మార్కెట్ సవాలు చేసింది. మరోవైపు, మతతత్త్వ  రాజకీయాలు ఊపందుకున్నాయి.

 

భారత సమాజాన్ని హిందూ ముస్లింలుగా వర్గ విభజన చేయాలనే  హిందూత్వ సిధ్ధాంతాన్ని దామోదర్ సావర్కర్ 1920లలోనే ముందుకు తెచ్చాడు. పరిస్థితులు అనుకూలంగా మారడంతో సంఘపరివారం 1990లలో మత విద్వేష ప్రక్రియను  వేగవంతం చేసింది. 2020లలో అది తన లక్ష్యాలను దాదాపుగా సాధించింది.  భారత సమాజాన్నీ, సాంస్కృతిక, రాజకీయార్ధిక రంగాల్నీ హిందూ ముస్లింలుగా విభజించడంలో  సఫలీకృత మైంది.  మరోవైపు, మతోన్మాద శక్తులకు కార్పొరేట్ల మద్దతు కూడ లభించడంతో కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ (CCD) దేశంలో బలపడింది.

 

సంతానోత్పత్తి కోసం స్త్రీపురుషుల మధ్య ఏర్పడిన విభజనే చరిత్రలో మొట్టమొదటి శ్రమ విభజన అనే సూత్రీకరణను కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ 1840లలో చేశారు. మార్క్స్‌ మరణానంతరం ఏంగిల్స్ రాసిన ‘కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాల పుట్టుక’ గ్రంధంలో  ఒక గొప్ప సూత్రీకరణ చేశాడు.  ఒక భర్త ఒక భార్య ప్రాతిపదిక ఏర్పడిన  ఆధునిక పెట్టుబడీదారీ కుటుంబంలో, భర్త పెట్టుబడీదారీ  వర్గానికి ప్రతినిధి; భార్య శ్రామిక వర్గానికి ప్రతినిధి అంటూ కరాకండిగా తేల్చి పాత సూత్రానికి కొత్త జవసత్వాలిచ్చాడు. అంతే కాదు; భార్యాభర్తల మధ్య ‘వర్గవైరం’  (class antagonism) వుంటుందని ప్రకటించాడు.

 

తాను ఒక బాధ్యతాయుత స్థానంలో వున్న  మూడుదశాబ్దాల్లో భారత  సమాజంలో వచ్చిన మార్పుల్ని  గణపతి సీరియస్ గా పట్టించుకుని కొత్త వర్గ విశ్లేషణ చేయాల్సి వుండింది.  కార్పొరేట్ మతతత్త్వ నిరంకుశ వ్యవస్థలో పెట్టుబడీదారీవర్గ సమూహం ఎవరూ? శ్రామికవర్గ సమూహం ఎవరూ? వర్గ వైరం కొత్తగా ఏ సమూహాల మధ్య  ఏర్పడిందీ? తాము ఎవరి పక్షం వహించాలీ? అనే ప్రాణప్రదమైన చారిత్రక సైధ్ధాంతిక సవాళ్ళను ఆయన సీరియస్ గా పట్టించుకోలేదు. అంటే తన కాలంలో తలెత్తిన తాత్విక సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నం ఆయన చేయలేదు. అలా వారు ఒక చారిత్రక అపచారానికి పాల్పడ్డారు.

 

మార్క్స్ పెట్టుబడీదారీ వ్యవస్థను విశ్లేషిస్తే, లెనిన్ సామ్రాజ్యవాదంగా మారిన పెట్టుబడీదారీ వ్యవస్థను విశ్లేషించాడు.   అలాగే, వ్యవసాయ ప్రధాన దేశాన్ని సోషలిస్టు దేశంగా మార్చే ప్రయత్నం మావో చేశాడు. అలా తన కాలంలో భారత సమాజంలో ఏర్పడిన  కార్పొరేట్ మతతత్త్వ నిరంకుశ వ్యవస్థను గణపతి ఏమేరకు అర్థం చేసుకున్నారు, దాన్ని మార్చడానికి ఏంచేశారూ? ఏ మేరకు సఫలీకృతం అయ్యారు  అనేవి కీలక ప్రశ్నలు.  ఉత్పత్తి శక్తులు – ఉత్పత్తి సంబంధాలు అనే మార్క్సిస్టు మెధడాలజీనీ కొత్త ఉత్పత్తి విధానానికి గణపతి  అన్వయించిన దాఖలాలు సహితం  మనకు కనిపించవు. 

 

“మాకు కులం లేదు, మతం లేదు” అని చెప్పుకోవడం చాలా సులభం. కానీ సమాజంలో కులం, మతం ఎలా పనిచేస్తున్నాయో వర్గ విశ్లేషణ చేయాలి. అది  అంత సులభం కాదు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీల వైఫల్యానికి ప్రధాన కారణం అవి సమాజ వాస్తవికతను అర్ధం చేసుకునే శక్తిని కోల్పోవడమే.  తమకు అర్థంకాని సమాజాన్ని ఎవరూ మార్చలేరు. ఇలాంటి తత్త్వదారిద్యం సహజ ఓటమిని పొందక తప్పదు.

 

మార్క్స్ ను లెనిన్ రష్యాకు అన్వయించాడేతప్ప, అనుసరించలేదు. లెనిన్ ను మావో చైనాకు  అన్వయించాడేతప్ప అనుసరించలేదు. మావోను కమ్యూనిస్టు పార్టీలు ఇండియాలో అనుసరించాయితప్ప, అన్వయించలేదు.  ఇదొక ఘోర అపరాధం.   ప్రపంచం 1990లలో గుణాత్మకంగా మారిపోయింది.  అది అప్పటి పీపుల్స్ వార్ కూ అర్ధంకాలేదు; నిన్నటి మావోయిస్టు పార్టీకీ అర్ధం కాలేదు. మావోయిస్టులు దుకాణం మూసేయాల్సి రావడానికి ఇది ప్రధాన కారణం.  ఇప్పటికీ కొందరు ఆలోచనాపరులు వర్తమాన భారత సమాజాన్ని అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థ అంటుంటే కొంచెం ఎక్కువగానే నవ్వు వస్తోంది.

గణపతి అనుసరించిన సైనిక వ్యూహాల్లోనూ ఇవే  సందేహాలు.  మావో పేరిట చరిత్రలో ప్రసిద్ధి చెందిన లాంగ్ మార్చ్ / జైత్రయాత్ర నిజానికి యుధ్ధరంగం నుండి వెనుకడుగు (రిట్రీట్). వెనక్కి తగ్గుతూనే దాన్ని ప్రజా మద్దతును కూడగట్టే  ఒక రాజకీయ వ్యూహంగా మలచగలిగాడు మావో. అందుకు భిన్నంగా గణపతి, పార్టి శ్రేణుల్ని విశాల సమాజానికి దూరం చేసి, తనకున్న సాయుధ దళాల్ని ఛత్తీస్ గడ్ అబుజ్ మడ్ లో మోహరించి పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్నీ వ్యతిరేకిస్తూ సాయుధపోరాటమే ఏకైకమార్గం అన్న మావోయిస్టు పార్టి మొదటి రంగాన్ని పూర్తిగా వదిలేసింది; రెండో రంగంలో విషాదకరంగా ఓడిపోయింది.

 

గణపతి నిబద్ధతను ప్రశంసించవచ్చు. ఆయన త్యాగాన్ని గుర్తించవచ్చు. ఒక సాయుధ ఉద్యమాన్ని దశాబ్దాల పాటు నడిపిన ఆయన సామర్థ్యాన్ని కూడా గుర్తించవచ్చు. అయితే నాణేనికి మరోవైపున కూడ చూడాలి.   

 

కొండపల్లి సీతారామయ్య తప్పులు చేయని రాజకీయ సిధ్ధాంత వేత్త అని చెప్పడం సరికాకపోవచ్చు. ఆయన చేసిన తప్పులు ఆయనకు వున్నాయి. కానీ, దాదాపు బూడిదగా మారిపోయిందనుకున్న నక్సలైట్ ఉద్యమానికి 1970లలో  ఫీనిక్స్ పక్షిలా తిరిగి ప్రాణం పోసి ఏపుగా పెంచిన ఘనత కొండపల్లిదే అనడంలో సందేహం లేదు. కొండపల్లి ఏపుగా పెంచిన ద్రాక్షతోటను కాల్చి బూడిదగా మార్చిన రికార్డు ఇప్పుడు గణపతి పేరున నమోదయ్యింది.

 

08 సెప్టెంబరు 2026

No comments:

Post a Comment