విజయా!
దీన్ని ప్రచురించుకో.
-
డానీ
I am the son of
a single woman!
నేను ఓ మూడేళ్ళు సింగిల్
వుమన్ కొడుకుని !
భండారు విజయ, పి.
జ్యోతిల సంపాదకత్వంలో వచ్చిన ‘స్వయం సిధ్ధ’ – ఒంటరి మహిళల జీవనగాధలు
సంకలనం గురించి విన్నాను. ఆ సంకలనకర్తల ఇంటర్వ్యూను పత్రికల్లో చదివాను. పరిచయ సభల
వార్తలు సోషల్ మీడియాలో చూశాను. ఈ సందర్భంగా కొన్ని భావోద్వేగాలను బహిరంగంగా పంచుకోవాలనుకుంటున్నాను.
మన వివాహ వ్యవస్థలో
పురుషుడు యజమాని; స్త్రీ శ్రామికురాలు. ఇది భూస్వామ్య వ్యవస్థ రూపొందించిన సామాజిక
ఏర్పాటు. పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ ఇది ఇలాగే కొనసాగుతోంది. చక్రవర్తుల్లో Cyrus
the Greatలాగ చాలా అరుదుగానైనా ఎక్కడో Benevolent భర్తలు వుండవచ్చు. నేను వాళ్ళ కోవలోనికి రాకపోవచ్చు. అందువల్ల, సింగిల్
వుమెన్ సమస్య మీద మాట్లేడే అర్హత నాకు వుందోలేదో కూడా తెలీదు.
అయితే నాకు ఒక సింగిల్
వుమన్ బాగా తెలుసు. ఆమె పడ్డ కష్టాలను, ఎదుర్కొన్న
సవాళ్ళను అధిగమించిన నిందల్ని, సాధించిన విజయాలను నేను అతి దగ్గరగా చూశాను. బహుశ; ఆ
అనుభవం కారణంగా నేను ఈ అంశం మీద మాట్లాడవచ్చు అనుకుంటున్నాను. ఆమె నాకు జన్మనిచ్చిన
తల్లి; సుఫియా బేగం. అమ్మీ తుమ్హే సలామ్ !
పుట్టినప్పుడు ఒక
విధంగా ఆర్ధికంగా మెరుగ్గా వున్న కుటుంబమే మాది. ఉమ్మడిలో ఒక లాంచి వుండేది. నాన్నకు
స్వంతంగా ఒక సైకిల్ షాపు, ట్రక్కుల టైర్ రీ-ట్రేడింగ్ కార్ఖానా వుండేది. మాకు రాయల్
ఎన్ ఫీల్డ్ బుల్లెట్ మోటారు సైకిలుండేది. మూడు ఇళ్ళు వుండేవి. ఇంట్లో రంగూన్ కలపతో
చేసిన పందిరి మంచాలుండేవి. టేబుళ్ళు కుర్చీలుండేవి. గ్రామ్ ఫోన్ వుండేది. అమ్మకూ, నాన్నకూ
పాటలంటే ఇష్టం. ఇంటికి షమా ఉర్దూ పత్రిక వచ్చేది. పింగాణి ప్లేట్లలో భోజనం చేసేవాళ్లం.
నాకోసం ప్రత్యేకంగా వెండి పళ్ళెం, వెండి గ్లాసు వుండేది. మంచి బట్టలు వేసుకునేవాళ్ళం.
1958లో - అంటే అప్పటికి
నాకు ఏడు సంవత్సరాలు వుంటాయి; పైన చెప్పినదంతా ఒక కలగా కరిగిపోయింది. గోదావరి వరదల్లో
లాంచీ కొట్టుకుపోయింది. కార్ఖానాలో అగ్నిప్రమాదం జరిగింది. ఉమ్మడిలోని పెద్దిల్లు అమ్ముకున్నారు.
అయినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఈలోకంలో అప్పులున్నవాళ్లకు అత్మగౌరవం నిషేధం. బయట
అప్పులున్నప్పుడు ఇంట్లో మనుషులు కుంగుబాటు,
వత్తిళ్ళకు లోనవుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత చెడిపోతుంది. ప్రేమించుకోవాల్సిన సందర్భల్లోనూ
వాళ్లు కలహించుకుంటారు.
1961 వేసవి రోజులు.
నేను ఇంకా ఐదవ తరగతి వార్షిక పరీక్షలు రాయలేదు. ఒకరోజు నడి బజార్లో అప్పులవాడు నిలదీస్తే
మా నాన్న చాలా అవమానంగా భావించి కుంగిపోయారు. ఒక రెండు రూపాయల నోటిచ్చి నన్ను నరసాపురం
బస్ స్టాండ్ లో విడిచి, ఆయన ఊరు వదిలి లూధియాన పారిపోయారు.
విషయం తెలిసి మా అమ్మ నన్ను పట్టుకుని శబ్దం
చేయకుండా ఒక రాత్రంతా ఏడిచింది. ఈ లోకంలో నిశ్శబ్దంకన్నా ఏడ్పుకన్నా భయంకరమైనది నిశ్శబ్దంగా
ఏడ్వాల్సి రావడం.
ఆ మరునాడు మా అమ్మ
హఠాత్తుగా ఒక రాక్షసిగా మారిపోయింది. ఇంట్లో సామానంతా పెరట్లో పెట్టి వేలం వేసి అమ్మేసింది.
అప్పులవాళ్ళను ఇంటికి పిలిచి ఎవరికి ఎంత ఇవ్వాలో లెఖ్ఖకట్టి ఇచ్చేసింది. నగదు యాభై
రూపాయలు కూడ మిగలలేదు. “చావడానికి స్వంత ఇల్లుందిరా ఫరవాలేదు” అంది చాలా ధైర్యంగా.
“గుర్తుపెట్టుకో మనం జీవితంలో ఎప్పుడూ అప్పు చేయకూడదు” అని హెచ్చరించింది.
తను ఉర్దూ బాగా చదువుకున్న
మనిషి. ధార్మిక సూక్ష్మాలు లోతుగా తెలుసు.
తాత్పర్యం అంతగా తెలీదుగానీ అరబ్బి కూడ బాగా చదవడం వచ్చు. మరునాడు ఉర్దూ ట్యూషన్లు
మొదలెట్టింది. అవి జీవించడానికి సరిపోవని కొద్దిరోజుల్లోనే తేలిపోయింది. అప్పట్లో కిరాణా
షాపుల్లో శంఖాకారంలో కట్టి ఇచ్చే పొట్లాల స్థానంలో
కొత్తగా కాగితపు సంచులు వచ్చాయి. మా అమ్మ ఆ సంచులు చేయడం నేర్చుకుంది.
మాకు జీవనాధారం దొరికింది.
కాని, తినడానికీ, ముగ్గురు పిల్లల్ని చదివించడానికీ ఆ కూలీ డబ్బులు సరిపోయేవి కావు.
ముస్లిం మహిళ కనుక బయటికి వెళ్ళి పనిచేసే వాతావరణం లేదు. కుటుంబాన్ని పోషించడానికి
రాత్రింబవళ్ళు పనిచేసేది. దానితో తన ఆరోగ్యం
చెడిపోయింది. క్షయ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టరు హెచ్చరించాడు. అప్పటికే నేను
అర్ధ అనాధను. అమ్మకు ఏదైనా జరిగితే నాకు దిక్కెవరు? చాలా దిగులు వేసింది.
ఆ రాత్రి మా మ్మ చెప్పిన
మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. “అల్లా దయగలవాడు. మంచివాళ్ళకు తప్పక మంచిరోజులు ఇస్తాడు.
మనకు మంచిరోజులు వస్తాయి. మనం మంచి రోజుల్ని చూడాలి. అప్పటి వరకు మనం బతికి వుండాలి.
బతికి వుండాలంటే ఆరోగ్యంగా వుండాలి కదరా?” అంది.
సాధారణంగా పిల్ల బాధ్యతల్లో
తల్లి కొంత, తండ్రి కొంత పంచుకుంటారు. ఒంటరి మహిళలు రెండు బాఢ్యతల్ని నిర్వర్తించాల్సి వుంటుంది. ఒంటరి
స్త్రీలు ఆత్మగౌరవంతో స్వంతకాళ్ళ మీద నిలబడడాన్ని, ఈ సమాజంలో కొందరు సహించలేరు. వాళ్ళ
స్వంత ఆస్తి ఏదో కోల్పోతున్నట్టు భావిస్తారు. ఈ క్రమంలో నిందలు వేయడానికీ జంకరు. ఆ
ఇబ్బందుల్ని అమ్మా కూడ ఎదుర్కొంది.
మా అమ్మకు సహాయకారిగావుండాలని
నేను కూడా పనిలో చేరాను. పదకొండవ ఏట బాల కార్మికునిగా మారాను. ఆమెకు ఉదయం పాలుకాసి
టీ ఇవ్వాలనేది నా కూలీకి తొలి లక్ష్యం. నేను
పనిలో చేరడం తనకు ఇష్టంలేదు. “నువ్వు ఇంగ్లీషు నేర్చుకోవాలి. ఇంగ్లీషులో మాట్లాడాలి
అప్పుడు మన గౌరవం పెరుగుతుంది” అనేది. తనకు తెలుగు చదవడం రాదు. మా కోసం నేర్చుకుని మమ్మల్ని
కూర్చోబెట్టి చదివించేది.
పౌరుషం ఆత్మాభిమానం
గల మనిషి. దేనికీ జంకేది కాదు. మాటంటే మాటే. అనుకున్నదంటే జరగాల్సిందే. మా పేదరికాన్ని
దాచడానికి చాలా తంటాలు పడేది. మన మీద మరొకరు జాలి పడడం తనకు నచ్చేదికాదు. రెండు మూడు
జతలైనా సరే మంచి బట్టలు కొనేది. తల వెంట్రుకల
నుండి కాలి గోళ్ళ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ
చెప్పేది. ఆమె నా తొలి స్టైలిస్ట్. నన్ను ప్రెజెంటబుల్
గా వుంచేది. శుభకార్యాల సందర్భంగా భోజనాలకు
వెళుతున్నప్పుడు అనేక జాగ్రత్తలు చెప్పేది.
ఆబగా తినకండి. మాసం ముక్కల కోసం ఎగబడకండి. అన్నాన్ని పిసకవద్దు; ముద్దలు చేయవద్దు;
వేళ్ళతో మాత్రమే సుతారంగా తినాలి. సగం కడుపే తినండి. ఆకలి తీరకపోతే ఇంటికి తిరిగి వచ్చాక
నేను మళ్ళీ వండి పెడతాను అనేది.
రెండున్నరేళ్ళ తరువాత
మానాన్న తిరిగి వచ్చారు. ఆ తరువాతి కత వేరు.
మా అమ్మ ఒంటరి మహిళగా
వున్న ఆ మూడేళ్ళ కాలంలో నేను మూడు విషయాలు
నేర్చుకున్నాను. మొదటిది; మంచిరోజుల్ని ఆస్వాదించాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాలి;
అంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రెండోది; జీవితంలో ఎన్నడూ అప్పు చేయకూడదు. మూడోది;
మనం చేస్తున్న పని న్యాయమైనదైనప్పుడు ఎంతటి బలవంతుడ్ని కూడ లెఖ్ఖ చేయకూడదు.
మా అమ్మ దాదాపు
84 ఏళ్లు బతికింది. చనిపోవడానికి ఏడాది ముందు
తనకు నిమోనియా వచ్చింది. ఆ సమయంలో నాలుగు రోజులు హాస్పిటల్ లో వుంది. అది తప్ప తన జీవితంలో
హాస్పిటల్ బెడ్డు ఎప్పుడూ ఎక్కలేదు. నేను
71 సంవత్సరాల్లో కోవిడ్ సోకినప్పుడు తప్ప ఎన్నడూ హాస్పిటల్ బెడ్డు ఎక్కలేదు.
ఆ మూడేళ్ళ అనుభవం
అప్పట్లో కొంచెం బాధగానే వుండేది. ఇప్పుడు తలుచుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను. నేను
రాటు తేలడానికి ఆ అనుభవం గొప్ప అవకాశం.
సింగిల్ వుమెన్ ఎదుర్కొనే
సమస్యల్ని చూసినపుడు నాకు అప్పటి మా అమ్మ గుర్తుకు వస్తుంది. వాళ్ళ మీద కొంచెం సాఫ్ట్
కార్నర్ కలుగుతుంది. ఒక్కొక్కసారి అదీ ఒక ఇబ్బందే.
ఇది చాలా vulnerable issue.
మన సమాజంలో సింగిల్స్
జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెఖ్ఖల ప్రకారం 20-40 ఏళ్ళ వయస్సు గలవారిలో సింగిల్స్ 11 శాతం అయితే
2021లో వీరి శాతం 21కి పెరిగింది. అంటే, పదేళ్ళలో రెట్టింపు అయింది. జనాభాలో ఇప్పుడు
ఇది ప్రధాన భాగం. మన సామాజిక ఆవరణం ఆ దిశగా
సాగుతోంది.
ముస్లింలకు ఇళ్ళు
అద్దెకు ఇవ్వనట్టు ఇటీవల సింగిల్ వుమెన్ కూడ ఇళ్లు అద్దెకు ఇవ్వడంలేదు. సామాజిక వివక్ష,
స్టిగ్మా, వ్యక్తిగత రక్షణ, చట్టపరమైన - విధానపరమైన అంశాలు, మద్దతు ఇచ్చే సంఘాల లేమి
వీటన్నింటి మీద దృష్టి పెట్టాలి. ఇది చాలా పెద్ద చర్చ. దానికి ఇది సందర్భంకాదు.
మా అమ్మని స్మరించడానికి
అవకాశాన్ని కల్పించిన ‘స్వయం సిధ్ధ’ సంకలనానికీ, సంపాదకులు భండారు విజయ, పి. జ్యోతిలకు
ధన్యవాదాలు.
అమ్మీకి సలాములు!
డానీ
జూన్, 26, 2023
No comments:
Post a Comment