*రాజ్యాధికారం లేకుండా ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కాపాడుకోలేం!*
మన
సమాజంలో రెండు రకాల విద్వేషాలు దాదాపు ప్రతిచోటా బాహాటంగా కనిపిస్తున్నాయి. మొదటిది;
ముస్లింల స్వయంఉపాధి మీద. రెండోది; ఎస్టి,
ఎస్సి, బిసిలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల మీద.
సాంఘీక
అణగారిన సమూహాల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని 1992లో సుప్రీం కోర్టు రాజ్యాంగ
ధర్మాసనం ఒక బిరడా బిగించింది. అంటే ఓసిలకు 50 శాతం రిజర్వేషన్లను పరిరక్షించింది.
దేశ జనాభాలో అణగారిన సమూహాలు 70 శాతం వుంటే, యజమాని సామాజికవర్గాలు 30 శాతం వుంటాయి.
70 శాతానికి 50 శాతం, 30 శాతానికి 50 శాతం ఏ విధంగానూ సమతూకం కాదు.
సాంఘీక అణగారిన సమూహాలకు చట్టంలోవున్న ఆ యాభై శాతం
రిజర్వేషన్లలో సగం వరకు ఏదో ఒక వంకతో ప్రభుత్వాలు
అమలు చేయవు. మరోవైపు, మార్కులు లేకపోయినా ర్యాంకులు రాకపోయినా సాంఘీక అణగారిన సమూహాలకు ఉద్యోగాలు ఇచ్చేసి నాణ్యతను చంపేస్తున్నారనే అక్కసు సమాజంలో ప్రబలుతూ
వుంటుంది. నాణ్యతను పరిశీలించడానికి ఇంకో భారమితి వుంది. దేశంలో జరిగిన భారి స్కాముల్లో కీలక పాత్ర వహించిన అధికారుల్లో
యజమాని సామాజిక వర్గాలకు చెందిన వారు ఎంతమంది? శ్రామిక సామాజికవర్గాలకు చెందినవారు
ఎంతమంది? అని గణాంకాలు తీస్తే ఆ నాణ్యత గుట్టు కూడా బయట పడిపోతుంది.
ముస్లింలు
ఆధునిక వృత్తి నిపుణులు. యంత్ర యుగంలో మూడవ
తరంగా వచ్చిన కంప్యూటర్లను సహితం హైస్కూలు చదువుకూడా లేని ఓ ముస్లిం సులువుగా రిపేర్ చేయగలడు.
ప్రభుత్వం వాళ్ళకు ఎలాంటి సహాయమూ చేయకపోవచ్చు. అయినా, వాళ్ళ స్వతంత్ర జీవన విధానం,
బిందాస్ తీరు చాలా మందికి నచ్చదు.
ఇటీవల
సివిల్ సర్విస్ పరీక్షల్లో సాంఘీక అణగారిన సమూహాల అభ్యర్ధులు ఇండియా టాపర్లుగా వస్తున్నారు.
ఇది యజమాని సామాజిక వర్గాలకు ఊహించని పరిణామం. నాణ్యత గురించి మాట్లాడే అవకాశం ఇప్పుడు
వారికి లేదు. ఇప్పుడు వాళ్ళూ రిజర్వేషన్లు
కోరుతున్నారు. మొత్తం ఉద్యోగాలను సామాజికవర్గాల జనాభా దామాషా ప్రకారం కేటాయించడమే అంతిమ
పరిష్కారం అవుతుంది. కానీ అలా జరగడంలేదు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ
ప్రభుత్వం ఆర్ధిక బలహీన వర్గాలకు (ఇడబ్ల్యూ ఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. చట్టంలో ‘ఆర్ధిక బలహీన వర్గాలకు’ అని పేర్కొన్నా
ప్రభుత్వ వుద్దేశ్యం మాత్రం యజమాని కులాలకు
అనే. అయితే ఇక్కడో చిక్కు వస్తుంది. యజమాని కులాలు ముస్లింలతో సహా అన్ని మత సమూహాల్లోనూ
వుంటాయి. ముస్లిం, క్రైస్తవ, శిక్కు తదితర మత సమూహాలకూ ఈ సౌకర్యాన్ని అమలు చేస్తారా?
అల్పాదాయవర్గాలకు దాదాపు అన్ని ప్రభుత్వాలూ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తుంటాయి. ఇందిరాగాంధీ
గరీబీ హటావో, ఎన్టీఆర్ కిలో బియ్యం రెండు రూపాయలు, చంద్రబాబు రైతు రుణమాఫీ’ జగన్ నవరత్నాలు
నరేంద్ర మోదీ ‘స్వఛ్ఛ భారత్’ వగయిరాలు ఈ కోవలోనికి వస్తాయి. ఆదాయం ప్రాతిపదికగా వీటి లబ్దిదారుల్ని
ఎంపిక చేస్తారు.
రాజ్యాంగంలో
ఎస్టి, ఎస్సీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించిన రిజర్వేషన్లకు ఆదాయం ప్రాతిపదిక
కానేకాదు. సాంఘీక వివక్ష, ఆధునిక విద్య లేమి
అనే రెండు అంశాలు మాత్రమే ప్రాతిపదికలు. 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్
రాజశేఖర రెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నపుడు చాలా పెద్ద చర్చ, రచ్చ
జరిగింది. అప్పటి బిజెపి రాష్ట్ర నాయకుడు జి. కిషన్ రెడ్డి ముస్లింలలో కులాలు వుండవు కనుక వారికి రిజర్వేషన్లు
ఇవ్వరాదు అని పెద్ద అభ్యంతరం లేవదీశారు.
“హిందూ
సమాజంలో కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి మీరు మద్దతు పలుకుతున్నారా?” అని ఓ
మీడియా సమావేశంలో ఓ పాత్రికేయుడు ఆయన్ను అడిగాడు. చివరకు ముస్లిం సమాజంలో కుల వర్గీకరణ
జరిపి 14 రకాల బిసి కులాలను నిర్ధారించి వారికి 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఓసి ముస్లింలు అనబడే సయ్యద్, పఠాన్, బేగ్, మొఘల్
తదితరులకు ఇందులో స్థానం కల్పించలేదు.
మొత్తం
భారత ముస్లిం సమాజమే సాంఘీక వివక్షకు గురవుతున్న కారణంగా వర్గీకరణ లేకుండ బిసి, ఓసి
ముస్లింలకు కూడ రిజర్వేషన్ కల్పించాలని అప్పట్లో ఒక ఉద్యమం కూడ సాగింది గానీ వాళ్ళ
ఆవేదనను పాలకులు పట్టించుకోలేదు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వరాదంటూ ఇంకొందరు
న్యాయస్థానాల్లో కేసులు వేశారు. నిజానికి మన రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లన్నీ మతప్రాతిపదిక మీదనే ఇచ్చారు.
సాంఘీక అణగారిన సమూహాల రిజర్వేషన్లను కొన్ని
చోట్ల కులం పేరుతో, మరికొన్ని చోట్ల మతం పేరుతో వాళ్ళు అడ్డుకుంటూనే వున్నారు. వాళ్ళు
అంటే ఎవరో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు; మెజారిటీ సమూహపు యజమాని కులాలు. రిజర్వేషన్లకు క్రీమీలేయర్ ట్యాగ్ ను తగిలించడం అంటే కొత్తగా ఆర్ధిక
నిబంధను ప్రవేశపెట్టడం. ఇది రాజ్యాంగ ఆదర్శానికి విరుధ్ధం. అలా అనేక విధాలుగా వరుస
ప్రభుత్వాలు సందర్భం దొరికినప్పుడెల్లా సాంఘీక అణగారిన సమూహాల రిజర్వేషన్లకు తూట్లు
పొడుస్తూనే వున్నాయి.
మనుషులు,
సంస్థలు, రాజకీయ పార్టీలు సాధారణంగా తమకే ఆచరణసాధ్యంకాని ఆదర్శాలను వల్లిస్తుంటారు. మన రాజ్యాంగ సభలోని మెజారిటి
సభ్యుల సాంఘీక స్వభావం, ప్రాపంచిన దృక్పథం వేరు; వాళ్ళు ఆమోదించిన ప్రజాస్వామిక ఆదర్శ
రాజ్యాంగం వేరు. రెండూ పరస్పర విరుధ్ధ అంశాలు. రాజ్యాంగ సభ సభ్యుల్లో అత్యధికులు సంస్థానాలకు
ప్రతినిధులు, యజమాని కులాలకు చెందినవారు. వాళ్ళేమీ అణగారిన సమూహాలకు చెందినవారు కాదు;
అణగారిన సమూహాలను ఉధ్ధరించాలనే ఆదర్శాలు ఏ మాత్రం వున్నవారూ కాదు. ఒక అందమైన రాజ్యాంగం
వుంటే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. దాన్ని ఆచరించే అధికారం తమ చేతుల్లోనే వుంటుంది
కనుక ఇష్టమైతే దాన్ని ఆచరించవచ్చు, ఇష్టంలేకపోతే దాన్ని పక్కన పడేయవచ్చు అనే ధీమాలో
వున్నారు.
రాజ్యాంగ
రచన కమిటికి అధ్యక్షునిగా వ్యవహరించిన అంబేడ్కర్ కు ఈ వైరుధ్యం ఈ పరిమితి సభ్యుల స్వభావం
తెలియనిదికాదు. రాజ్యాంగసభలో 1949 నవంబరు 25న చేసిన చివరి ఉపన్యాసంలో ఈ అంశం మీద చాలా
స్పష్టంగానే హెచ్చరికలు చేశాడు.
"రాజ్యాంగం
ఎంత గొప్పదయినాసరే దానిని అమలు చేసేవారు చెడ్డవారయితే అది చెడ్డదిగా మారిపోతుంది. రాజ్యాంగం
ఎంత చెడ్డదైనాసరే దానిని అమలు చేసేవారు మంచివారయితే అది గొప్పదిగా మారిపోతుంది. రాజ్యాంగం
పనితీరు రాజ్యాంగ స్వభావంపై ఆధారపడి ఉండదు; దాన్ని అమలుచేసే శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల్ని
నడిపే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి వుంటుంది” అన్నాడు.
రాజ్యాంగానికి
నాలుగవ సవరణ సందర్భంగా 1955 మార్చి 19 న చేసిన ప్రసంగంలో ఈ అంశాన్ని మరింత స్పష్టంగా
చెప్పాడు. “దేవుడి కోసం మేము ఒక ఆలయాన్ని నిర్మించాము. దేవుడ్ని ప్రతిష్టించడానికి
ముందే ఆ ఆలయాన్ని దెయ్యాలు ఆక్రమించుకున్నాయి.
అప్పుడు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయడంతప్ప మనం ఏమి చేయగలం? అందుకే ఆ రాజ్యాంగాన్ని
తగలబెట్టడమే మంచిదని నేను భావించాను” అన్నాడు. దీన్ని తిరగేసి చూస్తే, దెయ్యాలే అంబేడ్కర్
చేత దేవాలయాన్ని కట్టించుకున్నాయని సులువుగానే
అర్ధం అవుతుంది.
ఇప్పుడున్న
రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని రాజ్యాంగంగా మారుస్తామంటూ సంఘపరివారం ముఖ్యులు
తరచూ ప్రకటనలు చేస్తుంటారు. నిజానికి మనుస్మృతి ద్వార సాధించదలచిన సామాజిక, ఆర్ధిక
లక్ష్యాలను ప్రస్తుత రాజ్యాంగం ద్వార కూడ సాధించుకునే నైపుణ్యం సంఘపరివారానికి వుంది.
అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగంకన్నా రాజ్యాధికారం ముఖ్యం. రాజ్యాధికారం గురించి మాట్లాడకుండ
రాజ్యాంగం గురించి మాట్లాడడంవల్ల అణగారిన సమూహాల లక్ష్యాలు నెరవేరవు.
ఏయం ఖాన్ యజ్దానీ (ఉషా ఎస్ డానీ)
(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు MTF కన్వీనర్)
9010757776
Published : 22 June 2023
https://www.facebook.com/photo/?fbid=2503525999795665&set=a.1593755074106100
No comments:
Post a Comment