*ఈరోజు హైదరాబాద్ లో జరిగిన లోక్ రాజనీత్ మంచ్ సభలో నా ప్రసంగం*
కాంగ్రెస్ లేకుండా
బిజెపిని ఎదుర్కోలేం
లోక్ రాజనీత్ మంచ్ నాయకులు శ్యామ్ గంభీర్ గారికీ.
సోషలిస్టు ఉద్యమ నేత, ఈనాటి సమావేశానికి సమన్వయకర్త గోపాల్ సింగ్ గారికీ
ప్రజాస్వామిక శుభాకాంక్షలు.
మిత్రులారా!
2024 ఎన్నికల్లో బిజెపిని గద్దె దించి తీరాలనే
విషయంలో వేదిక మీద వున్నవారికీ, వేదిక ముందు వున్నవారికీ ఏకాభిప్రాయం వుంది.
అందుచేత బిజెపి దేశాన్ని ఎంత ఘోరంగా
పరిపాలిస్తున్నదీ?
దానిని ఎందుకు అధికారం నుండి తొలగించాలీ?
తదితర అంశాలను నేను వివరించాల్సిన అవసరం లేదు.
ఏకాభిప్రాయం వున్న అంశం మీద చర్చ అనవసరం.
ఒక శుభపరిణామం ఏమంటే
ఇప్పటికే ‘బిజేపి ముక్త్ దక్షణ భారత దేశం’ సాకారం
అయ్యింది.
ఇక జరగాల్సిందేమిటీ ‘బిజేపి ముక్త్ సంపూర్ణ భారత దేశం’
అది కూడ సాకారం అవుతుందనే సూచనలు నాకు చాలా స్పష్టంగా
కనిపిస్తున్నాయి.
ఉక్కు కరుగుతున్నది, యాభై ఆరు అంగుళాల ఛాతీ
బెదురుతున్నది.
నిన్నటి వరకు అప్రతిహత శక్తులుగా కనిపించినవారి
కళ్ళలో ఇప్పుడు కలవరం స్పష్టంగా
కనిపిస్తున్నది.
అయితే, బిజెపిని ఎలా గద్దె దించాలి అనే విషయంలో మన
మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
ప్రధానంగా విపక్షాలకు ఎవరు నాయకత్వం వహించాలనే
విషయంలో వివాదం వుంది.
నేనయితే విపక్షకూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించాలి అని భావిస్తాను.
వేదిక మీదున్న నా మిత్రులు నారగోని విజిఆర్ కు ఈ
విషయంలో అభ్యంతరం వుందని నాకు తెలుసు.
నేనేమీ కాంగ్రెస్ సభ్యుడ్ని కాను.
కాంగ్రెస్ చాలా గొప్ప ఆదర్శ పార్టి అని కూడ నేను అనను.
కాంగ్రెస్ తప్పులు కాంగ్రెస్ కూ వున్నాయి.
సందర్భం వచ్చినపుడు ప్రజలు కాంగ్రెస్ నూ ఓడించారు.
1977 ఎన్నికల్లో
అప్రతిహతంగా కనిపించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని రాయ్ బరేలీలో అతి సామాన్యుడయిన రాజ్ నారాయణ్ ఓడించిన చరిత్ర మనకు తెలుసు.
పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఇప్పటి పరిస్థితుల్లో
కాంగ్రెస్ ను ముందు వుంచక తప్పదు.
ఎందుకంటే లోక్ సభలో కాంగ్రెస్ కు 50 స్థానాలున్నాయి. అంతేకాక
దేశంలో ఓ రెండు వందల స్థానాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు అభ్యర్ధుల్ని ప్రకటించగల
సామర్ధ్యం ఆ పార్టికి వుంది. మిగిలిన పార్టీల సామర్ధ్యం 23 స్థానాలకు మించి లేదు.
దాదాపు 10-15 కమ్యూనిస్టు పార్టీలు, ఫూలే అంబేడ్కర్
మార్క్సిస్టు ముస్లిం మానవ హక్కుల, ప్రజాస్వామిక హక్కుల ప్రజాసంఘాలు అనేకం ఇప్పుడు
బిజెపిని ఓడించాలనే లక్ష్యంతో ఒకే వేదిక మీదికి వస్తున్నాయి. కొన్ని జేఏసిలి
ఏర్పడుతున్నాయి. ఇదొక గొప్ప పరిణామం. అయితే, 2019 ఎన్నికల ఫలితాలను పరిగణన లోనికి తీసుకుంటే వీటన్నింటికీ
కలిపి 4-5 శాతం ఓట్లకు మించి లేవు. ఈ వాస్తవాన్ని మనం పరిగణన లోనికి తీసుకోవాలి. ఎన్నికల్లో
మనం 40 -50 శాతం ఓట్ల మీద దృష్టి పెట్టి పనిచేయాలి.
పార్లమెంటరి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే అంకెల వ్యవహారం. 545 లోక్ సభా స్థానాల్లో
కనీసం 273 స్థానాలు రావాలి? అది మేజిక్ ఫిగర్. అలాంటి వ్యూహం లేకుంటే ఇప్పుడు మనం చేస్తున్న కసరత్తులన్నీ వృధా.
కాంగ్రెస్ ను అనుమానించడంలో తప్పులేదు. కానీ, దాన్ని
పక్కన పెట్టడమూ కుదరదు.
దీనికి ఒక పరిష్కారం లేకపోలేదు. ఉమ్మడి కనీస కార్యక్రమం
(CMP) ఒకదాన్ని రూపొందించుకుందాం. దానికి కాంగ్రెస్ ను ఒప్పిద్దాం.
అలా సమస్య పరిష్కారం అవుతుందని అశిస్తున్నాను.
బిజెపి ముక్త్ భారత్ మన లక్ష్యం కావాలి.
ధన్యవాదాలు
మీ
ఏయం ఖాన్ యజ్దానీ (ఉషా ఎస్ డానీ)
(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు MTF కన్వీనర్)
No comments:
Post a Comment